గొప్పలు
విమల బడినుండి వస్తూనే “అమ్మా, మాక్లాసులో ఒక కొత్తమ్మాయి చేరింది. పేరు
కమల. చాలా బాగుంది మంచి పిల్లలాగా ఉంది” అన్నది.
“అయితే ఆ అమ్మాయిని రేపు మనింటికొకసారి రమ్మనరాదూ?” అంది విమల తల్లి
శ్యామల.
“ఏమోనమ్మా మంచి పిల్లలాగానే ఉందిగాని గొప్పలు చెప్పుకుంటుందమ్మా. అప్పుడే
పిలవడమెందుకులే. కొన్నాళ్లయ్యాక చూద్దాం” అంది విమల.
శ్యామల నవ్వి “మహా నువ్వు మాత్రం తక్కువా? వీలదొరికితే గొప్పలు చెప్పుకోవూ”
అంది తల్లి.
“నీకు తెలీదులే అన్నీ ఆపిల్ల చెప్పినట్టే ఎలా చెప్పుకోగలనూ? కొంత నే చెప్పేది కూడా
ఆ పిల్ల వినాలి” అంది విమల.
బళ్లో కమలా విమలా మాట్లాడుకుంటుంటే మిగిలిన పిల్లలు తెగ నవ్వుకునేవారు.
“మా నాయనమ్మ ముసలావిడ, అయినా నాకు బోలెకు కథలు చెప్పి చిన్నపిల్లలాగా మాతో
సరదాగా ఉంటుంది అని కమల అంటే, “మా నాయనమ్మ కూడా ముసలావిడే” అనేది గాని
ఆవిడను గూర్చి గొప్పగా చెప్పేందుకు ఏమీ దొరికేది కాదు విమలకి.
కమల తన నీలం కంచి పరికిణీ గురించి గొప్పగా చెప్పుకుంటే విమల వాళ్లమ్మను
తనకొక నీలం కంచి పట్టు పరికిణీ కుట్టించమని అడిగింది.
“నీలం రంగు ఎందుకే ఇంకా చాలా మంచి రంగులున్నై బూడిదరంగు పరికిణీ
కుట్టించుకో చాలా బాగుంటుంది” అంది తల్లి శ్యామల.
"కాదమ్మా కమల నీలం రంగే బాగుంటుందంది" అన్నది.
“ఆ అమ్మాయికి ఏది బాగుంటే అదేనీకుకావాలా? ఉత్త పిచ్చిపిల్లవే నువ్వు” అంది తల్లి.
ఒక రోజున విమల బడినుండి వస్తూనే అమ్మా, మన శేఖరం మామయ్య ఇంగ్లండులో
చదువుకున్నాడా? అని అడిగింది.
“లేదే, శేఖరం మామ ఊరికే ఇంగ్లండు చూసి వచ్చాడు. చదువుకోలేదక్కడ” అంది
తల్లి.
“మరి మన పెద్ద మామయ్య ఇంగ్లండులో చదువుకున్నాడా?” అని మళ్లీ అడిగిందా
పిల్ల
“లేదు. ఎందుకూ ఈ ప్రశ్నలన్నీ?” అని అడిగింది తల్లి,
“ఎందుకో చెప్తాగానీ మన అత్తయ్యలు టెన్నీసు ఆడగలరా?” అని మళ్లీ మరో
ప్రశ్నవేసింది.
“విమలా, ఎందుకీ ప్రశ్నలు? మన అత్తయ్య లెవ్వరూ టెన్నీసు ఆడడం నేర్చుకోలేదు.
చదరంగం, పులిజూదం ఆడతారంతే” అని ఆవిడ అసలు సంగతేమిటో ఊహించేసుకుంది.
“ఎంచక్కా కమలా వాళ్ళ మామలు ఇంగ్లండులో చదివారు, వాళ్ళ అత్తలంతా టెన్నీసు
ఆడతారు. మన మామలో, ఒక్కళ్లూ ఇంగ్లండులో చదవలేదు. ఒక్క అత్తకూ టెన్నీసు ఆడడం
రాదు... అని గుణిసింది విమల. అసలు సంగతి తల్లి ఊహించినట్లే అయింది.
“శేఖరం మామ ఇంగ్లండులో చదవలేదు గానీ, అమెరికా వెళ్ళిమూడేళ్లు అక్కడ ఉద్యోగం
చేసి వచ్చాడే. అయినా విమలా, నువ్వు కమల చేసినట్టన్నీ చెయ్యగలవుగాని, నీ మామలూ
అత్తలూ కమల మామలూ అత్తలూ చేసినట్టు ఎలా చెయ్యగలరే?” అని నవ్వింది శ్యామల.
మర్నాడు బడిలో, తన శేఖరం మామ అమెరికాలో ఉద్యోగం చేశాడనీ, తన అత్తలు
చదరంగం, పులిజూదం ఆడగలరనీ గొప్పలు చెప్పుకుంది విమల. కమల నవ్వి, “పులిజూదం
ఆడడం గొప్పకాదోయ్” అంది. విమల కాసేపు మూతి బిగించుకుని కూర్చుంది.
ఒకరోజు విమల వచ్చేసరికి తల్లి ఒక ఉత్తరం చదువుతోంది. కూతురు వంక తిరిగి
చూసి ముసిముసిగా నవ్వింది.
“ఎవరు రాశారమ్మా ఆ ఉత్తరం? నవ్వుతున్నా వెందుకమ్మా?” అంటూ తల్లిని గారంగా
అడిగింది విమల.
“మన శేఖరం మామకు పెళ్ళిటే. ఒక అందమైన చదువుకున్న అత్త వస్తోంది నీకు,
ఆమె పేరు లీల. ఆమెకు తొమ్మిది భాషల్లో మాట్లాడటం వచ్చుట తెలుసా?” అని తల్లి
చెపుతుంటే విమల సంతోషానికి అంతులేదు. బడికి వెళ్లి ఈ గొప్పవిషయాలు కమలకు
ఎప్పుడు చెప్పడమా అని తొందరపడింది.
మర్చాడు బళ్లో కమలకు చెప్పేసింది. విమల తన లీలత్తని గురించి “ఓస్ ఇంతేనా?
నాకూ ఉంది ఒక లీలత్త. ఆమె పది భాషల్లో మాట్లాడగలదు. ఆమె మీ అత్తకంటే కూడా చాలా
అందమైంది. ఎన్నో పరీక్షలు ఫస్టుగా పాసైంది. ఒక బంగారు పతకం కూడా వచ్చింది
తెలుసా, మా లీలత్తకు?” అన్నది కమల కళ్ళు తిప్పుతూ.
విమల మళ్లీ ఏం సంగతులు దొరుకుతాయా, కమలను ఎలా ఓడించాలా, అని
ఆలోచిస్తూనే ఉంది. ఈలోగా మాలీలత్త అందమైందంటే, మా లీలత్తే అందమైందనీ, మా
లీలత్త గొప్పదంటే, మా లీలత్తా గొప్పదనీ ఆ పిల్లలిద్దరూ వాదించుకుంటూనే ఉన్నారు.
శేఖరం మామ పెళ్లికి విమలా వాళ్లూ వెళ్లలేదు. వాళ్ల నాన్నగారికి సెలవుదొరకక.
కొన్నాళ్ల తరువాత విమల బడి నుండి ఇంటికి వచ్చేసరికి తల్లి చేతిలో ఒక ఉత్తరం
ఉంది.
“విమలా, నీ కోసమే ఎదురు చూస్తున్నానే, లీలత్త రేపు వస్తుంది. శేఖరం మామ
ఉత్తరం రాశాడు. అత్తకూడా రాసింది. నువ్వు చాలా అందంగా ఉంటావని శేఖరం మామ
చెప్పాడుట. నీకొక అందమైన పట్టుపరికిణి దానిమీదికి మంచి జాకెట్టూ కొని తెస్తోందిట”
అన్నది శ్యామల.
ఆ మర్నాడు ఆదివారం. లీలత్త ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తోంది
విమల. ఆ రోజు బాగా తొందరగా నిద్రలేచి తలంటుకుని అమ్మనడిగి కుట్టించుకున్న నీలం
కంచి పట్టు పరికిణి కట్టుకుంది. ఎంతో అందంగా తయారైంది. పదకొండు గంటల వేళ
ఇంటి ముండు కారాగిన చప్పుడై, ఎవరెవరో వచ్చిన అలికిడైంది. వెంటనే మేడ మీద నుండి
పరుగు పరుగున దిగింది విమల.
అరే! ఎంతో ఆశ్చర్యం! శేఖర్ మామతో లీలత్త వచ్చింది, ఆవిడ చెయ్యి పట్టుకుని
ఎగురుకుంటూ కమల కూడా వచ్చింది. అత్తచాలా అందంగా ఉంది! అనుకుంటూ మేడ
మెట్ల మీదే నిలబడిపోయిన కూతుర్నిచూసి, శ్యామల “రావే, లీలత్త కోసం అంత కలవరించి,
తీరా వస్తే అక్కడే నిలబడి పోయావేం?” అంది.
అప్పుడే కమలకూడా మెట్లవైపు చూసి ఆశ్చర్యపోతూ, “మా లీలత్త !” అన్నది.
లీలత్త చిరునవ్వుతో అందంగా మెరిసిపోతూ, “మీ ఇద్దరికీ లీలత్తనే” అంటూ విమల
వైపు నడిచింది. విమల ఆఖరి మెట్లు రెండూ దిగి అత్త అందించిన కుడి చెయ్యిపట్టుకుంది.
సంతోషంగా కమలా విమలా ఒకరి ముఖం ఒకరు చూసుకుని అత్తచేతులు పట్టుకుని
సంతోషంగా నవ్వుకున్నారు.
ఆ మర్మాడు అత్త తెచ్చిన గులాబీ రంగు కొత్త పరికిణీలు రెండూ కట్టుకుని ఇద్దరూ
చాలా స్నేహంగా బడికెళ్ళారు.