దొంగల కథ
కేశవరావు గారికి హైదరాబాదులో ఉద్యోగం. వారి స్వస్థలం ఒక పల్లెటూరు. ప్రతి
సంవత్సరం ఎండాకాలంలో కుటుంబాన్ని తీసుకుని ఆ పల్లెటూళ్లో రెండు నెలలు గడిపి
వస్తారాయన, సెలవు పెట్టుకుని వెళ్లి వస్తూ ఉంటాడు.
ఆ సంవత్సరం పిల్లలందరికీ పరీక్షలై సెలవు లిచ్చేవేళకు కేశవరావుగారి భార్య
సావిత్రమ్మగారు - అక్కగారికి సుస్తీ చేసిందని అకస్మాత్తుగా కబురొస్తే - ఉన్నపళంగా
వెళ్లిపోయారు. కేశవరావుగారికి ఆఫీసు ఇన్‌స్పెక్షనుండడం వలన, ఆయ కూడా ప్రయాణం
కాలేకపోయారు.
పిల్లలంతా నిరుత్సాహ పడతారని కేశవరావుగారు తమ ఇంట్లో వంట చేసిపెడుతున్న
వాళ్ళ దూరపు బంధువు సీతమ్మగారితో పిల్లల్ని కార్లో వారి స్వంత ఊరు పంపే ఏర్పాటు
చేశారు.
ఆ రోజు ఉదయమే త్వరగా లేచిన రవి తన పెద్ద చెల్లి రమను త్వరగా (ప్రయాణానికి
సిద్ధపడమని హెచ్చరించాడు. రవి కేశవరావు గారి పెద్ద పిల్లవాడు.
“అబ్బ ఈ సంవత్సరం సెలవులు అంత సంతోషంగా గడపలేమేమోరా అన్నయ్యా.
అమ్మ ఊరెళ్లింది. ఇక నాన్నగారు కూడా రాకపోతే ఏమీ సరదాగా ఉండదురా” అంది రమ.
“ఈ హైదరాబాదులో ఉండి మాత్రం ఏం చేస్తాం? ఎండాకాలంలో మనకు మనతోటలో
బోలెడు తాటి ముంజులూ, కొబ్బరి నీళ్లూ ఉంటాయి. మన మామిడి తోటలో హాయిగా
కూర్చుని బాగా చదువుకుంటా నేను. నాన్నగారు ఎలాగో వారం రోజుల తరువాత వస్తారు.
అమ్మ దగ్గర్నించి ఉత్తరం రాలేదింకా .ఎప్పుడొస్తుందోమరి” అన్నాడు రవి.
అప్పుడే నిద్రలేచిన పద్మ “అక్కామన తోటలో మామిడికాయలు కావలసినన్ని తినొచ్చు”
అంది అప్పుడే నోరూరుతున్నట్లు.
“నాన్నగారు మన పాలేరు వెంకన్నకూ మాలీ ముత్తయ్యకూ ఉత్తరాలు రాయించారు.
మనం వెళ్లేసరికి వేరుశనగకాయలు ఇంట్లో రెడీగా ఉంటై. మామిడి తోటలో ఊగేందుకు
ఉయ్యాల సిద్ధంగా ఉంటుంది” అంది మేలుకుని ఉండే నిద్ర నటించిన శశి, ఒక గంతులో
పక్షమీంచి లేచి. శశి ఆఖరు పిల్ల. రెండోపిల్లవాడు రఘు ఈ కబుర్లన్నీ వింటూ ఇంకా
పడుకునే ఉన్నాడు. రఘు శశికన్న పైవాడు.
ఈ లోగా సీతమ్మగారు పడకగదిలో కొచ్చి, “పిల్లలూ మనం పదింటికల్లా బయల్దేరాలి.
మరి ఏడుకావస్తున్నా ఇంకా మంచాల మీద పడుకుంటే ఎట్లా?” అన్నది.
పిల్లలంతా లేచేశారు. త్వరత్వరగా కాలకృత్యాలు తీర్చుకుని, తమతమ బట్టలూ పుస్తకాలూ
సర్టేసుకున్నారు. ఫలహారాలు కానిచ్చి భోజనాలను టిఫిను కారియర్లలోకి సర్దుకుని కారెక్కారు.
“సీతమ్మగారూ, పిల్లలు జాగ్రత్త. మన ఇంటి తాళాలు ఆ ఊర్ల్ రాజమల్లయ్యగారి వద్ద
ఉంటాయి. ఏమైనా కావాలంటే మీరు ఆయన వద్దకు రవిని పంపండి. వారం రోజుల్లో నేనూ
వచ్చేస్తాలెండి” అని కేశవరావుగారు కారు కదలబోయే ముందు హెచ్చరిక చేశారు.
ప్రయాణం సరదాగానే గడిచింది. ఒంటిగంటకల్లా వాళ్ళ ఊళ్లో కారాగింది.
రాజమల్లయ్యగారి వద్దనుండి తాళాలు తీసుకుని తోటలోని తమ ఇంటి గుమ్మం ఎక్కారు
సీతమ్మగారూ పిల్లలూ. అప్పుడే ఇంటి లోపల్చుండి నీరు పారపోస్తున్న చప్పుడైంది.
రమ, “సీతమ్మగారూ, లోపల ఎవరో ఉన్నట్టు అలికిడి అవుతోంది” అన్నది.
“తాళాలు మన వద్దనే ఉన్నై తల్లీ, లోపలికి ఎవరు వెళతారు?” అని నవ్విందావిడ.
చెంబు ఠంగుమని కింద పడేసిన చప్పుడైంది ఇంటిలోపల. మళ్లీ బక్కెట్టు ఈడ్చినట్టు
కూడా వినిపించింది. ఈసారి సీతమ్మగారు నవ్వలేదు. పిల్లలంతా ఆమెచుట్టూ చేరి,
మాటాపలుకూ లేకుండా కాసేపు నిలబడ్డారు.
“సీతమ్మగారూ, లోపల ఎవరో దొంగలు ప్రవేశించి నట్టున్నారండీ మొన్న మా
స్నేహితురాలు వాళ్ల అమ్మా నాన్నలతో ఏలూరు వెళ్లి వచ్చేసరికి తాళమేసి ఉన్న ఇంట్లో
దొంగలుపడి ఇల్లంతా దోచుకుని వెళ్ళారట. రెండు రోజులు ఆ ఇంట్లోనే వంట చేసుకు తిని
ఇరుగు పొరుగు వారికి వారి చుట్టాలమని చెప్పారట” అన్నది రమ వీలైనంత తగ్గు స్వరంతో.
ఈ మాటలతో పద్నాలుగేళ్ల రవి కూడా భయపడ్డాడు. మిగిలిన పిల్లలంతా రవికన్న
చిన్నవాళ్లే. వాళ్లంతా కూడా భయం భయంగా చూశారు.
“సీతమ్మగారూ, లోపల ఎంతమంది దొంగలున్నారో యేమో! రవి అన్నయ్యా, మీరు
తప్ప మేమంతా చిన్నవాళ్లం. వాళ్లు పది మంది ఉంటే ఏం చెయ్యగలం?” అని రహస్యం
చెప్పేధోరణిలో అంది పద్మ.
సీతమ్మగారికి అంతా అయోమయంగా ఉంది. ఆమెకు కూడా భయంవేసింది.
కారుడైవరు రాజయ్య కారుకు తాళం వేసి, దూరాన చెట్టుకింద కూర్చున్న మాలీని పిలవడానికి
వెళ్లాడు. ఇక ఏదో ఆపద వచ్చిపడిందని అందరూ గజగజలాడారు. సీతమ్మగారు నాలుగు
మూలలా కలయచూశారు. వెయ్యి మామిడిచెట్లున్న అంత పెద్దతోటలోనూ ఆ ఒక్క ఇల్లే
ఉంది. తాళం చేతులు తన చేతుల్లోనే ఉండగా లోపలికి ఎవరెలా ప్రవేశించారో ఆమెకు
అర్థంకాలేదు.
ఈ లోగా ఇద్దరు మగవాళ్లెవరో మాట్లాడినట్లయింది. వెంటనే అటకమీది నుండి ఏవో
సామాన్లు దించినచప్పుడైంది కూడా.
“ఇంక అనుమానం లేదు. ఎవరో దూరారు లోపలికి. ఇప్పుడేం చెయ్యాలి మనం?
కవీ, నువ్వు వెంటనే వెళ్లి మన రాజమల్లయ్యగారిని తక్షణం పిలుచుకురా. వీలైతే ఇంకా
ఎవరినైనా ఇద్దర్ని కూడా తీసుకురమ్మను” అన్నది సీతమ్మగారు చాలా ఖంగారుగా తగ్గుస్వరంలో.
రవిని పంపేసి మిగిలిన నలుగురు పిల్లల్నీ వెంటేసుకుని కారు దగ్గరకెళ్లి నుంచుంది.
పది నిముషాల్లో రవీ, రాజమల్లయ్యగారూ, వారి పాలేర్లు ఇద్దరూ రెండు గట్టి కర్రలతోనూ
వచ్చేశారు.
రాజమల్లయ్యగారు ఆ ఇంటి సింహద్వారం వద్ద నిలబడి తాళం తెరిచారు. ఈ లోగా
సీతమ్మగారూ, పిల్లలూ కూడా అక్కడికి చేరారు. తలుపు తెరిచాక చుట్టల వాసన వచ్చింది.
కాని లోపలి నుండి బయటికి ఎవ్వరూ రాలేదు. రాజమల్లయ్యగారు పాలేళ్లను కర్రలతో
లోపలికి పొమ్మని సంజ్ఞచేశారు. వాళ్ళు లోపలికెళ్లేసరికి ఒక ఆడగొంతు “ఎవరూ?” అంది.
'రాజమల్లయ్యగారూ పాలేళ్లూ తెల్లబోయి నిలబడ్డారు. ఆ మాట్లాడినావిడ బయటికి వచ్చింది.
“అమ్మా, నువ్విక్కడికెల్లా వచ్చావమ్మా?” అంటూ పిల్లలంతా ఆవిడను వాటేసుకున్నారు.
ఆవిడ సావిత్రమ్మగారే.
“నేను ఉదయం పదింటికి వచ్చానర్రా. ఈ ఇంటి వెనక వాకిలి తాళం చెవులు
నాదగ్గిరే ఉన్నై అందుకని రాజమల్లయ్యగారికి తరువాత కబురు పెట్టవచ్చని దొడ్డిదారిన
ప్రవేశించాం. దొడ్డమ్మకి ఉన్న ఊరు మార్చి మంచి గాలీ వెలుతురూ ఉన్న (ప్రశాంత
వాతావరణానికి తీసుకెళ్లమని డాక్టరు చెప్పారు. నాతో దొడ్డమ్మా, అమ్మమ్మా, తాతయ్య కూడా
వచ్చారు. అక్కడి నుండి ఇద్దరు పనివాళ్లను కూడా తీసుకొచ్చాం. పొద్దుటి నుండీ సామాను
సర్టించాను. అమ్మమ్మ ఇప్పుడే స్నానం చేసి వంట మొదలుపెట్టింది. మీకు ఉత్తరం రాయాలంటే
టైములేకపోయింది” అన్నది సావిత్రమ్మ.
“లోపల దొంగలు జొరపడ్డారని రవి చెప్పాడమ్మా అందుకే కర్రలతో సహావచ్చాం.
అయినా కేశవరావుగారు మాకు కొత్తకాదు కదా, జబ్బు మనిషితో సహావచ్చారు. నాకు మాట
మాత్రం చెప్పి పంపక పోయారా? ఇంకా నయం మీ పనివాళ్ళు మీకన్నా ముందు మాకు
కనిపిస్తే వాళ్లకు దేహశుద్ధి అయ్యేది వాళ్ల అదృష్టం బాగుంది. అక్కగారికి ఈ ఊళ్లో వైద్యం
ఎలాగమ్మా?” అన్నారు రాజమల్లయ్యగారు.
“ఆమెకు వైద్యం ఏమీ అవసరం లేదుటండీ, కేవలం విశ్రాంతీ మంచి ఆహారంతోటి
కోలుకోవాలిట. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. మీకు కబురంపలేదని మరోలా అనుకోవద్దు.
మీ పిల్లలూ భార్యా క్షేమమేనా?” అన్నారు సావిత్రమ్మగారు.
ఆమె మాట్లాడుతూ ఉండగానే పిల్లలంతా “దొడ్డమ్మా” “అమ్మమ్మా” “తాతయ్యా”
అనుకుంటూ లోపలికి జొరబడి ఆ దొంగల కథను వాళ్లకు చెప్పి కడుపుబ్బా నవ్వుకున్నారు.
సాయంకాలం అయిదు గంటలకల్లా “పిల్లలూ ఇంకో దొంగను చూడండి. తొందరగా
రావాలి. అన్న తాతయ్య కేక విని అందరూ వీధి గదివైపు వెళ్లారు.
నిజంగా ఆశ్చర్యమే! వారం రోజుల తరువాత గాని రానన్న కెశవరావుగారు వచ్చెశారు.
“నాన్నా వారం దాకా రానన్నావే? ఇప్పుడే అమ్మతో చెప్పాను. ఎలా వచ్చేశావు?”
అంది రమ సంతోషంగా.
“ఇన్‌స్పెక్షన్ వాయిదా వేశారు. నా సెలవు మంజూరు చేశారని మీకారు కదిలిన
పదినిముషాలకే చప్రాసీ కాగితం తెచ్చి ఇచ్చాడు. ఇంకేముందీ తొందర తొందరగా తయారై
బస్సులో వచ్చేశా” అన్నారు కేశవరావుగారు.
పిల్లల కోరిక ప్రకారం, అమ్మానాన్నా కూడా వచ్చేశారు. అంతా కలిసి సరదాగా
మామిడి తోటలోనూ కొబ్బరి తోటలోనూ తిరిగి రావాలని బయల్దేరారు.
“సీతమ్మగారు. వంట చేస్తుందిగా అక్క దగ్గిర నేనూ నాన్నగారూ కూర్చుంటాం.
నువ్వుకూడా వాళ్ళతో కాస్త తిరిగిరావే సావిత్రీ. పిల్లలు నీకోసం వాచిపోయినట్లున్నారు”
అంది కేశవరావుగారి అత్తగారు.