పల్లెటూళ్లో పద్మ



పద్మ బడికి సెలవులిచ్చారు, కాని వాళ్ళ నాన్నగారికి సెలవులు లేవు, పద్మను ఒక్కదాన్నీ | కార్లో ఎక్కించి డ్రైవరుతోటి తాతగారి ఊరికి పంపారు వాళ్ళ అమ్మా, నాన్న, పద్మ తాతగారిల్లు చేరేసరికి రాత్రి అయ్యింది. కాస్త పెరుగన్నం తిని నిద్రపోయింది.

పద్మ తాతగారు కోదండరామయ్యగారు, ఆయన భార్య సీతమ్మగారు. మొదటి నుంచీ పల్లెటూళ్లోనే అలవాటుగా ఉండిపోయారు. వారికి గొడ్లసావడిలో బోలెడన్ని పశువులున్నై సీతమ్మగారు ఆవుల్నీ, గేదెల్నీ పేర్లు పెట్టి పిలుస్తారు.

పద్మ ఆ మర్నాడు నిద్రలేచేసరికి వాళ్ళ బామ్మ ఆవుపాలు పితుకుతోంది. “పద్మా తొందరగా పోయి పళ్లు తోముకురామ్మా, గుమ్మపాలు తాగుదువుగాని” అన్నారు. ఏడేళ్ల పద్మకు గుమ్మపాలంటే ఏమిటో తెలియలా. “నానమ్మా గుమ్మపాలంటే ఏం పాలు?” అని అడిగింది.

“అప్పటికప్పుడు పిండిన పాలు నురుగుతో ఉన్నవి” అన్నారు సీతమ్మగారు.

పద్మ త్వరగా పోయి పళ్లుతోముకొచ్చింది. వాళ్ల బామ్మ పటిక బెల్లం, ఏలకుపొడి, కుంకంపువ్వూ కలిపి ఒక గ్లాసునిండా గుమ్మపాలు ఇచ్చారు పద్మకు. అవి తాగేసింది పద్మ, తరువాత ఏమి చెయ్యాలా అని ఆలోచించింది. తాతగారింట్లో ఆడుకునేందుకు పిల్లలు లేరు. వాళ్ల పాలేరు గొడ్ల సావిడిలో పని చేసుకుంటున్నాడు. వాడి దగ్గిరికెళ్లి వాడు చేసే పనిని చూస్తూ నుంచుంది.

“పద్ధమ్మగోరు, తమరు ఎప్పుడొచ్చినారండీ?” అని అడిగాడు పాలేరు వెంకన్న,

“రాత్రి” అని మెల్లగా ఒక దూడ దగ్గిరికెళ్లి “వెంకన్నా నేను దీనికి గడ్డీ తవుడూ పెడతాగ” అంది పద్మ,

“తవరికి బయమేస్తాదం డి” అన్నాడు వెంకన్న,

“లేదు వెంకన్నా, నేను పెద్దదాన్నని, నన్ను అమ్మా, నాన్నా ఇక్కడికి ఒక్కదాన్నే పంపారు. నాకు భయం లేదు. కొంచెం తవుడు నా చేతులో పొయ్యి” అని అరచేతుల్లో తవుడు పోసుకుని దూడ మూతి దగ్గిర పెట్టింది పద్మ ఆ దూడ పద్మ చేతిలోని తవుడు నాకడం మొదలెట్టింది. పద్మ కిలకిలమని నవ్వి, ఒక గంతేసి మళ్లీ దూడ ముందు చెయ్యి జాపింది.

“ చెప్తే వినండమ్మగోరు, మీకు బయమేత్తది ” అన్నాడు వెంకన్న

“లేదురా, అది నా చెయ్యి నాకితే నాకు చక్కిలి గిల్లేసిందిరా. అందుకని చెయ్యి లాక్కున్నా మళ్లీ చక్కిలిగిల్లి పెడుతోంది చూడరా వెంకన్నా” అంటూ కేకలేసి కేరింతలు కొట్టింది పద్మ,

కోదండ రామయ్యగారు దూరాన్నుండి చూసి పద్మ ధైర్యాన్ని మనస్సులో మెచ్చుకున్నారు. ఆయన కూడా పాకలోకి వెళ్లారు, పద్మను ఇంట్లోకి తీసుకెళ్లడానికి.

“తాతయ్యా, ఈ దూడ పిర్రగిల్లినా అక్కడే ఉండి కదలదు. దానితోకమటుకు అటూ ఇటూ ఆడిస్తుంది. దాని తోక ఊపినప్పుడు నా మూతికి... తగిలింది తాతయ్యా” అంటూ పొట్ట పట్టుకుని విరగబడి నవ్వింది పద్మ,

“దీనికి అన్నీ విచిత్రాలుగానే ఉన్నై ఆ బస్తీలో ఆవులూ గేదెలూ కూడా కనిపించవు కాబోలు” అని “పద్మా నీకు నీళ్లు పోసి జడవేస్తానమ్మారా” అని లోపలికి పిలుచుకెళ్లారు సీతమ్మగారు.

పద్మ నీళ్లుపోసుకుని ముత్యంలా తయారై వచ్చేసరికి తాతయ్య ముందు సావిడిలో ఉయ్యాల బల్లమీద కూర్చుని ఉన్నారు.

“తాతయ్యా నీకు మంచి కథలొచ్చా?” అని అడిగింది పద్మ,

“ఓ! నీకు చెప్పనా?” అని అడిగారు.

“నాకు కథలంటే భలే ఇష్టం” అంది పద్మ

“సరే అయితే విను.”

అనగా అనగా ఒక చిన్నమ్మాయి ఉందిట. దాని పేరు తళతళ. ఒకనాడు వాళ్ళమ్మ “అమ్మాయీ నువ్వు మన వీధిచివరి పళ్ల దుకాణానికెళ్లి అరడజను అరటి పళ్లు కొను. ఆ తర్వాత కూరల దుకాణంలో ఒక అరకిలో వంకాయలూ ఒక అరకిలో ఆలుగడ్డలూ కొను. చిల్లర జాగ్రత్తగా లెక్కపెట్టి తీసుకురా. వస్తూ వస్తూ దారిలో అత్రయ్యగారింటికి పోయి మన పనివాడు అప్పన్న ఊరి నుంచి ఎప్పుడొస్తాడో అడుగు” అని డబ్బులిచ్చింది.

తళతళ తల్లినడిగి పళ్ళకూ కూరలకూ ఎంత డబ్బివ్వాలో తెలుసుకుంది. గుమ్మందాకా వెళ్లాక చినుకులు పడుతున్నట్టు తెలుసుకుని మళ్లీ అమ్మ దగ్గిరకొచ్చింది.

“అమ్మా గొడుగివ్వవే వాన వస్తోంది” అన్నది.

“సరే తీసుకెళ్ళు. కాని జాగ్రత్తగా పట్టుకురా. అది నీకు మద్రాసు మామ కొనిచ్చిన గొడుగు” అంది.

తళతళ తను చెయ్యాల్సిన పనులేవో ఒకసారి తనలో తను వల్లించుకుంది. ఒకటి, అరవైపైసల అరటిపళ్లు కొనాలి. రెండు, రెండు రూపాయల్లో అరవైపైసలు పోతే మిగిలేది ఒక రూపాయి నలభైపైసలు. వాటితోటి వంకాయలూ ఆలుగడ్డలూ కొనాలి. మూడు వస్తూ వస్తూ దారిలో అత్తనడిగి అప్పన్న ఎప్పుడొస్తాడో అడగాలి. నాలుగు, గొడుగు జాగ్రత్తగా పట్టుకురావాలి. “అమ్మా వెళ్తున్నా తలుపేసుకో” అంటూ తళతళ బయల్దేరింది. ఒక బుట్ట ఎడం భజానికి వేసుకుంది. గొడుగు కుడి చేత్తో పట్టుకుంది.

మొదట పళ్లుకొంది. అరవైపైసలిచ్చింది తరువాత అరవైపైసలకు వంకాయలు కొంది. అర్థరూపాయిచ్చి అర్థకిలో ఆలుగడ్డలు కూడా కొంది. వాటిని బుట్టలో వేసుకుని “ఒకటి రెండు మూడు నాలుగు అని తన పనులు లెక్కపెట్టుకుంది. త్వర త్వరగా మళ్లీ గొడుగు తెరిచి ఇంటివైపు బయల్దేరింది. ఈలోగా వాన బాగా ఎక్కువైంది. మెరుపులు మొదలైనై అక్కడే ఎవరిదో ఇల్లుంటే వాళ్ల వరండాలోకివెళ్లి గొడుగు మడిచి నుంచుంది. కొంచెం సేపటికి వాన తగ్గాక అత్తా వాళ్లింటికెళ్లింది.

తన బుట్ట కిందపెట్టి “అత్తా అప్పన్న ఊరి నుండి ఎప్పుడొస్తాడో అమ్మ అడగమంది” అంది.

“అయ్యో ఇప్పటిదాకా వానకదా, నిన్నెందుకు పంపిందే! అప్పన్న ఊరి నుండి వచ్చాడు. మీ ఇంటికే వెళ్లాడు” అంది అత్త, ఒసే, తళతళా నువ్వు బయట కాలుపెడితే మొరుపులొస్తయ్యే, నువ్వు మెరిసినట్టే అవ్వీ మెరుస్తయ్యే” అంది అత్త హాస్యంగా.

“పో అత్తా నువ్వు మరీను. వాన మళ్లీ వస్తుందేమో నేను వెళ్లిపోతా. మా అమ్మ నాకోసం ఎదురు చూస్తుంది” అంది తళతళ.

“సరే ఇవ్వాళ్ల కాస్త మిఠాయి చేశానే. ఈ గిన్నె కూడా పట్టుకెళ్లు. అమ్మా నాన్నా కూడా రుచి చూస్తారు.” అని అత్త ఒక బొక్కెన లాటి గిన్నె ఇచ్చింది.

తళతళ మళ్లీ ఒకసారి చూసుకుంది తను వట్టుకెళ్లాల్సిన నాలుగు వస్తువులూ ఉన్నాయోలేవో, చిల్లర సరిగ్గా ఉందో లేదో అని లెక్కేసుకుని వెళ్లిపోయింది.

ఇంట్లో అడుగుపెట్టి, అమ్మకు పళ్లూ, కూరగాయలూ, చిల్లరా ఇచ్చేసింది. అత్త ఇచ్చిన మిఠాయి గిన్నె కూడా ఇచ్చింది. అమ్మ అప్పుడడిగింది “గొడుగేదే తళతళా?” అని.

అప్పుడు గాని గుర్తురాలేదు తళతళకు, తను గొడుగు ఎక్కడో మరిచిపోయినట్టు. కాని నాలుగు వస్తువులు తెచ్చింది. ఏడుపు ముఖం పెట్టింది. వాళ్లమ్మ “వాన ఆగిపోయే వేళకి నువ్వెక్కడున్నావే?” అని అడిగింది. “వాన పూర్తిగా వెలిసేసరికి అత్తావాళ్లింట్లో ఉన్నాను” అని ఆలోచించి అంతకుముందు పళ్ల దుకాణం దాటాక వాన ఎక్కువైతే ఆ పక్క నున్న ఇంటి వరండాలో నిలబడ్డానమ్మా, అక్కడ మరిచిపోయి ఉండవచ్చు” అంది. వాళ్లమ్మ అప్పన్నను చూసిరమ్మని పంపితే ఆ గొడుగు అక్కడే దొరికిందని వాడు తీసుకొచ్చాడు. అప్పుడు తళతళ ముఖం తళతళా మెరిసింది సంతోషంతో.

“అమ్మా నేను ఇక ముందెప్పుడూ అజాగ్రత్తగా ఉండనమ్మా” అని అంది.

“తాతయ్యా, తళతళ అంతవానలోనూ భయపడకుండా ఎవరింట్లోనో ఆగింది మరి అన్ని వస్తువులూ తెచ్చింది, ఆ గొడుగు కూడా తెస్తే బాగుండేది” అంది.

“పొరపాటుగా మర్చిపోవడం అందరం చేస్తూనే ఉంటామమ్మా. కోపం తెచ్చుకోకుండా తన పొరపాటు తెలుసుకుని వాళ్ళమ్మకు తనే చెప్పింది ఇక ముందు అజాగ్రత్తగా ఉండనని. అదీ ఆ పిల్ల మంచితనం” అన్నారు పద్మ తాత కోదండరామయ్యగారు.

“మంచి కథ చెప్పావు తాతయ్యా” అని పద్మ మురిసిపోయింది.

Responsive Footer with Logo and Social Media