గాలిపటం
ఉమతల్లి దొడ్లో వని చేసుకుంటోంది. ఉమ మంచం మీద ఇంకా ఉదయం
ఆరుగంటలైనా దొర్లుతూనే ఉంది. కళ్లు మూసుకుంది.
ఇంతలోకి ఆకాశంలో గాలిపటం రంగురంగులది ఎగురుతూ ఉన్నట్టు కనిపించింది.
ఉమ గాలిపటం వైపే ఉండడం వల్ల తను ఏవైపుకు సాగిపోతోందో చూసుకోలేదు. కొంత
"సేపటికి ఒక పూల తోటలో ఉన్నట్టు తెలుసుకుంది. ఎటుచూచినా ఎంత మంచిపూలు! అబ్బ
ఇన్ని మంచి పూలు ఒకేచోటుకు ఎలాగ వచ్చాయా అని ఆనందంతో ఆశ్చర్యపడింది. ఒక
పక్క ఎర్రనివీ, పసుపుపచ్చనివీ, మరొక పక్క గులాబీవీ, తెల్లనివీ గులాబీలు ఆకు కనిపించకుండా
పూసి వున్నాయి. ఇంకా ఎన్నెన్నో రకరకాల పూలూ రంగు రంగుల పూలూ కుప్పలుగా పూచి
ఉన్నాయి.
ఉమ పువ్వులు కొయ్యాలని చెయ్యిజాపింది. ఇంతలోకే ఒక చక్కటి అందమైన అమ్మాయి
అక్కడికి వచ్చి “ఏయ్ అమ్మాయ్ ఎవరు నువ్వు?” అన్నది. ఆ అమ్మాయిని ఉమ ఇదివరకెన్నడూ
చూడలేదు. అంత చక్కని అమ్మాయిని కూడా చూడలేదు. అలాగే నోరు తెరచుకుని ఆశ్చర్యంగా
చూస్తోంది. ఆ అమ్మాయి “అదేమిటమ్మా అలా భయపడిపోతావ్? మాట్లాడు నాతో; రోజూ
ఆడుకొంటూ స్నేహంగా ఉండవచ్చు” అంది.
అప్పుడు ఉమ కొంచెం తేరుకుని “నా పేరు ఉమ మరి నీపేరో?” అంది. “నా పేరు
బాల ఇది మా బడితోట - ఇక్కడ పిల్లలమంతా చేరి అన్ని రకాల మొక్కలూ వేసి పువ్వులు
పూయిస్తాం. కాని ఎవరమూ వాటిని కోయనే కోయం పూజకు తప్ప.”
ఉమ - “మరి కోసుకోకపోతే పువ్వులెందుకూ” బాల “అయ్యో తోటలో పూలన్నీ
కోసేస్తే తోట అందం పోదూ? ఎప్పుడైనా కావాలంటే మూల మూలల్లో ఉన్న పూలు
కోసుకోవచ్చును.”
ఉమ “మరి మీ బళ్ళో పిల్లలంతా యేరీ? నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు?”
బాల - “మా బడి పిల్లలు పొద్దున్నే రారు. వేళకు వస్తారు.”
ఇంతలో గాలిపటం కనిపించింది. ఉమకు “అరే ఇంతసేపూ మరిచిపోయానే”
అనుకుంటూ దాని వంక చూసింది. ఇంతలో “ఉమా, ఓ ఉమా, మళ్లీ రేపురా” అని బాల కేక
దూరాన్నుంచి వినిపించింది. అటు తిరిగి చూసేసరికి తను మళ్లీ గాలిలో గాలిపటంలా
తేలిపోయింది. ఎందుకో చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ గాలిపటం ఎటుపోతోందో అని
చూసేసరికి అక్కడ గాలిపటం లేదు. మళ్లీ కిందకు చూసేసరికి అక్కడ బోలెడు మంది తన
యీడు ఆడపిల్లలు ఆడుకుంటున్నారు.
ఉమ ఆ పిల్లల దగ్గరకు పోయి “అమ్మాయిలూ, ఇదే ఊరు?” అన్నది. వాళ్ళు “ఇది
నీలినగరం” అన్నారు. ఇంతలో గణగణమని గంట వినిపించింది. అందరూ పరుగుపరుగున
వెళ్లిపోయారు. ఒక్క అమ్మాయి మాత్రం ఉమ దగ్గరకొచ్చి “రావమ్మా నువ్వు కూడా మా బడికి”
అన్నది.
ఉమ - “ఇది మీ బడా? నీ పేరేమిటి? అన్నది. “నా పేరు నీలతార” అన్నది ఆపిల్ల
ఉమ - “మీ బడికి నేను రావచ్చా?”
నీలతార - ఓ! తప్పకుండా, మా పంతులమ్మ చాలా మంచిది.
ఉమ నీలతారతో బడిలోకి పోయింది. వాళ్ళ పంతులమ్మ చక్కగా నవ్వుతూ, “నీల, ఆ.
పాప ఎవరు?” అన్నది.
నీల - మన బడివద్ద కనబడితే పిలుచుకొచ్చానమ్మా. ఈమె పేరు ఉమ.
పంతులమ్మ - ఉమా, నువ్వు కూడా చదువుకుంటావా?
ఉమ - చదువు తానండీ.
పంతులమ్మ ఒక లెక్క ఇచ్చింది. ఉమకు ఆ లెక్కరాలేదు. కళ్లవెంబడి నీళ్ళు వచ్చినవి .
పంతులమ్మ అది చూసి, అదేమని అడిగింది.
ఉమ - నాకీ లెక్క రాదండీ.
పంతులమ్మ - “అయ్యో లెక్క రాకపోతే ఏడుస్తారా? నన్నడగాలమ్మా నేను నీకు
నేర్పుతాను” ఇలా రా! అంటూ పంతులమ్మ ఉమను (ప్రేమగా చేరదీసి ఆ లెక్కను నేర్పింది.
నేర్పి “ఉమా నువ్వు చాలా మంచి దానవు. లెక్కరాకపోయినా ఎవరి దగ్గర నుండీ చూసి కాపీ
కొట్టలేదు. కాని తొందరపడిపోకుండా బాగా ఆలోచిస్తే తెలియని విషయాలు కూడా
తెలుస్తాయమ్మా” అన్నది.
ఉమ - మీరు చాలా మంచివారండీ.
మళ్లీ ఉమకు గాలిపటం కనిపించింది. ఇంతసేపు ఎక్కడికి పోయిందో గాలిపటం అని
ఉమ అనుకుంటూ ఉండగానే ఒక పల్లెటూరు కనిపించింది. కొద్దిక్షణాల్లో ఆ ఊరు దగ్గరకు
వచ్చేసింది. అక్కడ కూడా చాలా మంది ఆడపిల్లలు కనిపించారు. ఉమకి ఒక్క నిమిషంలో
వాళ్లంతా ఉమచుట్టూచేరి “నీ పేరేమిటి పాపా?” అని అడిగారు. “నా పేరు ఉమ” అన్నది.
ఆ పిల్లలు తమతమ పేర్లను చెప్పారు. పాప, లత, రమ, లక్ష్మి, సీత ఇంకా ఎన్నెన్నో అన్నీ
రెండక్షరాల పేర్లే - ఆ పిల్లలంతా చాలా మంచివాళ్ళు, ఎంతో కలిసిమెలిసి ఆడుకుంటున్నారు.
ఒకళ్ల ఆటవస్తువులు మరొకళ్లకిచ్చుకుంటున్నారు. కూడా తెచ్చుకున్న తినుబండారాలు ఒకళ్లవి
ఇంకొకళ్లకు పెట్టుకుంటున్నారు.
ఉమకు కూడా చాలా వస్తువులూ తినుబండారాలూ ఇచ్చారు. ఉమ వాళ్లను “ఇది ఏ
ఊరు” అన్నది. వాళ్లు “ఇది పిల్లల రాజ్యం మేమంతా మా ఊరు అంటాం దీన్ని” అన్నారు.
ఉమ - “పిల్లల రాజ్యమా” అన్నది ఆశ్చర్యంగా
లక్ష్మీ - లీలా ఉమకు పిల్లల రాజ్యం అంటే ఏమిటో చెప్పవే.
లీల - ఉమా పిల్లల రాజ్యంలో పిల్లలంతా పెద్దవారికి మల్లేనే అన్ని పనులూ చేసుకుంటాం.
పెద్దవారి మాట (శ్రద్ధగా వింటాం వారు చెప్పకుండానే మా చదువు మంచి చెడ్డలను మేమే
చూచుకుంటాం. మేమెక్కడికి వెళ్లినా మమ్మల్ని చాలా గౌరవంగా చూసి ముద్దుగా (ప్రేమగా
“వీళ్లు మంచి పిల్లలు” అని అందరూ అంటారు. మాకు తిట్లూ, చీవాట్లూ ఎప్పుడూ తగలవు.
ఉమ - నిజంగానా? అబ్బ నేను కూడా మీలాగే ఉంటాను.
ఇంతలోకి మళ్లీ గాలిపటం కనిపించింది. దాన్ని చూస్తూ “అయ్యో ఇంతసేపటినుండి
ఇల్లు వదలి తిరుగుతున్నాను. అమ్మా నాన్నా నాకోసం వెతుక్కుంటారో ఏమో” అనుకుంది.
ఇంతలో తన ఇల్లు కనిపించింది. గట్టిగా “అమ్మా, అమ్మా” అని అరచింది. లోపలినుండి
ఉమ తల్లి “అదేమిటే పొద్దున ఏడుగంటలైనా లేవకుండా కలవరింతలొకటి?” అంటూ వచ్చింది.
'ఉమ సిగ్గుపడిపోయింది. “అయ్యో నేనింకా నిద్రపోతున్నానా?” అని ఆశ్చర్యపడి
“పరవాలేదులే ఇక ముందు నేను మంచి పిల్లనై పోతానుగా” అని గంతులేసి పళ్లు తోముకోడానికి
వెళ్లింది.
ఉమ తల్లి నవ్వుకుంటూ “ఓయబ్బో! ఎంత మంచి దానవవుతావో చూస్తాగా” అన్నది.
ఉమ అన్నట్లుగానే చాలా మంచి పిల్ల అయింది. బళ్లో బడితోట (శ్రద్ధగా పెంచింది.
చదువులో నిదానంగా ఆలోచించి అన్ని పాఠాలూ వల్లెవేసింది. బడిలో పిల్లల (ప్రభుత్వానికి
బడిపెద్ద అయింది.