తగినశాస్తి


ఒకసారి ఒకపిసినారి కోమటి తన డబ్బు సంచీని పోగొట్టుకొన్నాడు. అందులో ఒకవంద బంగారు నాణాలు ఉన్నాయి. అది పోయిన నాటి నుండి ఏమీ చేయలేక మతిలేనట్లుగాను, పిచ్చెక్కినట్లుగాను ఉంటోందతనికి. చివరకు ఆ ఊరి పెద్దమనిషి వద్దకు వెళ్ళి తన కష్టం గూర్చి మొరబెట్టుకున్నాడు. “నీవు ఆ సంచీ తెచ్చి ఇచ్చిన వారికి ఏభై నాణాలను ఇస్తానని బహుమతి ప్రకటించు" అని ఆయన సలహా ఇచ్చాడు. "అమ్మో! ఏభై నాణాలను ఇచ్చివేయడమే!" అని బాధపడ్డాడు. కాని తప్పనిసరి అగుటచేత ఆ విధంగానే ప్రకటించేశాడు శెట్టి. ఒక బక్క రైతుకు ఆ సంచీ దొరికింది. బహుమతి దొరుకుతుందనే సంతోషంతో అతడు ఆ కోమటి ఇంటికి వెళ్ళాడు. ఆ పిసినారి తన సంచీ కన్పించగానే సంతోషంతో పొంగిపోయాడు. “నీవెంత మంచివాడవు! నీకు అనేక ధన్యవాదాలు!" అని చెప్పి ఆ శెట్టి ఇంటిలోనికి పోయి తలుపు మూసివేశాడు. “ఇంట్లోకి వెళ్ళి ఆ ఏభై నాణాలూ తెచ్చి ఇస్తాడు కాబోలు” అనుకొని ఆ రైతు అక్కడే ఉండిపోయాడు.

ఎంతసేపటికి రాకపోయేసరికి రైతు వెళ్ళి తలుపుకొట్టి “శెట్టిగారూ! శెట్టిగారూ!" అని పిలిచాడు. ఆ శెట్టి బయటికి వచ్చి "ఎందుకు పిలుస్తున్నావు? నీకేం కావాలి?" అని అడిగాడు. ఆ మాటలకు తెల్లబోయిన రైతు "సంచీ తెచ్చియిస్తే ఏభై నాణాలు బహుమతిగా ఇస్తానన్నారుగదా! వాటిని ఇప్పించండి! వెళ్ళిపోతాను" అన్నాడు. "నీకు బహుమతా? నేను లోపలికెళ్ళి లెక్కచూచుకొంటే అందులో వంద మాత్రమే నాణాలు ఉన్నాయి. అందులో నూట ఏభై నాణాలు ఉండాలి. అంటే ఆ ఏభై నాణాల్నీ నీవు బహుమతిగా తీసుకొన్నట్లేగదా? నన్ను అనవసరంగా బాధపెట్టకు! వెళ్ళిపో!" అన్నాడు శెట్టి.

ఏమీచేయలేక ఆ రైతు వెళ్ళి తనగోడును ఆ ఊరి పెద్దమనిషికి చెప్పాడు. ఆయన శెట్టిని డబ్బు సంచీతో సహా రావల్సిందిగా కబురుచేశాడు. అతడు వచ్చిన తర్వాత "ఈ విషయంలో నీవు చెప్పేది ఏమైనా ఉందా?" అని ఆయన శెట్టిని అడిగితే ఆ శెట్టి "ఈ సంచిలో నూట ఏభై నాణాలు ఉండాలి. ఇప్పుడు వంద నాణేలు మాత్రమే ఉన్నాయి" అని చెప్పాడు. “ఈ సంచీ చిన్నది. దీంట్లో ఏభై నాణాలకంటే ఎక్కువ పట్టవు. నీవు "వంద నాణాల్ని లెక్కపెట్టాను అన్నావు. అందుచేత ఈ సంచీ నీదికాదని నా నమ్మకం. ఈ రైతు నీవే ఆ సంచీకి నిజమైన అధికారివని తలచి పొరబాటున దీన్ని నీకిచ్చాడు. దాని అసలు యజమాని ఇక్కడలేనందున ఈ సంచీని ఈ బీదరైతుకు ఇచ్చివేస్తున్నాను" అని డబ్బుతో సహా ఆ సంచీని రైతుకు ఇచ్చివేశాడు ఆగ్రామ పెద్ద. 'ఆ పిసినారికి తగినశాస్తి జరిగిందని' అందరూ ఆనందించారు.

Responsive Footer with Logo and Social Media