దయగల పెట్టె



కంచిపేట అనే ఊరిలో దయానంద అనే యువకుడు ఉండేవాడు. అతడు పేరుకు తగ్గట్టే దయాగుణం ఉన్నవాడు. దయానందకి ‘నా’ అనేవారెవరూ లేరు. దీంతో చిన్నప్పటి నుంచీ ఊళ్లో వాళ్లకి చిన్న చిన్న పనుల్లో సాయపడుతూ పెరిగాడు. యుక్తవయసు వచ్చాక తనకంటూ మంచి ఉద్యోగం, కుటుంబం ఉంటే బాగుంటుందని అతనికి అనిపించింది. జీవితంలో స్థిరపడాలంటే తానున్న పల్లె కంటే పట్నంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించాడు. ఒకరోజు పట్నం బయలుదేరాడు. దారిలో చిట్టడివి దాటుతుండగా దగ్గరలోని పొదల మాటు నుంచి చిన్న మూలుగు వినిపించిందతనికి. దగ్గరకెళ్లి చూడగా ఒక వ్యాపారి ఒంటినిండా గాయాలతో బాధగా మూలుగుతూ కనిపించాడు. సహజంగానే దయగలవాడైన దయానంద ఆ వ్యాపారిని కూర్చోబెట్టి దగ్గరలోని కొన్ని మూలికలు ఏరుకొచ్చాడు. వాటి పసరు తీసి గాయాలకు పూసాడు. నీరు తెచ్చి అతడికి తాగించి సపర్యలు చేశాడు. అప్పటికి ఆ వ్యాపారి స్థిమితపడి దయానందకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు.

తానొక వజ్రాల వ్యాపారినని, ఒంటరిగా వస్తుంటే తనని దోపిడీ దొంగలు దోచుకుని, గాయపరిచి పొదల్లో పడేసి వెళ్లిపోయారన్నాడు. ఆ పొదల్లోంచి చిన్న చెక్క పెట్టెను వెతికి తీశాడు. దాన్ని దయానందకి ఇస్తూ ‘దొంగలు దీన్ని సాధారణమైన పెట్టె అనుకుని విసిరేశారు. అయితే ఇది చాలా మహిమ గల పెట్టె. ఒక ముని నా ఆతిథ్యాన్ని మెచ్చి దీన్ని నాకు ఇచ్చాడు. ప్రాణాలకంటే విలువైన వస్తువేదీ ఈ ప్రపంచంలో లేదు. కనుక ఆపదలో ఉన్న నన్ను కాపాడిన నీకు ఈ పెట్టెను కానుకగా ఇవ్వడం సముచితం. దీన్ని స్వీకరించు. నీకంతా మేలే జరుగుతుంది’ అన్నాడు. దయానంద ఆ పెట్టె తీసుకుని ముందుకు నడిచాడు. కొంతదూరం వెళ్లేసరికి అతడికి కింద పడి ఉన్న దొంగలు కనిపించారు. వారికి దగ్గర్లోనే మూడు మేలిమి వజ్రాలు కనిపించాయి. వజ్రాలు మూడు కావడం వల్ల ఇద్దరు దొంగల మధ్య తగాదా వచ్చి వారిద్దరూ ఒకరినొకరు గాయపరుచుకుని పడి ఉంటారని దయానంద అనుకున్నాడు. ఆ వజ్రాలు తీసుకుని చెక్క పెట్టెలో పెట్టి పట్నంకేసి సాగిపోయాడు.

పట్నం చేరుకున్న దయానంద ఆ రాత్రి సత్రంలో బసచేశాడు. పక్కగదిలోంచి ఇద్దరు వ్యక్తుల మాటలు విన్నాడు. తన పంటను అమ్మడానికి పల్లె నుంచి వచ్చిన ముసలిరైతు గిట్టుబాటు ధర లభించక చేసిన అప్పు తీర్చలేకపోతున్నానని, ఇక తనకు చావే గతి అని కొడుకుతో చెబుతుంటే విన్న దయానందకు వారిపై జాలి కలిగింది. తన వద్ద ఉన్న ఓ వజ్రాన్ని వారికిచ్చాడు. దయానందకు కృతజ్ఞత చెప్పి అక్కడి నుంచి ఆనందంగా వెళ్లిపోయాడా ముసలిరైతు. ఆ మర్నాడు చెక్క పెట్టె తెరిచి చూసిన దయానంద ఆశ్చర్యానికి అంతులేదు. ముసలి రైతుకు ఒక వజ్రం ఇవ్వగా అతని పెట్టెలో రెండు వజ్రాలే ఉండాలి. కానీ మహిమ గల పెట్టె గనుక నాలుగు వజ్రాలున్నాయి. ఆ సాయంత్రం భోజనానికి పూటకూళ్ల ఇంటికి వెళ్లిన దయానందకి మాటల మధ్యలో ఆ యజమానికి జబ్బు పడిన భార్య ఉన్నట్లు, ఆమె చికిత్స కోసం డబ్బులు లేక బాధపడుతున్నట్లు తెలిసింది. ముందు తన వద్ద ఉన్న వజ్రాల్లో ఒకదాన్ని తీసి వారికి ఇవ్వాలనుకున్నాడు. కానీ అంతలోనే అతనిలో స్వార్థం చోటుచేసుకుంది. ఇలా ఇస్తూ పోతే తనకి వజ్రాలు మిగలవనుకుని మిన్నకుండిపోయాడు. తర్వాత ఇంటికెళ్లి పెట్టె తెరిచి చూసుకోగా ఒక్క వజ్రమే ఉంది. కంగారు పడ్డ దయానందకి నెమ్మదిగా పెట్టె మహిమ తెలిసింది. ఇతరుల మేలు కోరి వజ్రాలు ఇస్తే ఆ పెట్టెలోవి రెట్టింపవుతాయి. అలాకాక స్వార్థంతో ఆలోచిస్తే అవి తరిగిపోతాయి.

వెంటనే దయానంద తన దగ్గరున్న వజ్రాన్ని తీసుకుని పూటకూళ్ల ఇంటి యజమాని చేతిలో పెట్టాడు. తర్వాత పెట్టెలో చూస్తే మళ్లీ రెండు వజ్రాలు ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి దయానంద స్వార్థం వీడి ఇదివరకట్లా ఇతరులకు సాయం చేయసాగాడు.

Responsive Footer with Logo and Social Media