పాడే పిశాచం-ఆడే పిశాచం



చిదంబరానికి కంటి పూత పూసి చూపుపోయింది. నిత్యానందానికి పుట్టెడు చెముడు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని, యాచకవృత్తితోనే పెళ్ళాలను పోషిస్తున్నారు. వాళ్ళ ఊరుకు పదిక్రోసుల దూరంలో రంగనాయకుల గుడి వున్నది. అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. కొండకూ తమ ఊరికీ మధ్య వున్న చిట్టడివి దాటి చిదంబరం, నిత్యానందం ఆ కొండ మీద నాలుగు రోజుల పాటు వుంటారు. గుడి మెట్ల పక్కన గుడ్డ పరచుకు కూర్చుంటే, సాయం కాలానికల్లా గుప్పెడు రూకలు మూట కట్టుకోవచ్చు.

ఆ ఏడు కూడా వాళ్ళిద్దరూ తిరునాళ్ళలో చెరో వంద సంపాయించుకుని, ఊరుకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, అప్పటికే బాగా చీకటిపడిపోవడంతో చిట్టడవిలో వాళ్ళ ప్రయాణం బాగా సాగలేదు. "ఒరే, చిదంబరం! మనం కాస్త ముందుగా బయలుదేరవలసింది. దారిలో పాముపుట్రా అర్ధరాత్రికయినా అడవి దాటకపోతే చాలా చిక్కుల్లో పడిపోతాం,” అన్నాడు నిత్యానందం చుట్టూ వున్న కటిక చీకట్లోకి భయం, భయంగా చూస్తూ. చిదంబరం అవునన్నట్టు తల వూపి, నిత్యానందం చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ వేగంగా నడవసాగారు. కొంత దూరం పోయాక హఠాత్తుగా ఒక చోట పెద్ద కోలాహలం రేగింది. చిదంబరం, నిత్యానందం చేతిని మరింత గట్టిగా వడిసిపట్టుకుని, “ఏమిటా గొడవ?" అని అడిగాడు. ఆ సరికి నిత్యానందం ఆ కోలాహలానికి కారణమైన పిశాచాలను చూసి నిలువునా వణికిపోసాగాడు. ఒక మగ పిశాచి గొంతెత్తి భీకరంగా పాడుతూంటే, ఒక ఆడ పిశాచి దానికి తగ్గట్టు అడుగులు వేస్తూ, అడవి అదిరిపోయేలా నాట్యం చేస్తున్నది.

నిత్యానందం చెప్పగా సంగతి తెలుసుకున్న చిదంబరం తానూ వణికిపోతూ, “పొగడ్తకు పొంగిపోని ప్రాణి ఎక్కడుంటుంది? పిశాచాలే అవుగాక!" అన్నాడు. తరవాత అతడు గట్టిగా చప్పట్లు చరిచి, "అద్భుతమైన పాట! కొబ్బరినీళ్ళలో కలకండ కలిపి తాగినట్టుగా వున్నది," అన్నాడు. ఆ పొగడ్తకు మగ పిశాచి పొంగిపోయింది. నిత్యానందం తానూ చప్పట్లు చరిచి, “అమోఘమైన నాట్యం! నెమలికైనా నేర్వడం అసాధ్యం అనిపించేలా వున్నది," అన్నాడు. ఆడ పిశాచికి ఆ పొగడ్త ఆనందాన్ని కలిగించింది. అయితే, తన పాటను నిత్యానందం మెచ్చుకోనందుకు కోపగించుకున్నది మగ పిశాచం. తన ఆటను చిదంబరం పొగడనందుకు ఆడపిశాచం ఉడుక్కున్నది. అది చిదంబరాన్ని, "ఆయన పాట తప్ప, నా ఆట నిన్ను ఆకర్షించలేదా?" అని అడిగింది.

“నీ ఆట చూసి ఆనందించే అదృష్టం లేని గుడ్డివాణ్ణి. ఈ క్షణానే చచ్చిపోవాలనుకుంటున్నాను!" అన్నాడు చిదంబరం. మగ పిశాచం నిత్యానందాన్ని, "ఆవిడగారి ఆట తప్ప, నా పాట నీకు ఆనందం కలిగించలేదా?” అడిగింది. చెవిటివాడైన నిత్యానందానికి మగ పిశాచి అడిగిందేమిటో అర్థం కాలేదు. చిదంబరం కల్పించుకుని, “ఈ చెవిటి మాలోకానికి పాట పసందుగా వున్నదీ లేనిదీ, ఎలా తెలుస్తుంది!" అన్నాడు. ఆ జవాబుతో పిశాచాలకు వాళ్ళల్లో ఒకడు గుడ్డివాడనీ, రెండవ వాడు చెవిటి వాడనీ తెలిసిపోయింది. ఆడ పిశాచి చిదంబరం కళ్ళలోకి చల్లటి మంచులాంటి గాలిని ఊదింది. మగ పిశాచి నిత్యానందం చెవిలో గూబ అదిరి పోయేలా పొలికేక పెట్టింది. ఆశ్చర్యం! మరుక్షణమే చిదంబరానికి కళ్ళు కనిపించసాగాయి. నిత్యానందానికి చెవులు వినిపిస్తున్నాయి. మళ్ళీ మగపిశాచి పాట అందుకున్నది. ఆడ పిశాచి ఆట ఆరంభించింది. కంపరం పుట్టిస్తున్న వాటి ఆటపాటల్ని మరి కొంతసేపు మెచ్చుకుని, ఇద్దరూ సంతోషంగా ఊరిదారిపట్టారు.

వాళ్ళు ఊరు చేరేసరికి బాగా తెల్లవారి పోయింది. వాళ్ళ ఇళ్ళు పక్క, పక్క వీధుల్లో వున్నవి. చిదంబరం కళ్ళు మూసుకు నడిస్తే తప్ప, తన వీధిలోని ఇంటిని గుర్తించలేకపోయాడు. అతడు తలుపు తట్టేసరికి చాలా అనాకారిగా వున్న స్త్రీ ఒకతె వచ్చి తలుపు తెరిచింది. చిదంబరం ఆమెకేసి ఏవగింపుగా చూస్తూ, "చింతామణి అనే ఆవిడ ఇల్లెక్కడ?" అని అడిగాడు. చింతామణి అతడి భార్య పేరు. తలుపు తెరిచింది ఆవిడే! భర్తకు చూపు వచ్చిన సంగతి తెలుసుకుని ఆమె పరమానందం చెంది, "నేనే చింతామణిని! నీకు కళ్ళు వచ్చాయనే ఆనందంలో, నా నోటమాట పెగలడం లేదు," అన్నది. ఆ అనాకారి స్త్రీ తన భార్య అని నమ్మలేకపోయాడు చిదంబరం. అయితే, కంఠస్వరాన్ని బట్టి, ఆమె తన భార్య అని తెలుసుకున్నాడు. ఇంతకాలంగా ఆ వికారిమనిషితో తాను కాపురం చేసినందుకు అతడికి కంపరం పుట్టుకొచ్చింది. కాని, భార్య ఈ శుభవార్త ఇరుగు పొరుగులకు చెప్పేందుకు పరుగుతీసింది. ఇక నిత్యానందం తన ఇల్లు చేరి, ఒకటికి, రెండుసార్లు తలుపు తట్టాక, “వస్తున్నా! వస్తున్నా!” అన్న కరుకైన 'మగ కంఠస్వరం లాంటిది వినిపించింది.

"ఏదో మగకంఠం వినబడుతున్నది. ఎవరు వచ్చారు?" అని అడిగాడు నిత్యానందం భార్యను. భర్తకు చెవుడుపోయి, మాట వినబడుతున్నందుకు పొంగిపోయిన కాంతం, "దేవుడి దయవల్ల నీకు చెవులు వినిపిస్తు న్నాయన్నమాట! నా గొంతు తీరే అంత," అన్నది. ఆ కంఠస్వరం భరించలేని నిత్యానందం, “అలాగా! అయితే, అది తరచూ వినడం జరిగితే, నాకు మళ్ళీ చెముడు వస్తుంది. ఇక, నాముందు ఎన్నడూ పెదవి విప్పకు, జాగ్రత్త!" అన్నాడు. అతడి భార్య గుడ్ల నీరు కుక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అడవి దారిపట్టి పోతున్న నిత్యానందాన్ని, దారిలో చిదంబరం కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరి కష్టాలొకరు చెప్పుకుని, పిశాచాలే తమ కష్టాలను తొలగించాలనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి, ఈసారి ఆడ పిశాచి పాడుతున్నది, మగపిశాచి ఆడుతున్నది. వాళ్ళను చూస్తూనే అవి ఆటా, పాటా కట్టిపెట్టి, “మళ్ళీ వచ్చారేం! సంగతేమిటి?" అని అడిగినై. "నా భార్య పరమకురూపి! నేను కాపురం చెయ్యలేను. కంటి చూపు తెప్పించి, మీరే ఈ గొడవకు కారణం అయ్యారు. పరిష్కారం మీరే చెయ్యాలి,” అన్నాడు చిదంబరం. "మగగొంతున్న ఆడమనిషి అన్ని అరిష్టాలకూ కారకురాలవుతుంది. నా భార్య గొంతు భరించలేను. మీరే ఏదైనా దారి చూపాలి." అన్నాడు నిత్యానందం. పిశాచాలు తెల్లబోయి ముఖముఖాలు చూసుకుని, “ఇన్నాళ్ళూ, వాళ్లు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటున్నారు గదా?" అని అడిగినై. "అవును, ఇప్పుడూ అలాగే చూస్తున్నారు. ఎటొచ్చీ వాళ్ళ రూపం, కంఠస్వరాలే చిరాకు కలిగిస్తున్నవి," అన్నారు చిదంబరం, నిత్యానందం.

"ఇంతకూ మీకున్న లోపాలను వాళ్ళేం పట్టించుకోకుండా, ఎంతో ఆదరంగా చూశారు. వాళ్ళ మనసులు ఎంత మంచివో ఆలోచించి చూడండి!" అన్నది మగపిశాచం. ఆ మాట నిజం కావడంతో ఇద్దరూ జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు మగపిశాచం, “శారీరకంగా వుండే లోపాలు సరిదిద్దుకోలేనివి. అవి వున్నవారిని అసహ్యించుకోవడం, క్షమించరాని నేరం. జీవితం అంతా కలిసి వుండవలసిన భార్యాభర్తల మధ్య వుండవలసింది ప్రేమా, ఒకరిపై ఒకరికి ఆదరణ. మీరు, మీ భార్యల అందచందాల్ని కాక, వాళ్ళ గుణగణాల్ని గౌరవించడం నేర్చుకోండి," అన్నది. ఆ మాటలతో నిత్యానందానికి, ఆక్షణం లోనే తన చెముడు పోయినట్టనిపించింది. చిదంబరం అప్పుడే తన గుడ్డితనం పోయినవాడిలా పిశాచాల కేసి ఆప్యాయంగా చూశాడు. ఇద్దరూ పిశాచాలకు వంగి నమస్కరించి, "మాకు సరైన బుద్ధి చెప్పినందుకు, బతికున్నంతవరకూ మీకు కృతజ్ఞులం!" అని, అప్పటికప్పుడే ఇంటి దారి పట్టారు.

Responsive Footer with Logo and Social Media