పేజీ సంఖ్య - 56
డ్రింక్ అండ్ కాల్
తండ్రి (ఫోన్‌లో) : తాగినప్పుడు కారు నడపకు నాన్నా!
కొడుకు: నువ్వు తాగి నప్పుడు కాల్ చేయకు నాన్నా.
తండ్రి: నీకెలా తెలుసురా నేను తాగుతున్నానని!
కొడుకు: నువ్వు నాకు కారు ఎప్పుడు కొనిచ్చావ్ నాన్నా?
ఆవాసనం
ఆవాలు బరువు తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.
ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక కిలో ఆవాలను గచ్చు నేల మీద వేయాలి. ఆ తర్వాత ఒక ఖాళీ గిన్నెను ఎత్తైన గట్టుమీద ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఆవ గింజనూ ఏరి ఆ గిన్నెలో వేయాలి. ఆవాలు మొత్తం గిన్నెలోకి వచ్చేదాకా ఇలా చేస్తూనే ఉండాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. రెండు నెలల్లో మీరు సన్నగా అవ్వడం గ్యారెంటీ!
గమనిక: ఆవాలకు బదులుగా గసగసాలు కూడా వాడవచ్చు.
వర్రీ మ్యాన్
పెళ్లి కానప్పుడు- స్పైడర్ మాన్
పెళ్లి కుదిరినప్పుడు- సూపర్ మాన్
పెళ్లి తర్వాత- జెంటిల్ మాన్
పెళ్లాం అందంగా ఉంటే - వాచ్‌మాన్
రిసెర్చ్ రిపోర్ట్
టీ, కాఫీలు తాగడం చాలా ప్రమాదకరం అని నిన్న నేను చేసిన సర్వేలో తేలింది. నిన్న నేను పబ్‌కి వెళ్లి, నాలుగు బీర్లు తాగి, రాత్రి రెండింటికి ఇంటికి వచ్చా. ఇంట్లో మా ఆవిడ నాకోసం వెయిట్ చేస్తూ రెండు టీలు, ఒక కాఫీ తాగింది. ఇక్కడే అసలు రిసెర్చ్ మొదలైంది. బీర్లు తాగి వచ్చిన నేను ప్రశాంతంగా శాంతంగా పడుకున్నాను. కాని టీ తాగిన మా ఆవిడ మాత్రం ఎంతో వయెలెంట్‌గా అరుస్తూ కేకలు పెడుతూ కరాళ నాట్యం చేసింది. అంటే టీ తాగితే మనుషులు సంయమనం కోల్పోతారని... తేలిపోయింది.
ఈగ ఈగే!
స్వామీజీ: సందర్భాన్ని బట్టి మనుషుల నైజం మారుతుంది.
అప్పాజీ: ఏదీ ఒక ఉదాహరణ చెప్పండి
స్వామీజీ: ఛాయ్ కప్పులో ఈగ పడితే పారబోస్తారు. అదే నెయ్యి గిన్నెలో పడితే తీసేసి వాడుకుంటారు.
రక్షణ అవసరం
భార్య: ఏమండీ... శివుడూ, పార్వతీ ఉండే ఫోటోల్లో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. విష్ణువూ, లక్ష్మీ ఉండే ఫోటోల్లో విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది. శ్రీరాముడూ, సీతా ఉండే ఫోటోల్లో రాముడి చేతిలో విల్లు ఉంటుంది. అయితే కృష్ణుడూ, రాధ ఉండే ఫోటోల్లో మాత్రం కృష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి ఉంటుంది. ఎందుకని?
భర్త: అదేమీ లేదే.. నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్లూ భార్యలతో ఉన్నారు. కాబట్టి ఆయుధాలతో ఉన్నారు. కృష్ణుడు మాత్రం ప్రియురాలితో ఉన్నాడు కాబట్టి ఆయుధం అవసరం లేకుండా పోయింది. దీని మూలంగా తేలిందేమంటే దేవుడయినా సరే భార్యతో ఉన్నప్పుడు తనని తాను కాపాడుకునేందుకు ఆయుధం అవసరమే అని.
వర్షాకాలం సలహా!
మనకు కన్నీరు వస్తే తుడవడానికి చాలా మంది స్నేహితులు వస్తారు. కానీ జలుబు చేస్తే ముక్కు తుడవడానికి ఎవరూ రారు. మనమే తుడుచుకోవాలి. అందుకే జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడుతున్నాయి. తడవకండి.
అజాగ్రత్త
వంటగదిలో గిన్నెలు తోముతున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భర్త ఆవేదన
‘‘పదివేలు- పాతికవేలు పోసి కొనే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషీన్, మొబైల్ ఫోన్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని కూడా ముట్టుకోనివ్వరు. అలాంటిది, లక్షలు పెట్టి కొన్న భర్తను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలీ? డబ్బంటే లెక్క లేదు ఆడవాళ్లకు!’’
చాలా తేలిక
డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న పేషెంట్‌తో...
డాక్టర్: ఇప్పుడు తేలిగ్గానే అనిపిస్తోందా?
రోగి (పర్సు తడుముకుంటూ): హా... చాలా తేలిగ్గా అనిపిస్తోంది.
మోడ్రన్ మదర్
అప్పుడే ప్రసవమై మెలకువ వచ్చిందామెకు. పక్కన తడిమి చూసుకుంది. ఆదుర్దా పడింది.
బాలింత బాధ అర్థం చేసుకున్న నర్సమ్మ ‘‘ఇదిగోండి మీ పాప ... మనసారా చూసుకోండి’’ చేతికందిస్తూ నవ్వింది.
‘‘నేను వెతుకుతోంది ... నా మొబైల్ ఫోన్’’ చెప్పింది బాలింతరాలు.
స్టేటస్ కోమా
ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన సుబ్బారావు, ఒక అమ్మాయి పెట్టిన పోస్టు చదివి కోమాలోకి వెళ్లాడు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే...
‘‘నాకు మగాళ్లంటే అసహ్యం. అందుకే ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను, నా పిల్లల్ని కూడా చేసుకోనివ్వను’’.
వీక్ బాయ్
‘‘టింకూ .. ‘వీక్’ అనే పదాన్ని ఇంగ్లీషులో పదిసార్లు రామయంటే రెండు సార్లే రాశావేం?’’
‘‘నేను లెక్కల్లో కూడా వీకే మేడమ్’’
ఓ కాకి ఫీలింగ్
‘‘వీళ్లెక్కడి మనుషులురా బాబూ... అన్నానికి వస్తే పాడు కాకి అని తమురుతారు... పిండానికి రాకపోతే బతిమిలాడతారు’’.
సరికి సరి
‘‘మా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచాం. తనకి వంట చేయడం రాదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బావగారూ ...’’ వియ్యంకుడి చేతులు పట్టుకున్నాడు దయానందరావు.
‘‘అయ్యో .. ఎంతమాట బావగారూ .. తప్పకుండా. అన్నట్టు మా అబ్బాయిని కూడా అల్లారుముద్దుగా పెంచాం. సంపాదించడం రాదు. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి’’ బదులిచ్చాడు వియ్యంకుడు.
చెప్పకనే చెప్పడం
‘‘ఊరికే ఆరోగ్యం గురించి వర్రీ కాకండి. మీకు ఢోకా లేదు. తొంభై ఏళ్లు బతుకుతారు’’ చెప్పాడు డాక్టర్.
‘‘డాక్టర్, ఆల్రెడీ నా వయసు తొంభై’’ బేలగా చూశాడు పేషెంటు.
‘‘చూశారా .. ఎంత కరెక్టుగా చెప్పానో’’ గర్వంగా చెప్పాడు డాక్టర్.
మరి ఆ రోజుల్లో...
ఆ రోజుల్లో అమ్మమ్మ గారింట్లో పుట్టేవాళ్లం... పండుగలకూ, జాతరలకూ తరుచూ అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్లం.
మరి ఇప్పుడో... ఆసుపత్రిలో పుడుతున్నాం... ఎప్పుడూ వాటి చుట్టూ తిరుగుతున్నాం.
వద్దన్నా వస్తారు
‘‘స్వామీ నేను పోయిన తర్వాత నా సమాధి చుట్టూతా జనాలు గుమిగూడాలంటే ఏం చేయాలి ..’’ అడిగాడు శిష్యుడు.
‘‘ఏముంది నాయనా .. నీ సమాధి దగ్గర ఫ్రీ వైఫై సౌకర్యం కలిగిస్తే చాలు. రాత్రింబవళ్లూ నీ సమాధి చుట్టే ఉంటారు’’ సెలవిచ్చాడు స్వామీజీ.
రెండాకులు ఎక్కువే...
‘‘విడాకులు ఎందుకు కోరుకుంటున్నావ్?’’ అడిగాడు జడ్జి
‘‘నా భార్య నాతో వెల్లుల్లి ఒలిపిస్తుంది. ఉల్లిపాయలు కోయిస్తుంది. అంట్లు తోమిస్తుంది, బట్టలు ఉతికిస్తుంది ...’’ చెప్పాడు బుల్లెబ్బాయ్.
‘‘వీటితో అంత కష్టం ఏముంది? వెల్లుల్లిని వేడి నీటిలో వేస్తే పొట్టు సులువుగా వస్తుంది. ఉల్లిని గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచితే కళ్లు నీరు కారవు. అంట్లు తోమే ముందు కొద్దిసేపు నానబెడితే సులువుగా శుభ్రపడతాయి, బట్టలు ఉతికే ముందు సర్ఫ్ నీటిలో నానబెడితే మురికి వదులుతుంది ..’’ బోధించాడు జడ్జి.
‘‘అర్థమయ్యింది’’ తల గోక్కున్నాడు బుల్లెబ్బాయ్.
‘‘ఏమర్థమయ్యింది?’’ అడిగాడు జడ్జి.
‘‘మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉందని’’ చెప్పాడు బుల్లెబ్బాయ్.
ఔరా!
‘అన్ని సబ్జెక్టులూ ఒకే మాస్టారు చెప్పలేడు కానీ, అన్ని సబ్జెక్టులూ ఒకే స్టూడెంట్ ఎలా నేర్చుకోగలడు!?’
స్టూడెంట్ నెం.1
‘‘ఏడాదిలో మొత్తం ఎన్ని రాత్రులు?’’ అడిగింది టీచర్.
‘‘పది టీచర్’’ చెప్పాడు రాజు.
‘‘ఎలా?’’ ఆశ్చర్యపోయింది టీచర్
‘‘తొమ్మిది నవరాత్రులు, ఒక శివరాత్రి. మొత్తం పది టీచర్’’ వివరించాడు రాజు.
అదీ సంగతి!
టూరుకెళ్లిన ఆడవాళ్ల బస్సు దురదృష్టవశాత్తు నదిలో పడి అందరూ పోయారు. భర్తలందరూ వారం రోజుల పాటు ఏడ్చి ఏడ్చి చాలించారు గాని, శేషావతారం మాత్రం ఏడుపు ఆపడం లేదు.
‘‘భార్యను బాగా మిస్సవు తున్నారా ..’’ జాలిగా అడిగాడు శేషావతారం శ్రేయోభిలాషి.
‘‘లేదు. ఆ రోజు నా భార్య బస్సు మిస్సయ్యింది’’ మళ్లీ గొల్లుమన్నాడు శేషావతారం.
రివర్స్ గేర్
‘‘పనిమనిషి వస్తుంది కదా .. ఇల్లు నువ్వు ఊడుస్తున్నావేం?’’ అడిగాడు అప్పుడే ఇంట్లోకి వచ్చిన భర్త.
‘‘అది వచ్చిందంటే .. ఇల్లంతా మట్టి మట్టిగా ఉందని ఒకటే గొడవ చేస్తుంది. అందుకే ఊడుస్తున్నా ...’’ బదులిచ్చింది భార్య.
భలే మొగుడు
అప్పటిదాకా ఊరిమీద బలాదూర్ తిరిగొచ్చిన శ్యామలరావు భార్యతో ‘‘కాంతం, ఈ రోజు లంచ్‌లోకి ఏంటి?’’ అడిగాడు విలాసంగా.
ఆ మాటకి బట్టలు ఉతుకుతున్న కాంతానికి కోపం నషాళానికి అంటింది. తమాయించుకుని ‘‘ఇవాల్టికి నేను ఊరు వెళ్లాననుకుని మీరే వండుకోండి’’ అంది.
లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి దూరి కడుపునిండా వండుకు తిని బయటకి వస్తుంటే ..
‘‘నాకేదీ...’’ అడిగింది కాంతం.
‘‘నువ్వు ఊరునుండి ఎప్పుడొచ్చావ్ కాంతం?’’ అమాయకంగా ప్రశ్నించాడు శ్యామల్రావు.
సొంత వైద్యం
‘‘నా బాడీలో ఐరన్ లేదు డాక్టర్. ఐరన్ టాబ్లెట్లు రాయండి.’’
‘‘నీ బాడీలో ఐరన్ లేదా ... రక్త పరీక్ష చేయించావా?’’
‘‘బాడీకి అయస్కాంతం పెట్టి చూశా. అతుక్కోలేదు ...’’
‘‘ .....!?’’
ఆ రెండు మాటలు
‘‘స్వామీ, మీరు సన్యాసిగా ఎలా మారారు?’’ అడిగాడు శిష్యుడు.
‘‘గతంలో చీరల షాపులో పనిచేసేవాడ్ని. అక్కడికి వచ్చే ఆడవాళ్లు మాట్లాడిన రెండు మాటలకి జీవితంపై విరక్తి కలిగి ఇలా మారాను’’ చెప్పాడు స్వామీజీ.
‘‘ఏం మాట్లాడేవారు స్వామీ వాళ్లు?’’ ఆసక్తిగా అడిగాడు శిష్యుడు.
‘‘1 - ఈ డిజైన్‌లో వేరే కలర్ చూపించు. 2 - ఈ కలర్‌లో వేరే డిజైన్ చూపించు ..’’ అర్ధనిమీలిత నేత్రాలతో సెలవిచ్చాడు స్వామీజీ.
ఆరోహణ క్రమం
ఒక స్కూల్లో గ్రూప్ ఫోటో తీయడానికి ఫొటో గ్రాఫర్ని పిలిచారు.
ఫొటోగ్రాఫర్ ఒక్కొక్కరికి రూ.20 అవుతుందన్నాడు. హెడ్ మాస్టర్ పిల్లలు చాలా బీదవారని చెప్పి రూ.10 ఇస్తారని ఒప్పించాడు.
ఫొటోగ్రాఫర్ సరేనన్నాడు.
హెడ్‌మాస్టర్ టీచర్లని పిలిచి ‘‘ఒక్కొక్క విద్యార్థి దగ్గర రూ.30 వసూలు చేయమని చెప్పాడు. టీచర్లు పిల్లలతో ఒక్కొక్కరూ రూ. 50 తీసుకురావాలని ఆర్డరేశారు. పిల్లలు వాళ్ల వాళ్ల అమ్మల దగ్గరకు వెళ్లి స్కూల్లో ఫోటోకి రూ.100 అడిగారని చెప్పారు. అమ్మేమో నాన్న దగ్గరకు వెళ్లి పిల్లల గ్రూప్ ఫోటోకి స్కూల్లో రూ.200 అడిగారని చెప్పి వసూలు చేసింది.
అన్నీ మంచి శకునములే...
ఐసీయూలో ఉన్న జోగినాథానికి దినపత్రిక ఇచ్చారు సిబ్బంది.
గబగబా పేజీలు తిప్పి రాశిఫలం చూసుకున్నాడు.
‘‘ఈరోజు మీకు శుభదినం. సుదూర ప్రయాణం. ఖర్చు తక్కువ. పాత మిత్రులను, బంధువులను కలుస్తారు. ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదు ... శుభం!’’
డైమండ్ రాణి
‘‘నిన్న నా శ్రీమతి పుట్టినరోజు జరుపుకుంది’’ చెప్పాడు పీతాంబరం.
‘‘అలాగా .. మరి గిఫ్ట్ ఏమిచ్చావ్?’’ అడిగాడు ఏకాంబరం.
‘‘ఏం కావాలో కోరుకోమంటే, మీరేదైనా కొనివ్వండి కాని అందులో డైమండ్ తప్పనిసరిగా ఉండాలంది’’ వివరించాడు పీతాంబరం.
‘‘అవును మరి, శ్రీమతా మజాకా .. ఇంతకీ ఏం కొనిచ్చావు?’’ ఉత్సాహంగా రెట్టించాడు ఏకాంబరం.
‘‘ప్లేయింగ్ కార్డ్స్’’ తాపీగా బదులిచ్చాడు పీతాంబరం.
తెలుగుబాబు
అటుగా వెళ్తున్న జోగినాథానికి స్కూల్ గేటు ముందు బెంచీపైన ఒక పిల్లాడు దీనంగా కూర్చుని ఉండడం కనిపించింది.
‘‘ఏం బాబూ .. నిన్ను తీసుకెళ్లడానికి మీ అమ్మా రాలేదా?’’ అడిగాడు జోగినాథం.
‘‘నాకు అమ్మ లేదు’’ చెప్పాడు బాబు.
‘‘నాన్న వస్తారా మరి?’’ బాధపడ్డాడు జోగినాథం.
‘‘నాకు నాన్న లేడు’’ చెప్పాడు బాబు.
‘‘మరి ఎవరొస్తారు?’’ జాలిగా అడిగాడు జోగినాథం.
‘‘మమ్మీడాడీల్లో ఎవరో ఒకరొస్తారు’’ తాపీగా చెప్పాడు పిల్లాడు.
దాచాలన్నా దాచలేవు
సుందరికి సర్జరీ జరుగుతోంది.
‘‘మీ వయసు ఎంత?’’ డాక్టర్.
‘‘22’’ చెప్పింది సుందరి.
‘‘నిజం చెప్పండి. మీ వయసుని బట్టి మత్తు ఇవ్వాల్సి ఉంటుంది’’ అనుమానంగా అడిగాడు డాక్టర్.
‘‘32’’ పదేళ్లు పెంచింది సుందరి.
‘‘వయసు తేడా చెబితే, మత్తు పనిచెయ్యదు. సర్జరీ మధ్యలోనే మెలుకువ రావచ్చు. అది మరీ ప్రమాదం’’ ఇంకా నమ్మలేదు డాక్టర్.
‘‘46’’ నమ్మకంగా చెప్పింది సుందరి.
నమ్మాడు డాక్టర్.