అధ్బుత వస్తువులు



రామాపురం అనే గ్రామంలో సూర్యం అనే యువకుడుండేవాడు. వాడికి ఇరవై ఏళ్ళ వయసువచ్చినా, ఎలాంటి పనీ నేర్చుకోక తిని తిరుగుతూండేవాడు. వాడికి తండ్రీ, అనారోగ్యంతో బాధపడే తల్లీ, పెళ్ళీడు వచ్చిన చెల్లెలు వుండేవారు. ఇలా వుండగా, సూర్యం తండ్రి ఏదో వ్యాధికి గురై మరణించాడు. తండ్రి మిగిల్చిపోయిన కొద్దిపాటి డబ్బుతో రెండు మాసాలు గడిచినై. రోజూ అన్నం వడ్డిస్తూ, వాడి తల్లి, “ఎక్కడైనా చెల్లెలికి సంబంధం చూడు, బాబూ! ఇక నేను ఆట్టేకాలం బతికేలా లేను,” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకునేది. ఈ బరువు బాధ్యతలు మోయడం అసాధ్యం అనిపించి, వాడొకనాటి రాత్రి జీవితం మీద విరక్తితో ఇల్లు వదిలి, అడవిలోకి పోయాడు. సూర్యం అడవిలో తల వంచుకుని నడుస్తూండగా, "ఎవరా వెళ్ళేది? ఇటురా! చూడబోతే తీరని కష్టాల్లో వున్నట్టు కనబడుతున్నావు,” అన్న మాటలు వినిపించినై.

ఆ మాట్లాడింది, దాపులనున్న గుట్టమీద కూర్చున్న, ఒక ఆడపిశాచం. సూర్యం భయపడక, గుట్ట మీదికి పోయి, తన పరిస్థితి అంతా దానికి చెప్పుకున్నాడు. అది విన్న పిశాచం కొంచెం సేపు వెక్కి వెక్కి ఏడ్చి, “ఇన్ని కష్టాల మధ్య నువ్వింకా బతికి వుండడం ఎంత ఆశ్చర్యం!" అన్నది. "అవును. ఏం చేయమంటావో చెప్పు!" అని అడిగాడు సూర్యం. "నీ అదృష్యం కొద్దీ, ఇక్కడికి దగ్గర్లో వున్న వల్లకాట్లో, ఒక పాడుపడిన బావి వున్నది. వేగిరం పోయి అందులో దూకుదువుగాని పద" అంటూ పిశాచం, సూర్యాన్ని బయలుదేరతీసింది. సూర్యానికి, పిశాచం సలహా సబబుగానే తోచింది. వాడు పిశాచంతో, ఆ పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళి, అందులో దూకబోయాడు. "ఎవరు వాళ్ళు? ఇంత అర్థరాత్రి వేళ, ఇక్కడేం పని?" అంటూ ఒక ముసలి పిశాచం పైకి వచ్చింది. సూర్యం, దానికి తన కథ అంతా చెప్పుకున్నాడు. “పాపం, తల మునకలయ్యే కష్టాల్లో వున్నవాడు, వింటూంటే, నా గుండె తరుక్కుపోయింది. నావంతు సహాయం చేయడానికి, ఇక్కడికి తీసుకువచ్చాను" అన్నది ఆడపిశాచి గర్వంగా. "అఘోరించావుగానీ. ఇక వచ్చిన దారిన వెళ్ళు" అని ముసలి పిశాచం, ఆడపిశాచాన్ని చీవాట్లు పెట్టి పంపేసింది. "పాపం, దాన్నేమీ అనకు. నా సమస్యకు చక్కని పరిష్కారం చూపిన ఘనత దానిదే!" అన్నాడు సూర్యం.

ముసలిపిశాచం తల వూపి, "సరే, నిన్నొకచోటుకు తీసుకుపోతాను. అక్కడ జరిగేదంతా, చూడు. ఆ తర్వాత, నువ్వే గంగలో దూకుతావో, అదంతా నీ ఇష్టం," అని, సూర్యాన్ని వల్లకాటిలో మరొక ప్రాంతానికి తీసుకుపోయింది. అక్కడ ఒక శిథిలమైపోయిన సమాధి ముందు, కొన్ని పిశాచాలు కూర్చుని వున్నవి. ముసలిపిశాచం, సూర్యాన్ని ఒక ముళ్ళపొద వెనక దాక్కోమని చెప్పి, తాను పోయి గుంపుకట్టిన పిశాచాల పక్కన కూర్చున్నది. కొంత సేపటికి, పెద్ద అట్టహాసంగా, ఆ పిశాచాల నాయకుడు వచ్చి, శిథిలమై పోయిన సమాధిమీద కూర్చున్నాడు. పిశాచాలన్నీ సంతోషంగా చప్పట్లు చరిచాయి. పిశాచాల నాయకుడు, ఒకసారి గొంతు సవరించుకుని, “సహచరోత్తములారా! జాగేలా? ఈ నెల రోజుల్లో, మీరు సేకరించిన అద్భుతవస్తువులు ప్రదర్శించండి. ఒక సంగతి జ్ఞాపకం వుంచుకోండి. సంవత్సరాంతంలో, అత్యుత్తమ అద్భుత వస్తువు సేకరించినవారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది." అన్నాడు. ఆ వెంటనే, ఒక పిశాచి ఖాళీబుట్ట నొకదాన్ని సమాధి మీద బోర్లించి, "కాయలు! కూరగాయలు!" అంటూ బుట్ట మీద బెత్తంతో మూడుసార్లు చరిచింది. తర్వాత బుట్టను ఎత్తగానే, దాని కింద రకరకాల కూరగాయలు పోగుపడి వున్నవి. "భేష్! భేష్!" అంటూ మిగతా పిశాచాలన్నీ చప్పట్లు చరిచాయి. అది చూసిన సూర్యానికి, ఆ బుట్ట తన దగ్గర వుంటే, తన కెదురైన సమస్యలన్నీ తీరిపోయినట్టే అనిపించింది. మరొక పిశాచి, గుండిగ నొకదానిని సమాధి మీద బోర్లించి, "వండు, వండు! వంట వండు!" అంటూ బెత్తంతో దాని మీద మూడుసార్లు కొట్టింది. తర్వాత గుండిగ ఎత్తగానే, దాని కింద ఘుమఘుమ లాడుతూ ఎన్నో పిండివంటలు! బుట్టకన్న, గుండిగ లాభసాటిగా తోచింది, సూర్యానికి, ఇంకొక పిశాచం, ఒక కుండను సమాధి మీద పెట్టి, "కావాలి, కావాలి, పాలు!" అంటూ బెత్తాన్ని కుండ చుట్టూ తిప్పింది. కుండనిండా చిక్కటిపాలు! గుండిగ కన్న, కుండతో మరింత ధనం సంపాయించవచ్చనుకున్నాడు, సూర్యం. పిశాచాల నాయకుడు లేచి, "నా అనుచరుల్లో, ఇంతటి ఘనులున్నారని తెలిసి గుండె పొంగిపోతున్నది. మళ్ళీ అమావాస్యనాడు సమావేశమవుదాం. లోగడ దాచినవాటి దగ్గరే ఈ మూడు అద్భుతవస్తువుల్ని దాచిపెడదాం,” అంటూ వాటిని తీసుకుని, పక్కనేవున్న మర్రిచెట్టు తొర్రలో పెట్టాడు. పిశాచాలన్నీ కోలాహలంగా, అక్కడినుంచి వెళ్ళిపోయాయి. సూర్యం మర్రిచెట్టు దగ్గరకుపోయి, దాని తొర్రలోంచి కుండను బయటికి తీశాడు. దాని కింద వాడికి గుండిగ కనిపించింది. దాన్ని బయటికి తీశాడు. తర్వాత బుట్టనూ, దాని అడుగున వున్న పిల్లనగ్రోవినీ, చెప్పులనూ, చేటనూ, బెత్తాన్నీ, గంటనూ బయటికి తీశాడు. వాటన్నిటినీ ఎలా తీసుకుపోవడమా అని, వాడాలోచిస్తూండగా, తొర్ర అడుగున ఒక గోనె సంచి కనిపించింది. సూర్యం ఆత్రంగా దాన్ని పైకితీసి, అద్భుత వస్తువులన్నిటినీ అందులో వేశాడు. తర్వాత అక్కడ దొరికిన, ఒక తీగతో గోనె మూతిని బిగించి కట్టి, దాన్ని భుజానికి ఎత్తుకోబోయి, తెల్లబోయాడు.

అద్భుతవస్తువులతో నిండిన ఆ గోనె కాస్తా, అదృశ్యమైపోయింది. గోనెకూడా అద్భుతవస్తువన్న సంగతి అప్పుడు అర్థం అయ్యింది సూర్యానికి, సూర్యం పిచ్చివాడిలా దిక్కులు పరికిస్తూండగా, ముసలిపిశాచం అక్కడికి వచ్చి, “జరిగినదంతా చూశాను! నేను పాడుబడిన బావి దగ్గర, నిన్ను చూసినప్పుడు నిరాశా పిశాచం నిన్ను ఆవహించి వున్నది. నీలో ఆశ అనే కొత్త ఊపిరిపోసి, నీచేత ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. అయితే, ఇక్కడ నిన్ను నిరాశాపిశాచం వదిలినా, అత్యాశ అనే పిశాచం పట్టుకున్నది. అందువల్లనే, అన్ని అద్భుతవస్తువుల్నీ సొంతం చేసుకోవాలన్న ఆరాటంలో, ఏ ఒక్కదాన్నీ, నీదిగా చేసుకోలేక పోయావు!" అన్నది. "అవును, నిజమే! మరి ఇప్పుడు నేనేం చేయాలి?" అని అడిగాడు సూర్యం. "మనిషి పట్టుదల వహిస్తే, ఎన్ని అద్భుతాలైనా చేయగలడు. నువ్వు కూరగాయలు పండించలేవా? పిండివంటల వ్యాపారం చెయ్యలేవా? ఇన్ని గేదెలను పెట్టుకుని, వాటి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించలేవా? ఆలోచిస్తే, బతకడానికి ఎన్ని మంచి మార్గాలు లేవు!" అని ముసలి పిశాచం అదృశ్యమైంది. ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన సూర్యం, కొత్త ఉత్సాహంతో ఇంటి కేసి బయలుదేరాడు.

Responsive Footer with Logo and Social Media