పేజీ సంఖ్య - 67

నేనిప్పుడు కోటీశ్వరుడిని

‘‘నేనే కోటీశ్వరుడినైతే! అనే అంశంపై అందరూ వ్యాసం రాయండి’’ చెప్పింది పంతులమ్మ.

క్లాసులో పిల్లలందరూ తాము కోటీశ్వరులమైపోయినట్టు ఊహించుకుని రాసేస్తున్నారు - ఒక్క కిరణ్‌ తప్ప.

‘‘ఏమైందిరా.. వ్యాసం మొదలుపెట్టలేదేం?’’ అడిగింది పంతులమ్మ.

‘‘నా సెక్రటరీ కోసం ఎదురుచూస్తున్నా టీచర్‌’’ చెప్పాడు కిరణ్‌.


అర్థం పరమార్థం

‘‘నాతో పెళ్లికి ముందు నీవంటే ఇష్టమని చాలాసార్లు అన్నారు గుర్తుందా?’’ గుర్తు చేసింది అలివేలు.

‘‘నేనెప్పుడూ మాట తప్పను డియర్‌. ఇప్పటికీ అదే అంటున్నాను నీ‘వంటే’ ఇష్టం’’ చెప్పాడు భీమరాజు.


స్వామి ప్రసాదం

‘‘నీకేమైనా పిచ్చా .. ’’ ఇంట్లోకి వస్తూనే గట్టిగా అరిచాడు సూరిబాబు.

‘‘అయ్యో .. నేనేం చేశానండీ’’ అమాయకంగా అడిగింది అలివేలు.

‘‘కనిపించిన వారందరితో ఆ నిత్యానంద స్వామి దయవల్లే కొడుకు పుట్టాడని చెబుతున్నావట’’ తల బాదుకున్నాడు సూరిబాబు.


నీకు ఆ భయం అక్కర్లేదు

‘‘నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే .. పెళ్లిలో కట్నం ప్రసక్తి తీసుకురాకూడదు మధూ ..’’ గోముగా అంది అర్పిత.

‘‘నీకు ఆ సమస్యే ఉండదు డియర్‌ .. ఎందుకంటే అసలు నేను పెళ్లి ప్రస్తావనే తీసుకురాను’’ అభయమిచ్చాడు మధు.


పేకాట నాన్న

‘‘డాడీ .. సాయంత్రం పూట అయినా బయటకి కదలనివ్వవేమిటి నన్ను ... అలా బయటకెళ్లి కాసేపు ఆడుకుని వస్తాను’’ బతిమాలాడు బుజ్జిబాబు.

‘‘ఆడుకోడానికి వెళ్తావా .. కాళ్లు విరగ్గొడతా వెధవా ... ఇది ఆట కాదా .. ముందు ముక్కేయ్‌’’ కసిరాడు పాపారావు పేక ముక్కలు సరిచేసుకుంటూ.


జీవనాధారం అదే

‘‘ఏంటి నీ ప్రాబ్లమ్‌?’’ అడిగాడు డాక్టర్‌.

‘‘పదిమంది ఉన్న గుంపులోకి వెళ్లగానే చేతులు వణుకుతున్నాయి డాక్టర్‌’’ చెప్పాడు కోటయ్య.

‘‘గుంపులోకి వెళ్లడం మానేయండి’’ సలహా ఇచ్చాడు డాక్టర్‌.

‘‘పని చేయకపోతే బతకేదెలా డాక్టర్‌ .. నేను జేబుదొంగని’’ అసలు సంగతి చెప్పాడు కోటయ్య.


సామాన్యులకు అందని భాష

ఒక అందమైన అమ్మాయి, ఒక మెడికల్‌ షాప్‌ బయట నుంచుంది. వచ్చిన కస్టమర్లు అంతా వెళ్లిపోయాక ‘‘ఏం కావాలమ్మా? వచ్చి చాలాసేపైనట్టుంది ... మందులు అడగడానికి అంత సిగ్గుపడితే ఎలా?’’ అన్నాడు షాపు యజమాని.

‘‘ఏం లేదండి .. నా కాబోయే భర్త ఒక డాక్టర్‌. ఆయన మొదటిసారి లవ్‌లెటర్‌ రాశారు. ఒక్క ముక్కా అర్థం కావడం లేదు. కాస్త చదివి పెడతారా?’’ అని మళ్లీ సిగ్గుపడింది ఆ జవరాలు.


గ్లిజరిన్‌ వాడితే పోలా ..

‘‘మా ఆయనలో పెళ్లయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పొచ్చింది వదినా ..’’ చెప్పింది రాజమణి.

‘‘మార్పంటే ...?’’ ప్రశ్నించింది సుబ్బమ్మ.

‘‘పెళ్లయిన కొత్తలో నా కంట్లో కన్నీరుని చూడలేకపోయేవాడు. ఇప్పుడు నా కంట్లో కన్నీరును చూడకుండా ఉండలేకపోతున్నాడు’’ గోడు వెళ్లబోసుకుంది రాజమణి.


సెగ దెబ్బ

‘‘నువ్వు అంత స్పీడ్‌గా ఎందుకు వెళ్తావు?’’ అడిగింది విమానం రాకెట్‌ను.

‘‘నీ కింద మంట పెట్టినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో’’ చెప్పింది రాకెట్‌.


అదే నువ్వు ...

యాక్సిడెంట్‌లో ఒకేసారి చనిపోయిన భార్యాభర్తలు కొంత కాలం తర్వాత అనుకోకుండా పైలోకాలలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.

‘‘అరె .. చాలా కాలం తర్వాత కనిపించారు. కాని పూర్తిగా మారిపోయారండి మీరు ... అచ్చం దెయ్యంలా ఉన్నారు’’ అంది భార్య.

‘‘నువ్వు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు’’ బదులిచ్చి ఎగిరిపోయాడు భర్త.


పట్టుదలే నన్నిక్కడికి చేర్చింది

భర్త: స్వామీ.. భార్యాభర్తల గొడవలలో ఎక్కువగా భర్తలే సర్దుకుపోతారు ఎందుకు స్వామీ..

స్వామి: తప్పదు నాయనా.. లేకపోతే భార్యలు బట్టలు సర్దుకు పోతారు..

భర్త: అంటే ఈ విషయంలో పట్టుదలగా ఉండే భర్తలే ఉండరా స్వామీ..?

స్వామి: నేను లేనా నాయనా.. నా లాంటి వాళ్లందరూ ఒకప్పటి పట్టుదల కలిగిన భర్తలే!


సారీ

శనివారం సాయంత్రం జ్యువెలరీషా్‌పకి వచ్చిందో ప్రేమజంట. అక్కడి బంగారునగల్ని చూసి చూసి ఓ నెక్లె్‌స సెలెక్ట్‌ చేసుకుంది ప్రియురాలు. దాని ఖరీదు అయిదులక్షలు. అయిదులక్షలకీ చెక్‌ రాసి, షాప్‌ ఓనర్‌కి ఇచ్చాడు ప్రియుడు. చెప్పాడిలా.
‘‘సోమవారం చెక్‌ క్యాష్‌ కాగానే వచ్చి ఆ నెక్లెస్‌ తీసుకుంటాను.’’
‘‘ఓకే సార్‌’’
సోమవారం వచ్చింది. షాప్‌కి ప్రియుడు ఒక్కడే వచ్చాడు.
‘‘మీ చెక్‌ బౌన్స అయిందిసార్‌! మీ ఎకౌంట్‌లో డబ్బుల్లేవట!’’ చెప్పాడు షాప్‌ ఓనర్‌.
‘‘ఆ సంగతి నాకూ తెలుసు. ప్రియురాలితో వీకెండ్స్‌ హాయిగా గడవాలంటే ఇలాంటివి తప్పవు, సారీ’’ అన్నాడు ప్రియుడు.

** ఎంతైనా మగాడు మగాడే! జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలూ!


బాంబు

ఓ అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ కారులో బాంబును ఫిక్స్‌ చేస్తున్నారు.

1వ వ్యక్తి: మనం ఫిక్స్‌ చేస్తున్నప్పుడే ఈ బాంబు పేలిపోతే?

2వ వ్యక్తి: నాకూ ఆ అనుమానం ఉంది. అందుకే ఇంకో బాంబు రెడీగా ఉంచాను.


టీచర్‌

తల్లి: చింటూ పరీక్ష పాసయ్యావా?
చింటూ: నేనే కాదు, మా క్లాసులో అంతా పాసయ్యాం. పాస్‌ కానిది టీచరొకరే!
తల్లి: అవునా?
చింటూ: అవును మమ్మీ! నేనిందాక చూశాను కదా, పాపం సేమ్‌ క్లాసులో పాఠాలు చెప్పుకుంటూ కనిపించింది టీచర్‌.


దోమలు

భార్య: మీరిక్కడ ఏం చేస్తున్నారు?
భర్త: దోమల్ని చంపుతున్నాను.
భార్య: ఎన్నిటిని చంపారేం?
భర్త: మూడు మగదోమల్ని, రెండు ఆడదోమల్ని, మొత్తం అయిదు దోమల్ని చంపాను.
భార్య: ఆడా మగా ఎలా తెలుసుకున్నారు?

భర్త: బీరుగ్లాసు మీద వాలినవి మూడూ మగదోమలు. అందులో అనుమానం లేదు. అలాగే అద్దం మీద వాలినవి రెండూ ఆడదోమలు.


ఆవులించి చూడు..

భర్త: ఏమోయ్‌.. బయట వర్షం పడుతోంది..

భార్య: ఇంట్లో శనగపిండి లేదు. ఉల్లిధర కొండెక్కి కూర్చుంది. పనమ్మాయి రాలేదు.. గిన్నెలన్నీ అలానే ఉన్నాయి .. అసలు ఇప్పుడు పకోడీ చేసే ఓపిక అసలు లేదు.

భర్త: హూ...సరేలే..

భార్య: ఇంకో విషయం.. ఐస్‌ క్యూబ్స్‌ ఇవ్వమని అస్సలు అడగొద్దు. పిల్లలు పెరిగారు. ఈ మందు తాగడం లాంటివన్నీ ఇంట్లో పెట్టారంటే ఒప్పుకునేది లేదు..

భర్త: అలానే (దేవుడా.. మగాడి మనసులో మాటలని వీళ్లు ఎలా కనిపెట్టేస్తారో ఏమో...!)


ఆ రోజుల్లో... అంతేమరి..

షష్టిపూర్తి జరుపుకున్న ఒక ముసలాయనకి ఒక వింత కోరిక పుట్టింది.. భార్యను పిలిచి ‘‘హనీ.. మనం మన యంగ్‌ ఏజ్‌లో ఎంత ఆనందంగా గడిపామో కదా.. ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో కదా.. ఒక పని చేద్దాం. మనం పెళ్లి కాకముందు ఎలా గడిపామో ఒకసారి మళ్లీ అలా చేద్దాం. సరేనా...’’ అన్నాడు. భార్య సరేనంది.

తర్వాత రోజు ముసలాయన బాగా ముస్తాబై, ఒక ఎర్ర గులాబి చేతిలో పట్టుకుని.. నది ఒడ్డున కూర్చొని ఎదురుచూడసాగాడు. ఎంతసేపు అయినా భార్య రాలేదు. (ముసలాయన మొబైల్‌ కూడా తీసుకెళ్లలేదు.. ఎందుకంటే ఆ రోజుల్లో మొబైల్‌ ఉండేది కాదు కదా!)

3, 4 గంటలు వెయిట్‌ చేశాక ఇంటికి వెళ్లి చూసేసరికి.. ముసలామె బయట అరుగు మీద కూర్చుని, ముసిముసి నవ్వులు నవ్వుతోంది.

ముసలాయనకు తిక్కరేగింది. ‘‘ఎంతసేపు వెయిట్‌ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు?’’ కోపంగా అరిచాడు.

ముసలమ్మ సిగ్గుపడుతూ ‘‘నేను వద్దామనే అనుకున్నా.. కానీ మా మమ్మీ రానీయలేదు..’’ అని బదులిచ్చింది కూల్‌గా.


ఇంతకంటే మార్పా?

‘‘మీకు ఏ వ్యాధి లేదు. కేవలం కొంత మార్పు ఉంటే సరిపోతుంది’’ చెప్పాడు డాక్టర్‌.

‘‘మార్పా .. ఈ మూడేళ్లలో నలుగురు భార్యలను, 8 కార్లను, పదిమంది వంటవాళ్లను, 22 మంది పనిమనుషులను మార్చాను ... ఇంతకంటే ఏం మార్పు చేసుకోగలను డాక్టర్‌?’’ అసహనంగా ప్రశ్నించాడు హీరో చిదానందం.


భూమి గుండ్రంగా ఉండును

‘‘మద్రాసుకు వచ్చిన కొత్తలో బీచ్‌లో బఠాణీలు అమ్ముతుండేవాడిని, దాంట్లో వచ్చిన ఆదాయంతో టీ కొట్టు పెట్టాను’’

‘‘అవునా .. ఆ తర్వాత...’’

‘‘టీ కొట్లో వచ్చిన లాభాలతో పెద్ద హోటల్‌ ప్రారంభించా’’

‘‘భేష్‌ ... మంచి ఇంప్రూవ్‌మెంట్‌. ఆ తర్వాత..’’

‘‘ఆ సమయంలో ఓ ప్రొడ్యూసర్‌తో స్నేహం కుదిరింది..’’

‘‘అంతా దేవుడి దయ .. తర్వాత’’

‘‘తర్వాత ఆయనతో కలిసి స్కోప్‌లో బ్రహ్మాండమైన సిన్మా తీశాను’’

‘‘అదృష్టమంటే మీదే.. తర్వాత..’’

‘‘ఇప్పుడు మళ్లీ బీచ్‌లో బఠాణీలు అమ్ముతున్నా’’


సెలవు సెలవే!

‘‘మమ్మీ .. ఈ రోజు పార్కులో మా టీచర్‌ కనిపించింది’’ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు టింకూ.

‘‘మరి హలో చెప్పావా?’’ అడిగింది అమ్మ.

‘‘లేదు ... ఈ రోజు ఆదివారం కదా .. మర్చిపోయావా?’’ మళ్లీ తుర్రుమన్నాడు టింకూ.


నిజం కానందుకేమో!

‘‘నేను చనిపోయే సన్నివేశం చూసి మా ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చిందిరా ..’’ గొప్పగా చెప్పాడు హీరో బుచ్చిబాబు.

‘‘బహుశా అది నిజం కాదన్న సంగతి గుర్తొచ్చి ఉంటదిరా’’ మనసులో అనుకున్నది పొరపాటున బయటకే అనేశాడు చిట్టిబాబు.


రాయడమే తరువాయి

‘‘ఎగ్జామ్స్‌ రేపటినుండే కదా .. ప్రిపేరయ్యావా?’’ అడిగాడు తండ్రి.

‘‘ప్రిపేరయ్యా నాన్నారూ .. ఎగ్జామ్‌ పాడ్‌ కొత్తది కొని దానికి హాల్‌ టికెట్‌ అతికించా. పెన్నులో కొత్త రీఫిల్‌ వేసా. పెన్సిల్‌ షార్ప్‌గా చెక్కి పెట్టాను. బట్టలు తెల్లగా ఉతికించి ఇస్త్రీ చేయించా’’ చెప్పాడు తనయుడు.


కిటుకు

అబ్బాయిలు పెన్‌ పోయినా ఏడవరు, కాని అమ్మాయిలు పెన్సిల్‌ పోయినా ఏడుస్తారు. ఎందుకంటే అబ్బాయిలకి తెలుసు ఏడిస్తే పోయినవి తిరిగిరావని. కాని అమ్మాయిలకు బాగా తెలుసు .. ఏడిస్తే ఎవడో ఒకడు పెన్సిల్‌ కొనిస్తాడని!


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -67

Responsive Footer with Logo and Social Media