ధైర్యం వలన కలిగిన లాభం



ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండే వాడు. ఆయన ప్రేతకర్మలు చేయించే వాడు. ఆయన చాలా ధైర్యశాలి. దుర్మరణాల పాలైనవారికి కూడా దహనసంస్కా రాలు చేయించేవాడు. ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా, ఉరిపోసుకు చచ్చినా దహనసంస్కారాలు చెయ్యటానికి ఈ బ్రాహ్మణ్ణే పిలిచేవారు. ఎందుకంటే, అలాంటి శవాలకు సంస్కారం జరిపించటానికి మామూలు బ్రాహ్మలు భయపడే వారు. బలవంతపు చావు చచ్చినవాళ్ళు దయ్యాలయి, బతికున్నవాళ్ళను బాధిస్తారని అందరూ నమ్మేవారు.

ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణ్ణి ఒకసారి, ఏడెనిమిది మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామంవాళ్ళు పిలిచారు. అక్కడ ఆ బ్రాహ్మడు తన పని పూర్తి చేసే సరికి చీకటి పడిపోయింది. “ఈ చీకట్లో మీ ఊరు వెళ్ళవద్దు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు వెళ్ళవచ్చు" అన్నారు ఉదయం గ్రామస్ధులు. "ఎందుకూ? భోజనంవేళకు ఇల్లు చేరి పోనూ?" అన్నాడు బ్రాహ్మడు. " మరేం లేదు. మా ఊరికీ మీ ఊరికీ - మధ్య ఉండే శ్మశానంలో దయ్యాలున్నాయట. అవి రాత్రివేళ ప్రయాణీకులను పట్టుకుని నానా తిప్పలూ పెడతాయట,'' అన్నారు గ్రామస్థులు. బ్రాహ్మడు విరగబడి నవ్వుతూ, "దయ్యాలూ భూతాలూ నన్నేం చేస్తాయి? నేనీ రాత్రికి ఇల్లు చేరాలి,” అంటూ బయలు దేరాడు, . వెన్నెల రాత్రి. ఆకాశం నిర్మలంగా ఉన్నది. అందుచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడక సాగించాడు. దాదాపు సగం దారి నడిచాక ఆయనకు ఒక పూరిపాక కనబడింది. అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడుగాని, పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడలో నిలబడి కనిపించింది. ఆమె ఇంటికేసి తిరిగి ఉండి, బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయన కేసి తిరగలేదు. " ఈమె ఏ మొగుడితోనో, అత్తగారితోనో దెబ్బలాడి, ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లారే లోపల ఏ నూతి లోనో, గోతిలోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటివాళ్ళకు చాలా మందికి దహనాలు నా చేతిమీదగా చేయించాను. ఈ పిల్లకు కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపెయ్యాలి" అనుకున్నాడు బ్రాహ్మడు .

" ఎవరివో నువు, నిర్భాగ్యురాలా? ఈ వేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు ? నువు ఎవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు. నేనెవరికీ చెప్పనులే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేర్చుతాను కూడా!" అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికీ వెనక్కు తిరగక, "ఊళ్ళోవాళ్ళ విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువు పోరాదూ?" అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒకంతట దారికి వచ్చే రకంగా లేదనుకుని బ్రాహ్మడు, " అడిగిన మాత్రాన అంత గింజుకుంటావేం? ఈ వేళప్పుడు నిన్నిలా విడిచి నా దారిన పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుతుందా? మీది ఏ గ్రామమో చెప్పు. కనీసం నీ పేరైనా చెప్పు. లేదూమీవాళ్ళెవరో చెబితే వాళ్ళకు కబురు అందిస్తాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు.'' అన్నాడు. "మంచిగా వెళ్ళవన్నమాట. నిన్ను పట్టుతాను, కాచుకో!" అంటూ ఆమె వెనక్కు తిరిగింది. ఆమె ముఖం రక్త హీనంగా, పాలిపోయి సుద్దలాగా ఉన్నది. ఆమె తప్పక దయ్యమే అయి ఉండాలని తనకున్న ఖ్యాతిని కాపాడుకోనేందుకు ఆయన తన భయాన్ని తొక్కిపట్టి, "నన్ను పట్టుతావా? ఏదీ పట్టు! దయ్యం పట్టాలని నేనెంతో కాలంగా ఎదురు చూస్తున్నాను” అంటూ పెద్దగా నవ్వాడు. దయ్యం జుట్టు విదిలించుకుని, నాలుక బయటికి చాచింది. బ్రాహ్మడికి భయం చాలా భాగం తగ్గిపోయింది"దయ్యాలు నీ కన్న రెట్టింపు పొడుగున నాలుకలు చాచటం నేనెరుగుదును." అన్నాడాయన దయ్యంతో. దయ్యం ఈ మాటకు చిన్న బోయినట్టు కనబడి, నాలుక లోపలికి తీసుకుని, నోటి నుంచీ, చెవుల నుంచీ, రక్తం కార్చసాగింది. " లాభం లేదే, అమ్మాయి. నీ కన్న భయంకరంగా రక్తం కార్చిన శవాలను నేను చాలా చూశాను. నువు వట్టి చేతగాని దయ్యంలా కనిపిస్తున్నావు!" అన్నాడు బ్రాహ్మడు.

దయ్యం నిరుత్సాహపడిపోయి, " ఆవునండీ! మీకు నిజం చెప్పేస్తాను. నాకు అనుభవం లేదు. రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దయ్యాన్ని నేను. ఈ ఆత్మహత్య ఎలా చేసుకోవాలా అని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిన మీరు వెళ్ళినట్టయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను.” అని బ్రాహ్మణ్ణి బతిమాలింది "ఓసి నీ కడుపుడకా!" అని బ్రాహ్మడు తన మనసులోనే అనుకుని, ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్లమీద జాలి పడ్డాడు. ఆయన పైకి, దయ్యం మీద సానుభూతి నటిస్తూ, "బతికున్న దయ్యాన్ని నేనింత వరకు చూడలేదమ్మాయీ! పాపం, ఆ పిల్ల ఎవరో?" అన్నాడు. " ఆ కనిపించే గ్రామంలో తూర్పువేపున ఉండే వడ్రంగివాళ్ళ కోడలు" అన్నది దయ్యం " నిజంగానా? పాపం, ఆ పిల్లకేం కష్టం వచ్చిందో?" అన్నాడు బ్రాహ్మడు. " ఇంకేం రావాలి? అత్తముండ కోరంటికం పెట్టి దాని ప్రాణం కొరికేస్తున్నది" అన్నది దయ్యం. " ఇంకేం? నీకు శ్రమ లేనేలేదన్నమాట. జరగవలిసినదేదో అత్త చేతిమీదగానే జరిగిపోతుందిగా ." అన్నాడు బ్రాహ్మడు. " అది అంత తేలిక అనుకుంటున్నారా? నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాలి. ఆలోచించాను కూడా!" అన్నది దయ్యం. "భేష్ ! నీ పథకం పారేనా?" అన్నాడు బ్రాహ్మడు. "ఎందుకు పారదూ? రేపు ఆ అత్త ముండ నోము నోస్తున్నది. బుట్టెడు అరటి పళ్ళు తెప్పించింది. ముత్తయిదువులకు తాంబూలాలలో పెట్టి ఇవ్వటానికి. ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను. అప్పుడా అత్తముండ కోడల్ని నానా తిట్లూ తిడుతుంది. ఏ పాపమూ ఎరగని కోడలు కాస్తా ఆత్మహత్య చేసుకుంటుంది.'' అంటూ దయ్యం అమాయకంగా రహస్యం బయట పెట్టేసింది. "ఓసి నీ కడుపుడకా!" అని బ్రాహ్మడు తనలో మళ్ళీ అనుకుని, పైకి దయ్యంతో, "బాగుంది, బాగుంది! ఇక నేను కదలాలి. కాలాతీతమై పోతున్నది. వస్తా!" అంటూ తన గ్రామానికి బయలుదేరాడు.

ఆయన ఆ రాత్రి ఇల్లుచేరి, భోజనం చేసి - పడుకుని, తెల్లవారుతూనే లేచి, తూర్పు వేపున ఉండే వడ్రంగుల ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపలి నుంచి పెద్దగా అరుపులూ, కేకలూ వినిపిస్తున్నాయి. " బ్రాహ్మడు చల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి, ఇంటావిడ ఇల్లెగిరి పోయేటట్టు కోడలి మీద అరుస్తున్నది. కోడలు నడవాలో ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. "ఏమిటర్రా ఈ సందడి?" అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు. " ఈ తప్పుడు ముండతో వేగలేకుండా ఉన్నాను బాబుగారూ! నా చేత్తో నేనిక్కడ పెట్టిన పళ్ళబుట్ట మాయమయింది. గర్భాత్రపుది అన్నీ తినేసింది. నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చి మొద్దునా?" అన్నది అత్త గుక్క తిప్పుకోకుండా. " ఎందుకమ్మా అంతగా హైరాన పడిపోతావూ? నీ పళ్ళబుట్ట అటకమీద ఉన్నది," అన్నాడు బ్రాహ్మడు. "ఇక్కడ పెట్టిన పళ్ళు అటక మీదికి వాటంతట అవి పోతాయిటండీ? అదే పెట్టాలి, లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి.” అంటూ అత్త కోడలుకేసి కొరకొరా చూసింది. "ముందు అటక మీద చూడవమ్మా! ఆ పళ్ళబుట్ట అక్కడ ఉన్నదీ లేనిదీ నన్ను కూడా రూఢి చేసుకోనీ!" అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అంటిపళ్ళబుట్ట ఉండనే ఉన్నది. "అయితే, ఆ దయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాటా!" అన్నాడు బ్రాహ్మడు. "దయ్య మేమిటండోయ్?" అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మడు తనకు దయ్యం కనిపించి తనతో మాట్లాడటం గురించి చెప్పాడు. ఆ బ్రాహ్మడి ధైర్యానికి ఆశ్చర్య పడింది. కోడలు ఏడపటం మానేసి, చిన్నగా నవ్వ నారంభించింది. తన కృషి ఫలిస్తున్నదని గ్రహించి బ్రాహ్మడు అత్తతో, ''చూశావుటమ్మా? ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుకవాసిలో తప్పింది. కాని నీ బుద్ధి మార్చుకోకపోతే, ఆ పిల్ల ఏదో రోజు తన ప్రాణం తీసుకుంటుంది. ఆ తరవాత నీ పాట్లు పగవాడికి కూడా వద్దనేటట్టు ఉంటాయి. తరవాత నీ ఇష్టం!'' అన్నాడు.

అత్త కోడలు కేసి తిరిగి, "నా పరువు నట్టేట కలపకే నా తల్లీ! నీకు చందమామ కావాలన్నా తెచ్చి ఇస్తాను. అఘాయిత్యాలు మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది!" అన్నది. ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢి చేసుకుని బ్రాహ్మడు తన ఇంటికి చక్కాబోయాడు.

Responsive Footer with Logo and Social Media