వరాలిచ్చే వనదేవత



ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములుండే వాళ్ళు. అన్న స్వార్థపరుడు, తమ్ముడు అమాయకుడు. తండ్రి పోగానే, అన్న - ఆస్తి అంతా తీసేసుకుని తమ్ముడికి ఏమీ లేకుండా చెయ్యాలని - చూశాడు. కాని, నలుగురు పెద్ద మనుషులూ చివాట్లు పెట్టిన మీదట, తమ పెరట్లో ఉన్న గొడ్లపాకను తమ్ముడికి పంచి ఇచ్చాడు. అమాయకుడు కావటం చేత తమ్ముడు దానితోనే తృప్తిపడ్డాడు. తమ్ముడు ఆ పనీ, ఈ పనీ చేసి తన పెళ్ళాన్నీ, పిల్లలనూ ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు. అన్న మటుకు తనవద్ద ఉన్న డబ్బును వడ్డీకి తిప్పుతూ, తన పెళ్ళాంతో హాయిగా జీవిస్తున్నాడు. తమ్ముడి సంపాదన ఏనాడూ అతని కుటుంబం అవసరాలకు సరిపోయేది కాదు. అందుచేత వారికి ఏ విషయంలోనూ సంతృప్తి అనేది ఉండేది కాదు. ఆ కారణంగా తమ్ముడు, అన్న వద్ద అప్పుడప్పుడూ అప్పు తీసుకునేవాడు. ఆ అప్పు ఎలాగూ తీరేది కాదు గనక, అప్పు కొంతదాకా పెరిగిన మీదట ఆ గొడ్లపాక కూడా స్వాధీనం చేసుకుని, అక్కడ మరొక ఇల్లు కట్టాలనే ఉద్దేశంలో ఉన్నాడు అన్న. ఇలా ఉండగా తమ్ముడు అడవి దాటి ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది. అతను ఆ ఊరు వెళ్ళి తన పని చూసుకుని, వేకువజామునే బయలుదేరి తన ఊరు వస్తున్నాడు. సూర్యోదయం అయేసరికి అతను ఒక చిన్నకొలను దగ్గరికి వచ్చాడు. ఆ కొలనులో ఒకే ఒక బంగారు రంగు కల తామర మొగ్గ ఉన్నది. తమ్ముడు చూస్తూ ఉండగానే ఆ మొగ్గ మీద సూర్య కిరణాలు పడ్డాయి. వెంటనే అది విచ్చుకున్నది. అపూర్వమైన ఆ బంగారు తామర పుష్పాన్ని చూసి ముగ్ధుడై తమ్ముడు దాన్ని కోసేసుకున్నాడు.

అదే క్షణంలో అక్కడ ఒక స్త్రీ ప్రత్యక్షమయింది. ఆమె దేవతా స్త్రీలాగా కనిపించేసరికి, తమ్ముడు ఆమెకు నమస్కరించాడు. ఆ దేవతా స్త్రీ అతనితో, “ఈ కొలనులో రోజూ ఒకే ఒక పువ్వు పూస్తుంది. దాన్ని నేను నా పూజకు ఉపయోగించుకుంటాను. అందుచేత నువు కోసిన పుష్పాన్ని నా కిచ్చి, దానికి బదులుగా ఏదైనా వరం కోరుకో,” అని చెప్పింది. తమ్ముడు పశ్చాత్తాపంతో, “దేవీ, నేను తెలియక కొలనులో దిగి ఈ పుష్పాన్ని కోశాను. ఆ కారణంగా తప్పునాదే. ఈ భాగ్యానికి వరం దేనికి? నీ పుష్పాన్ని నువు తీసుకో," అంటూ బంగారు కమలాన్ని ఆమె కిచ్చాడు. “నువు చాలా మంచివాడివి, నీ మంచితనానికి మెచ్చి వరం ఇవ్వదలిచాను ఏదైనా కోరుకో,” అన్నదామె. తమ్ముడు కొంచెం ఆలోచించి, "దేవీ బీదరికం చేత మా ఇంటిల్లిపాదీ అసంతృప్తితో బతుకుతూ ఉన్నాం. మాకు ఏ నాటికీ అసంతృప్తి అనేది లేకుండా అనుగ్రహించు,” అన్నాడు. “చాలా తెలివిగా వరం కోరావు. ఏ వరం కోరినా మనిషి చివరకు కోరేది సంతృప్తే. మరొక వరం కోరినట్టయితే, ఇంకా మంచి వరం కోరకపోతినే అన్న అసంతృప్తి నీకు ఉండేదే," అని చెప్పి దేవతాస్త్రీ అదృశ్యమయింది. తమ్ముడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు అతని ఇంటి జీవితమే మారిపోయింది. అతను ఎంత తీసుకువచ్చినా అందరికీ సరిపోవటమే గాక కొంత మిగులుతున్నది. అతని ఇంటిలో ఏ విషయంలోను ఎవరికీ అసంతృప్తి అన్నది లేదు. అతను అన్న దగ్గరికి అప్పు కోసం వెళ్ళకపోగా, చేసిన అప్పులు క్రమంగా తీర్చేశాడు. తమ్ముడి సంసారం పచ్చగా ఉన్నట్లు కనబడేసరికి, వాళ్ళ కేదో నిధి దొరికి ఉంటుందనుకున్నాడు అన్న. తమ్ముడు బోళావాడు కనక అడిగితే చెప్పేస్తాడనుకుని వెళ్ళి, “ఏం, తమ్ముడూ అంతా కులాసాగా ఉంటున్నారా? నా అప్పంతా తీర్చేశావు. మళ్ళీ అప్పుకు అంటూ రాలేదు. ఏమిటి విశేషం? నా దగ్గర దాపరికం దేనికీ?" అన్నాడు. "ఏమీ లేదు, అన్నయ్యా. ఉన్నదాంతోనే నాకు జరుగుబాటు అవుతున్నది అంతే. నాకు నేను కష్టపడి సంపాయించేదాంట్లో కాస్తో కూస్తో మిగులుతున్నది కూడా. కొరత లేకుండా బతుకుతున్నాం." అన్నాడు తమ్ముడు. అన్న నవ్వి, " నా దగ్గర దాస్తున్నావు. ఏదో నిధి దొరికి ఉంటుంది. లేకపోతే, ఇంతకాలమూ లేని జరుగుబాటు ఇప్పుడెలా వచ్చిందీ?" అన్నాడు. తమ్ముడు దాచకుండా అన్నతో, అడవిలో కొలను గురించీ, తామరపువ్వు గురించీ, దేవత గురించీ, ఆమె ఇచ్చిన వరం గురించీ, వివరంగా చెప్పాడు. అంతా విని అన్న తమ్ముడితో ఏమీ అనకుండా, ఇంటికి వచ్చేసి, దేవతను ఏం వరం కోరాలో తెల్లవార్లూ ఆలోచించి తేల్చుకున్నాడు. అతను మర్నాడు ఉదయం సూర్యోదయం కాక పూర్వమే అడవిలో ఉన్న కొలను చేరుకున్నాడు. కొలనులో ఒకే ఒక బంగారు తామర మొగ్గ ఉన్నది. సూర్య కిరణాలు తనమీద పడగానే అది విచ్చుకున్నది. వెంటనే అన్న దాన్ని కోసేసి, తన రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకున్నాడు.

అంతలో వనదేవత రానే వచ్చింది. ఆమె అన్ననూ, అతను పువ్వుపట్టుకున్న వాలకాన్ని చూసి, అతను కావాలనే ఆ పని చేశాడని గ్రహించి, "ఆ పువ్వు నాది, నా కిచ్చెయ్యి,” అన్నది. అన్న వెకిలిగా నవ్వి, “నాకు వరమిస్తే పువ్వు ఇస్తా, లేకపోతే ఇవ్వను," అన్నాడు. వనదేవత వాణ్ణి చూసి అసహ్యించుకుంటూ, “నీ కేం వరం కావాలి?" అని అడిగింది. ముందే ఆలోచించి పెట్టుకున్న అన్న, "నేను అనుకున్న వెల్లా జరగాలి," అన్నాడు. వనదేవత వాడికి అలాగే వరం ఇచ్చి, బంగారు కమలం తీసుకున్నది. అన్న ఆనందానికి మేరలేదు. కొలను గట్టున ఉన్న మామిడి చెట్టునిండా పళ్ళుండాలి. అనుకున్నాడు. అలాగే జరిగింది. వాడు తిన్నన్ని పళ్ళు తిని, ఇంటికి వెళ్ళి, తన ఇల్లు పెద్ద భవంతి కావాలనుకున్నాడు. అలాగే జరిగింది. వాళ్ళకిప్పుడు దేనికీ లోటు లేదు గనుక ఇంటిల్లిపాదీ పంచభక్ష్యపరమాన్నాలతో విందు ఆరగించారు. ఆ సాయంకాలం అన్న భార్య తన తోటికోడలకీ, మరిదికీ తమ గొప్ప చెప్పుకోటానికి పాకకు వెళ్ళింది. ఆమె చీకటిపడ్డాక పాక నుంచి వస్తుండగా గదిలో పరధ్యానంగా కూర్చుని వున్న అన్న పెరట్లోకి తొంగి చూసేసరికి ఎవరో నల్లగా తమ ఇంటికి రావటం కనిపించింది. "బాబోయ్, అది దయ్యమేమో! లోపలికి రాదుగదా?" అని అన్న భయపడ్డాడు. వెంటనే అన్న భార్య దయ్యంగా మారి ఇంట్లో ప్రవేశించింది. "ఈ దయ్యం నన్ను మింగేస్తుందేమో అని మళ్ళీ అనుకున్నాడు అన్న. అంత పనీ జరిగింది. దయ్యం అన్నను మింగేసి ఎటో వెళ్ళిపోయింది. అన్నకు పిల్లలు లేకపోవటం చేత అతని భవంతీ, మిగిలిన ఆస్తీ తమ్ముడికే సంక్రమించింది.

Responsive Footer with Logo and Social Media