అసలు ఎలుక
రమావాళ్ళ అమ్మ ఊరెళ్లింది. తాతకు జబ్బుచేసిందని టెలిగ్రాం వస్తే రవినీ రమనూ
పక్కింటి దొడ్డమ్మగారికి అప్పగించి వెళ్ళింది. వాళ్ళ నాన్న ఆఫీసుపని ఎక్కువగా ఉందని
రోజూ రాత్రి తొమ్మిదింటిదాకా ఇంటికి రావడం లేదు. ఎనిమిదేళ్ళ రవీ ఆరేళ్ల రమ
భయపడతారని పక్కింటి దొడ్డమ్మగారు వాళ్ళ రజనిని తోడు పంపుతోంది రోజూ.
ఆ రోజు ఏడు గంటలైంది, చీకటిపడిపోయి చాలా సేపైంది. రవీ, రమ, రజని రాకను
అంత దూరాన చూసి చాలా సంతోషించారు.
రజని రాత్రి పొద్దుపోయిందాకా ఊరికే కూర్చోవడం ఎందుకని ఏదో పని తెచ్చుకుని
చేసుకుని పోతుంది. ఆవేళ రజని కుడిచేతి కింద తెల్ల కాగితాలూ, కవర్లూ పెట్టుకుంది. ఆ
చేతికే ఒక చిన్న ప్లాస్టిక్ బుట్ట తగిలించుకుంది ఆ చేతి వేళ్లలో ఒక చాకలెట్ల పొట్లం, కాస్త
రంగుదారం పట్టుకొంది. ఇక ఎడమ చేతికింద ఒక కథల పుస్తకం పెట్టుకుని, ఆ చేతిమీదే
కుట్టుకునే గుడ్డ ఒకటి వేసుకుని ఆ చేతిలోనే ఒక పెన్నూ పెన్సిలూ ఒక సూదీ పట్టుకుంది.
ఎడం చేతిలోని సూదిలోకి కుడిచేతిలోని దారం వేళ్లతో ఎక్కించుకుంటూ చాక్లెట్ల పొట్లం.
పెన్సిలూ పదిలంగా చేతుల్లోనే ఉంచుకుని గుమ్మంలో అడుగు పెట్టింది.
పిల్లలిద్దరూ సంతోషంగా “రా అక్కా ఆలస్యమైతే నువ్వు రావేమో ఇవాళ్ళ. అని,
భయపడ్డాం” అంటూ ఎదురెళ్ళారు.
పిల్లల పడకగదిలోకి అడుగు పెట్టిన పదహారేళ్ల రజని ఒక్కసారి కెవ్వుమని కేకేసి.
అక్కడే ఉన్న ఒక పెద్ద స్టూలెక్కి నిలబడింది. ఆ కేక విన్న పిల్లలిద్దరూ తమ మంచాలెక్కి నిలబడి |
భయంతో ఏమైందని అడిగారు.
రజని చేతుల కింద కవర్లూ, కాగితాలూ, కథల పుస్తకం చేతులకు తగిలించుకున్న
బుట్టా, బుట్టలోని రకరకాల కుట్టుసామానూ, చేతుల్లోని పెన్నూ పెన్నిలూ, సూదీ దారమూ ,
ఒకటేమిటి అన్నీ నేలపాలై నలు దిక్కులా చెల్లాచెదురుగా పడి ఉన్నై, చాకలెట్లు ఆ అమ్మాయి
ఓణీ కుచ్చెళ్లలో కొన్నీ నేలమీద కొన్నీ పడ్జై. ఇంకా భయం తగ్గని రజని, స్టూలు మీదే నిలబడి
కాలితో కాలుతుడుచుకునే పట్టావైపు చూపింది. అక్కడ ఒక ఎలుక ఉంది. ఇంకా కదలకుండా
అక్కడే ఉంది.
“ఛీ, ఎలుకను చూసి దడుసుకున్నానేమిటి?” అని అనుకున్నా స్టూలు మీదనుండి
దిగబుద్ధికాలేదు.
'మంచాలెక్కిన పిల్లలిద్దరూ పొట్ట పగిలేలా నవ్వుకుంటూ దిగీ ఆ ఎలుకను చేత్తో
పట్టుకున్నారు. “ఇది అసలు ఎలుక కాదక్కా మైనపుది. అయినా అసలు ఎలుక ఐతే మాత్రం ,
దాన్ని చూసి భయపడతారా?” అని నవ్వారు.
“అరే, నిజంగా ఎలుక కాదూ? అచ్చంగా ఎలుకలాగే ఉంది సుమా” అంటూ స్టూలు ,
దిగి “అయ్యో నా బుట్టలో కుట్టు సామానంతా ఎలా పడిపోయిందో” అని విచారించింది.
రవీ రమ గది నలుమూలలకూ పాక్కుంటూ వెళ్లి ఆ సామానంతా బుట్టలోకెత్తి కవర్లూ
కాగితాలూ బొత్తి చేసి రజని కిచ్చారు. మిగతా సామాను రజని ఏరుకుంది తరవాత అందరూ
కూర్చుని చాకలెట్లు తిన్నారు. రజని కథల పుస్తకంలోంచి చిన్న చిన్న కథలు చదివి వినిపించింది.
తరువాత కబుర్లు చెపుతూ తను తెచ్చిన గుడ్డమీద ఒకటో రెండో పువ్వులు కుట్టింది. ఈ లోగా
పిల్లలిద్దరూ నిద్రపోయారు. తాపీగా కూర్చుని రెండు ఉత్తరాలు రాసుకుని కవర్లలో పెట్టి
అంటించింది. వాటి మీద ఎడ్రసులు రాసి తను తెచ్చుకున్న గుడ్డమీద పెన్సిలుతో రెండు
డిజైన్లు గీసుకుంది. ఈలోగా రవీ వాళ్ళ నాన్నగారు వచ్చారు. తన సామానంతా సర్దుకుని
కూనిరాగం తీసుకుంటూ ఇంటికి వెళ్లాలని లేచి నుంచుంది. మళ్లీ అక్కడే కాళ్లు తుడుచుకునే
పట్టా దగ్గిరే ఎలుకను చూసి ఉలిక్కిపడింది. “ఛీ, మైనపు ఎలుకను చూసి నేను భయపడతానా?”
అనుకుంటూ మళ్లీ కూనిరాగం తీసుకుంటూ బయటికెళ్లిది.
కాని మైనపు ఎలుకను రవి తన దిండు కింద పెట్టుకుని నిద్రపోయాడు! ఈసారి
రజనికి కనిపించింది అసలు ఎలుకే!!