దొంగ-తేలు
సుజాత అర్థరాత్రివేళ మంచి నిద్రలో వుండగా, పక్కన, "అమ్మో!" అన్న కేక విని సుజాత ఉలిక్కిపడి నిద్ర లేచింది. తల దగ్గర చీకట్లో ఎవరో మనిషి నిలబడి, చెయ్యి విదిలించుకుంటూ వుండడం చూసి, ఆమె గుండె జల్లుమన్నది. ఇంట్లో ఆమె ఒక్కతే వున్నది. తండ్రి పొరుగూళ్ళో ఏదో సంబంధం వున్నదని తెలిసి, ఆ సంగతి విచారించి రావడానికి వెళ్ళాడు. వెళ్ళేముందు పనిమనిషిని కూతురుకు తోడుగా వుండమని చెప్పాడు. అయితే, అనుకోకుండా దాని భర్తకు జబ్బుచేసి, అది ఇంటికి వెళ్ళిపోయింది. సుజాతకు ఒంటరిగా వుండక తప్పలేదు. ఎవడో దొంగ, వంటగది పై పెంకులు తొలిగించి,ఇంట్లో ప్రవేశించాడు. సుజాతకు భయంతో ఏమిచేయడానికీ పాలుపోలేదు.
దొంగ ఆమెతో, “తొందరగాలే! నీ తల కింద పెద్ద తేలున్నది" అన్నాడు చేతిని బాధగా విదిలించుకుంటూ. అతను సుజాత తల కింద తాళం చెవుల కోసం వెతుకుతుండగా, తేలు కుట్టింది. సుజాత అందుబాటులో వున్న దీపం వత్తిని పెద్దది చేసి, చప్పున మంచం దిగింది. దొంగ దిండును పక్కకు తోసి, అక్కడ వున్న పెద్ద నల్లతేలును కిందికి విదిలించి, చెప్పుతో కొట్టి చంపేశాడు. సుజాతకు తేళ్ళంటే చెడ్డభయం. దొంగ సమయానికి రాకపోతే, తేలు తనను తప్పక కుట్టి వుండేదే! ఆమెకు దొంగ పట్ల కృతజ్ఞతా భావం ఏర్పడింది. దొంగ ఇంకా బాధపడుతూ వుండడం చూసి, ఆమె అతడి వేలుకు కరక్కాయ అరగదీసి రాసి, పాతగుడ్డల పొగ వేసి, వేలు మంట పోయేందుకు ఊదుతూ కూర్చున్నది. దొంగ ఆమెకేసి చూస్తూ, “ఇంత ఇంట్లో ఒక్కదానివే వున్నావేం? ఒంటరిగా వుండడం ప్రమాదం అని తెలియదా” అన్నాడు.
"ఇలా ఎప్పుడూ వుండను. ఈ రోజు మా నాన్న పొరుగూరు వెళ్ళాడు. చూడబోతే చదువుకున్నవాడిలా వున్నావు, ఇలా దొంగతనానికి ఎందుకు బయలుదేరినావు?" అని అడిగింది సుజాత, దొంగ దిగులుగా మొహం పెట్టి, "అంతా చెబుతాను నా పేరు మురళి. నన్ను మా అవ్వ గారాబంగా పెంచి పెద్ద చేసింది. అవ్వ మురిపం వల్ల నాకు చదువు అంతగా అబ్బలేదు. చెడు స్నేహాల కారణంగా అవ్వ పెట్టెలోంచి చిల్లర డబ్బులు దొంగిలించేవాడిని. ఆ మధ్య అవ్వ పోయింది. మా ఊరు నుంచి ఈ పట్నం వచ్చాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా, పని దొరకలేదు. మూడు రోజులు పస్తులుండి చివరికి ఈ దొంగతనానికి దిగాను" అన్నాడు. సుజాత అతడి స్థితికి జాలిపడింది. ఇంట్లో వున్న పళ్ళు తినమని ఇచ్చింది. తెల్లవారేదాకా బాధ కలగకుండా అతడికి కబుర్లు చెబుతూ కూర్చున్నది. మురళి మంచి అందగాడు. కాని అతడి దొంగబుద్ధి ఆమెకు కలవరం కలిగిస్తున్నది.
"ఉదయాన్నే మా నాన్న వస్తాడు. నిన్ను ఆయనకు మా స్నేహితురాలి అన్నగా పరిచయం. చేస్తాను. నిరుద్యోగివనీ, ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చెబుతాను. దొరికిన పనేదో చేస్తూ సుఖంగా కాలం గడపడానికి నీకు అభ్యంతరం వుండదనుకుంటాను" అన్నది సుజాత. మురళి సంతోషంగా తలాడించి, సుజాత తండ్రి రాకముందే వంటగది కప్పు పెంకులు సర్ది పెట్టేశాడు. బారెడు పొద్దెక్కాక సుజాత తండ్రి తిరిగి వచ్చాడు. తండ్రి ముఖం చూస్తూనే వెళ్ళిన సంబంధం కుదరలేదని సుజాత గ్రహించింది. ఆమె తండ్రికి మురళిని తన స్నేహితురాలి అన్నగా పరిచయం చేసి, "ఉద్యోగం కోసం పట్నం వచ్చాడట" అన్నది. సుజాత తండ్రి మాటల ధోరణిలో మురళిని రకరకాల ప్రశ్నలు అడిగి చూశాడు. మురళి జవాబులూ, అతడు వినయంగా ప్రవర్తించిన తీరూ ఆయనకు బాగా నచ్చినవి. అప్పటికే సంవత్సరం నుంచి కూతురు పెళ్ళికోసం ఎన్నో ఊళ్ళు తిరిగి విసిగిపోయి వున్న అతడికి మురళినే తన ఇంటి అల్లుడుగా చేసుకుంటే బావుండును గదా అనిపించింది.
సుజాత తండ్రి కూతురును ఒంటరిగా చూసి "అమ్మా యీ అబ్బాయి నీ స్నేహితురాలి అన్న అంటున్నావు. మనిషి బావున్నాడు, మాటతీరు చూస్తుంటే చాలా సాధువులా వున్నాడు. ఇలాంటి వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కష్టం కాదు. నాకు నచ్చాడు, నీకు నచ్చేటట్లుంటే, మీ ఇద్దరికి వివాహం చేసేస్తాను" అన్నాడు. సుజాత తండ్రికి ఎటూ తేల్చి చెప్పకుండా "తొందరేముంది నాన్నా!" అని వూరుకున్నది. ఆమెకు మురళి మీద ఇంకా పూర్తి నమ్మకం కలగలేదు. అతడు పెరిగిన వాతావరణం, చెడ్డ స్నేహితుల ప్రభావం అంత త్వరగా వదిలేవికాదని ఆమె అనుకున్నది. ఆ సాయంత్రం మురళికి తమ తోట అంతా తిప్పి చూపించింది. చీకటి పడి ఇల్లు చేరాక, ఒక పెట్టెలో వున్న నగలు అతడికి చూపించి, "ఇవి మా అమ్మవి మా ఇంట్లో ఇంతకన్న విలువైనవి మరేం లేవు." అన్నది. ఆ రాత్రి మురళికి మళ్లీ నిద్రపట్టలేదు. అతని కళ్ళముందు సుజాత చూపించిన నగలు తళుక్కుమంటున్నాయి. ఆ నగలు ఎత్తుకుపోయి అమ్మి, ఆ డబ్బుతో హాయిగా బతకవచ్చునన్న ఆలోచన అతడికి కలిగింది. అలా కాక, బతికినన్నాళ్ళూ ఒకళ్ళకింద నౌకరీ చేస్తూ కష్టపడడం ఎందుకు? అనుకున్నాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి మురళి ఒక రాత్రివేళ నగలపెట్టె తీసుకుని, పెరటి దారిన పారిపోయాడు. అతడు కొంతదూరం వెళ్ళి నగల పెట్టెను దగ్గర వుంచుకోవడం ప్రమాదం అని భావించి నగలు మాత్రం తీసుకుందామని పెట్టె తెరిచి, ఉలిక్కిపడ్డాడు. నగల మధ్య నల్ల తేలు వున్నది!
తేలు మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయంతో అతడు నగలపెట్టెను చప్పున జారవిడిచాడు. నగలతోపాటు కిందపడిన తేలు కదలలేదు. అది బొమ్మ తేలని గ్రహించిన మురళి దాన్ని పక్కకు తోసి నగలు తీసుకుంటూండగా వాటి మధ్య ఒక చీటి కనిపించింది. అది సుజాత రాసినది. అందులో ఇలా వున్నది. "బొమ్మ తేలు అయినందుకు చాలా సంతోషించి వుంటావు! తేలులా కనిపించి కుట్టకపోతే పరవాలేదు కాని, వాన పాములా కనిపించి విషం కక్కితేనే ప్రమాదం. నిన్న నీవు దొంగలా కనిపించి హాని చేయలేదు. ఈరోజు ఈ ఇంటికి కాబోయే అల్లుడివయే అవకాశం వుండీ, నగలు దొంగిలించుకుపోతున్నావు. నా తండ్రికి నచ్చినా, నీ లాంటి మనిషి భర్త కాకుండా పారిపోతున్నందుకు ఆనందిస్తున్నాను.”
ఉత్తరం చదివి మురళి దిగాలుపడిపోయాడు. సుజాతను పెళ్ళాడి, హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకవలసిన తను, ఇలా దొంగలా జీవించ తలచినందుకు అసహ్యపడ్డాడు. వెంటనే పోయి, నగలు సుజాతకు ఇచ్చి, ఆమెను క్షమాపణ కోరి తన దారిన తాను వెళ్ళిపోదలిచాడు. మురళి తిరిగి ఇంటిలోకి వస్తూండగా, మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వచ్చిన సుజాత తండ్రి, అతణ్ణి చూసి అనుమానంగా, "ఇంత రాత్రివేళ నగల పెట్టె తీసుకుని ఎక్కడికి వెళ్ళావు?" అని అడిగాడు. మురళి జవాబు చెప్పేందుకు తత్తర పడుతూండగా సుజాత వచ్చి, “నా చేతి గాజులు గుచ్చుకుంటూంటే, వాటిని నగల పెట్టెలో దాద్దామనుకున్నాను, నాన్నా! అయితే అందులోకి ఎలాచేరిందో ఒక తేలు చేరింది. దాన్ని చంపిరావడానికి మురళి నగలపెట్టె తీసుకుని బయటికి వెళ్లాడు" అన్నది. తండ్రి అటు వెళ్ళగానే ఆమె మురళితో "అలా దిక్కులు చూస్తావేం? లోపలికిరా. తేలును పూర్తిగా చంపేశావా? దేన్నయినా సగం, సగం చంపడం మహా పాపం" అన్నది నవ్వుతూ. సుజాత తనలోని దొంగబుద్ధి అనే తేలును గురించి అడుగుతున్నదని గ్రహించిన మురళి ఆమె తనను క్షమించినందుకు ఎంతగానో సంతోషించాడు.