పేజీ సంఖ్య - 70
కొట్టాడు దెబ్బ!
‘‘ఈ మార్కులేంట్రా... నూటికి రెండా .. సిగ్గు సిగ్గు’’ ఆశ్చర్యపోయాడు వాస్తు శిల్పి వామనశాస్త్రి.
‘‘మా స్కూలుకు వాస్తు బాగోలేదట నాన్నా’’ చెప్పాడు పుత్రరత్నం.
మార్చాల్సి వచ్చింది
‘‘మీ ఆవిడ పేరు గున్నమ్మ కదా ... గూగులమ్మా అని పిలుస్తున్నారేం?’’ ఆశ్చర్యపోయాడు చిత్తరంజన్.
‘‘అసలు పేరు గున్నమ్మే. ఈ మధ్య ఒక్క ప్రశ్న అడిగితే వంద జవాబులు చెబుతోందని పేరు మార్చాను’’ తాపీగా చెప్పాడు ఏకదంతం.
సెల్ఫీ దెబ్బ
‘‘ఏంటి బావా అలా చేతులు, మెడ పైకెత్తి నడుస్తున్నావు?’’ అడిగాడు బామ్మర్ది.
‘‘ఏం చెప్పను బామ్మర్దీ ... సెల్ఫీ తీసుకుంటుంటే పట్టేశాయి’’ మూలిగాడు బావ.
అప్పుడయినా ...
‘డాక్టర్‌గారూ! మా ఆవిడకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందండి. ఏదైనా మందివ్వరా.’
‘ఎందుకండి? పగలు ఎలాగూ నడుస్తున్నట్టు లేరు ఆవిడ. రాత్రిపూటయినా నడవనివ్వండి!’
‘నీ పని చెప్తా ఉండు’
ఒక మనిషికి తన మెదడు మీద కోపం వచ్చింది.
‘ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తుంటావు. ఏదో ఒక పని చేయమని చెపుతుంటావు. నీ నోరు మూయించాలంటే ఒకటే మార్గం. ఇప్పుడు బార్‌కి వెళ్ళి మూడు సీసాల బీర్ తాగుతాను. దెబ్బకి చచ్చి ఊరుకుంటావు’ అంటూ బయటికి నడిచాడు.
ఎవరికిష్టమైన భాగం వారిది
‘‘మానవ శరీరంలో ఏ భాగాన్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తామో చెప్పగలరా?’’ అడిగాడు సైన్స్ టీచర్.
‘‘మగవారు కళ్లను, ఆడవారు నాలుకని ..’’ బదులిచ్చాడు వైకుంఠం.
ఏ రాయైుతే నేం?
‘‘మీ ఇంట్లో అసలు టీవీనే లేదా?’’
‘‘ఒకప్పుడు ఉండేది. మా ఆవిడ అస్తమానం సీరియల్స్ చూస్తోందని అమ్మిపడేశా ..’’
‘‘వెరీ గుడ్ .. మంచి పనిచేశావు. మరి ఆవిడ ఏదీ? ఇంట్లో కనిపించడం లేదు!’’
‘‘పక్కింట్లో టీవీ సీరియల్ చూడ్డానికి వెళ్లింది’’
అప్పుడు ఎక్కువిస్తారా?
‘‘ఇలా రోడ్డు మీద నిల్చుని అడుక్కోటానికి సిగ్గు లేదూ?’’ కోపంగా అన్నాడు కాంభోజీరావు.
‘‘మీరు వేసే బోడి రూపాయి కోసం ఆఫీసు ఓపెన్ చేయమంటారా?’’ అంతకంటే కోపంగా అడిగాడు బిచ్చగాడు.
అంతకంటే డౌట్స్ లేవండి
‘‘ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. బాగా చదవాలి. ఆల్రెడీ కొశ్చన్ పేపర్లు కూడా ప్రింట్‌కు వెళ్లాయి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి’’ హెచ్చరించాడు లెక్చరర్.
‘‘ప్రింటింగ్ ప్రెస్ పేరు చెప్పగలరా?’’ వెనక బెంచి నుండి వినిపించింది డౌట్.
‘బీమా’రావు కొడుకు
‘‘మమ్మీ ... నదిలో దిగి ఈత కొడతానే...’’
‘‘వద్దు .. అందులో మొసళ్లున్నాయి ..’’
‘‘మరి డాడీ ఈదుతున్నాడుగా ...’’
‘‘డాడీ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు ..’’
ప్రకటనలో లోపం లేదు
దినపత్రిక తెరవగానే ఒక ప్రకటన ఆకర్షించింది వెంకటేశ్వర్లును.
‘ఇదొక అద్భుత వస్త్రం. ఒక సాధుపుంగవుడు తన తపశ్శక్తితో రూపొంచిందిన మహిమగల వలువ. దీన్ని ధరించినచో ఎదుటివారు మీకు కనిపింతురు కాని ఎదుటివారికి మీరు కనిపించరు. ఆలస్యం చేయకుండా రుసుము చెల్లించి బుక్ చేసుకోండి. ’
వెంకటేశ్వర్లు వెంటనే పది వేలు కట్టి పోస్టులో తెప్పించుకున్నాడు. పార్సల్ విప్పాడు. అందులో ఒక మామూలు బురఖా ఉంది.
చూస్తే .. మీరే ఒప్పుకుంటారు
‘‘ఇలా దొంగతనాలు చేసి బతికేకంటే, కష్టపడి బతకొచ్చుకదా ...’’ సలహా ఇచ్చాడు జడ్జి ఏకదంతం.
‘‘గునపంతో గోడలకు కన్నం వెయ్యడం, కిటికీ ఊచలు విరగ్గొట్టడం, తలుపు తాళాలు బద్దలు కొట్టడం ఇవన్నీ తేలిక పనులని అనుకుంటున్నారా? స్వయంగా చూస్తేగాని నేను పడుతున్న కష్టమేమిటో మీకు అర్థం కాదు’’ ఆవేశంగా చెప్పాడు చెంచయ్య.
ఫోటోలు పంపండి
‘‘నాకు తెలిసిన సంబంధం ఒకటుంది. మీ అబ్బాయికి ఈడూ జోడూ బాగుంటుంది. అమ్మాయి కుందనం బొమ్మనుకో. అమ్మాయి పేర రెండు కోట్లు విలువచేసే బిల్డింగ్ ఉంది ..’’
‘‘అందం కొరుక్కుతింటామా .. బిల్డింగ్‌ను నాలుగు వైపులనుండి ఫోటోలు తీసి పంపమనండి. మా అబ్బాయికి చూపిస్తాం’’
బందు పుణ్యం
‘‘ఈరోజు అబ్బాయి కాలేజీకి వెళ్లినట్టున్నాడండి’’ సంతోషంగా చెప్పింది భార్య.
‘‘వెళ్లక చస్తాడా .. ఈ రోజు సినిమాహాళ్లు బందు ప్రకటించాయి’’ బదులిచ్చాడు భర్త.
అన్ని అయితే...
టీచర్ : 1 పుస్తకం + 1 పుస్తకం. ఎన్ని?
విద్యార్థి : 2 పుస్తకాలు.
టీచర్ : 2 పుస్తకాలు + 2 పుస్తకాలు. ఎన్ని?
విద్యార్థి : 4 పుస్తకాలు.
టీచర్ : 5630 + 4370 పుస్తకాలు. ఎన్ని?
విద్యార్థి : లైబ్రరీ.
పాసైతే ...
తండ్రి కొడుకుతో..
‘టెన్త్ పాస్ అయితే నీకు సైకిల్ కొనిపెడతారా...’
‘మరి ఫెయిల్ అయితేనో...’
‘పది సైకిళ్ళు కొనిపెడతా’
‘ఎందుకు నాన్నా?’
‘సైకిల్ షాపు పెట్టుకోవడానికి.’
ముందే తెలిస్తే ...
తన స్నేహితురాలు గీత నడిచి రావడం చూసి స్కూటర్ ఏమైందని అడిగింది మంజు.
గీత: లోన్ తీసుకుని కొన్నాకదా! వాయిదాలు కట్టడంలేదని దాన్ని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు తీసుకుపోయారే.
మంజు: ఈ విషయం ముందే తెలిస్తే నేను లోన్ తీసుకుని పెళ్ళి చేసుకునేదాన్ని కదే...
కక్కలేక ... మింగలేక
భర్త: నీ ఏటీఎం పాస్‌వర్డ్ ఏంటి?
భార్య: నా పుట్టినరోజు
భర్త: దొరికిపోయా. కావాలనే చేసింది.
జాలి గుండె!?
ఇద్దరు మిత్రులు బస్సులో కూర్చుని ఉన్నారు. ఒక స్టాప్‌లో కొందరు ఆడవాళ్ళు బస్సెక్కారు. వెంటనే ఇద్దరిలో ఒకడు కళ్ళు మూసుకున్నాడు.
‘‘ఎందుకురా కళ్ళు మూసుకున్నావు’’ అడిగాడు రెండోవాడు.
‘‘చాలామంది ఆడవాళ్ళు నిల్చుని ఉంటే కూర్చుని చూడడానికి నాకు మనసొప్పదురా’’ చెప్పాడు మొదటివాడు.
దటీజ్ మొగుడు!
ఒక భర్త రాత్రి పొద్దుపోయాక తన భార్యకు ఇలా ఎస్.ఎం.ఎస్. చేశాడు.
‘‘నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దేవతవు నువ్వు. నీకు సర్వదా కృతజ్ఞుడను. ఇప్పుడు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే’’
‘‘ఇవ్వాళ కూడా మందు ఎక్కువై నట్టుంది. నా ఖర్మ. ఏమీ అననులే. ఇంటికి తగలడు’’ అని రిప్లయ్ ఇచ్చింది.
వెంటనే భర్త ‘‘థాంక్స్ - నేను ఇంటి బయటే ఉన్నాను. దయచేసి తలుపు తియ్’’ అంటూ మరో ఎస్.ఎం.ఎస్. ఇచ్చాడు.
మామిడి విలాపం
‘‘పదునైన కత్తితో మా తొడిమలు గిల్లి
నునుపైన మా చెంపలు కత్తిరించి
ముక్కముక్కలుగ నరికి పోగుపెట్టి
ఉప్పు, ఆవ, నూనెలతో ముంచి తేల్చి
‘కొత్తావకాయ’నుచు లొట్టలేతురు
అకటా! దయలేనివారు మీ ఆడువారు!!’’
తర్కపోతు
‘‘వీటిల్లో ఆరు దొంగనోట్లున్నాయి .. చెల్లవు’’ చెప్పాడు బ్యాంకు క్యాషియర్.
‘‘నా ఖాతాలోనే కదా జమ చేసేది. అది దొంగ నోట్లయితే నీకేంటి? మంచి నోట్లయితే నీకేంటి?’’ అడ్డంగా వాదించాడు చెంగల్రావు.
తప్పన్నానా?
‘‘ఈత ఎక్కడ నేర్చుకున్నావ్’’ అడిగాడు మహేష్.
‘‘నీటిలో ...’’ ఠపీమని చెప్పాడు సురేష్.
అంతకంటే మరేం లేదు
‘‘మీలో సీనియర్‌కీ, జూనియర్‌కీ తేడా ఎవరు చెప్పగలరు?’’ అడిగింది టీచర్ మందాకిని.
‘‘సీ (సముద్రాని)కి దగ్గరగా ఉండేవారు సీనియర్స్, జూకి దగ్గరగా ఉండేవారు జూనియర్స్ మేడమ్’’ చెప్పాడు శంభులింగం.
బుక్కయ్యాడు!
ఒక విదేశీయుడు ఇండియా వచ్చాడు. ఒకరోజు అవసరమైన పుస్తకం కొందామని బుక్ స్టాల్‌కు వెళ్లాడు. అనుకోకుండా అక్కడ మరో పుస్తకం కనిపించింది. దాన్ని చూడగానే ఆ విదేశీయుడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ పుస్తకం పేరు ‘‘30 రోజుల్లో డాక్టర్ కావడం ఎలా?!’’
సూత్ర ప్రాయంగానే ...
‘‘నువ్వు ఏ సూత్రం ప్రకారం అంత డబ్బు డిమాండ్ చేస్తున్నావు నన్ను?’’ అడిగాడు లెక్కల మాస్టారైన భర్త.
‘‘మంగళసూత్రం ప్రకారం’’ నిక్కచ్చిగా చెప్పింది భార్య.
చూస్తే నీకు పెళ్లయ్యేదా?
‘‘నాలో ఏం చూసి పెళ్లిచేసుకున్నావ్?’’ గోముగా అడిగాడు కుమార్.
‘‘ఏమీ చూడలేదు కాబట్టే పెళ్లి చేసుకోగలిగాను’’ చెప్పింది శాంత.
వండుకోనక్కర్లా
‘‘ఎవడ్రా గులాబీ మొక్కనీ, జామ మొక్కనీ గొయ్యితీసి ఒక్క చోటే పాతింది?’’ అడిగాడు తాతయ్య.
‘‘నేనే తాతయ్యా .. పెద్దయ్యాక గులాబ్‌జాములు కాస్తాయని’’ చెప్పాడు మనవడు.
వీరముదురు
‘‘కొశ్చన్ పేపర్ లీక్ అయినా సరే కాపీ కొడుతున్నావెందుకురా?’’ అడిగాడు టీచర్.
‘‘ఆకాశంలో చంద్రుడు ఉన్నాడని ఇంట్లో లైట్లు వేసుకోకుండా ఉంటామా?’’ బదులిచ్చాడు విద్యార్థి.