మహత్తర మూలిక



సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలం తన అవ్వ రెక్కల కష్టంతో పెరిగి, ఆమె పోగానే దిక్కూ, దరీ లేనివాడై పోయాడు. ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు. నలభై ఏళ్ళ క్రితం ఎక్కడినుంచో ఆ ఊరికి వచ్చి, స్థిరపడి, చుట్టుపక్కల ఊళ్ళలో గొప్ప వైద్యుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఏదో మహత్తర మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవికి వెళ్ళి, ఆ మూలిక తెచ్చి, దానితో ఇతర దినుసులు చేర్చినూరి, గుళికలు చేసేవాడు. ఆయన గుళిక ఒక్కటి వేసుకుంటే, ఎలాంటి జబ్బుగాని ఎగిరి చక్కా పోతుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. రామయ్య తాత డెబ్బై అయిదేళ్ళ వృద్ధుడు. ఆయనకు ఎవరూ లేరు. ఆయన దగ్గర చేరి, మూలిక రహస్యం తెలుసుకుంటే, జీవితాంతమూ సుఖంగా బతకవచ్చునని సోమశేఖరుడు ఆలోచించాడు. ఈ ఆలోచనతో వాడు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు. లోపల గుళికలు చేసుకుంటున్న ముసలాయన తన పని కట్టిపెట్టి, ఇవతలకి వచ్చి, "నీ కేమీ జబ్బులేదు. నిక్షేపంలా ఉన్నావు. ఇంటికి వెళ్ళు అన్నాడు. "నేను జబ్బు నయం చేసుకోవటానికి రాలేదు. ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటి దగ్గర పని ఏమీలేదు." అన్నాడు సోమశేఖరుడు. “నీ చేత చేయించుకునే పని కూడా నాకు ఏమీలేదే!" అన్నాడు ముసలాయన. “ఇంటి పని అంతా చేస్తాను. అడవికి వెళ్ళి నీకు కావలసిన మూలికలు తెస్తాను." అన్నాడు సోమశేఖరుడు.

ముసలాయన సోమశేఖరుణ్ణి ఎగా దిగా చూసి, "సరే, ఇంటి పని నువుచూడు. మిగిలిన పని నేను చూసుకోగలను." అన్నాడు. సోమశేఖరుడు నిరుత్సాహపడక, ఆ రోజే పనిలో చేరాడు. ముసలాయన అతణ్ణి అన్ని పనులూ చెయ్యనిచ్చేవాడు. కాని మూలికలు తేవటానికి అడవికి వెళ్లేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాడు. తాను గుళికలు తయారుచేసేటప్పుడు సోమశేఖరుణ్ని ఆ చాయల ఉండనిచ్చేవాడు కాదు. మూడు మాసాల అనంతరం ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గర తన మనసులో మాట చెప్పుతూ, "తాతా, నువ్వు కాటికి కాళ్ళు చాచుకుని ఉన్న వాడివి. అన్ని రోగాలూ నయం చెయ్యగల శక్తి నీకున్నది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు. దాని రహస్యం నీతోనే అంతమవటం మహా అన్యాయం! అదేదో నాకు చెప్పు. నీ అనంతరం నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటారు" అన్నాడు. రామయ్య తాత విరగబడి నవ్వి "నా కేంరా? దుక్కలా ఉన్నాను. ఇప్పుడప్పుడే చస్తానని భ్రమపడకు" అన్నాడు.

ఆ తరవాత సోమశేఖరుడు ఆ విషయం మరి ఎత్తలేదు. ఒక సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేశాడు. ఈ కాలంలో ఇద్దరి మధ్యా, వారికే తెలియకుండా, ఒకరిమీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. ఒకరోజు రామయ్యతాతకు పెద్ద జబ్బు చేసింది. ఆయనను చూసి సోమశేఖరుడు కళ్ళనీరు పెట్టుకుని, "రెండు గుళికలు మింగు తాతా! జబ్బు పోతుంది" అన్నాడు. ముసలాయన నీరసంగా నవ్వి, “ఇంక ఈ ఘటం వెళ్ళిపోతుందిరా ఇది గుళికలతో నయమయే జబ్బు కాదు" అన్నాడు. తరవాత ఆయన వాడితో "మూలికా రహస్యం చెప్పమన్నావా?" అన్నాడు. “ఇప్పుడు వద్దులే, తాతా, కాసేపు విశ్రాంతి తీసుకో. ముందు నీ జబ్బు నయంకానీ" అన్నాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రామయ్యతాత తన మంచం పక్కనే నేలమీద పడుకున్న సోమశేఖరుణ్ని లేపి, "నాయనా, నా మూలికా రహస్యాన్ని తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను. నేను పోయాక తీసి చదువుకో" అని పడుకున్నాడు. అలా పడుకున్న మనిషి మళ్లీ లేవలేదు. సోమశేఖరుడు రామయ్య తాత కోసం తండ్రి పోయినంతగా ఏడ్చాడు. వాడు రామయ్యతాతకు శ్రాద్ధ కర్మలు యధావిధిగా చేశాడు. ఇక వాడికి ఆ ఇంట ఉండ బుద్ధిపుట్టలేదు. వాడు ఆ ఇల్లు వదిలి పోదామనుకుంటూండగా, రామయ్యతాత తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాడు పెట్టెలో నుంచి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు. "నాయనా, శేఖరం ఆఖరుదశలో నువు నాకు దిక్కు అయ్యావు. మూలిక రహస్యం తెలుసుకోవటానికే నువ్వు నా దగ్గర చేరావు. అయితే రానురాను ఇద్దరమూ స్నేహితులమయాం. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలుసునా? ప్రజల విశ్వాసం! నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికలకు మహత్తర శక్తి వచ్చింది. నేను పోయినా ఇల్లు నీదే. పెరట్లో జామచెట్టు కింద నా డబ్బు చాలా దాచాను. దానితో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకో నీకు మేలు కలుగుతుంది. సోమశేఖరుడు మనసులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకుని, ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యటానికి నిర్ణయించుకున్నాడు.

Responsive Footer with Logo and Social Media