పదహారణాల స్నేహం
అత్తవారింటికి కొత్తగా కాపురానికొచ్చిన అమల, ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి, తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది. లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు - ఈ జరిగినదంతా ఆమెకు ఒక కలలా తోచింది. దాదాపు మూడు నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుంచి నీటిబిందెతో ఇంటికి తిరిగి వస్తున్నది. దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి, ఆమె కేసి ఒకటి, రెండు క్షణాలు పరీక్షగా చూసి, “మరేం అనుకోకు. నా పేరు సుదర్శనం. నీ పేరేమిటి? ఇల్లెక్కడ?" అని అడిగాడు. అపరిచితుడు ఇలా పలకరించే సరికి అమల బెదరిపోతూనే, అతడి ప్రశ్నలకు జవాబు చెప్పి, గబగబా ఇంటికి వెళ్లి పోయింది.
ఆ తరవాత పది రోజులకు సుదర్శనం తల్లిని వెంట బెట్టుకుని అమల వాళ్ళ ఇంటికి వచ్చాడు. అసలు విషయం ఆమెకు అప్పుడు తెలిసింది. లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన రోజున, తల్లితండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడవచ్చాడు. ఆ అమ్మాయి తండ్రి, సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు. అతిగా అలంకరించుకుని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆ అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు. తండ్రి కోపగించుకొని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్లిపోయాడు. కొంచెం వెనగ్గా ప్రయాణమైన సుదర్శనానికి, ఏటి నుంచి నీరు తెస్తున్న అమల దారిలో తారసపడింది. అమల సవతి తల్లి, అమల అదృష్టానికి చాలా బాధ పడిపోయింది. అయితే, ఇరుగూ పొరుగు వాళ్ళ వల్ల నానా మాటలూ అనిపించుకోవలసి వస్తుందని, ఈ పెళ్ళికి ఒప్పుకున్నది.
అమల అత్తవారింటికి వస్తూనే, ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకున్నది. ఆయనకు కట్నం గురించి చింతలేదు. కొడుకు, తన స్నేహితుడి కూతుర్ని కాదన్నాడన్నదే బాధ! ఆమె ఒకనాడు భర్తతో, “నాకు స్నేహితుడంటూ వున్న ఒక్కరూ, ఈ ఊళ్లోనే వున్నారు. ఆయన్నొకసారి చూడాలి. ఇది, ఎన్నేళ్ళుగానో మనసులో వున్న కోరిక," అన్నది. సుదర్శనం ఆశ్చర్యపోతూ, "నీకు ఈ ఊళ్ళో స్నేహితుడా! ఎవరాయన?” అని అడిగాడు. "అంత ఆశ్చర్యపోకండి. ఆ స్నేహితుడి కథ ఇది," అంటూ అమల జరిగినదంతా చెప్పింది. అమల పుట్టగానే తల్లి పోయింది. తండ్రి మరొక పెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి అమలను రాచి రంపాన పెట్టేది. పదేళ్ళు కూడా నిండని అమల చేత ఇంటి చాకిరీ అంతా చేయించేది. బడికి వెళ్ళనిచ్చేది కాదు.
ఇలా వుండగా, సవతి తల్లి తమ్ముడి పెళ్ళి నిశ్చయమైంది. ఆమె పది రోజులు ముందుగానే పెళ్ళికి ప్రయాణమైపోతూ, ఇంటి గదులు అన్నీ తాళం పెట్టి, ముందు గదిలో కుంపటీ, సంచీలో కొంత బియ్యం అమల కోసం వుంచింది. “నేను పది రోజుల్లో తిరిగొస్తాను. నే నిచ్చే, ఈ ఇరవై అణాలతో మజ్జిగా, ఆకుకూరలూ కొనుక్కొని, మహారాణిలా వండుకు తిను," అంటూ ఆమె అమల చేతిలో ఇరవై అణాలు పెట్టి, పిల్లలూ, భర్తతో వెళ్ళిపోయింది. అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ. అమల రెండు పూటలకు సరిపడ వంట చేసుకుని, పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చుని, వీధిలోకి చూస్తూ కాలం గడిపేది. ఇలా ఒంటరిగా వుండడం ఆమెకు బెంగ పుట్టించేది.
ఒకనాటి మధ్యాహ్నం వేళ, ఒంటి మీద కట్టుపంచ మాత్రమే వున్న ఒకాయన, వీధిలో నిలబడి, దారినపోయే వాళ్లకేసి చేతులు చాచి, "గ్రహణం అని సముద్ర స్నానానికి వచ్చాను. బట్టలు ఒడ్డున పెట్టి, స్నానం చేస్తూండగా, వాటిని ఎవరో ఎత్తుకుపోయారు. మా ఊరు వెళ్ళేందుకు బాడుగ బండిలో రేవు చేరి, అక్కడ పడవ ఎక్కాలి. ఇందుకు మొత్తం పదహారణాలు అవసరం. సాయం చేస్తే, ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను, " అని దీనంగా అడగసాగాడు. కాని, ఎవరూ అతడికి సాయం చెయ్యలేదు. తల పక్కకు తిప్పుకుని వెళ్ళిపోసాగారు. ఇది చూసి అమలకు చాలా జాలి కలిగింది. ఆమె గుమ్మం దాకా వెళ్ళి, అతణ్ణి కేకవేసి పిలిచి, దగ్గరకు రాగానే, “పదహారణాల మాట సరే, భోజనం చేశావా?" అని అడిగింది. "ముందు మా ఊరు వెళ్ళిపోవాలి, పాపా! నీ పేరేమిటి?” అని అడిగాడతను. అమల అని తన పేరు చెప్పి, “నేను పదహారణాలిస్తాను. ముందు భోజనం చెయ్యి," అని, రాత్రికని దాచిన అన్నంలో మజ్జిగ వేసి, అతడికి పెట్టింది. అతను భోజనం చేసి రకరకాల కథలూ, కబుర్లూ చెప్పి అమలను బాగా నవ్వించాడు. "ఇంతకూ, మీ ఊరేదో చెప్పావు కాదు," అన్నది అమల.
"నీ ఊరే! అమలాపురం," అంటూ నవ్వాడతను. అతను పైన కప్పుకోవడానికి, తన తెల్ల పరికిణీ ఇచ్చింది, అమల. చిరుగులు కనబడకుండా ఆ పరికిణీ కప్పుకుని అతను, “ఇదే ఆదితో, మా ఊరు నుంచి నీకు పట్టుపరికిణీ కుట్టించి పంపుతాను," అన్నాడు. అమల ఇచ్చిన పదహారణాలూ పుచ్చుకుంటున్నప్పుడు అతని చేతులు వణికాయి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "పాపా, ఒకవేళ, ఏనాడైనా మా ఊరు రావడం జరిగితే, మా ఇంటికి తప్పకుండా రా. ఈ వయసులో నీకు అర్థమౌతుందో లేదో గాని, కష్టంలో ఆదుకున్న వాళ్లే, నిజమైన స్నేహితులు. చిన్న కాగితం ఇచ్చావంటే, నా చిరునామా రాస్తాను," అని అమల ఇచ్చిన కాగితం మీద, తన ఊరూ, పేరూ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. చదువురాని అమల ఆ కాగితాన్ని బట్టల అడుగున భద్రంగా దాచుకున్నది. రెండు రోజుల తరవాత ఒక మనిషి పట్టుపరికిణీ, వంద రూపాయలూ తెచ్చి, అమలకు యిచ్చి, "అమలాపురం వచ్చినప్పుడు, తమ ఇంటికి తప్పకుండా రమ్మని, బాబుగారు చెప్పమన్నారు” అన్నాడు. ఆ వంద రూపాయల్లో పన్నెండణాలు ఖర్చయ్యే సరికి, అమల సవతితల్లి తిరిగి వచ్చేసింది. ఆమె సంగతి తెలుసుకుని, అమల దగ్గర్నుంచి మిగిలిన డబ్బు తీసుకున్నది.
ఇది జరిగిన రెండు నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు. సవతితల్లి పుట్టిల్లు దూరంగా వున్న ఒక పల్లె గ్రామం. వేరే దిక్కులేని అమల సవతితల్లి వెంట ఆ గ్రామం వెళ్ళిపోయింది. భర్తకు అమల ఇదంతా చెప్పి, “పెళ్ళి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి, నాకు చాలా సంతోషం కలిగింది. తండ్రి ప్రేమ ఎలా వుంటుందో ఆయనవల్ల తెలిసి వచ్చింది," అన్నది. "అంతా బాగానే వున్నది, మరి, ఆయన పేరూ, ఇల్లెక్కడో తెలియాలి కదా? నీకు చదువు రాకపోవడం ఎంత ఇబ్బందో చూశావా. ఆ స్నేహితుడిచ్చి పోయిన కాగితం ఇటు తీసుకురా," అన్నాడు సుదర్శనం. అమల పెట్టె అడుగున పట్టుపరికిణీలో పెట్టి దాచిన కాగితం తీసి భర్తకిచ్చింది. సుదర్శనం అది చదివి, పెద్దగా చిటికె వేసి, “నీ చిన్ననాటి స్నేహితుడు, మరెవరో కాదు. మా నాన్నే!" అన్నాడు. అమల నిర్ఘాంతపోయింది. వయసు పెరగడంతోపాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా, తలంతా తెల్లబడి పోవడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుర్తించలేక పోయింది. సుదర్శనం, తండ్రిని పిలిచి, కాగితం చూపించి, “దీన్ని గుర్తు పట్టగలవా, నాన్నా?" అని అడిగాడు.
సుదర్శనం తండ్రి ఆ కాగితాన్నీ, అమలనూ ఒకటికి రెండుసార్లు తేరి పార చూసి, "అవును మరి, మాది అసలైన పదహారణాల "స్నేహం!" అన్నాడు సుదర్శనం తండ్రి నవ్వుతూ, “నువ్వు, ఆనాడు కష్టసమయంలో నన్ను ఆదుకున్న అమల వేనన్న మాట!" అంటూ సంతోషం కొద్దీ కళ్ళల్లో ఉబికే నీరును పై పంచెతో అడ్డుకున్నాడు. "మీ స్నేహబంధం మహా గట్టిది నాన్నా! పన్నెండేళ్ళ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపింది," అన్నాడు సుదర్శనం.