పేజీ సంఖ్య - 57
నీకు సంబంధం లేదు
తాగుబోతు తాతారావు ఉదయం నిద్ర లేవగానే గతరాత్రి భార్యతో జరిగిన గొడవ గుర్తుకొచ్చి బాధపడ్డాడు. తాగి పడేసిన బీరు సీసాలను చూస్తూ...
‘‘ఛీ, ఈ గొడవకంతటికీ మీరే కారణం’’ అని వరసగా ఒక్కో సీసా పగలగొట్టసాగాడు. చివరి సీసా పైకెత్తబోయి ఆగాడు. అది బరువుగా ఉంది. సీల్ కూడా తీయలేదు. ‘‘రాత్రి జరిగిన గొడవకూ, నీకూ సంబంధం లేదు’’ అంటూ తీసుకెళ్లి జాగ్రత్తగా అలమరాలో దాచాడు.
దూరబాకురోయ్!
చూడు తమ్ముడూ ... భార్యాభర్తలు ఒకే కత్తెరలోని రెండు భాగాలు. అవెప్పుడూ కలిసే ఉంటాయి. మధ్యలో వెళ్లినవాడికే పీక తెగిపోద్ది!
పానీపూరి
ఎంతటి కోటీశ్వరుడి కైనా చేతిలో చిప్ప పెట్టి, వరుసలో నిల్చోబెట్టగల సామర్థ్యం ఒక్క పానీపూరి బండివాడికే ఉంది.
ఎంబ్రాయిడరీ డాక్టర్
‘‘ఆపరేషన చేశాక నా పొట్టమీది కుట్లన్నీ పువ్వుల్లా కనిపిస్తున్నాయి’’ గాబరాగా అడిగాడు చంచల్రావు.
‘‘అదా .. నీకు ఆపరేషన చేసిన మా లేడీ డాక్టర్‌కి ఎంబ్రాయిడరీ చేయడం చాలా ఇష్టం ..’’ తాపీగా చెప్పింది నర్సు.
మీరే కొనిస్తారనుకున్నా ...
‘‘దేవుడా .. నాకు లాటరీ తగిలేలా చెయ్యి’’ మొక్కాడు వీరబాబు. వరసగా పది రోజులు ఇదే మాదిరి మొరపెట్టుకున్నాడు వీరబాబు. పదకొండో రోజు కూడా దేవుడ్ని ప్రార్థించబోయేసరికి, ‘‘మూర్ఖుడా, ముందు వెళ్లి లాటరీ టికెట్టు కొనుక్కో’’ అనే మాటలు వినిపించాయి గాల్లోంచి.
ఎవరి ప్రాబ్లం వారిది
‘‘నువ్వెందుకు ఆర్మీలో చేరావు?’’
‘‘నాకు భార్య లేదు. యుద్ధం అంటే ఇష్టం. మరి నువ్వెందుకు చేరావు?’’
‘‘నాకు భార్య ఉంది. శాంతి అంటే ఇష్టం’’
అసలు సంగతి
‘‘నదులన్నిటికీ ఆడపేర్లూ, కొండలన్నిటికీ మగపేర్లూ ఉంటాయెందుకు?’’ అడిగాడు శేషు.
‘‘నదులు ఒక చోట కుదురుగా ఉండవు కాబట్టి, కొండలు కూర్చున్న చోటు నుండి కదలవు కాబట్టి’’ చెప్పాడు బోసు.
టక్కరి కుక్క
‘‘మా కుక్క చాలా తెలివైంది తెలుసా?’’
‘‘ఏంటో ఆ తెలివి?’’
‘‘పొద్దున్నే నాకు పేపరు తెచ్చి ఇస్తుంది’’
‘‘విశేషమేముంది. అన్ని కుక్కలూ చేసే పనే’’
‘‘కానీ, మేం పేపరు వేయించుకోంగా ...’’
భార్యల రియాల్టీ
పైలెట్ భార్య : నా దగ్గర మరీ అంతలా ఎగరకండి.
డాక్టర్ భార్య : మీ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు.
టీచర్ భార్య : నాకేం క్లాసు పీకక్కర్లేదు.
జడ్జి భార్య : ఇది చెప్పడానికి వాయిదాలెందుకు?
న్యాయవాది భార్య : ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటది.
యాక్టర్ భార్య : ఈ మాత్రం నటన మాకూ వచ్చు.
ఇంజనీర్ భార్య : ప్లాను వేయడం మాకూ తెలుసు.
సాఫ్ట్‌వేర్ భార్య : మీ ఆఫీసులో ఉన్న యాంటీ వైరస్‌కి ఏ సాఫ్ట్‌వేర్ వాడాలో నాకు బాగా తెలుసు.
పొలిటీషియన్ భార్య : మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మానాన్నలతో అత్యవసర సమావేశం పెట్టించి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా.
పెళ్లిరోజు కానుక
‘‘ఈసారి మన పెళ్లి యానివర్సరీకి నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు?’’ గోముగా అడిగింది రోజీ.
‘‘ఆఫ్రికా ...’’ చెప్పాడు బుజ్జిబాబు.
‘‘ఓ... వండర్, మరి వచ్చే ఏడాది యానివర్సరీకి?’’ కొంటెగా అడిగింది రోజీ.
‘‘నిన్ను ఆఫ్రికానుండి వెనక్కి తీసుకొస్తాను’’ తాపీగా చెప్పాడు బుజ్జిబాబు.
ఎందుకు చంపాడో తెలిసిందా?
ఇంటి ముందు పార్క్ చేసిన కారు పోవడంతో పోలీసు కంప్లెంట్ ఇచ్చాడు పర్వతాలు. 24 గంటల తర్వాత యధాస్థానంలో తన కారు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. పైగా అందులో ఒక ఆకాశరామన్న ఉత్తరం కూడా ఉంది.
‘‘సార్, నన్ను క్షమించండి. నేను ఒక కారు మెకానిక్‌ని. కావాలని మీ కారు దొంగతనం చేయలేదు. మా అమ్మకు సుస్తీ చేయడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సమయానికి వెహికిల్ దొరకక తప్పని సరి పరిస్థితుల్లో దొంగిలించాను. పెట్రోలు కూడా పోయించాను. కృతజ్ఞతగా ఈ రోజు సెకండ్ షోకి మీ ఇంటిల్లిపాది వెళ్లడానికి బాహుబలి - 2 సినిమా టికెట్లు జత చేస్తున్నాను. సినిమా చూసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోండి.’’
దొంగ నిజాయితీకి పర్వతాలు మనసు కరిగి పోలీస్ కంప్లెంట్ వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత అంతా కలిసి సినిమాకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యింది. బీరువాలో ఒక చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది.
‘‘ఇప్పుడు అర్థమయ్యిందా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో?’’
అదీ సంగతి
‘‘ఈ రోజు పాఠం బుద్ధిమంతుడిలా వింటున్నావు..’’ మెచ్చుకుంది టీచర్.
‘‘ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది టీచర్’’ అబద్ధం చెప్పలేకపోయాడు రాజేష్.
చూడు తమ్ముడూ...
ఈ ప్రపంచంలో పిరికివాడు సైతం చేయగల సాహస కార్యం పెళ్లిచేసుకోవడం!
అడగ్గానే ఇచ్చేవారి దగ్గర అప్పు తీసుకోరాదు. మనం ఇచ్చేవరకు అడగనివారి దగ్గర మాత్రమే తీసుకోవాలి.
అంతే తేడా!
‘‘ఈజిప్టు మమ్మీలకు, నిజం మమ్మీలకు తేడా ఏంటి డాడీ?’’ అడిగింది పుత్రిక.
‘‘ఈజిప్టు మమ్మీలకు పిల్లలు భయపడతారు. నిజం మమ్మీలకు డాడీలు భయపడతారమ్మా’’ చెప్పాడు జనకుడు.
అంతా మనమంచికే!
‘‘రేయ్ బంగారం, నేను ఫెయిలైతే మానాన్న రిక్షావాడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడురా’’ ఏడ్చింది ప్రియురాలు.
‘‘వర్రీకాకు బంగారం, నేను ఫెయిలైతే మా నాన్న రిక్షా కొనిస్తానన్నాడు’’ ఓదార్చాడు ప్రియుడు.
అదీ సంగతి
‘‘ఈ రోజు పాఠం బుద్ధిమంతుడిలా వింటున్నావు..’’ మెచ్చుకుంది టీచర్.
‘‘ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది టీచర్’’ అబద్ధం చెప్పలేకపోయాడు రాజేష్.
ఓడ్కా సూక్తి
నన్ను నమ్ముకో .. నువ్వు తప్పక డాన్స్ చేయగలవు!
అతికిస్తారా? అంటిస్తారా?
‘‘కాగితాలు అంటించాలి. జిగురు తీసుకురా ..’’ చెప్పాడు తండ్రి.
అగ్గిపెట్టె తెచ్చాడు సుపుత్రుడు.
‘‘జిగురు తెమ్మంటే, అగ్గిపెట్టె తెచ్చావేం?’’ కోప్పడ్డాడు తండ్రి.
‘‘జిగురుతో ఎలా అంటిస్తారు?’’ బుర్ర గోక్కున్నాడు సుపుత్రుడు.
ఆ ముగ్గురూ నేనేనట!
‘‘మమ్మీ! రవితేజ, మహేష్‌బాబు, అల్లు అర్జున్, నేనూ ... ఒకటే అంది మా టీచర్’’ గొప్పగా చెప్పాడు బుల్లెబ్బాయ్.
‘‘నిజమా ... ’’ ఆశ్చర్యపోయింది సుమిత్ర.
‘‘అవును. నాలో ఒక ఇడియట్, ఒక పోకిరి, ఒక దేశముదురు ఉన్నారంది’’ అసలు విషయం చెప్పాడు బుల్లెబ్బాయ్.
రవాణా మార్గం
‘‘గంట నుండి మీతో మాట్లాడుతుంటే కాలమే తెలియలేదు. నా తలనెప్పి అంతా పోయింది’’ సంతోషంగా చెప్పాడు శంభులింగం.
‘‘అయితే, ఇప్పుడు నాకొచ్చిన తలనెప్పి నీదేనన్నమాట’’ నొసలు చిట్లించాడు రామలింగం.
నా డ్యూటీ తనే చేస్తాడు
‘‘నేను రాత్రుళ్లు కాపలా కాయను. సుబ్బరంగా నిద్దరోతా’’ చెప్పింది మొదటి కుక్క.
‘‘ఎందుకూ ...?’’ అడిగింది రెండో కుక్క.
‘‘మా యజమానికి నిద్దట్లో అరిచే అలవాటుంది’’ చెప్పింది మొదటి కుక్క.
బిజినెస్ కిటుకు
‘‘ఎప్పుడూ ఈసురోమని ఉండే నీ హాస్పటల్ ఈ మధ్య పేషెంట్లతో కళకళలాతోంది .. ఏమిటి సంగతి?’’ అడిగాడు మిత్రుడు వీరలింగం.
‘‘పదిమంది అందమైన నర్సులను ఈ మధ్యనే అప్పాయింట్ చేశానోయ్’’ నిజాయితీగా చెప్పాడు సోమలింగం.
సరైనోడు
‘‘నెమ్మదిగా నడిపే డ్రైవరు కావాలన్నావు కదా .. ఇదిగో తీసుకొచ్చాను’’ చెప్పాడు మిత్రుడు సుబ్బారావు.
‘‘థాంక్యూ రా .. గతంలో ఏ వెహికిల్ నడిపేవాడివోయ్?’’ అడిగాడు అప్పారావు డ్రైవరు వంక చూస్తూ.
‘‘రోడ్ రోలరండి’’ చెప్పాడు కొత్త డ్రైవరు.
సరే గురువుగారూ
‘‘కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా’’ బోధించాడు గురువు.
‘‘అలాగేనండి’’ - కట్టుకున్న లుంగీని, విప్పిన తర్వాత మడతపెట్టి బీరువాలో దాచాడు శిష్యుడు.
ఫలించనున్న జోస్యం
‘‘నేనొకవేళ చనిపోతే ..’’ దగ్గుతూ పొలమారాడు రోగిష్టి జోగినాథం.
‘‘అంతమాటనకండి .. నేనూ మీతో పాటే ..’’ అంది ఆండాళ్లు కళ్లొత్తుకుంటూ.
‘‘బతికున్నా, చచ్చినా దురదృష్టం నీ వెంటే ఉంటుందని జ్యోతిష్కుడు ఎప్పుడో చెప్పాడు’’ నీరసంగా పలికాడు జోగినాథం.
అది మాత్రం కుదరదు!
తల్లితో ప్రేమగా మాట్లాడాలి.
తండ్రిదో మర్యాదగా మాట్లాడాలి.
అన్నదమ్ములతో అభిమానంగా మాట్లాడాలి.
గురువులతో గౌరవంగా మాట్లాడాలి.
మిత్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి.
బామ్మర్దులతో కాస్త వెటకారంగా మాట్లాడాలి.
భార్యతో ....
అంత సీన్ లేదు - ఆవిడ చెప్పింది వినాలి.
మర్చిపోలేని రూపం
‘‘ఎటు వైపు చూసినా నీ మొహమే కనిపిస్తోంది రాజా ...’’ ఫోన్‌లో చెప్పింది నీలవేణి.
‘‘అంటే నీ మనసులో నేనున్నానన్నమాట. లవ్ యూ డియర్ ... ఇంతకీ ఎక్కడున్నావు’’ గోముగా అడిగాడు రాజా.
‘‘జూలో .. డియర్’’ అంతే గోముగా చెప్పింది నీలవేణి
రివర్స్‌లో చూపించు
‘‘ఈ సోఫా చూడండి. పగలు సోఫాలా, రాత్రి మంచంలా ఉపయోగపడుతుంది’’ చెప్పాడు సేల్స్‌మ్యాన్.
‘‘అబ్బే .. లాభం లేదు. రాత్రి సోఫాలా, పగలు మంచంలా ఉండేది చూపించు’’ ఆవులిస్తూ చెప్పాడు శేషావతారం.
అంతే మరి..
టీచర్: ఈజిప్ట్ మమ్మీకి, ఇండియన్ మమ్మీకి తేడా ఏంటి..?
స్టూడెంట్: ఈజిప్ట్ మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..
కొంప కొల్లేరయ్యింది
‘‘ఒరేయ్ పండూ, రిజల్ట్స్ వచ్చాయట. వెళ్లి చూసుకుందాం రా’’
‘‘నేనిప్పుడు రాలేను. మా డాడీతో పనిమీద వెళ్తున్నాను. నువ్వే నా రిజల్ట్ చూడు. ఒక సబ్జెక్ట్ పోతే గుడ్‌మార్నింగ్ అని, రెండు సబ్జెక్ట్సు పోతే గుడ్‌మార్నింగ్ టు యు అండ్ యువర్ డాడీ అని పంపించు’’
గంట సేపు తర్వాత పండుకు మెసేజ్ వచ్చింది.
‘‘గుడ్‌మార్నింగ్ టు యు అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ’’.