మచ్చపిల్లి కథ



అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ముసలమ్మ ఇంట్లో ఒక పిల్లి ఉండేది. అది ఒకసారి నాలుగు బుల్లి పిల్లలను పెట్టింది. అవి చాలా ముద్దుగా తెల్లగా ఉండేవి. వాటిలో ఒకదానికి మాత్రం ఎడమ చెవి మీద ఒక చిన్న నల్లని మచ్చ ఉండేది. ఆ నాలుగు పిల్లి కూనలలోకి చెవిమీద మచ్చ ఉన్నది అతి చురుకైనది. అది ఎప్పుడూ మిగిలిన మూడింటిని తోసి పారేసేది. ఒక్కొక్కసారి అవి మూడు పడుకుని ఉంటే ఈ మచ్చ ఉన్న కూన పోయి వాటిని గోళ్ళతో పీకి లేపేది.

ఆ కూనలు నాలుగూ కాస్త పెద్దవైనాయి. వాటిని వదిలిపోయి వాటి తల్లి రాత్రల్లా తిరిగి తిరిగి పొద్దున వచ్చేది.

ఒకనాడు తల్లి వెళ్ళిపోగానే చెవిమీద మచ్చ ఉన్న పిల్లికూనకు పెత్తనాలు చెయ్యాలని బుద్ధిపుట్టింది. “అలా అలా పోయి హాయిగా తిరిగి వద్దాం రండి” అని మిగిలిన మూడు కూనలను అడిగింది.

“అమ్మలేకుండా మేము రాం. నువ్వు కూడా పోకు ఎవరేనా ఏదైనా చేస్తారు. దారి తెలియకపోతే మళ్ళీ ఇంటికి రాలేం” అన్నాయి. “మీరెప్పుడూ ఇంతే, ఉత్తపిరికి దద్దమ్మలు. ఎప్పుడూ ఇంట్లో మూల కూర్చుంటారు. మీరు రాకపోతే నేనొక్కదాన్నే పోతాను లెండి” అని బయలుదేరింది.

ఆ రాత్రల్లా తెగ తిరిగింది. దారిలో చాలా పొలాలు వచ్చాయి. వాటిలో కనిపించిన మొక్కనల్లా కొరికి రుచి చూసింది. ఒకచోట దురదగుంటాకును కొరికింది. గంటసేపటి దాకా నోరు ఒకటే దురదపెట్టింది “మ్యావ్‌, మ్యావ్‌” అని అరిచింది. దానిగోల వినేవాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు.

అంతటితో దానికి బుద్ధిరాలేదు. “ఇంటికి తిరిగివెళ్ళాం, అమ్మ దగ్గరకు పోదాం” అని దానికి తోచనే లేదు. ఇంకా అక్కడా ఇక్కడా స్వేచ్చగా తిరగాలనే అనుకుంది. కళ్ళు మూసుకు ఎగురుకుంటూ పోయింది. పోయిపోయి ఒక బురద గుంటలోపడింది.

“మ్యావ్‌, మ్యావ్‌” మని జాలి వేసేటట్టు మొత్తుకుంది. కాని ఎవ్వరూ దాని గోల వినలేదు. చాలా కష్టపడి ఎలాగైతేనేం ఆ బురద గుంటలో నుండి పైకి వచ్చింది. ఒళ్ళంతా బురద ఐంది. చక్కటి పట్టువంటి తెల్లజుట్టు ఏమీ కనపడలేదు. అది చూసుకుని “మ్యావ్‌, మ్యావ్‌” అని కాసేపు ఏడిచింది. కాసేపు నేల మీదపడి అటూ ఇటూ దొర్లింది. ఇంకా ఇంత దుమ్ము ఒంటి నిండా పట్టింది. తెల్లవారి బాగా వెలుగు వచ్చింది.

ఏమీ తోచక కొంతసేపు కూర్చుంది. అమ్మ దగ్గరకు పోతాను కాసేపు తిట్టినా ఒళ్ళంతా నాకి శుభ్రం చేస్తుంది అనుకుంది. ఇంతలోకే ఒక ఒడ్లురాశి కనపడింది. దానిని చూచి ఏమనుకుందో ఏఘో పరుగుపరుగున పోయి దానిని ఎక్కడం మొదలు పెట్టింది. సగందాకా ఎక్కి కిందకి జర్రున జారింది. ఇట్లా రెండు, మూడుసార్లు జారేసరికి ఒంటిన ఉన్న తడి బురదకు ఒడ్లు దట్టంగా అంటుకున్నాయి.

దానికి పిచ్చి ఎక్కినట్రైంది. మ్యావ్‌ మ్యావ్‌ మంటూ దూరంగా ఆడుకుంటూ ఉన్న పిల్లల గుంపు దగ్గరకు పోయింది. ఒక చిన్న అమ్మాయి దానిని పట్టుకుని “అన్నా, నాకు పిల్లికూన దొరికింది” అని కేకవేసింది. వాళ్లన్న దానిని చూచి “ఛీ, అది మురికిగా ఉంది. ఇంటికి తీసుకుపోయి స్నానం చేయించేదాకా ఎత్తుకోకు” అన్నాడు. “మరి దానిని ఇంటికి తీసుకు వెళ్ళటం ఎలాగ?” అని చెల్లి అడిగింది. అన్న కొంచెం సేపు ఆలోచించాడు. ఆలోచించి అటూ ఇటూ చూచాడు.

ఇంతట్లోకి పిల్లలంతా ఆట ఆపి చుట్టూ మూగారు. “ఒకతాడు వెదకండి. పిల్లి మెడకు కట్టి ఇంటికి తీసుకుపోదాం” అన్నాడు అన్న. ఒక చిన్న తాడు తెచ్చి దాని మెడకు కట్టి అన్నా చెల్లీ ఆ పిల్లికూనను తమ ఇంటికి లాగుకుపోతున్నారు. పిల్లలంతా చప్పట్లు కొడుతూ కూడా పోయారు.

ఇంటికి వెళ్లాక పిల్లి కూనకు నీళ్లుపోసి, సబ్బుతోరుద్ధి, బురదంతా కడిగి వేశారు. పిల్లికూన చలితో వణికిపోయింది. అప్పుడు అన్నా చెల్లీ ఒక పాతబట్ట తెచ్చి దానిని నెమ్మదిగా తుడిచారు. దాని మెడకొక చిన్న తోలుబెల్టు కట్టి, ఒక స్తంభానికి కట్టివేశారు. దాంతో పిల్లికూన ఉత్సాహమంతా ఉడిగిపోయింది. “ఇంక తల్లి దగ్గరకు పోవడం కాదుకదా ఇష్టం వచ్చినట్లు తిరగడానికి కూడా వీలేలేదు. ఆకలి తెగవేస్తోంది. ఇంక అమ్మ దగ్గరకు పోనేలేదు!” అని భయం వేసింది. “మ్యావ్‌ మ్యావ్‌, మ్యావ్‌ మ్యావ్‌” అని అంతులేకుండా ఏడుపు మొదలు పెట్టింది.

పనిమనిషి ఇల్లు 'చిమ్ముతోంది. పొద్దున్నే దానికి ఈ పిల్లిగోల అసహ్యం అనిపించింది. చీపురుతో ఒకటివేసి “ఊరుకో, వెధవ గోలా నువ్వూను” అని కోపపడింది. పిల్లి పిల్లకింకా భయంవేసింది. “ఈ ముసలి దానికన్న ఆ పిల్లలే మంచివాళ్ళు” అనుకుని “మ్యావ్‌ మ్యావ్‌” అని వాళ్ళకోసం అరిచింది.

అన్నా చెల్లీ దానిగోల ఎక్కువ కావడం విని పరుగున వచ్చారు. “పాపం దానికి ఆకలి వేస్తోంది గాబోలు” అని ఇంట్లోకిపోయి కాఫీ కాచే వాళ్ళమ్మనడిగి కాసిని పాలు తెచ్చి ఒక కొబ్బరిచిప్పలో పోసి దాని ముందు పెట్టారు. తల్లి కోసం బెంగ పెట్టుకుని ఏడ్చే పిల్లిపిల్లకు పాలుతాగాలనిపించలేదు. అది వాటిని ముట్టనే లేదు.

క్రమంగా పొద్దెక్కింది. రోజూ తల్లి డొక్కలో పడుకుని నిద్రపోయేవేళ ఐంది. అది తలచుకుని ఇంకా భయపడింది. గొంతెత్తి అంతు లేకుండా “మ్యావ్‌ మ్యావ్‌” అని ఒకటే ఏడుపు మొదలెట్టింది. దానికి ఏమి కావాలా? అని పిల్లలిద్దరూ చాలా ఆలోచించారు. “పాపం చలివేస్తోందిరా అన్నయ్యా దానికేదైనా చొక్కా తొడగాలి” అంది చెల్లి “అంత చిన్న చొక్కా ఎక్కడుందే మన దగ్గర?” అన్నాడు అన్న

“మా బడిలో కుట్టు నేర్చుతారుగా, నేను బొమ్మకు కుట్టిన చొక్కా ఒకటి ఉంది అది సరిపోతుందేమో అంది చెల్లి. “తే చూద్దాం” అన్నాడు అన్న

చెల్లి చొక్కా తెచ్చింది. ఇద్దరూ కలిసి దానికా చొక్కా బలవంతాన తొడిగారు. పిల్లి కూనకు చొక్కా తొడుక్కునే అలవాటు లేదుకదా! పైగా చొక్కా కొంచెం బిగువైంది. అందుకని దానికి మరీ చీకాకు పుట్టింది. “మ్యావ్‌, మ్యావ్‌” అంటూ గోల మొదలు పెట్టింది. అన్నా చెల్లీ మాత్రం “తెల్లని పిల్లికి ఎర్రని చొక్కా ఎంతో బాగుంది” అని చాలా ఆనందించారు.

చెల్లికి దానిని ఇంకా అలంకరించాలనిపించింది. తన బొమ్మల గదికి ఫోయి ఎన్నో, సామానులు తెచ్చింది. బొమ్మల చేతులకు, మెడకూ కట్టే రంగు రంగులపూసలు తెచ్చి పిల్లికూన మెడకు, కాళ్ళకు కట్టింది. అప్పుడది ఇంకా ముద్దుగా కనిపించింది. “బొట్టూ కాటుకాకూడా పెట్టాలి. మా బుల్లిపిల్లికి” అంది. అన్న “బలే బలే చాలా బాగుంటుంది” అన్నాడు. బొట్టూ కాటుక పెట్టి చెల్లి అద్దం చూపెడుతూ “చూచుకో అమ్మా ఎంత బాగున్నావో!” అంది.

పిల్లిపిల్లకు అద్దంలో తన అవతారం చూచుకునేసరికి ఎంతో ఏడుపువచ్చింది.

“మ్యావ్‌ మ్యావ్‌” మని ఇల్లు ఎగిరిపోయేటట్టు అరచింది. ఆ గోల విని ఆ పిల్లల అమ్మా నాన్నా వచ్చారు. చక్కగా పెండ్లికూతురులా అలంకరింపబడిన ఆ పిల్లి పిల్లను చూచి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకున్నారు. పిల్లికూన “మ్యావ్‌” అని ఎగిరింది. దాని మెడలో బెల్టుకున్న గజ్జెలు ఘల్‌ ఘల్‌మని మోగుతున్నై. పెద్దవాళ్ళకు కూడా ఆ పిల్లికూన భలే గమ్మత్తుగా ఉంది.

కాని పిల్లల అమ్మానాన్నా ఎక్కువ సేపు నవ్వలేదు. “మనకు మల్లే అలంకరించితే పిల్లికి ఇష్టం ఉండదు. ఎలా బాధపడుతోందో పాపం చూశారా? అందుకే మీరు పోసిన పాలు అది తాగనేలేదు. అట్లా పిల్లికూనలను హింసించరాదమ్మా! అది ఇంకా చిన్నది వాళ్ళమ్మను వదలి ఉండలేదు ఎలా తప్పిపోయిందో పాపం వదిలి వెయ్యండి” అన్నారు. అది విని పిల్లలిద్దరూ కూడా “పాపం వదిలి వేద్దాం వాళ్ళమ్మా నాన్నా దగ్గరకు పోతుంది” అన్నారు. మళ్ళీ చెల్లికి

ఒక సందేహం వచ్చింది. “ఇంక కాసేపటికి రాత్రివచ్చి చీకటి పడుతుంది దానికి దారి కనపడదు. కనుక రేపు పొద్దున్నే వదిలేద్దాం” అన్నది. “పిల్లికి రాత్రే కళ్ళు బాగా కనపడతాయటే మాసైన్సు పుస్తకంలో రాసి ఉంది” అని అన్న అన్నాడు. అన్న తనను హాస్యం చేస్తున్నాడనుకుని చెల్లి వాళ్ళ నాన్నకేసి చూచింది. ఔనమ్మా నిజమే పిల్లులకు పగలు కన్న రాత్రే కళ్ళు బాగా కనపడతాయి. అదిగో చూడు! దాని కంటిపాపలు ఎట్లా సన్నగా ఉన్నాయో. రాత్రి అవే పెద్దగా ఔతాయి” అన్నాడు. “ఐతే వదిలేద్దాం” అని బెల్ట్ కు కట్టినతాడు విప్పింది. కట్టు విప్పడంతోటే “బతికానురా దేవుడా” అనుకుని పిల్లిపిల్ల ఒక్క గెంతు గెంతి పారిపోయింది. పిల్లలు చేసిన అలంకారాలు దాని ఒంటిని అట్లాగే ఉండిపోయాయి. పిల్లి కూనకు దారి తెలియడం ఎంతో కష్టమైంది.

రాత్రల్లా “మ్యావ్‌, మ్యావ్‌” మంటూ తిరిగి, తిరిగి ఎంతో కష్టంమీద తెల్లవారేసరికి ఇల్లుజేరుకుంది.

దాని అవతారం అలంకారం చూచి తల్లీ మిగిలిన మూడు కూనలూ ఆనవాలు పట్టక “ఘర్‌ ఘర్‌” మని పోట్లాటకు వచ్చాయి. “నేనేనే అమ్మా” అన్నట్లు మచ్చపిల్లి తల్లిని చూచి జాలిగా “మ్యావ్‌ మ్యావ్‌” అని ఏడ్చింది. ఆ ఏడ్చువిని గొంతు గుర్తించి తల్లిపిల్లి (ప్రేమతో డొక్కలోకి తీసుకు నాకింది. “అమ్మయ్య ఇప్పటికి మా అమ్మ దొరికింది” అనుకుని ఒక్కసారి బావురుమని ఏడ్చింది. “అట్లా ఒక్కదానివి ఎక్కడకూ పోకూడదమ్మా నువ్వింకా పాలుతాగే పిల్లదానివి. అని తల్లి (ప్రేమతో చెప్పింది.

మచ్చపిల్లికి బాగా బుద్ధి వచ్చింది. “అమ్మను వదలి ఇంకెప్పుడూ పోకూడదు” అని చెంపలు వాయించుకుంది. తల్లి డొక్కలో దగ్గరగా పడుకుని కడుపునిండా పాలుతాగి నిద్రపోయింది.

అప్పటి నుంచీ మిగిలిన మూడు పిల్లలతోటీ ట్లాడడం కాని అల్లరి చేయడం కాని మానుకుంది.

Responsive Footer with Logo and Social Media