కొడుకు బాధ్యత


పార్వతమ్మ అనే ముసలావిడ, వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికేరోజుల్లో, ఆరేళ్ళ అనాధ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద వున్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాయించిన డబ్బులో కొంత మిగిలిస్తూ, వాడికి చదువు చెప్పించింది. అనంతుడు ఇరవై ఏళ్లవాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని, అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్టు, చాలా ఆనందపడింది.

ఆ పరిస్థితుల్లో, తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతడి ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాల్లో, తనకూ, తనను పెంచి పెద్దచేసిన అవ్వ పార్వతమ్మకూ నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తను కాపురానికి వచ్చిన రోజునుంచీ, భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా వుండేది. భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటి పోటి మాటలు అనేది. అయినా, ఇలాంటివాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురి అయింది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకున్నది. ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బు ఖర్చుచేయసాగాడు. అమలకు ఇదేమాత్రం ఇష్టంలేదు. ఒకనాడు ఆమె భర్తతో “పండగ ఇంకా వారం రోజులే వున్నది. మీరు, నాకు పట్టుచీర కొని పెట్టి చాలా కాలమైంది. పండగకు ఒక పట్టుచీర కొనండి" అన్నది. అనంతుడు కొంచెం సేపాలోచించి, “పండగలకేం, దీని తర్వాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసివస్తున్నది." అన్నాడు. - ఆ జవాబు వింటూనే, అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకుని, "ఒక బిచ్చకత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం, బుద్ధిమంతులు చేసే పనేనా?" అని అడిగింది.

అనంతుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి, “అవ్వను గురించి అంత చులకనగా, మరెన్నడూ మాట్లాడకు!" అని బయటికి వెళ్ళిపోయాడు. దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయింది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో, "నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో, మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి, నేను కావాలో లేక, ఆ బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి!" అన్నది. ఆ మాటలకు అనంతడు ఆవేశపడిపోతూ, “బిచ్చగత్తె అనవద్దని ఇంతకముందే చెప్పాను. నీది వట్టి కుళ్ళుబుద్ధి. భర్తగా నిన్ను సంతోష పెట్టవలసిన బాధ్యత నాకు ఉంది. అయితే, అనాధనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల, నాకు బాధ్యతంటూ లేదా? ఇంతటితో నోరు మూసుకో” అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున, తను వెళ్ళిపోతున్నట్టు ఒక ఉత్తరం రాసి, నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి, బాడుగబండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి “ఇలా ఒక్కదానివే వచ్చావేం?" అని అడిగాడు. ఆమె జరిగినదంతా తండ్రికి చెప్పి, "నాకన్నా ఆయనకు, ఆ ముసలి బిచ్చగత్తె ఎక్కువట ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా వుండలేక వచ్చేశాను" అన్నది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ వూరుకుని "మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు" అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే, ఆమె అన్న మాత్రం పలకరించనైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవడం, ఆమెకు చాలా బాధకలిగించింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ, “జరిగిందేదో జరిగిపోయింది! నేను చీకటి పడకుండా వచ్చేస్తాను" అన్నాడు. అయితే, ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో, అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి, "ఏం, బాబాయ్! మా నాన్న ఇంకా రాలేదేం?" అని అడిగింది. “నీకు చెప్పడానికి మనస్కరించక వూరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికి పోయాడు. నిలవడం కష్టం - ఉద్యోగం పోయినట్టే!" అని చెప్పాడు - రామయ్య.

ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే, దానితోపాటు పరువూ పోయినట్టే! అమల ఇలా ఆలోచిస్తూ, ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి, తండ్రి నూతి మీద ఏదో కాయితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకున్నది. "ఇక ఎవరికీ, నా ముఖం చూపెట్టలేను, తల్లీ! నా దారిన నన్ను పోనీ," అన్నాడు అమల తండ్రి. "అదేం మాట నాన్నా! లోపలికి రా" అన్నది అమల. వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. “ఈ వయసులో ఉద్యోగం పోయిన నా బతుకు ఎలా గడుస్తుంది." అన్నాడామె తండ్రి బాధగా, "దిగులుపడకు, నాన్నా! నీ ఉద్యోగం పోయినా, అన్నయ్య ఉద్యోగం ఉన్నది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా?" అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో "ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను ముందు ఈ సంగతి చెప్పు అమలా! కాళ్ళూ, చేతులూ బావుండి, గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న, లంచం తీసుకోవడం, నీకు అసహ్యం కలిగించడంలేదా?" అన్నాడు. "దైవసాక్షిగా, నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రం లేదు" అన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, "లంచం తీసుకోవడం లాంటి, అతి నీచమైన పని చేసిన నాన్న అంటే, నీకు అసహ్యం కలగడం లేదు. కాని, అంగవైకల్యం వల్ల, మరో దారిలేక బిచ్చగత్తెగా మారిన సార్వతమ్మ అంటే, నీకు అసహ్యం! ఎటువంటి నేరం చేసినవాడైనా, తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు," అన్నాడు. "అవును, లేదా మరి?" అని అడిగింది అమల కోపంగా.

"ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాధ అయిన తనను, ఎన్నో శ్రమలకోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను, ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ, సేవలు చేయడం నీకు ధర్మం కాదా? " అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్ళు పెట్టుకుని, "అన్నయ్యా నువ్వు నా కళ్లు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని, నాకు భయంగా వున్నది" అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, "నేను లంచమూ తీసుకోలేదు, ఉద్యోగమూ పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి రావడానికి రామయ్యా, నేనూ, నీ అన్నయ్యా, ఈ చిన్న నాటకం ఆడాం" అన్నాడు. “మీరాడిన నాటకం నాకీ జన్మకు సరిపడా బుద్ధినీ, మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్నీ ప్రసాదించింది!" అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ి.

Responsive Footer with Logo and Social Media