విధి నిర్వహణ
రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరం ఒక నది ఒడ్డున ఉన్నది. నదికిపుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి,విఠలూ, ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు. విఠలు ఒక చిన్న గ్రామంలోన్యాయాధికారి.రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళకుఇంటికి తెచ్చి, తన స్నేహితులకు కూడా వంట చెయ్యమని తన భార్యకు చెప్పి, ముందు గదిలోకివచ్చి కూర్చుని, తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు :ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెలా విందుచేసి, దానికి గొప్పవాళ్ళను మాత్రమేఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ళ చిట్టాలోతన పేరు కూడా ఎక్కింది గదా అనీ, ఊరి పెద్దల పరిచయం చేసుకుని తాను తన వృత్తిలోబాగా పైకి రావచ్చుననీ రామశాస్త్రి ఎంతో సంతోషించాడు.అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని, విందుకు బయలుదేరబోతూండగా ఒక పేదరాలుగోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ళమీద పడి, “నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి.
పదిమంది సంతానానికి దిక్కు అయిన వాడు అకస్మాత్తుగా విరుచుకుపడి పోయాడు," అనికళ్ళనీళ్ళతో దీనంగా వేడుకున్నది.రామశాస్త్రి మనసు విందుమీద ఉన్నది. అదీగాక ఈ పేదరాలి మొగుడికి వైద్యంచేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను, “తొందర పనిమీద వెళుతున్నాను”.అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆరోజు ఆ విందు వాయిదా పడింది.రామశాస్త్రి ఇంటికి తిరిగివచ్చి, ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్ళేసరికి అంతా మించి పోయింది.సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు."ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటుకానియ్యలేదు". అన్నాడు రామశాస్త్రి."నీలాగే నేను కూడా ఒక్కసారి నాధర్మాన్ని అతిక్రమించాను." అంటూ బడిపంతులుశ్రీహరి ఇలా చెప్పాడు.అతను పనిచేసేది జమీందారుగారి బడిలో. అందులో జమీందారుగారి అబ్బాయి
చదువుకునేవాడు.
అయినా అది తమ బడే గనక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులలోమొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు.ప్రతి విషయంలో వాడు జమీందారుగారి అబ్బాయిని మించి ఉండేవాడు.అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడినుంచి పంపెయ్యమని శ్రీహరినికోరాడు. వాడు చెప్పినట్లు చెయ్యకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని, శ్రీహరిఆ రైతు కొడుకును, చెప్పని పాఠాలలో ప్రశ్నలు వేసి, ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకువాడి మీద ఇంత ఎత్తు లేచి, వాణ్ణి ఒకనాడు బడినుంచి వెళ్ళగొట్టాడు.
రైతుకు తన కొడుక్కు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకుభయపడి, మెదలకుండా వూరుకున్నాడు. ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావలసిన రైతుకొడుకు, తండ్రితోపాటు పొలం పనులు చేసుకోవలసి వచ్చింది. “మీలాగే నేను కూడా ఒక్కసారి నా విధిని నిర్వర్తించలేక పోయాను." అంటూ న్యాయాధికారివిఠలు ఇలా చెప్పాడు:ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్దభవంతి కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలమూ, గుడిసే ఉన్నాయి. ఎంతగాఅడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషులచేత కాపువాడిగుడిసె కూలదోయించి, స్థలం ఆక్రమించుకున్నాడు.నిజం విఠలుకు తెలుసు. కాని అతని చెల్లెలిని వ్యాపారి కొడుక్కు ఇచ్చి పెళ్ళి చేసేటందుకుమాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠలు వ్యాపారికిఅనుకూలంగా తీర్పు చెప్పాడు.“ఇది ఒక్కటే నేను నావృత్తిలో చేసిన అక్రమం" అన్నాడు విఠలు.“మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే! ఇంక భోజనాలకులేద్దాం,” అంటూ రామశాస్త్రి వంట ఇంట్లోకి అడుగు పెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్యవంటచేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని, ముందు గదిలో జరిగిన సంభాషణవింటున్నది.“ఇదేమిటి, ఇలా కూర్చున్నావు? వంట చెయ్యలేదూ?" అని రామశాస్త్రి అడిగాడు.“లేదు. ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది," అన్నదామె.
రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకూళ్ళ ఇల్లు కూడా కట్టేసిఉంటారు. రాకరాక వచ్చిన తన స్నేహితులు పస్తుపడుకోవాలా? అతనిక్కూడా ఆకలిదహించుకుపోతున్నది.ఆ కోపంతోనూ, ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోబోయాడు.“ఆగండి. నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించనందుకే నన్ను కొట్టవచ్చారు ఏం ముణిగిపోయిందని?ఒకపూట తిండిలేకపోతే ఎవరమూ చచ్చిపోం. వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండుప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోతుంది.న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. ఈవృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు.ముందు మీ ముగ్గురూ ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడే వంటచేసేశాను. కాళ్లు కడుక్కుని రండి, వడ్డిం చేస్తాను,” అన్నది రామశాస్త్రి భార్య.