ఆవు-దూడ
రాఘవపురం అనే గ్రామంలో నారయ్య, పేరయ్యవి ఇరుగుపొరుగు ఇళ్ళు. వాళ్ళ పొలాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. వారి ఇళ్ళకు ఒక్కటే ప్రహరీ గోడ. ఇళ్ళ మధ్య అడ్డుగోడ లేదు.
నారయ్య భార్య కాంతమ్మకు, పేరయ్య భార్య శాంతమ్మకు దైవభక్తి ఎక్కువ. కాడి ఎద్దులూ, రెండేసి గేదెలూ ఉన్నా, రెండు కుటుంబాలకు ఆవులు లేవు. భార్యల కోరిక మీద నారయ్య, పేరయ్య పశువుల సంతకు వెళ్ళి చెరొక ఆవును కొన్నారు. గోపూజకు అవకాశం ఏర్పడినందుకు కాంతమ్మ, శాంతమ్మ చాలా సంతోషించారు. ఆవులను శ్రద్ధగా పెంచసాగారు. నారయ్య ఆవు వరసగా రెండుసార్లు కోడెదూడను ఈనింది. పేరయ్య ఆవు రెండుసార్లూ పెయ్యదూడను ఈనింది. కోడెదూడ అయితే, పొలం పనికి ఉపయోగపడుతుందని పేరయ్య ఆశ. రెండు ఆవులూ మూడోసారి చూడితో ఉన్నాయి. ఈసారైనా తన ఆవు కోడెదూడను పెట్టాలని పేరయ్య ఆశతో కోరుకుంటున్నాడు. రెండు ఆవులూ ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. బంధువుల ఇంట్లో పెళ్ళికోసం నారయ్య కుటుంబం వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. మరునాడే వచ్చేస్తామనీ, తన ఆవును జాగ్రత్తగా చూస్తూ ఉండమనీ పేరయ్యతో చెప్పి, నారయ్య కుటుంబంతో సహా పొరుగూరువెళ్ళాడు.
పేరయ్య మనసులో చిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ రాత్రి రెండు ఆవులూ ఈనితే బావుణ్ణని అనుకున్నాడు. ఆ తరవాత చేయవలసిన దానిని గురించి ఉత్సాహంగా భార్య శాంతమ్మతో చెప్పాడు. ఆ మాటవిని ఆవిడ దిగ్భ్రాంతి చెంది, ‘‘ఇదేం బుద్ధండి! వాళ్ళ ఆవు కోడెదూడను పెడితే మనం తెచ్చేసుకోవాలా? మన ఆవు పెయ్యదూడను పెడితే వాళ్ళ ఆవు దగ్గర ఉంచాలా? ఎంత అన్యాయమండి? మనుషుల కంటే పశువులే తమ సంతానాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకుంటాయి.
కుక్క, పిల్లి, కోతి వంటి వాటిని చూడడం లేదూ! మీరు ఆశించినట్టు దూడను మార్చినా, పలుపు తెంపుకుని ఆవు, దూడను వెతుక్కుంటూ వెళుతుంది,'' అని హెచ్చరించింది. పేరయ్య ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, విచిత్రంగా ఆ రాత్రి పేరయ్య ఆశించినట్టే రెండు ఆవులూ ఈనాయి.
పేరయ్య ఆవు పెయ్యదూడను పెట్టింది. నారయ్య ఆవు కోడెదూడను పెట్టింది. శాంతమ్మ ఎంత వారించినా వినకుండా, పేరయ్య తన ఆలోచనల ప్రకారం దూడలను మార్చాడు. ఆ తరవాత నిద్ర రావడంతో వెళ్ళి పడుకున్నాడు. మరికాస్సేపటికి గొడ్లపాకలో ఏదో చప్పుడయితే, పేరయ్య, శాంతమ్మ వెళ్ళి చూశారు. తమ పాకలో నారయ్య ఆవు తన కోడెదూడను నాకుతూ కనిపించింది.
మెడలో పలుపు తెగివుంది. గబగబా వెళ్ళి నారయ్య గొడ్లపాకలోకి వెళ్ళి చూశారు. అక్కడ తమ ఆవు పెయ్యదూడను నాకుతోంది. పశువులకు తమ సంతానం పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో పేరయ్యకు అర్థమయింది. తన భార్య చెప్పిన మాట అక్షరాలా నిజమని గ్రహించి, తను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడు. నారయ్య ఆవునూ, కోడెదూడనూ నారయ్య గొడ్ల పాకలోకి తీసుకువెళ్ళి వదిలి, తన ఆవునూ పెయ్యదూడనూ తన గొడ్లపాకలోకి తీసుకువచ్చాడు.
మరునాడు ఊరునుంచి తిరిగి వచ్చిన నారయ్య, కాంతమ్మ తమ ఆవును జాగ్రత్తగా చూసుకున్నందుకు పేరయ్య దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేరయ్య రాత్రి జరిగిన దానిని నారయ్యకు పశ్చాత్తాపంతో వివరించి, ‘‘నా దుర్బుద్ధికి నన్ను క్షమించు నారయ్యా,'' అన్నాడు.
‘‘ఎంత మాట పేరయ్యా. ఇందులో దుర్బుద్ధి ఏముంది? అయినా, మూడు కోడెదూడలను పెట్టుకుని నేనేం చేస్తాను? వాటిలో నువ్వొక దాన్ని తీసుకో,'' అన్నాడు నారయ్య.
‘‘నీది చాలా మంచి మనసు నారయ్య. అయితే, నా పెయ్యదూడలలో నువ్వొకటి తీసుకోవాలి మరి,'' అన్నాడు పేరయ్య. నారయ్య అందుకు అంగీకరించాడు. వాళ్ళ మాటలను కొద్ది దూరంలో నిలబడి విన్న కాంతమ్మ, శాంతమ్మలు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.