ఎవరు నగ



శాంతా, సుమిత్రా ప్రాణ స్నేహితులు. సుమిత్ర భాగ్యవంతుల పిల్ల. శాంత సామాన్య కుటుంబీకుల పిల్ల. ఇద్దరూ ఒకే బళ్లో చదువుతున్నారు, ఒకే క్లాసు కూడా.

ఒక రోజున బళ్లో నాటకాలు వేశారు. వార్షికోత్సవం సందర్భంలో సుమిత్ర తన రవ్వల దుద్దులను శాంతకు పెట్టి శాంత చెవులకున్న చిన్న నక్షత్రాలను తను పెట్టుకుంది. ఇళ్లకు వెళ్లబోతూన్నప్పుడు “సుమిత్రా నీ రవ్వల దుద్దులు తీసుకోవే” అని శాంత అంటే “రేపు ఇద్దుగాని లేవే అసలే పొద్దు పోతోంది” అని సుమిత్ర హడావిడిగా వెళ్లిపోయింది.

శాంత ఇంటికి వచ్చాక రాత్రి దీపపు వెలుతురులో తన ముఖాన్ని అద్దంలో చూసుకుంది. ఆ రవ్వల దుద్దులు తెగ మెరిసిపోతూ ముఖానికి కొత్తకళ నిచ్చాయి. వాటిని చెవులకు ఉంచుకునే నిద్రపోయింది.

శాంత తల్లి మాణిక్యమ్మగారు ఉదయమే లేచి గుడికిపోతూ, “శాంతా తమ్ముడ్ని కాస్త ఆడించమ్మా నేను గుళ్లో పూజ చేయించుకొస్తాను” అని వెళ్లిపోయారు. తండ్రి ప్రసాదరావుగారు ఏదో పని ఉందని బయటికి వెళ్లారు.

ఆ రోజు శాంతా వాళ్ల బడికి సెలవు. అందుకని బద్ధకంగా తమ్ముడు మురళిని ఆడిస్తూ కూర్చుంది. ఏడాది నిండని మురళి అక్కను వదలడు.

రాత్రి అమ్మ “ఆ ఖరీదైన దుద్దులు వెంటనే సుమిత్రకిచ్చెయ్యాల్సింది ఇంటికి ఎందుకు తెచ్చావమ్మా? ఎరువు సొమ్ము బరువుచేటన్నారు. పెద్దలు. తీసి జాగ్రత్తగా దాచి రేవు సుమిత్రకిచ్చెయ్యి. ఇంకెప్పుడూ అలా ఇంటికి తేకు” అంది. అప్పుడు తను “చెవులకుంటేనే పదిలంగా ఉంటాయమ్మా రేపు సుమిత్రే వచ్చి తీసుకెళ్తుంది” అని అంది. ఆ విషయం గుర్తొచ్చి చెవులు తడుముకుని చూసుకుంది. కుడి చెవికి దుద్దు లేదు! సీల మాత్రమే ఉంది!

చిన్న మురళిని మధ్యహాలులో వదిలేసి దుద్దు వెతుక్కుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ ఇల్లంతా తిరిగింది. అది దొరకలేదు. మళ్లీ నిస్పృహతో హాల్లోకి వచ్చింది. అప్పటిదాకా హాయిగా ఆడుకుంటున్న తమ్ముడు దగ్గుతూ ఆయాసపడుతూ ఊపిరికోసం తంటాలు పడుతున్నాడు. పద్నాలుగేళ్ల శాంత నిలువునా ఒణికిపోయింది!

“రవ్వల దుద్దు పోయింది, దాని ఖరీదు వేల రూపాయలు చేస్తుంది. తన తండ్రి తీర్చగలిగిన సొమ్ము కాదది” అని అసలే ఒక పక్క కుళ్లుతుంటే, తన ముద్దుల తమ్ముడు ఇలాగైపోయాడు!

“భగవంతుడా, నా తమ్ముడ్ని బతికించు” అనుకుంటూ దుఃఖం పార్లుకొస్తూంటే ఏం చేయడానికీ తోచక వాడిని ఒళ్లోకి తీసుకుంది. “కనకమ్మా!” అని పని మనిషిని పిలిచింది. అది వస్తూనే “అయ్యో! బాబుకేమైందమ్మా? ఏదో మింగినట్టున్నాడు” అంది.

వెంటనే శాంతవాడి గొంతులోకి వేలు పెట్టింది. వాడు వెంటనే భళ్లున కక్కేశాడు. ఆ కక్కులో ఎదురుగా రవ్వల దుద్దు పడి ఉంది!

ఒకసారి ప్రాణం కుదుట పడింది శాంతకు. తన (ప్రాణంతో సమానమైన తమ్ముడు కాసిని మంచినీళ్లు తాగి భుజం మీద పడుకుని మళ్లీ కేరింతాలు మొదలెట్టాడు. వాడు కక్కేసిన దుద్దును కడిగి రెండోది కూడా తీసి రెండింటినీ అల్మారాలో పదిలంగా దాచింది. కనకమ్మ ఇల్లు కడిగేసింది.

అప్పుడే తల్లి వచ్చింది. వస్తూనే “అదేమిటే శాంతా నీ కళ్లు ఎర్రగా ఉన్నాయి?” అని అడగటం, కనకమ్మ జరిగిన విషయం చెప్పటం అయింది.

“ఎరువు సొమ్ము బరువు చేటమ్మా” అని మళ్లా అని “పోయి స్నానం చేసి నువ్వే వెళ్లి సుమిత్ర దుద్దులు తిరిగి ఇచ్చేసిరా” అన్నారు మాణిక్యమ్మగారు.

శాంత స్నానానికెళ్లింది. ఈ లోగా సుమిత్రే వచ్చింది వాళ్లింటికి. జరిగిన సంగతి విని చంటిపిల్లవాడిపైన జాలి కనబరిచింది. “రాత్రి శాంత తీసుకోమంటే, తొందరేముందని నేనే తీసుకోలేదండీ” అని తప్పు తనదే నన్నట్టు అన్నది సుమిత్ర.

అప్పుడే స్నానం ముగించి వచ్చిన శాంత “ఎరువు సొమ్ము బరువు చేటని తెలుసుకున్నానే సుమిత్రా” అంది.

“పొరపాటు నాదేనే, అసలు నీ చెవులవి తీసి నేను పెట్టుకుని, నావి నీకు నేనేగా పెట్టాను? అంతే కాకుండా రేపు తీసుకుంటానని నువ్విస్తున్నా తీసుకోకుండా వెళ్లిపోయాను” అంది సుమిత్ర.

“రాత్రి అద్దంలో చూసుకుని దుద్దులు బాగున్నాయని నేనెంత మురిసి పోయానో సుమిత్రకు తెలియదు కదా!” అని మనసులోనే అనుకుంది శాంత.

“అసలు నగలు పెట్టుకుని బడికి వెళ్లడం ఒకళ్లవి ఒకళ్లు మార్చుకోవడం మంచిది కాదమ్మా, మళ్లీ ఎప్పుడూ అలా చేయకండి” అని మెల్లగా మందలించారు మాణిక్యమ్మగారు.

Responsive Footer with Logo and Social Media