మంత్రి తెలివి


పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఒకరోజున రాజభవనం పై అంతస్తులో బాల్కనీలో నిలబడి ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. ఆ రోజున గాలి ఎక్కువగా ఉండి చలిచలిగా ఉంది. అచ్చట ఎక్కువసేపు నిలబడలేక ఆయన గదిలోకి పోదామని ద్వారం దగ్గరకు చేరుకొన్నాడు. హఠాత్తుగా పెద్దగాలి వీచడంవల్ల తెరచిన ఆ తలుపు దభేలున మూసుకొనిపోయింది. తలుపుసందులో ఆయనవేలు ఉండుటచేత అది తెగి క్రింద పడిపోయింది. ఆయన బాధతో విలవిల్లాడిపోతూ అరవడం మొదలుపెట్టాడు. ఆ హడా విడికి రాజోద్యోగులూ ముఖ్యమంత్రి కూడా పరిగెత్తుకొని వచ్చారు. అందరూ ఆయనకు సానుభూతి తెలియజేస్తూ బాధపడ్తున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి "అయ్యా! బాధపడకండి! జరిగింది ఏదో మనమంచికే జరిగింది." అన్నాడు. ఆ మాటలకు రాజుగార్కి అంతులేని కోపం వచ్చింది. వెంటనే ఆయన "ఈ దుర్మార్గుణ్ణి తీసుకెళ్ళి చెరసాలలో బంధించండి" అని ఆజ్ఞాపించారు. అతణ్ణి జైల్లో పెట్టిన వెంటనే ఒక కొత్త మంత్రిని ఆస్థానంలో నియమించాడు రాజు.

కొన్నాళ్ళ తర్వాత రాజుగారు తన పరివారంతో సహా అడవిలోనికి వేటకు వెళ్ళాడు. వాళ్ళు అడవిలో తిరుగుతుండగా, అచ్చటి కోయవాళ్ళు వచ్చిరాజుగార్ని బంధించి "మేం మా దేవతకి బలి ఇయ్యటానికి ఒక మంచి మనిసి కోసం ఎతుకుతుండాం. ఇయాల ఈ మనిసి దొరికిండు" అని ఆయన శరీరమంతా పరీక్షగా చూడ్డం మొదలెట్టారు. చివరకు తెగిన వేలు వాళ్ళకంటబడింది" ఛీ! ఛీ! ఈ మనిసి కి యేలులేదు. మా దేవతకి కోపమొచ్చుద్ది" అని ఆయన్ను ప్రక్కకునెట్టి, అన్నివిధాలా బాగున్నాడని కొత్తమంత్రిని తీసుకొనిపోయి వాళ్ళదేవతకు బలి ఇచ్చారు.

వేటనుండి కోటకు చేరిన రాజు "వెంటనే చెరసాలకు వెళ్ళి, మనపాత ముఖ్యమంత్రి గార్ని విడిపించి ఇక్కడకు తీసుకొనిరండి" అని సేవకులకు పురమాయించాడు. కాసేపట్లో వచ్చి ఎదుట నుంచున్న మంత్రితో రాజు "నీవు చెప్పింది నిజమే! ఏది జరిగినా మన మేలుకే జరుగుతుంది. నీవు మామూలుగా మా కొలువులో ముఖ్యమంత్రిగానే కొనసాగవచ్చును" అన్నాడు. ఆ తెలివైన మంత్రి చిరునవ్వుతో “చిత్తము! మహారాజా! ఏది జరిగినా మనమంచికే జరుగుతుంది" అన్నాడు.

Responsive Footer with Logo and Social Media