లత మీది లత



ఉదయం ఎనిమిది గంటలైనా ఇంకా లత మంచం పైన పడుకుని ఉన్నది. పాపం దాదాపు రెండు నెలల నుండి జ్వరంతో బాధపడుతోంది.

లతకు తోట అంటే ప్రాణం - చిక్కుడు విత్తులు నాటింది. అవి మొక్కలై లత పడుకున్న కిటికీలో నుండి చూస్తే కనుపించేటట్లు పందిరికి పాకినై. లత చాలాసేపు ఆలోచించింది. ఆ చిక్కుడు తీగను గురించి పందిరి వెయ్యకపోతే అది ఆకాశంలోకి ఎంత దూరం పాకుతుందో కదా అనుకుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి.

కిటికీ దగ్గరకు నీరసంగా అడుగులో అడుగు వేస్తూ వెళ్ళింది లత, చిక్కుడు తీగను చూసేందుకు. ఆశ్చర్యపడేటట్లు ఆ చిక్కుడు తీగ ఆకాశంలోకి నిలువుగా పెరిగి ఉంది. మెల్లిగా కిటికీలోకి ఎక్కి ఆ చిక్కుడు తీగను పట్టుకుని నిలబడింది. “అరే, ఈ చిక్కుడు తీగ నిచ్చెనలాగ గట్టిగా ఉన్నదే” అనుకుని ఆశ్చర్యపోయింది. దానిపైకి ఎక్కుకుంటూ చాలా దూరం వెళ్లింది. ఆకాశాన్ని అందుకోవాలని కోరిక పుట్టింది. పైకి పోయినకొద్దీ మంచిగాలి, అన్ని రకాల పువ్వుల సువాసనలతో నిండుకున్నట్లు వీస్తోంది. లత ఆనందానికి అంతులేదు. ఇక ఇక్కడ ఉండిపోతే హాయిగా ఉంటుందనుకుంది. కాని ఈ లోగా దూరాన్నుండి పెద్దకేకలు వినిపించాయి. ఆ కేకలు వినిపించిన వైపుకు చూసింది. చూసీ చూడడంతో ఆమెకు ఎక్కడలేని భయమూ పుట్టుకొచ్చింది. కాస్త దూరంలో ఒక వందమంది రాక్షసులున్నారు. వాళ్ళు నల్లగా మొద్దుగా ఉన్నారు. నెత్తి మీద జుట్టు నిటారుగా నిలిచి ఉండి. వాళ్ళ కళ్ళు కోడిగుడ్లంత లేసి ఉన్నాయి. అవి చింతనిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. వాళ్ళ నోట్లో పళ్ళు మధ్యవి జానెదేసి పక్కలవి బారడేసి ఉండి కిందికి వేళ్ళాడుతున్నాయి. వాళ్ళలో వాళ్ళు ఎందుకో తగవులాడుకుంటూ కేకలేస్తున్నారు. కేకలు వేసినప్పుడల్లా వాళ్ళనోళ్ళలో నుండి భగ, భగమని మంటలూ పొగలూ వస్తున్నాయి.

లతకు ముందు భయం వేసినా ఈ రాక్షసుల్ని చూసేసరికి కొంత విచిత్రమనిపించింది కూడా. వాళ్ళమాట ఒక్కటి కూడా అర్థంకావడం లేదు. వాళ్ళేమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రయత్నం చేసింది. కాని లాభం లేకపోయింది. వాళ్ళ కేకల్ని కాసేపు విని, తనుకూడా వాళ్ళలాగానే కేకలు వెయ్యాలని ప్రయత్నం చేసింది. కొంత సేపటికి రాక్షసులతోపాటు తనుకూడా కేకలు వెయ్యడం మొదలుపెట్టింది.

లత కేకలు కొంతసేపటికి రాక్షసులకు వినిపించినాయి కాబోలు వాళ్ళు వాళ్ళ తగవులాట ఆపి లతవైపు చూశారు. చూడడంతోనే వాళ్ళముఖాల్లో సంతోషం కనుపించింది. లత కూర్చున్న దగ్గిరికి వచ్చారు. లత మీద చెయ్యివేశాడు ఒక పెద్ద రాక్షసుడు. లత కెవ్వున కేకపెట్టింది. అప్పుడక్కడ ఉన్న రాక్షసులంతా గొల్లున నవ్వారు.

ఆ రాక్షసులు ఇలా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

ఒకడు : ఈగిరి పిగిరి ల్లగర శుగురు ధ్ధగర పిగిరి రిగిరి కిగిరి దిగిరి.

రెండవవాడు : చిగిరి న్నగర పిగిరి ల్లగర కగర దగర మగర రిగిరి,

మూడవవాడు : చగర కృ్కగర నిగిరి పిగిరి ల్లగర కగర దుగురు?

మిగిలిన వాళ్ళు : అగర వుగురు నుగురు చాగర లగర చగర కృగర నిగిరి పిగిరి ల్లగర ముగురు డ్రౌగొరొ స్తుగురు న్నగర దిగిరి.

ఈ భాష వింతగా ఉన్నది లతకు. తనను గూర్చే మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కాని ఆ భాష ఏమిటో అని శ్రద్ధగా వింటూ కూర్చుంది.

ఇంతలో ఒక చిన్న రాక్షసుడిని ముందుకు తోసి మిగిలిన వాళ్ళు ఇలా అన్నారు. “నుగురు పుగురు వెగిరి శ్ళిగిరి ఆగర పిగిరి ల్లగర తొగొరొ మాగర ట్లాగర డుగురు” చిన్న రాక్షసుడు లతతో “నువ్వు ఎవరు” అన్నాడు.

లత : నేను ఈ చిక్కుడు తీగ ఉండే ఊర్లో ఉంటాను. ఇది మా దొడ్లోదే.

రాక్షసుడు : అంత భయపడే పిల్లవి ఇంత దూరం ఎందుకు వచ్చావు?

లత : ముండు మిమ్మల్ని చూస్తే భయం వేసింది. మీ నోళ్ళల్లో నుండి మంటలూ పొగలు ఎందుకొస్తాయి?

రాక్షసుడు : మేముతినే వస్తువుల్ని నోట్లోనే వండుకోవడానికీ కాల్చుకోవడానికీని. మా దేశంలో నిప్పు చేసుకోం.

లత : మీ నోళ్ళల్లో అంతంత పొడుగాటి పళ్ళు ఉన్నాయి కదా. వాటితోటి ఎట్లా బతుకుతారు? మీ వంటికే గుచ్చుకోవూ?

రాక్షసుడు : మాకు కూరలు మాంసమూ కోసుకోవడానికి చాకులూ కత్తిపీటలు ఉండవు. మా పళ్లతోటే చీరి తినేస్తాం. మేము ఎప్పుడూ వెల్లకిలా పడుకుని నిద్రపోవాలి. అందుకని అవి మాకు గుచ్చుకోవు.

లత : మరి మీ గుడ్లు కోడి గుడ్లంత లేసి ఉన్నాయి కదా ఎర్రగా భయమేసేటట్లు వాటితో కూడా ఏదైనా పని చేస్తారా?

రాక్షసుడు : ఓ! మా కళ్ళకు ఎంత దూరంగా ఉన్న వస్తువైనా కనిపిస్తుంది. ఆ వస్తువు లోపల ఏముందో కూడా కనుపిస్తుంది.

లత : అయితే నా పొట్టలో ఏముందో చెప్పు చూద్దాం.

రాక్షసుడు : నీ పొట్టలో ఏమీ లేదు. అంతా ఖాళీ.

లత : అవును చాలా ఆకలిగా ఉంది. నేను మళ్లీ మా అమ్మదగ్గరకు పోవాలి.

రాక్షసుడు : మరి ఇక్కడికి ఎందుకొచ్చావు?

లత : ఊరికేనే - నేను తొందరగా వెళ్లాలి గాని మీ భాష నాకు నేర్పుతావా?

రాక్షసుడు : ఓస్‌, ఇంతేనా? మా వాళ్ళకు నీ భాష రాడు. నీకు మా వాళ్ళ భాష రాదు. మా భాషలోని గర, గిరి, గురు, గెరె, గౌరొ మొదలైనవి తీసి పారేస్తే మీ భాష అవుతుంది.

లత : అంతేనా? నాకు వచ్చేస్తుంది మీ భాష, నాగర కుగురు మీగిరి భాగర షగర వగర చ్చేగెరె సింగిరి దిగిరి (అంటూ చప్పట్లు కొట్టింది సంతోషంతో

మిగిలిన రాక్షసులంతా పరుగు పరుగున లత దగ్గరికి వచ్చి తమ భాషలో మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళు చూస్తే భయం వేసేటట్టున్నారు. కాని, చాలా మంచివాళ్ళు లాగున్నారు. వాళ్ళ దగ్గరే ఉండిపోవాలని ఉన్నా, మళ్ళీ అమ్మా నాన్నా బెంగ పెట్టుకుంటారేమోనని అనుకుంది. పువ్వుల వాసనలతో కూడిన చల్లని గాలిని తనివితీరా పీల్చి. రాక్షసులతో మా అమ్మనూ నాన్ననూ కూడా మీ దేశం తీసుకొస్తానని చెప్పి, “పోగొరా తుగురు న్నాగర పోగొరొ తుగురు న్నాగర” అనుకుంటూ కళ్ళు తెరచి చూసేసరికి లత తల్లి ఎదురుగా ఉన్నది.

“ఏమ్మా లతా ఇందాక ఎనిమిది గంటలకు వచ్చి చూస్తే మేలుకుని ఉన్నావు. కాసిని పాలు తాగుతావేమోనని కాచి తెచ్చేసరికి మళ్ళీ పడుకుండిపోయావు. మళ్ళీ వంటింట్లో నుంచి వచ్చేసరికి 'గరగరా గరగరా” అంటూ ఏమో అరుస్తున్నావు. కలవచ్చిందా అమ్మా?

లత : అవునమ్మా కలవచ్చింది. కలలో కథకూడా వచ్చిందమ్మా. గమ్మత్తుగా ఉంది. నాకు జ్వరం ఉన్న సంగతే మరచిపోయానమ్మా.

తల్లి : ఏది చూడనియ్యి. జ్వరం జారింది. కడుపునిండా తిని ఎన్నాళ్ళయిందో నా తల్లి. కాసిని పాలుతాగు.

లత పాలు తాగేసి మళ్ళీ నిద్రపోయింది. ఈసారి కలలూ రాలేదు. రాక్షసులూ రాలేదు. కళ్ళు తెరచేసరికి వాళ్ళ డాక్టరుగారు ఎదురుగా ఉన్నారు. అమ్మతోటీ నాన్నతోటీ వారం రోజుల్లో అమ్మాయి బడికి పోవచ్చును. రెండు రోజులు పాలూ పళ్ళూ ఇచ్చి తరువాత భోజనం మెల్లిగా పెట్టవచ్చని చెప్తున్నారు.

జ్వరం తగ్గాక లత, తన స్నేహితులతో తన కలలో కథను చెప్పింది. అప్పటి నుండీ బళ్ళో పిల్లలకు “లత మీద లత కథ చెప్పులతా” అనో లేక “కలలోని కథను చెప్పులతా” అనో అడగడం అలవాటైంది.

Responsive Footer with Logo and Social Media