రైతు తెలివి
పూర్వం ఒక ఊళ్ళో ఒకరైతు ఉండేవాడు. అతడు బీదవాడే కాని చాల తెలివైనవాడు. ఆ చుట్టుప్రక్కల వారంతా అతని సలహాల కోసం వస్తూండేవారు. ఒక రోజున రాజుగారు ఆ వీధిలోంచిపోతూ రైతుని చూశారు. అతణ్ణి దగ్గరకు పిలిచి "నీవు రోజుకు ఎంత సంపాదిస్తావు? ఎంత మిగులుస్తావు?” అని అడిగారు. అందుకు రైతు "మహారాజా! నేను రోజుకొక రూపాయి సంపాదిస్తాను. అందులో ఒక పావలా తింటాను. ఒకపావలా అప్పిస్తాను, ఒకపావలా అప్పు తీరుస్తాను. ఒకపావలా విసిరేస్తాను" అని చెప్పాడు. రాజుగారికి ఇదేమీ అర్థం కాలేదు. అందుకు ఆయన "నీవు చెప్పినది నాకు అర్ధమయ్యేటట్లు వివరించు" అని అడిగారు. ఆ రైతు ఈవిధంగా వివరించి చెప్పాడు.
“నా సంపాదనలో నాల్గవ వంతు నాకు, నా భార్యకు తిండి కోసం ఖర్చు చేస్తాను. అందుచేత మొదటి నాల్గవ వంతు తినేస్తాను అని చెప్పాను. రెండవ నాల్గవ వంతును నా పిల్లలకు ఖర్చుచేస్తాను. నేను పెద్దవాణ్ణి అయ్యాక నన్నువాళ్ళు పోషించాలి కదా! అందుచేత అది అప్పు ఇచ్చినట్లే కదా! మూడో నాల్గవ వంతుని నా తల్లితండ్రులకై ఖర్చుచేస్తాను. వారునన్ను చిన్నప్పటినుండి పెంచి పెద్దచేశారు. కనుక అది వారి బాకీ తీర్చినట్లే కదా! నాల్గవ భాగాన్ని దానధర్మాలకి ఖర్చుచేస్తాను-అంటే విసిరివేసినట్లే కదా" అన్నాడు. రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు. "ఇప్పుడు నీకు ఒక షరతు విధిస్తున్నాను. నా ముఖాన్ని వందసార్లు చూసే దాకా ఈ సమస్యకు అర్థమేమిటో ఎవరికీ చెప్పకూడదు. తర్వాత నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను" అని చెప్పాడు.
మర్నాడు తన దర్బారులో రైతుచెప్పిన దాన్ని ఒక సమస్యగా ఇచ్చి దాని జవాబును చెప్పమని కోరాడు. అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ జవాబు చెప్పలేకపోయారు. అందుచేత ఆయన వారికి మూడురోజులు గడువిచ్చి దానికి జవాబు చెప్పమన్నాడు. ఆయన కొలువులో ఒక తెలివైన మంత్రి రహస్యంగా ప్రయత్నం చేసి, రాజుగార్కి ఈ సమస్యను చెప్పింది ఒక రైతని తెలుసుకొన్నాడు. వెంటనే ఆ ఊరికి వెళ్ళి, రైతుని దానికి జవాబు చెప్పవల్సిందని కోరాడు. అందుకు రైతు “అయ్యా! క్షమించండి! రాజుగారి అనుమతిలేనిదే నేను దాని జవాబును మీకు చెప్పలేను" అన్నాడు..
అప్పుడా మంత్రి ఒక వంద బంగారు నాణాల్నిఇచ్చి దాని జవాబు చెప్పమని అడిగాడు. రైతు ఆ వందనాణాల్నీ ఒకసారి లెక్కబెట్టి చూచి, ఆ సమస్యకు జవాబును వివరించి చెప్పాడు. మర్నాడు ఆ మంత్రి తాను తెలుసుకొన్న జవాబును దర్బారులో చెప్పాడు. అదివిన్న రాజుకు రైతుమీద అనుమానం వచ్చింది. రైతే తనకు జవాబు చెప్పినట్లు ఆ మంత్రి కూడా ఒప్పుకొన్నాడు. రాజు గార్కి చాలా కోపం వచ్చింది. రైతును తప్పక శిక్షించాలి అనుకొన్నారు. ఆయన ఆ రైతు ఉండే ఊరికి వెళ్ళి, రైతును కలిసి "నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరచి, సమస్యకు జవాబును చెప్పివేశావు. నీకు మరణదండన విధిస్తున్నాను" అన్నారు.
"లేదు మహారాజా! నేను వాగ్దానాన్ని మరువలేదు మీముఖాన్ని వందసార్లు చూచిన తర్వాతనే ఆయనకు జవాబు చెప్పాను" అన్నాడు. "నిన్ను మొదట చూచిన నాటినుండి నేటివరకూ నేను చూడలేదు. నీవు ఎట్లా నా ముఖాన్ని వందసార్లు చూశావు?" అని అడిగారు రాజుగారు. "ఇదిగో చూడండి-వంద బంగారు నాణాలు వీటి అన్నిటి మీద తమముఖమే ఉంది. వాటినన్నిటినీ చూచిన తర్వాత మాత్రమే నేను అతనికి జవాబు చెప్పాను" అన్నాడు రైతు.
రైతు చెప్పిన తెలివైన జవాబుకు అతని తెలివి తేటలకు రాజు బ్రహ్మానందపడిపోయాడు. వెంటనే ఒక గొప్ప బహుమానంతో బాటు అదనంగా కొన్ని బంగారు నాణాల్ని కూడా అతనికి ఇప్పించాడు రాజు.