పేజీ సంఖ్య - 66

నా అకౌంటు - నా ఇష్టం!

‘‘ఇందులో 3 దొంగ నోట్లున్నాయి .. చెల్లవు’’ చెప్పాడు బ్యాంకు క్యాషియర్‌.

‘‘వీటిని నా అకౌంటులో కదా వేసేది. అవి మంచి నోట్లయితే నీకేంటి? దొంగనోట్లయితే నీకేంటి?’’ వాదించాడు కస్టమర్‌ కనకయ్య.


మెదడుకు మేత

‘‘ఒక పొలంలో 12 గొర్రెలున్నాయి. అందులో 6 గొర్రెలు పక్క పొలంలోకి వెళ్తే ఎన్ని గొర్రెలు మిగుల్తాయి?’’ అడిగాడు లెక్కల మాస్టారు.

‘‘ఏమీ మిగలవు సార్‌’’ చెప్పాడు చింటు.

‘‘అదెలా?’’ ఆశ్చర్యపోయాడు మాస్టారు.

‘‘ఒక గొర్రె వెళ్లిందంటే అన్ని గొర్రెలూ దాని వెనకే వెళతాయండి’’ చెప్పాడు చింటు.


ప్రేమలేఖ

‘ప్రియమైన నీకు ..

నీ గురించి ఏమి రాయాలో ఆలోచించి .. ఆలోచించి .. చించి .. తెలియక చివరకు నేనే జండూబామ్‌ రాసుకున్నాను...’

ఇట్లు - నీ కాళిదాసు


ఇంతకంటే సింప్లిసిటీ ఉండదు

‘‘సింప్లిసిటీకి నిర్వచనం చెప్పగలవా?’’

‘‘వంద రూపాయలు పెట్టి చెప్పులు కొన్న ఆడవాళ్లు ‘షాపింగ్‌కు వెళ్లొచ్చామ’ని చాటింపు వేసుకుంటే, రెండు వేలు ఖర్చు చేసి మందు తాగిన మగవాళ్లు సైలెంట్‌గా వచ్చి పడుకుంటారు. ఇంతకంటే సింప్లిసిటీ ఏముందబ్బా!’’


ముందే చెప్పలేకపోయావా?

‘‘ఏమండీ .. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతానంతే’’ కచ్చితంగా చెప్పింది కాంతం.

‘‘ఈ విషయం ముందే తెలిసుంటే బాగుండేది కాంతం. జుట్టు రాలకుండా ఉండేందుకు ఇన్నాళ్లూ నానా జాగ్రత్తలు తీసుకున్నాను అనవసరంగా’’ నెత్తి గోక్కున్నాడు జోగినాథం.


బోధపడిందా?

‘‘ప్రజా ప్రతినిధి .. ప్రజా ప్రతినిధి అనే మాట తరచూ వినబడుతుంది ... అర్థం ఏమిటి గురూ?’’ అడిగాడు శిష్యుడు.

‘‘ఏమీలేదు నాయనా .. ప్రజలకోసం వచ్చే ప్రతి నిధిని స్వాహా చేసేవాడిని ప్రజా ప్రతినిధి అంటారు’’ చెప్పాడు గురూజీ.


వాట్సప్‌ జోక్‌

సోమనాథం: మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు?
రామనాథం: ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ బిజినెస్‌.
సోమనాథం: అవునా! ఏఏ వస్తువులను ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ చేస్తుంటాడు?
రామనాథం: వాట్స్‌పలో వచ్చినవి ఫేస్‌బుక్‌లో, ఫేస్‌బుక్‌లో వచ్చినవి వాట్స్‌పలో పోస్ట్‌ చేస్తుంటాడు.


రాబోయే కాలంలో కాబోయే పరామర్శలు..!!

పాపం చాలా మంచి మనిషి.. ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉండేవాడు
అందరి పోస్టులకీ లైక్స్‌ కొట్టేవాడు
చాలా హుందాగా కామెంట్స్‌ పెట్టేవాడు
పాపం తన పోస్టులకు ఎవ్వరినీ ట్యాగ్‌ చేసేవాడు కాదు
ఎవరైనా వారి పోస్ట్స్‌కి తనని ట్యాగ్‌ చేసినా పల్లెత్తు మాటా అనేవాడు కాదు
అందరి ప్రొఫైల్స్‌ పిక్స్‌కీ లైక్‌ కొట్టేవాడు
ఫేక్‌ ఫొటోలను ప్రొఫైల్‌ పిక్‌గా ఎనాడూ పెట్టని పెద్దమనిషి

పాపం జీవితాంతం ఒక్క అకౌంట్‌ మీదే బతికాడు...


ఫన్నీ చాటింగ్‌..

గర్ల్‌ఫ్రెండ్‌: హాయ్‌ డియర్‌, చిన్న సహాయం కావాలి.
బాయ్‌ఫ్రెండ్‌: ఏం సహాయం??
గర్ల్‌ఫ్రెండ్‌: మై స్వీట్‌ డార్లింగ్‌! నాకు ఒక 15k కావాలి. ఇస్తావా ప్లీజ్‌!
బాయ్‌ఫ్రెండ్‌: 15k? ఎందుకంత?
గర్ల్‌ఫ్రెండ్‌: 5k నా డ్రస్సులకోసం, 7k నా హెయిర్‌స్టయిల్‌, మేక్‌పకిట్‌ కోసం, 3k నా షూస్‌ కోసం...
బాయ్‌ఫ్రెండ్‌: ఓ ష్యూర్‌! ఇప్పుడే పంపిస్తున్నా, తీసుకో.

లెక్కపెట్టుకో డియర్‌, కరెక్టుగా 15k ఉన్నాయి. ఇంకో 2k కూడా పంపిస్తున్నాను. దాంతో పర్‌ఫ్యూమ్‌ కొనుక్కో!


అనుభవసారం

‘‘బ్రహ్మచారి అంటే పెళ్లికానివాడు, సంసారి అంటే పెళ్లయినవాడు. మరి సన్యాసి అంటే ఎవరు స్వామీ?’’ అడిగాడు శిష్యుడు.

‘‘పెళ్లి వలన విరక్తి చెందినవాడు నాయనా’’ చెప్పాడు గురువు.


అతిథి దేవో భవ!

ఇంటికి అతిథి రాగానే మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న-

మీ మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టమంటారా?

ఈ మాటతో అతిథి ఆనందపడతాడు.

రెండవ ప్రశ్న .. ఠీజీ జజీ పాస్‌వర్డ్‌ ఇమ్మంటారా?

గురుడు ఆనందంతో పిచ్చెక్కి గంతులేస్తాడు.


సుంకం మాఫీ చేస్తా!

‘‘డాక్టరుగారూ .. పేదవాడిని. మీరు చేసిన వైద్యానికి డబ్బులు ఇచ్చుకోలేను. కాని ఏదో రకంగా మీ రుణం తీర్చుకుంటానండి’’ బతిమాలాడు వీరమల్లు.

‘‘సర్లే .. ఇంతకూ రుణం ఎలా తీర్చుకుంటావో చెప్పు?’’ ఆసక్తిగా అడిగాడు డాక్టర్‌ చంపారావు.

‘‘నేను కాటికాపరిని. మీ ఇంటి నుండి ఎప్పుడు శవం వచ్చినా సుంకం తీసుకోను’’ వినయంగా బదులిచ్చాడు వీమల్లు.


మళ్లీ మళ్లీ దొరుకుతున్నాడు!

‘‘మా అబ్బాయి తప్పిపోయిన విషయం ఫోటోతో పాటు వాట్సాప్‌లో పెట్టడం తప్పయిపోయిందిరా .. ’’ బాధగా అన్నాడు రత్నాకరం.

‘‘అందులో పెట్టబట్టే కదా ... వెంటనే దొరికాడు’’ బదులిచ్చాడు చిదంబరం.

‘‘నిజమే .. ఆ తర్వాత ఎక్కడ దారిలో కనిపించినా ఎవరో ఒకరు గుర్తుపట్టి వాడిని తెచ్చి నాకు అప్పగిస్తున్నారు’’ గొల్లుమన్నాడు రత్నాకరం.


ఓర్వలేని దేవుడు

దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడు నిజమే. అయితే పురుషుడు ఆనందంగా ఉండడం చూసి ఓర్వలేక ఆ దేవుడే భార్యను సృష్టించాడని ఎందుకు చెప్పరు?


కొత్త కాపురం

‘‘ఇదిగో నిన్నే ... స్నానానికి వేణ్ణీళ్లు మరిగించావా?’’ కేకేశాడు కోదండ రామయ్య.

‘‘లేదండి .. చన్నీళ్లే మరిగించి బాత్రూమ్‌లో పెట్టా’’ వంటింట్లోంచి బదులిచ్చింది అలివేలు.


మరుపులో మెరుపు

రమేష్‌ : ఈ మధ్య మతిమరుపు ఎక్కువయి పోయిందిరా.. మొన్న వర్షంలో గొడుగు తీసుకోకుండా వెళ్ళిపోయాను.

సురేష్‌ : మరి ఎప్పుడు గుర్తొచ్చింది?

రమేష్‌ : వాన తగ్గాక మడుద్దామని చూస్తే చేతిలో గొడుగు లేదు..


సొల్లుగాడి పని పడదాం రా!

‘‘సినిమా ఎలా ఉంది?’’

‘‘ఏమో..’’

‘‘అదేంటి.. టికెట్‌ బుక్‌ చేసుకున్నావు.. వెళ్లలేదా?’’

‘‘వెళ్లాను.. మధ్యలో నా పక్క సీటు వాడికి అర్జెంట్‌ ఫోన్‌కాల్‌ వచ్చింది. 45 నిమిషాలు మాట్లాడాడు. ఫ్లిప్‌కార్ట్‌ వాడికి తన ఇంటి దారి చెప్పాడు. నేనిప్పుడు వాడి ఇంటికే బయలుదేరాను. వస్తావా? గన్ను పట్టుకొని వెనుక సీట్లో కూర్చుంటావా?’’


చూపించు - లక్ష పట్టు

స్నేహితులు లేని వాళ్లని లక్ష మందిని చూపిస్తాను. కాని శత్రువు లేనివాడిని ఒక్కణ్ణి చూపించు. లక్ష రూపాయలిస్తాను.


చెప్పే అర్హత వచ్చేసింది!

గంటసేపు పోరాడి చిక్కుపడ్డ నా హెడ్‌ ఫోన్స్‌ ముళ్లు విప్పాను. ఇది సాధించాక జీవితంలో ఏదీ ఛాలెంజింగ్‌గా అనిపించట్లేదు.

రైట్‌ .. అయాం రెడీ. ఈ సమాజానికి ఉచిత సలహాలివ్వటానికి అర్హత సంపాదించినట్టే. ‘పడుకునేలోపు జీవితంలో గెలుపు’ అనే వ్యక్తిత్వ వికాసం పుస్తకం రాయటం మొదలుపెట్టాను.


తిక్క కుదిరింది .

కొత్తగా పెళ్ళైన ఒక జంట తీరికగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.

భర్త: మన పెళ్లికి ముందు నీకు ఎంత మంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు?

భార్య: ఇంట్లో నుంచి ఒక బాక్స్‌ తెచ్చి భర్త ముందు ఉంచింది.

భర్త: ఇదేమిటి ఇందులో ఏడు బియ్యం గింజలు, రెండు వందల రూపాయలు ఉన్నాయి.

భార్య: నాకు బాయ్‌ ఫ్రెండ్‌ మారినప్పుడల్లా ఒక బియ్యం గింజ ఆ డబ్బాలో వేసేదాన్ని.

భర్త: ఏడుగురే కదా .. ఈకాలంలో కూడా ఇంత తక్కువ మంది ఉండటం ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది. మరి ఈ రెండు వందలు?

భార్య: (అమాయకంగా) : అలా వేసిన బియ్యం అమ్మితే .. ఈ రెండు వందలు వచ్చాయి.


ధర్మ సందేహం

విద్యార్థి: సార్‌ .. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అందరూ అడుగుతున్నారు కానీ కట్టప్ప ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఎవరూ అడగరెందుకు?

గురువు: ఆఁ ...!


క్లూ పనిచేయలేదు

టీచర్‌: వేమన శతకం రాసిందెవరు?

విద్యార్థి: తెలీదు సార్‌..

టీచర్‌: సరే.. నీకు ఒక క్లూ ఇస్తాను. నేనడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది.

విద్యార్థి: శతకంగారు సార్‌..


నమ్మకపోతే తిరిగి చూడండి

టీచర్‌: చంటీ ... భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా..

చంటి: తెలుసు టీచర్‌.. భూమి తన చుట్టూ తాను తిరిగి తిరిగి కళ్లు తిరిగి పడిపోయినప్పుడు టీచర్‌...


పేరు మారింది అంతే

‘‘గతంలో అన్ని సుఖాలనూ త్యాగం చేసిన వారిని సర్వసంగ పరిత్యాగులని పిలిచేవారు. ఇప్పుడు అలాంటి వారు లేరా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు.

‘‘లేకేం నాయనా .. ఇప్పుడు వారిని ‘ప్రైవేటు ఉద్యోగులు’ అని పిలుస్తున్నారు!’’ జవాబిచ్చాడు గురూజీ.


ఇది ఆ దెబ్బ కాదు

తల పగిలి రక్తం కారుతుండగా ఆసుపత్రికి పరిగెత్తుకొచ్చాడు ఒక వ్యక్తి. ప్రథమ చికిత్స చేశాక అడిగింది నర్సమ్మ.

‘‘మీ పేరు ..?’’

‘‘కోదండం’’.

‘‘వయస్సు?’’

‘‘30 ఏళ్లు ...’’

‘‘పెళ్లయిందా?’’

‘‘లేదండి .. ఈ దెబ్బ కారు యాక్సిడెంట్‌లో తగిలింది.’’


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -66

Responsive Footer with Logo and Social Media