పేజీ సంఖ్య - 78

నో ఆనవాలు

‘‘సార్‌, మీరు అర్జెంటుగా రావాలి. మన నగల షాపులో దొంగతనం జరిగింది’’ ఫోన్లో చెప్పాడు సెక్యూరిటీ.

‘‘నువ్వేం చేస్తున్నావు .. నిద్రపోతున్నావా? సీసీ కెమెరాలున్నాయి కదా ... గుర్తుపట్టండి’’ కోపంగా అరిచాడు యజమాని.

‘‘వాడు సీసీ కెమెరాలు కూడా పట్టుకుపోయాడు సార్‌’’ ఆవలిస్తూ చెప్పాడు సెక్యూరిటీ.


అనుభవసారం

‘‘ఒక మగవాడు ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకుంటే ఇబ్బందుల్లో పడతాడట నిజమేనా మాస్టారూ?’’ అడిగాడు శిష్యుడు.

‘‘ఇబ్బందుల్లో పడ్డానికి ఇద్దరెందుకు నాయనా?’’ తల తడుముకుంటూ బదులిచ్చాడు గురువు.


నగల మాటేంటి మరి?

‘‘నువ్వు నిర్దోషివని రుజువైంది. నిన్ను విడుదల చేస్తున్నాం. నువ్విక హాయిగా ఇంటికి వెళ్లవచ్చు’’ తీర్పు చెప్పాడు జడ్జి.

‘‘అలాగే బాబయ్యా ... మరయితే నేను దొంగిలించిన నగల్ని నా దగ్గరే ఉంచుకోవచ్చా?’’ అమాయకంగా ప్రశ్నించాడు ముద్దాయి ఏడుకొండలు.


విశ్వాస గార్దభర

‘‘ఎవరైనా కుక్కని వెంట పెట్టుకుని తిరుగుతారు కానీ, నువ్వేంటి గాడిదని వెంటేసుకు తిరుగుతున్నావు?’’ నవ్వుతూ అడిగింది సునంద.

‘‘నాకు వచ్చిన ప్రేమలేఖలన్నీ ఇదే తిన్నది. ఆ విశ్వాసంతో నా తిరుగుతోంది’’ తాపీగా చెప్పింది అపర్ణ.


ఆవలిస్తే ... లెక్కట్టెగలను

‘‘మీరు కండక్టర్‌గారి అబ్బాయా?’’ అడిగాడు బిచ్చగాడు.

‘‘అవును. నీకెలా తెలిసింది?’’ ఆశ్చర్యపోయాడు శ్రీగంధం.

‘‘మీ జేబునిండుగా చిల్లర గలగలమంటేనూ ...’’ నసిగాడు బిచ్చగాడు.


అమ్మయ్య ... సాధించాను

‘‘ఎట్ట్టకేలకు నా పేషంట్‌ చేత గోళ్లు కొరికే అలవాటు మానిపించానోయ్‌’’ గొప్పగా చెప్పాడు డాక్టర్‌ వివేకం.

‘‘నిజమా? చాల్రోజుల్నించి ఆ అలవాటు మాన్పించే ప్రయత్నం చేస్తున్నావు కదా .. ఇప్పుడెలా సాధ్యపడిందోయ్‌?’’ అనుమానంగా అడిగాడు మిత్రుడు శ్రీముఖం.

‘‘ఒక డెంటిస్టు సాయంతో ఆ పేషంటు పళ్లన్నీ ఊడ బీకించానోయ్‌’’ కాలరెగరేశాడు వివేకం.


నాకంటే గొప్పోడేం కాదు

‘‘ఏమండోయ్‌ ...ఇది విన్నారా? ఆ సన్యాసెవడో ఆకలికి తట్టుకోలేక పచ్చిగడ్డి తిన్నాడట’’ ఆశ్చర్యంతో చెప్పింది ఆండాళ్లు.

‘‘అందులో వింతేముంది? నేను రోజూ తినట్లా’’ ఠపీమని బదులిచ్చాడు సచ్చిదానందం.


డాక్టరు సలహా

‘‘అదేంటమ్మా ... పెన్ను పక్కన పెట్టి రీఫిల్‌తో రాస్తున్నావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు బాస్‌ జోగినాథం.

‘‘నేను ఆరో నెల ప్రెగ్నెంట్‌ సార్‌ - డాక్టరుగారు బరువులు ఎత్తొద్దన్నారు’’ సిగ్గు పడుతూ చెప్పింది స్టెనో సుకుమారి.


కొత్తమాలోకం

ఒక గంట తర్వాత -

‘‘వెళ్లొచ్చాను సార్‌, అక్కడ యెల్లో, రెడ్‌ రంగుల టికెట్లు తప్పించి బ్లాక్‌ టికెట్లు అమ్మటం లేదు’’ సెల్యూట్‌ కొట్టి అటెన్షలో నిలబడి చెప్పాడు కొత్త కానిస్టేబుల్‌.


అంతా ప్రేక్షకుల దయ

‘‘మీరు తీస్తున్న సినిమా ట్రాజెడీయా? కామెడీయా?’’ అడిగాడు విలేకరి.

‘‘ముందే ఎట్టా తెలుస్తుందయ్యా? విడుదలయ్యాక హిట్టయితే కామెడీ, ఫట్టయితే ట్రాజెడీ’’ తడుముకోకుండా చెప్పాడు నిర్మాత.


శకునం చూడొద్దా?

‘‘వేటకు బయల్దేరి వెంటనే వచ్చేశావేం’’ అనుమానంగా అడిగింది పెళ్లాం పిల్లి.

‘‘గుమ్మం దాటగానే నల్లటి మనిషి ఎదురొచ్చాడు ... కాస్సేపయ్యాక వెళ్తాలే’’ చెప్పింది మొగుడు పిల్లి.


జన్మ జన్మల బంధం

‘‘ఆ వెంకట్‌గాడు రోజూ నా వెంట పడుతున్నాడు ... అర్థం కావటం లేదే’’ వాపోయింది సరోజ.

‘‘ఇందులో అర్థం కాకపోవడానికేముందే ... పూర్వజన్మలో వాడు కుక్కగా, నీవు దాని యజమానిగా పుట్టి ఉంటారు’’ తేలిగ్గా కొట్టేసింది హిమజ.


వార్నింగ్‌

‘‘నేను సెల్‌ ఫోన్‌ అయితే .. నీవు సిమ్‌ కార్డువి’’ గోముగా అంది రాధ.

‘‘యురేకా ...’’ పిడికిళ్లు బిగించి అరుస్తూ ముద్దివ్వబోయాడు మదన్‌.

‘‘ఓవర్‌ యాక్షన్‌ చేస్తే సిమ్‌ కార్డు మార్చేస్తా జాగ్రత్త’’ వార్నింగ్‌ ఇచ్చింది రాధ.


కనిపించని బాటిల్‌

‘‘టైరు ఎలా పంక్చరయ్యింది?’’

‘‘కారుని ఒక మందు బాటిల్‌పై నుండి నడిపాను’’

‘‘మరి మందు బాటిల్‌ ఏది?’’

‘‘అది ఆ తాగుబోతు జేబులో ఉండి పోయింది’’


రివర్స్‌ గేర్‌

‘‘అమ్మా ... బిచ్చం తల్లీ’’ అరిచాడు రోజూ వచ్చే బిచ్చగాడు.

‘‘హమ్మయ్య వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా .. అనుకోకుండా మా అత్తింటి బంధువులొచ్చారు. ఇప్పుడు నాకు వండే ఓపిక లేదు. నీ జోలెలో ఉన్న అన్నం, కూరలు అరువివ్వు. రేపు వడ్డీతో సహా ఇస్తాలే’’ ఖాళీ గిన్నెలు ముందుంచి బిచ్చగాడిని అర్థించింది అలివేలు.


గోడ తగవు

స్వర్గానికి, నరకానికి మధ్య ఉన్న గోడ కూలిపోడానికి సిద్ధంగా ఉందని, ఇరు పక్షాల వారు సమావేశమయ్యారు.

‘‘నరకవాసుల వల్లే గోడ బీటిచ్చింది ... మీరే పునర్నిర్మించాలి’’ అన్నారు స్వర్గవాసులు.

‘‘మాకు సంబంధం లేదు. కావాలంటే కోర్టులో కేసు వేద్దాం’’ అన్నారు నరకవాసులు.

‘‘మాకు న్యాయం జరగదు. లాయర్లంతా నరకంలోనే ఉన్నారు’’ చెప్పారు స్వర్గ వాసులు.


మనిషిన్నాక కృతజ్ఞత ఉండాలే ...

రమ, సుమ పార్కులో ఉండగా ఒక బిచ్చగాడు ఎదురై ‘‘ధర్మం చెయ్యండమ్మా’’ అని అడిగాడు.

రమ వెంటనే పర్స్‌లోంచి ఐదు వందల రూపాయల నోటు తీసి వేసింది.

‘‘పిచ్చెక్కిందా నీకు, అది ఐదు రూపాయలనుకున్నావా?’’ ఆశ్చర్యపోయింది సుమ.

‘‘తెలిసే వేశాను .... గతంలో అలాంటి ఐదు వందల నోట్లు నాకోసం ఎన్నో ఖర్చుపెట్టాడతను’’ తాపీగా చెప్పింది రమ.


పోలీసుల్లో మాలోకం

జైలు ఆవరణలో కంగారుగా తిరుగుతున్నాడు కానిస్టేబుల్‌ సుబ్బారావు.

‘‘ఏంటయ్యా ... మరీ అంత కంగారు పడుతున్నావు?’’ అప్పుడే డ్యూటీకి వచ్చిన షిఫ్ట్‌ కానిస్టేబుల్‌ జోగారావు అడిగాడు.

‘‘రాత్రి ఖైదీలతో పాండవ వనవాసం నాటకం వేయించాను. పాండవుల వేషం వేసిన ఖైదీలు వనవాసానికి వెళ్లొస్తామని చెప్పి వెళ్ల్లారు. ఇంకా రాలేదని ...’’ తల గోక్కుంటూ చెప్పాడు సుబ్బారావు.


పిల్లి ... తల్లి ... ఒక పిల్ల పిడుగు

‘‘అది మధ్యాహ్నం దేవుడి దగ్గరకి వెళ్లింది కన్నా ... ’’ బాఽధగా చెప్పింది సునంద.

‘‘చనిపోయిన పిల్లిని దేవుడు ఏం చేసుకుంటాడు మమ్మీ?’’ ప్రశ్నించాడు బాబు.


మీ ఆవిడ కంట్లో పడకుండా

‘‘మీకు పెళ్లయిందా?’’ అడిగాడు టైలర్‌ అప్పారావు.

‘‘కాలేదు .... ఎందుకూ?’’ ఆశ్చర్యపోయాడు వివేక్‌.

‘‘ఏం లేదు, పెళ్లయితే సీక్రెట్‌ పాకెట్‌ కుడదామని’’ చెప్పాడు టైలర్‌ అప్పారావు.


ప్రయోజన విద్య

‘‘మీ తాతయ్య వయోజన విద్య ఎంతవరకు వచ్చిందిరా?’’ అడిగాడు సుందరం.

‘‘పక్కింటి బామ్మకి ప్రేమలేఖ స్వయంగా రాసుకునేదాకా’’ చెప్పాడు గోవిందం.


మహా పొదుపు

‘‘పెళ్లిచూపుల్లో అమ్మాయి గొప్ప పొదుపరి అంటే సంతోషించి ఒప్పుకున్నారా’’

‘‘మంచిదేగా ... ఈ ఏడుపు ఎందుకు?’’

‘‘బ్లేడుకు డబ్బు వృథా ... కత్తిపీటతో గడ్డం చేసుకోమంటోంది’’


అప్పన్న తెలివిడి

‘‘అదేంట్రా ... మళ్లీ ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నావు దేవుడ్ని?’’ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.

‘‘మాపెద్దమ్మాయి గౌన్లు పొట్టయిపోతున్నాయిరా. చూస్తూ చూస్తూ వాటిని పారేయలేం కదా’’ చెప్పాడు అప్పారావు.


లోకమంతా పచ్చదనమే

‘‘ఆవులకు ఆకుపచ్చ కళ్లజోళ్లు తగిలించండి ... ఫలితం ఉంటుంది ... నెక్ట్స్‌ కాల్‌’’ తన ధోరణిలో చెప్పి పళ్లు ఇకిలించాడు పశు వైద్యాకారి.


ఇంటి కన్నా బస్సు పదిలం

‘‘ఈ బస్సు ఎక్కడికెళ్తుంది కండక్టరు గారూ?’’ అడిగాడు ఆసామి.

‘‘మీరెక్కడికెళ్లాలో చెప్పండి?’’ చిరాగ్గా అన్నాడు కండక్టర్‌.

‘‘ఎక్కడికీ లేదు. బస్సు ఇక్కడే కాసేపు ఉండే పనయితే వెనకసీట్లో ఓ గంటసేపు నడుం వాలుద్దామని’’ చెప్పాడు ఆసామి.


రోగం కుదిరించా

‘‘ఈ రోజు మీకోసం అరడజను చేతి రుమాళ్లు కొనుక్కొచ్చా’’ ప్రేమగా అంది సుమ. ‘‘మరీ ఖరీదైనవి తీసుకురాలేదు కదా...’’ కాఫీ సిప్‌ చేస్తూ అడిగాడు భాస్కర్‌. ‘‘అంత తెలివి తక్కువ దాన్నా? ఫ్రీగా వచ్చాయి కాబట్టి తెచ్చాను’’ ‘‘ఫ్రీగానా?’’ సంతోషించాడు భాస్కర్‌. ‘‘అవును. పది వేలు పెట్టి పట్టుచీర కొంటే ఆ రూమాళ్లు ఫ్రీగా ఇచ్చారు’


ఆ ఛాన్సు మీదే ...

భర్తకు ప్రత్యేకంగా ఆర్గానిక్‌ కూరగాయలు కొందామని మార్కెట్‌కు వెళ్లింది శ్రీప్రియ.

‘‘ఇవి ఆర్గానిక్‌ కూరగాయలేనా?’’

కొత్తగా వచ్చిన సేల్స్‌ బాయ్‌కి శ్రీప్రియ మాట అర్థం కాక తల గోక్కున్నాడు.

‘‘క్రిమి సంహారక మందులేమీ వేయలేదా అని అడుగుతున్నా’’ మళ్లీ చెప్పింది ఆమె.

‘‘వేయలేదు మేడం ... మీరే వేసుకోవాలి’’ తడబడుతూ బదులిచ్చాడు కుర్రాడు.


ముసలోడి తెలివి

రామయ్యకు బ్రహ్మ చెవుడు. ఆపరేషన్‌ చేయించుకున్నాడు. కొంత కాలం తర్వాత ఆపరేషన్‌ చేసిన డాక్టరు తారసపడి అడిగాడు -

‘‘రామయ్యా .. ఇప్పుడు బాగా వినబడుతోందా?’’

‘‘బ్రహ్మాండంగా ...’’

‘‘మీ ఇంట్లో వారు సంతోషించి ఉండాలే’’

‘‘వాళ్లకు ఆపరేషన్‌ సంగతి తెలీదు’’.

‘‘ఎందుకు చెప్పలేదు?’’

‘‘నా గురించి ఏమనుకుంటున్నారో వినాలని’’.

‘‘ఏమనుకుంటున్నారు మరి?’’

‘‘మీరే అర్థం చేసుకోండి ... ఇప్పటికే ఆరుసార్లు నా వీలునామా మార్చి రాశాను’’.


పెళ్లంటే ఇంతేనా?

పెళ్లి గురించి ఎంత చెప్పినా అర్థం కాలేదు బంటికి. తండ్రి పెళ్లి ఆల్బమ్‌ చూపిస్తూ వివరించాడు. ఫోటోలు చూశాక ‘‘ఓహో ... మమ్మీ మనింట్లో పని చేయడానికి వచ్చిన రోజా’’ ఆరిందాలా అడిగింది బంటి.


మనసులోని కోరిక

‘‘డాడీ ... సర్కస్‌కి వెళ్దాం’’ అడిగాడు నాలుగేళ్ల బాబు.

‘‘ఏముంటుందిరా అందులో ...’’ పెదవి విరిచాడు తండ్రి.

‘‘ఏనుగులున్నాయట డాడీ’’

‘‘అబ్బే .. ఏనుగుల్ని ఏం చూస్తాం రా?’’

‘‘అవి ఫుట్‌బాల్‌ ఆడతాయంట డాడీ’’

‘‘అబ్బే ... బోర్‌’’

‘‘షార్ట్స్‌ వేసుకున్న అమ్మాయిలు ఆ ఏనుగుల్ని ఆడిస్తారంట’’

‘‘సర్లే ... వెళ్దాం పద. సర్కస్‌ చూడక చాలా ఏళ్లయింది’’


మెంటల్‌ కేస్‌

‘‘ఈ కట్‌ డ్రాయర్‌ ఎంత?’’

‘‘అరవై రూపాయలు’’

‘‘వేసుకుని చూడొచ్చా?’’

‘‘కట్‌ డ్రాయరా ... సరే, చూసుకో’’

కొద్ది సేపు తర్వాత -

‘‘సరిగ్గా సరిపోయింది’’

‘‘ఐతే ప్యాక్‌ చేయిస్తాను’’

‘‘ఇది వేసుకున్నది కదా ... మరొకటి చేయించండి’’


నేను మేధావి నవుతా

‘‘పిల్లలూ .. మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో ఒక కాగితం మీద రాయండి’’ చెప్పింది టీచర్‌ మీనాక్షి.

కలెక్టరు, ఇంజనీరు, డాక్టరు, శాస్త్రవేత్త ... ఎవరికి తోచింది వాళ్లు రాస్తుండగా -

‘‘ష్‌ .. ’’ మెల్లిగా పిలిచాడు చింటు.

‘‘ఏంటీ?’’ అంతే మెల్లగా అడిగింది అమ్ములు.

‘‘మేధావిలో ‘ధ’కు పొట్టలో చుక్క ఉంటుందా?’’


జన్మహక్కు

‘‘బాధ్యత, హక్కు గురించి రెండు ముక్కల్లో చెప్పండి’’ అడిగాడు క్లాసు టీచర్‌ పీతాంబరం.

‘‘పాఠం చెప్పడం మీ బాధ్యత. వినడం, వినకపోవడం మా హక్కు’’ వెనక బెంచీ నుండి ఠపీమని వచ్చింది సమాధానం.


ఓస్‌ ... ఇంతేనా?

‘‘ఈ రోజు అమ్మా నాన్న ఆట ఆడుకుందాం’’ అమ్ములు.

‘‘నాకు రాదుగా’’ బుజ్జిగాడు.

‘‘ నేను చెబుతాగా. నువ్వు పేపర్లూ పుస్తకాలూ నాపైకి విసురు. నేను గ్లాసులూ గిన్నెలూ నీ మీదకి విసురుతాను. కాసేపయ్యాక నువ్వు తలుపు దఢేల్‌మని లాగి బజారుకెళ్లు. నేనేమో ఈ చిన్నూగాడి వీపు పగలగొడతాను .. ఇంతే’’ చెప్పింది అమ్ములు.


తెలివైన నాన్న

‘‘దారుణమైన మోసం జరిగిపోయింది మామా’’ భోరుమన్నాడు అఖిల్‌.

‘‘ఏమైందిరా?’’ అడిగాడు సునీల్‌.

‘‘పుస్తకాలు కొనాలి డబ్బులు పంపమని ఫోన్‌ చేస్తే, పుస్తకాలు కొని పంపించాడు మా అయ్య’’ మళ్లీ భోరుమన్నాడు అఖిల్‌.


ఆయన చేతిలో లేదు

‘‘గత పదేళ్లుగా కఠోర తపస్సు చేస్తున్నా ... దేవుడు ప్రత్యక్ష్యం కావటం లేదు స్వామీ?’’ అడిగాడు జూనియర్‌ స్వామి.

‘‘ఏం కోరుకుందామని ఈ తపస్సు?’’ కళ్లు విప్పి అడిగాడు సీనియర్‌ స్వామి.

‘‘ధరలు తగ్గించమని అడుగుతా’’ నిజాయితీగా చెప్పాడు జూనియర్‌.

‘‘ఈ జన్మలో నీకు దేవుడు ప్రత్యక్షం కాడు’’ మళ్లీ కళ్లు మూసుకుంటూ అన్నాడు సీనియర్‌.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -78

Responsive Footer with Logo and Social Media