నేర్పకుండా వచ్చిన పాఠం
గుండు అనే పిల్లవాడుండేవాడు, వాడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. వాళ్ల
అమ్మానాన్నా అతిగారాబంచేసి గుండును చెప్పిన మాట వినకుండా చేశారు. వాడు ఏపనైనా
చెయ్యాలనుకుంటే అమ్మా నాన్నా ఒద్దన్నా చేస్తాడు.
కొన్నాళ్లకు వాళ్లమ్మానాన్నా విసుగెత్తి “ఒరేయ్ గుండూ నువ్వు కనుక మేము చెప్పినమాట
వినకపోతే నీకే నష్టంరా” అని చెప్పారు.
ఒకసారి గుండు “నేను హిమాలయపర్వతాలు ఎక్కాలమ్మా” అన్నాడు.
మరోసారి నేను “ఏడుసముద్రాలూ ఈదుతా నాన్నా” అన్నాడు.
ఇంకోసారి నేను “పక్షులకు మల్లే ఆకాశంలో ఎగురుతా” అన్నాడు.
తల్లీ తండ్రీ అవి చెయ్యలేని పనులని చెప్పితే కోపం తెచ్చుకున్నాడు.
ఒకనాడు గుండు ఊరి వెలుపల ఉన్న తోటలోకి వెళ్లాడు ఒక్కడూ. అక్కడ ఒక సపోటా
చెట్టుకింద పడుకుని ఆలోచిస్తున్నాడు.
అలాగే ఆలోచిస్తూ ఉండగా వాడి ముందు ఒక విమానమంత షక్షి వాలింది. దానిమీదకెక్కి
కూర్చున్నాడు గుండు. ఆ పక్షి అడిగింది “నీ పేరేమిటి?” అని “నా పేరు గుండు” అన్నాడు
వాడు.
అప్పుడా పక్షి “నువ్వు గుండువి, నీ తెలివి సున్న గుండుసున్న అనే పేరు నీకు ఇంకా
బాగుంటుంది” అనేసి పకపకా నవ్వింది.
గుండుకు పక్షిమీద చాలా కోపం వచ్చినా, దానిమీద ఎక్కి ప్రయాణం చెయ్యాలనే
'సరదా వలన నోరు మూసుకుని కూర్చున్నాడు.
ఆ పక్షి ఆకాశంలో చాలా దూరం ఎగిరింది. దానిమీద కూర్చుని గుండు కూడా
(ప్రయాణం సాగించాడు. ఆకాశంలో చాలా తెల్లని మేడలు కనిపించాయి. వాటి మధ్య నీలం
రంగు మేడలూ, బూడిద రంగు మేడలూ, ఎర్ర రంగు మేడలూ, ఇంకా ఎన్నోరంగుల మేడలూ
కనిపించాయి. ఆ పెద్ద పక్షిని గుండు కాస్త ఆగమని అడిగాడు. “అట్లా ఆగరాదు గుండుసున్నా”
అంది పక్షి
అట్లా చాలాసేపు సరదాగా తిరిగాడు గుండుసున్న తరువాత ఆ పక్షి తెల్లని ఎత్తైన
కొండలమీద అతనిని దింపి అతను పిలుస్తున్నా పలకకుండా ఎగిరిపోయింది.
తెల్లని కొండలు తెల్లనివికావు. నల్లని కొండలమీద మంచు కురిసి తెల్లగా కనుపించాయి.
అక్కడే కూర్చున్నాడు గుండు. తన పేరు గుండు అన్నది మరచిపోయి, పక్షి పెట్టిన పేరే
జ్ఞాపకం ఉంచుకున్నాడు. మాట్లాడలంటే ఎవ్వరూ కనుపించలేదు. ఆకలిగా ఉంది. తినడానికి
తన దగ్గర ఏమీ లేదు. అయ్యో అమ్మనడిగి వచ్చేటప్పుడు కాసిని రొట్టెలు తెచ్చుకోవలసింది
అనుకున్నాడు.
చాలాసేపు అట్లాగే కూర్చుని కూర్చుని విసుగెత్తి ఆ కొండల్లో ఏముందో చూద్దామని
లేచాడు. కాస్త దూరంలో ఇంకా కాస్త ఎత్తైన కొండ కనిపిస్తే దాన్ని ఎక్కాలని వెళ్లాడు. కాస్త
పైకి ఎక్కేసరికల్లా అమ్మబాబో ఒక పెద్ద రాక్షసుడు కనుపించాడు. గుండుసున్నకు చాలా
భయం వేసింది. కాళ్లూ చేతులూ వణికాయి. ఆ రాక్షసుడికి పెద్ద తలకాయ ఉంది. కాళ్ళూ
చేతులూ పొట్టిగా ఉన్నాయి. కాని భలేలావుగా ఉన్నాడు. వాడి నోరు చాలా వెడల్పుగా ఉంది.
నోట్లో పళ్లు అరటిపళ్ల పెళ్లల లాగా ఉన్నాయి. కళ్లు పెద్ద గుండు చెంబుల్లాగా ఉన్నాయి. వాడి
శరీరపు రంగు మసిబొగ్గులాగా ఉంది. వాడు గుండుసున్నవైపు చూచినప్పుడు వాడికళ్లు
బావిగిలకల లాగా గిర్రునతిరగాయి. గుండుసున్నాకు ఏడవాలన్నా గొంతు పెగలలేదు. ఒక్క
అడుగు ముందుకు కూడా వెయ్యలేదు. అంత మంచుకురిసే కొండల్లో కూడా వాడికి చెమటపోసి
కాలవలలాగా కిందకు పారింది. ఆ రాక్షసుడు గుండుసున్నా దగ్గరకు వచ్చి “చిన్న పిల్లలు
ఇంతదూరం పెద్దవాళ్లకు చెప్పకుండా రావచ్చా?” అని అతనిని ఒక్క తోపు తోశాడు.
ఆ తోపుతో గుండుసున్నా పెద్ద సముద్రంలో పడ్డాడు. పడ్డాడుగాని నీళ్లలో మునగలేదు.
ఆ నీరు రంగు రంగులుగా కనిపించింది. చేత్తో తీస్తే చేతులోకి రాలేదు. ఆ సముద్రంమీద
తేలుతూ తేలుతూ ఎంతదూరం వెళ్లాడో! ఈ లోగా అతనికి ఆకలి చాలా ఎక్కువగా వేసింది.
ఆ పక్షి వదిలేసిందిగానీ, మళ్లీ ఇంటికి తీసుకెళ్లేదెవరు? తనను మళ్లీ అమ్మానాన్న
వద్దకు తీసుకువెళ్లకపోతే ఎట్లా? అట్లా ఆలోచించేసరికి మరీ భయంవేసి ఒకటే ఏడుపు
మొదలు పెట్టాడు గుండుసున్నా. వాడి ఏడుపు సముద్రపు హోరులో కలిసిపోయింది.
ఇంకా కాసేపటికి ఇంద్రధనుస్సులో ఉండే అన్ని రంగులూ కంటికి మెరుపులాగా
కనిపించాయి. గుండుసున్నా ఏడుపుమాని కళ్లు నలుపుకుని చూశాడు.
ఆ సముద్రం పై అందమైన ధగధగ మెరిసే చెప్పులు వేసుకుని ఒక స్త్రీ కనిపించింది.
ఆమెకు పాదాలవరకు జడ ఉంది. ఆమె తలలో అన్నిరకాల రంగురంగుల పూలూ ఉన్నై.
నవ్వితే మెరుపు మెరిసినట్లు వెలుగు వస్తుంది. ఆమె చేతులు దూదిలాగా మెత్తగా ఉన్నై, ఆమె
అందం వర్ణించడానికి వీలులేదు. ఆమె తన మెత్తని చేతితో గుండుసున్నా తల నిమిరి
“బాబూ బెంగ పెట్టుకోకు. పెద్దవాడివైనదాకా పెద్దలమాట విను.” అని అంటూ ఉండగా
గుండుసున్నాకు సముద్రమూ కనుపించలేదు. ఇంకేమీ కనుపించలేదు. కళ్లు నలుపుకుని
చూచేసరికి వాళ్ల అమ్మ తన మంచం మీద కూర్చొని ఉంది.
“ఏం బాబూ, గట్టిగా ఏడ్చావు? కల ఏమైనా వచ్చిందా?” అని అడిగింది వాళ్లమ్మ.
గుండుకు వాళ్లమ్మను చూసేసరికి |ప్రాణంలేచి వచ్చినట్రైంది. తను ఇంట్లోనే ఉన్నట్లూ,
అప్పుడే తెల్లవారుతున్నట్లూ తెలుసుకున్నాడు. తనని 'గుండుసున్నా' అని ఎవ్వరూ పిలవరని
ధైర్యం వచ్చింది.
ఆ రోజు నుండీ “అక్కడికి పోతాను, ఇక్కడికి పోతాను" అని అల్లరి పెట్టడం మానేశాడు. అంతే కాకుండా కల ద్వారా తన కోరికలన్నీ తీరినై. కోరికలు తీర్చటమేకాక ఆ కల గుండుకు పెద్ద పాఠం నేర్పింది.