Subscribe

అసలైన ఆభరణం



రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాన, హఠాత్తుగా పెద్ద వర్షం ప్రారంభం కావడంతో, గంగాధరం వీధి వాకిలి తలుపుతో పాటు కిటికీలు కూడా మూసి వచ్చాడు. గాలి హోరుకూ, ఉరుముల శబ్దానికీ అతడి ఆరేళ్ళ కూతురు విద్య భయపడి పోయి తల్లిని గట్టిగా చేర్చి పట్టుకుని కూర్చున్నది. “భయపడకే, తల్లీ!" అంటూ గంగాధరం కూతుర్ని ఎత్తుకున్నాడు. అంతలో ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దమైంది. గంగాధరం వెళ్ళి తలుపు తీశాడు. వర్షంలో బాగా తడిసి ముద్దయిపోయిన అతడి మిత్రుడు సత్యంతోపాటు, మరొక మనిషి లోపలికి వచ్చాడు. సత్యాన్ని చూస్తూనే విద్య భయం పోయి చిన్నగా నవ్వింది. సత్యం, గంగాధరం చిన్ననాటి స్నేహితుడు. అతడికి పట్నంలో ఉద్యోగం. గంగాధరం ఉత్సాహంగా భార్యను, "గాయత్రీ, ఇదుగో మీ అన్నయ్య వచ్చాడు!" అంటూ కేకవేశాడు. వాళ్ళు తడిసి వుండడం చూసి గాయత్రి వాళ్ళకు పొడిబట్టలు తెచ్చి ఇచ్చింది. సత్యం బట్టలు మార్చుకుని, విద్యను తన చేతుల్లోకి తీసుకుంటూ, “పనిపడి రంగాపురం వెళుతున్నాను. దారిలో ఈ వర్షం! అనుకోకుండా కోదండం కలిశాడు. మా పట్నం వాడే," అంటూ తనతో వచ్చిన మనిషిని గంగాధరానికి పరిచయం చేశాడు. గాయత్రి అతిధులకు అప్పటికప్పుడు వేడివేడిగా వంట తయారు చేసింది. వాళ్ళు భోజనం చేయగానే, వీధిగదిలో ఇద్దరికీ పడకలు సిద్ధం చేసింది.

"నేను, మామయ్య పక్కనే కథలు వింటూ పడుకుంటాను,” అన్నది విద్య. “ఇప్పటికే బాగా పొద్దుపోయింది. మామయ్య ప్రయాణ బడలికలో వున్నాడు. ఇప్పుడాకథలు!" అంటూ గాయత్రి కూతురును కసురుకున్నది. "మరేం ఫర్వాలేదు, చెల్లీ! విద్యకు నిద్రపట్టే వరకూ కథలు చెబుతాను," అన్నాడు సత్యం. విద్య సత్యం పక్కనే పడుకుని, అతడు చెప్పే కథలు వింటూ గంట తరవాత నిద్రపోయింది. సత్యం కూడా బడలిక కొద్దీ, ఆ వెంటనే నిద్రపోయాడు. అతడికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తున్నది. అప్పటికే నిద్ర లేచి వున్న కోదండం, సత్యాన్ని, "నువ్వు మరి కొంతసేపు వుంటావా, నాతో పాటు బయలుదేరి వస్తావా?" అని అడిగాడు. విద్య నిద్రలేస్తే, ఇక ఆ పూటకు అక్కడి నుంచి తనను కదలనీయదని ఎరిగి వున్న సత్యం, గంగాధరం అతడి భార్యా భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసినా వినకుండా, కోదండంతో పాటు బయలుదేరాడు. పొద్దెక్కి నిద్రలేస్తూనే విద్య, "సత్యం మామయ్య ఏడీ?" అంటూ ఇల్లంతా వెతికి చూసింది.

గాయత్రి కూతుర్ని స్నానం చేయించడానికి పెరట్లోకి తీసుకుపోతూ, "మామయ్య నీకు బొమ్మలు తెస్తానని బజారుకు వెళ్ళాడు." అన్నది. ఆమె కూతురుకు నీళ్ళు పోస్తూ బోసి మెడకేసి చూసి నిర్ఘాంతపోయింది. విద్య మెడలో అత్తగారు ఎంతో ప్రేమతో చేయించిన మూడు తులాల బంగారు గొలుసు లేదు! కిందటి సాయంత్రమే విద్య పేచీ పెడితే, పెట్టెలోంచి గొలుసు తీసి ఆమె మెడలో వేసింది. గాయత్రి గబగబా ముందుగదిలోకి వచ్చి, విద్య పడుకున్న పక్క అంతా దులిపి చూసిందీ. గొలుసు జాడలేదు! గాయత్రికి కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. అత్తగారు తన పెళ్ళినాటి గాజులు కరిగించి ఎంతో అపురూపంగా చేయించిన గొలుసు. అది పోయిందంటే ఆమె ఎంతగా బాధపడుతుంది! ఒక వారం రోజుల్లో, ముఖ్యంగా మనమరాలిని చూసేందుకు వస్తున్నట్లు ఉత్తరం కూడా రాసింది. భార్య నుంచి గొలుసు కనిపించడం లేదని విని, గంగాధరం కూడా రెండు మూడుసార్లు ఇల్లంతా వెతికాడు. ప్రయోజనం కలగలేదు. గాయత్రి దిగులు పడిపోతూ, “రాత్రికి రాత్రి గొలుసు మాయం కావడం విడ్డూరంగా వుంది. ఒకవేళ అన్నయ్య, నిద్రలో పిల్ల మెడకు గుచ్చుకుంటుందని, దాన్ని తీసి దాచాడేమో!" అన్నది. గంగాధరానిక్కూడా, చివరికి ఈ ఒక్క ఆశే మిగిలింది. రెండు రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలో విద్యకోసం బొమ్మలు తీసుకుని సత్యం మళ్లీ వచ్చాడు. గంగాధరం సత్యానికి జరిగింది చెప్పి, "గొలుసేమైనా నువ్వు తీసి దాచావేమో అనుకున్నాం,” అన్నాడు. సత్యం కొంచెం సేపు ఆలోచించి, "తప్పకుండా ఈ పని ఆ కోదండం గాడిదే అయుంటుంది!" అన్నాడు. "అతనలాంటి వాడా?" అన్నాడు గంగాధరం ఆశ్చర్యపోతూ. "అతడితో నాకు కొద్దిపాటి ముఖ పరిచయం తప్ప, అంతగా స్నేహమంటూ లేదు. నువ్వు, నాతో బయలుదేరు. అతడింటికి వెళ్ళి అడుగుదాం. అవసరం అయితే బెదిరించి చూద్దాం." అన్నాడు సత్యం.ఇద్దరూ పట్నం చేరేసరికి మధ్యాహ్నం అయింది. భోజనం చేసి విశ్రాంతి తీసుకుని, సాయంత్రం కోదండం ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కోదండం ఇంటి ముందున్న కూరపాదులకు నీళ్లు పోస్తున్నాడు. అతడు సత్యం, గంగాధరాలను చూస్తూనే ఒక క్షణం నివ్వెరపడి, అంతలోనే సర్దుకుని, “రండి, రండి అనుకోని అతిథులు!" అన్నాడు. సత్యం అతడితో “ఇక్కడ రక్షక భటుల అధికారి గంగాధరం పిన్ని కొడుకు. గంగాధరం వాళ్ళింట్లో శుభకార్యానికి వచ్చాడు. నిన్ను చూస్తానంటే తీసుకువచ్చాను." అన్నాడు.

కోదండం వాళ్ళను ముందుగదిలో కూర్చోబెట్టి, లోపలికి పోయి భార్యను, "అమ్మాయి ఎక్కడ?" అని అడిగాడు. "ఆడుకోవడానికి వెళ్ళింది" అని భార్య చెప్పగానే, కోదండం "నువ్వు వెంటనే పెరటిదోవన వెళ్ళి అమ్మాయి మెడలో వున్న గొలుసు తీసుకురా," అన్నాడు. "అంత మునిగిపోయిందేమిటి? అమ్మాయి చీకటి పడుతూనే తిరిగి వస్తుంది గదా,” అన్నది భార్య. "ముందు చెప్పిన పని చెయ్యి," అంటూ కోదండం భార్యను కసురుకున్నాడు. ఆమె పావుగంట గడిచీ గడవక ముందే, శోకాలు పెడుతూ తిరిగి వచ్చి, "కొంప మునిగింది! వీధిలో ఆడుకుంటున్న పిల్లలు చెప్పారు. ఎవడో పెద్ద గడ్డంవాడు మిఠాయి కొని పెడతానని అమ్మాయిని తీసుకుపోయాడట. వాడు అమ్మాయి మెడలో వున్న గొలుసు దొంగిలించేందుకే అలా చేసి వుంటాడు." అన్నది. గొలుసు మాట వింటూనే కోదండం వెలవెలపోయి, భార్యను వారించబోయాడు గాని, ఆమె దుఃఖంలో అది గమనించలేదు. సత్యం కల్పించుకుని, “పిల్లలను వీధిలోకి మెడలో బంగారం గొలుసుతో పోనివ్వడం కోరి ప్రమాదం తెచ్చుకోవడమే! ఆ గొలుసు ఎలా వుంటుందో చెప్పి వెంటనే రక్షకభటులకు ఫిర్యాదు చేద్దాం," అన్నాడు. ఈ ఫిర్యాదు మాట వింటూనే కోదండానికి వణుకు పుట్టింది. తను విద్య మెడలోంచి గొలుసు దొంగిలించిన సంగతి ఎలాగూ బయటపడుతుంది. ఆ సంగతి రక్షకభటుల దగ్గర తెలియడం అంటే, తనకు ఖైదు తప్పదు. కోదండం ఇలా ఆలోచించి, గంగాధరం చేతులు రెండూ పట్టుకుని వణుకుతున్న గొంతుతో, “మీరు నన్ను క్షమించాలి! మా అమ్మాయి మెడలోని గొలుసు మీ విద్యది, మొన్న రాత్రి దొంగిలించాను. మా ఆవిడ అమ్మాయికి గొలుసు చేయించమని రోజూ సాధిస్తూండేది, నాకా ఆ స్థోమతలేదు. ఫిర్యాదు చేయకండి, పరువు నాకు ప్రాణంతో సమానం,” అన్నాడు.

గంగాధరం ఎంతో సౌమ్యంగా “చూడు కోదండం! పెళ్ళానికి నచ్చ చెప్పలేనప్పుడు, ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి. పిల్లలకు అసలైన ఆభరణం విద్య. అంతేకాని, చిన్నతనం నుంచీ వాళ్ళకు బంగారం మీద మోజు కలిగేలా చేయడం అవివేకం. ముందు మీ అమ్మాయి ఏమైందో వెదుకుదాం పద," అన్నాడు. ఇంతలో మిఠాయి పొట్లంతో కోదండం కూతురు తిరిగి వచ్చింది. ఆ పిల్ల మెడలో విద్య బంగారు గొలుసు కనబడగానే కోదండం భార్య సంతోషంతో, “ఎక్కడికి వెళ్ళావే తల్లీ? గడ్డం వాడెవడో నిన్ను ఎత్తుకు పోయాడనుకున్నాం," అన్నది. కోదండం కూతురు మిఠాయి పొట్లం విప్పుతూ, "ఆ మామయ్య కొత్తగా ఈ ఊరుకు ఉద్యోగం పని మీద వచ్చాడట. నేను అచ్చం వాళ్ళ అమ్మాయిలా వుంటానన్నాడు. కాసేపు నా మాటలు విని, మిఠాయి కొట్టు దగ్గరకు తీసుకుపోయి, మిఠాయి కొనిపెట్టాడు." అన్నది.

కోదండం భార్య కూతురు మెడలోని గొలుసు తీసి గంగాధరానికిస్తూ, "నా మూర్ఖత్వం, ఆయన్ని దొంగగా చేస్తుందనుకోలేదు. 'పిల్లలకు బంగారం కాదు, బంగారంలాంటి భవిష్యత్తు కోసం చదువు ముఖ్యం' అన్న సంగతి, మీ వల్ల తెలుసుకున్నాను," అన్నది. గంగాధరం గొలుసును జేబులో వేసుకుని, కోదండం కూతురును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ, “దేవుడి దయవల్ల ఎవరి సొత్తు వారికి దక్కింది!" అన్నాడు.

Responsive Footer with Logo and Social Media