చెట్టు నీడ


ఒక గ్రామంలో ఒక ఆసామీ ఇంటి ముందు పెద్ద చెట్టుండేది. వేసవి కాలంలో దాని నీడలో చల్లగా ఉండేది. ఆసామీ అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యానం ఆయన భోజనం చేసి చెట్టుకింద కూర్చోడానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగావాడు కూర్చుని ఉన్నాడు. “ఇదేమిటి? నిన్నిక్కడ ఎవరు కూర్చోనిచ్చారు? పద పద! అని ఆసామీ అలగావాణ్ణి అదిలించాడు.

“ఎందుకు బాబూ, అలా కోప్పడతారు? ఎండ జాస్తిగా ఉంది. నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను!” అన్నాడు అలగావాడు మర్యాదగా. “అదేమీ కుదరదు. ఈ చెట్టు నా చెట్టు. నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెంచి ఇంత చెట్టు చేశాను. అందుచేత దీని నీడ కూడా నాదే,” అన్నాడు ఆసామి. “అలా చెప్పరేం! అయితే ఒకపని చేయండి. ఈ నీడ నాకు అమ్మండి, డబ్బిస్తాను!” అన్నాడు అలగావాడు.

డబ్బు మాట వినేసరికి ఆసామీకి ఆశ పుట్టుకొచ్చింది. “సరే అమ్ముతాను. ఏమిస్తావు?' అన్నాడాయన. బేరం కుదిరింది. ఇద్దరు ముగ్గురు దారే పోయేవాళ్ల సమక్షంలో అలగావాడు ఆసామీకి డబ్బిచ్చి చెట్టునీడను తను కొనేసుకున్నాడు. అది మొదలు అలగావాడు రోజూ వచ్చి చెట్టునీడను కూర్చుంటూండేవాడు. దారిన ఎరిగున్న వాళ్లెవరన్నా పోతుంటే వాళ్లను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వాళ్లవెంట పశువులుంటే అవి కూడా నీడలో చేరేవి. ఇది చాలక, నీడ కొన్న అలగావాడు మరొక పని చేయాలనుకున్నాడు. ఆ చెట్టునీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్లేవాడు. సమయాన్ని బట్టి, రుతువును బట్టి ఆ చెట్టునీడ ఆసామీ ఇంటి అవరణలోనూ, పంచలోనూ, పడకగదిలోనూ, నడవలోనూ పడేది. అలగావాడు మొహమాటం లేకుండా నీడ పడిన చోటికల్లా వెళ్లి తిష్టవేసేవాడు. ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది. “ఏయ్‌! మా దొడ్లోకీ, వసారాలోకీ, గదిలోకీ వచ్చి కూర్చునేటందుకు నీకే హక్కున్నది?” అని ఆయన అలగావాణ్ణీ గద్దించి అడిగాడు.

“బాబుగారు, నేను మీ చెట్టునీడను డబ్బు పోసీ కొనుక్కున్నాను. అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోవడానికి నాకు హక్కున్నది! అన్నాడు అలగావాడు. ఆసామి రుసరుసలాడాడు. కాని తాను తన చెట్టు నీడను ఆ పేదవాడికి అమ్మిన మాట నిజమే. ఒక రోజు ఆసామి ఇంట ఏదో అక్కర అయింది. చుట్టాలనూ బంధువులనూ పిలిచి విందు చేస్తున్నాడు. వారంతా భోజనం చేసే చోట చెట్టునీడ పడింది. సమయానికి అలగావాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు. “పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవడో ఇక్కడ చతికిలబడ్డాడేమిటి?” అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నాడు.

అలగావాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్లకు చెప్పేశాడు. ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు. ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది. ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్లిపోయాడు.

Responsive Footer with Logo and Social Media