పెద్దదిక్కు


సింహాచలం ఒక చిన్న గ్రామంలో వుంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూండేవాడు. అతడి జీతం నెలకు రెండు వందల రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా, అతణ్ణి పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకొక కూతురు. పెళ్ళీడు రాగానే కూతురుకు వివాహం చేసి, అత్తవారింటికి పంపి, తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే వుంటుది. సింహాచలం ఏ మాత్రం అందగాడు కాదు. పై పెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్ళి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుక్కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడం. ఈ పెళ్ళికాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి, ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్ళి ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలనీ, ఆ విధంగా ఈ పెళ్ళి తప్పిపోవాలనీ, ఆమె ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నది.

అయితే, మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో, “మా నుంచి కట్న కానుకల ప్రసక్తే వుండదు. ఈ శుభ సమయంలో దాని సంగతి మరిచిపోదాం.” అన్నది. ఈ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్ళి జరిగిపోయింది. అందువల్ల, కాపురానికి వచ్చిన రోజునుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది. నెల తిరక్కుండానే ఒకనాటి రాత్రి ఆమె, సింహాచలంతో, “ఈ రోజుల్లో సొంత అత్తలనే చూసేవాళ్ళు లేరు. ఇక పిన అత్తగారికి ఊడిగం చేసేదెవరు! మీ పిన్నిని, వాళ్ళ కూతురు దగ్గరకు వెళ్ళమని చెప్పు" అన్నది. ఈ మాటలకు సింహాచలం నొచ్చుకొని "అదేం మాట మా పిన్ని, మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా వుంటుంది కదా” అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, “మనకే తిండికి దిక్కులేదు. నీదేమైనా సముద్ర వ్యాపారమా? ఈ కరువు కాలంలో తిండి దండగ మనం ఎంతకని పోషిస్తాం?" అన్నది.

పక్క గదిలో నిద్రపోతూ, మంచినీళ్ళ కోసం లేచిన మీనాక్షి, ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుగానే, ఏ కారణం చెప్పకుండా కూతురు ఇంటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించినా, భార్య నోటికి భయపడి, అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగబండిలో పినతల్లిని ఆమె కూతురు ఇంట దిగవిడిచి, పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ కారణంగా, అతడు బాగా పొద్దుపోయేవరకూ దుకాణంలో వుండవలసి వచ్చింది. పట్నంనుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా, మరొక అడ్డదారి వున్నది. తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనం మసలని ఆ అడవిదారి పట్టాడు. సింహాచలం అడవి మధ్యలో వుండగానే చీకటిపడింది. అయితే పున్నమి రోజు కావడం వల్ల పుచ్చపువ్వులా వెన్నెల కాస్తున్నది. అతడు ఒక చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నవి. ఆ వెంటనే ఆకుల మధ్యనుంచి, "ఎవరో, వారెవరో రావాలి! వారికి అడిగిందివ్వాలి!” అంటూ కర్ణకఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది.

సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తిచూసి, అది ఒక నేరేడు చెట్టని గ్రహించి, నేరేడుచెట్టు ఏమివ్వగలదు? నేరేడు పండేగా!" అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతడి కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకుని సంచీలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నవి. తరవాత, ఏమివ్వను? నీకేమివ్వను? అంటూ మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలగచెట్టుగా గుర్తించి, "వెలగచెట్టు ఇవ్వగలిగేది, వెలగపండు. అంతేగదా?" అన్నాడు. మరుక్షణం ఆతడి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచీలో వేసుకున్నాడు. అతడు మరి కొద్ది దూరం నడవగానే, మరొక చెట్టు ఆకులు కదిలి, “అందిస్తాను. అందుకో! అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో!” అన్న మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం రెండు చెవులూ మూసుకుని, ఆ చెట్టు మామిడి చెట్టని గ్రహించి, "మామిడి చెట్టు మామిడిపండు గాక ఇవ్వగలిగిందేముంటుంది!” అన్నాడు. వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండొకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంత సేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచీలో వున్న, ఆ మూడు పళ్ళనూ చూసి ఆశ్చర్యపోయి, "కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికినాయి, నీకు?" అంటూ భర్తను అడిగింది. సింహాచలం జరిగినదంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడి కేసి కోపంగా చూస్తూ, "ఎంత బుద్ధిమాలిన పని చేశావు! నీతో మాట్లాడింది.

ఆ చెట్లే అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద వుండే పరోపకారి పిశాచాలో, వనదేవతలో అయివుంటవి. రేపు మళ్ళీ చీకటిపడ్డాక, ఆ దారినే రా, వాటిని ఏం అడగాలో తెల్లవారాక, నీకు చెబుతాను" అన్నది. ఆమె రాత్రి అంతా నిద్రమాని, పిశాచాలను ఏం అడగాలో బాగా ఆలోచించి, తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటిపడిన తరవాత అడవిదారిన బయలుదేరాడు. అతడు నేరేడుచెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకుల గలగలలతోపాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినవి, భార్య చెప్పింది బాగా గుర్తు పెట్టుకున్న సింహాచలం, "నేరేడుచెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను!" అన్నాడు. చెట్టు మీది నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని, అది పసిడి ఛాయలో వుండడంతో పరమానందం చెందాడు. అతడు వెలగచెట్టును చేరేలోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి, నేరేడు చెట్టు భగభగమనే మంటలతో నేల కూలింది. వెలగచెట్టును చేరిన సింహాచలం "వెలగచెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా!” అన్నాడు.

అతడి కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో, సంచీలోంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కిందపడిన కాసుల్ని వదల బుద్ధి కాక, వాటిని సంచీలో వేసుకుని, ఆ సంచీ మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే, పిడుగుపాటుకు గురి అయి, వెలగ చెట్టు నేలకు "మామిడిచెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే, అమోఘంగా వుండదా!" అన్నాడు. సింహాచలం చెట్టు, కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తల పైన ఏదో పడినట్టయింది కాని తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగలలేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడిచెట్టు కూడా పిడుగు దెబ్బకు గురి అయింది. ఆ తరవాత ఇంటి దారిపట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల, బంగారంతో బరువుగా వున్న సంచీ వల్ల నడవడం కష్ట సాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా వున్న దిబ్బనొకదాన్ని ఎక్కి దిగబోతూ కాలుజారి, పక్కనే వున్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచీ ఊబి అడుక్కు మునిగిపోయింది.

అతడి శరీరం క్రమంగా భుజాలవరకు ఊబిలో దిగబడి పోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతణ్ణి అంటి పెట్టుకునే వున్నది. హఠాత్తుగా దాపులనున్న చెట్టుకొమ్మ ఒకటి పెళపెళ మంటూ విరిగి, అతడికి చేరువగా ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకుని, ఊబినుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతూండగా ఇల్లు చేరి, స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆస్థితిలో వున్న భర్తను చూసి దడపుట్టుకు వచ్చింది. ఏం చెయ్యాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు! ఏమీ పాలుపోని లావణ్య, మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడా మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలినవి! జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, "నీ భర్తకు, మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్న ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే, రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృథా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతణ్ణి ఊబి నుంచి కాపాడింది." అన్నది.

"మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్లనే నేను, ఆయనను ఈ అవివేకపు కోరికలు కోరమని, నానా అగచాట్లకూ గురిచేశాను" అన్నది లావణ్య, కళ్ళనీళ్ళతో "ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు. పది కాలాల పాటు సుఖంగా వుండండి!" అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకో సాగింది. లావణ్య కళ్ళనీళ్ళు తుడుచుకుని, ఆమె రెండు చేతులూ పట్టుకుని "అత్తయ్యా నా మూర్ఖత్వాన్ని క్షమించండి! మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు,” అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక, సింహాచలానిక్కూడా ఎంతో ఆనందం కలిగించింది.

Responsive Footer with Logo and Social Media