కన్నతండ్రి
చదువు పూర్తవగానే చైతన్య, పెద్ద శ్రమ పడకుండానే పట్నంలో ఉద్యోగం సంపాయించ గలిగాడు. అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్టణానికి మార్చి, రోజా బాడుగబండిలో కచేరీకి వెళ్ళి వస్తూండేవాడు. ముసలివాళ్ళంటే చైతన్యకు తగని జాలి. అతడు బాడుగుబండి వీరయ్యకు నెలకు యాభై రూపాయలు ఇవ్వడమే గాక, "వీరయ్యా, ఇద్దరు కొడుకులు సంపాయిస్తుండగా, ఇంకా నీకీ కష్టం ఎందుకు? హాయిగా ఇంటి పట్టున వుండి విశ్రాంతి తీసుకోకూడదా? " అనేవాడు. వీరయ్య నవ్వి, "కొడుకుల సొత్తు నాకు పరాయి సొత్తుగా కనిపిస్తుంది. ఒంట్లో ఓపిక వున్నంతవరకూ, స్వయంగా సంపాదించుకుని బతకడంలోనే మనిషికి తృప్తి" అని జవాబిచ్చేవాడు. చైతన్య తండ్రి, కొడుకును పట్నంలో చదివించడానికి అష్టకష్టాలు పడ్డాడు. ఇది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే, “నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచీ, నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను" అనే వాడు ఆయన. అయితే, చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బుపడి, తీరా కొడుకు ఉద్యోగంలో చేరడానికి వారం రోజుల ముందు చనిపోయాడు. తండ్రిని కొద్దికాలమైనా సుఖ పెట్టలేక పోయాననే బాధ చైతన్యను ఇంకా పీడిస్తూనే వున్నది.
చైతన్య కచేరీకి వెళ్లే దారిలోని బజారు కూడలిలో, ఒక డెబ్బై ఏళ్ళ ముసలివాడు బుట్టలో జంతికలూ, చేగోడీలూ పెట్టుకుని కూర్చుని వుండేవాడు. అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తూండగా, ముసలి వాడు అక్కడే తినుబండారాల బుట్ట ముందు చతికిలబడి కూర్చుని వుండేవాడు. రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడంటే చైతన్యకు ఎంతో జాలి కలిగేది. ఇలా రోజూ కనిపించే ముసలివాడు ఒకసారి వరసగా పది రోజులు కనిపించకపోయేసరికి అతడు చచ్చిపోయాడేమో అనుకుని బాధపడ్డాడు చైతన్య. కాని ఆ మర్నాడు ముసలివాడు తన మామూలు చోట జంతికలబుట్ట ముందు కూర్చుని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది. అతను వీరయ్యను బండి ఆపమని ముసలివాడి దగ్గరకు వెళ్ళి, “పదిరోజులుగా కనిపించడం లేదేం, తాతా?" అని అడిగాడు. తను ఎరగనివాడు ఇంత అప్యాయంగా పలకరించేసరికి, తాత తృప్తిగా తలాడించి, "బాబూ, రోజూ నేనిక్కడ కూర్చుని వుండడం చూస్తున్నావన్నమాట! నాకు ఈ మధ్య జ్వరం వచ్చింది. ఇన్నాళ్ళూ మూసినకన్ను తెరవలేదు" అన్నాడు నీరసంగా. చైతన్యకు అతడి మీద మరింత జాలి కలిగి, "తాతా, ఈ బుట్టలో వున్నవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది?" అని అడిగాడు.
"నాలుగు రూపాయలు అందులో రూపాయి లాభం." అన్నాడు ముసలివాడు. "అలా అయితే, బుట్టలో వున్నవన్నీ నాకు ఇచ్చెయ్యి. ఐదు రూపాయిలిస్తాను," అన్నాడు చైతన్య. ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ వున్నాడు. చైతన్య బుట్టలో వున్నవన్నీ బండిలో పెట్టి, ముసలివాడికి ఐదు రూపాయలిచ్చి, బండిలో కూర్చున్నాడు. వీరయ్య, చైతన్యను “ఇవన్నీ ఏం చేస్తారు బాబూ?" అని అడిగాడు. "మీ ఇంటి చుట్టుపక్కల వుండే పిల్లలకు పంచు" అన్నాడు చైతన్య. మర్నాడు మళ్ళీ బండి కూడలి చేరగానే, చైతన్య ఐదురూపాయలిచ్చి, ముసలివాడి బుట్టలో వున్నవన్నీ కొనేశాడు. మూడవరోజున కూడా బండి ఆపమన్న చైతన్యను, వీరయ్య “ఇలా ఎన్నాళ్ళు రోజుకు ఐదు రూపాయలు ఖర్చు చేస్తావు బాబూ?" అని అడిగాడు.
"ఈ తాత బతికి వున్నంతకాలం" అన్నాడు చైతన్య. అయితే, అతడు ముసలివాణ్ణి సమీపించగానే, వాడు చేతులు జోడించి, "రోజూ నేను వచ్చిన గంటలోనే అన్నీకొని, నన్ను మరింత కష్టాలపాలు చేయకు బాబూ! వెంటనే తెచ్చినవి అమ్ముడు పోవడంతో, నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడు. నిన్న మండుటెండలో కట్టెలు కొట్టవలసి వచ్చింది" అన్నాడు. ఇది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు, చాలా బాధ కలిగింది. కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి, ఆ అవకాశం రాకముందే చనిపోయాడు. ఆ అవకాశం వున్నా, వీరయ్య అందుకు ఇష్టపడటం లేదు. తండ్రి చేత ఆఖరి క్షణం వరకూ అడ్డమైన చాకిరీ చేయిస్తూ తినుబండారాల బుట్ట ముందు పెట్టుకుని ఎండలో కూర్చోవడమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు! చైతన్యకు ఆ క్షణాన ఒక ఆలోచన వచ్చింది. తాత కొడుక్కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అతడు ముసలివాడితో "తాతా మా ఇంటికి వస్తావా? నీకక్కడ తిండి తిప్పలుకు లోటేం వుండదు." అన్నాడు. ముసలివాడు కొంచెం సేపు మౌనంగా వూరుకుని, "నా కొడుకు గొడవ లేపుతాడు బాబూ!" అన్నాడు.
“అదంతా నేను చూసుకుంటాను రా, బండెక్కు!" అని చైతన్య అతడి చేయిపట్టుకుని తీసుకుపోయి, బండిలో కూర్చోపెట్టి, ఇంటికి తీసుకుపోయాడు. తాత కొడుకు అక్కడా ఇక్కడా వాకబుచేసి, ఆ మర్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు. చైతన్య వాడికి, ముసలివాడు మండుటెండలో పడుతున్న బాధ గురించి చెప్పి, "ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి, అతడి ద్వారా సంపాయించాలని చూస్తున్నావా?" అని అడిగాడు. తాత కొడుకు జంకుతూనే, "అయ్యా అలాంటి స్వార్థం నాకేం లేదు. మా నాన్న సంపాదన,ఆయన తిండికి, బట్టకూ ఖర్చు పెడుతున్నాను" అన్నాడు. "అలా అయితే మీ నాన్నను మా ఇంటనే వుంచి, ఆ తిండి బట్టా నేనే ఇస్తాను. నీకేమైనా అభ్యంతరమా?" అని అడిగాడు చైతన్య.
తాత కొడుకు తండ్రి ముఖం కేసి సిగ్గుతో, అవమానంతో తలవంచుకున్నాడు. అప్పుడు చైతన్య వాడితో “నాకు తెలుసు. ఈ ముసలితనంలో నీ తండ్రి నీ దగ్గర వుండడమే ధర్మం అయితే, అతణ్ణి ఇంటిపనివాడిలా కాక, కన్నతండ్రిలా ఆదరించు" అన్నాడు. తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళ నీళ్ళు పెట్టుకుని, చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో, “నాన్నా రా ఇంటికి పోదాం. బుద్ధివచ్చింది, కళ్ళు తెరిపిడిపడినై," అంటూ తండ్రిని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు.