పేజీ సంఖ్య - 76

స్వయంకృతాపరాధం

ఒకసారి మనిషి దేవుడ్ని అడిగాడు.

ఆడపిల్లలంతా ఇంత అందంగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారే ... భార్యలు మాత్రం ఎందుకంత కోపంగా ఉంటారు?

దేవుడు ఇలా జవాబిచ్చాడు.

ఆడపిల్లల్ని నేను తయారుచేస్తాను. భార్యల్ని మీరు తయారు చేస్తారు. అదే తేడా


మిస్డ్‌కాల్‌ నెం. 25

‘‘నా పేరు దైవాధీనం కదా. నీ సెల్‌ ఫోన్లో ఎం.ఎఫ్‌.25 అని ఫీడు చేసుకున్నావేం?’’ ఆశ్చర్యంగా అడిగాడు దైవాధీనం.

‘‘నాకు మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చేవాళ్లందరి పేర్లూ ఇలాగే ఫీడు చేసుకుంటాను. నా మిస్డ్‌ ఫెలోస్‌లో నీ ర్యాంకు 25’’ చెప్పాడు జ్ఞానానందం.


పీనాసి మొగుడు

‘‘ఏవండీ, నాకు దూరంగా ఉన్నవి సరిగా కనిపించడం లేదు. కంటి డాక్టరు దగ్గరకు తీసుకెళ్లండి’’ వాకిట్లో కూర్చున్న భర్తకు టీ అందిస్తూ చెప్పింది మంగతాయారు.

సుబ్బారావు ఆకాశం కేసి చూపించి ‘‘అక్కడున్నదేమిటి?’’ అడిగాడు.

‘‘సూర్యుడు’’ చెప్పింది మంగతాయారు.

‘‘ఇంతకన్నా దూరం ఏం చూస్తావు? నీ కళ్లు బంగారంలా పనిచేస్తుంటేనూ’’ మందలించాడు సుబ్బారావు.


వేలి ముద్రలు

‘‘దొంగ దొరికాడా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.

‘‘లేదు సార్‌, కానీ ఒక కీలకమైన ఆధారం దొరికింది’’ చెప్పాడు పోలీసు వెంకటస్వామి.

‘‘ఏమిటది?’’ ఆతృతగా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.

‘‘దొంగ వేలిగుర్తులు. నా చెంప మీద’’ చూపించాడు వెంకటస్వామి.


దానికేం పర్వాలేదు

రామారావు డాక్టరు అపాయింట్‌మెంట్‌ కోసం ఫోన్‌ చేశాడు.

‘‘సారీ సార్‌, మరో రెండు వారాల వరకు ఖాళీ లేదు’’ చెప్పింది రిసెప్షనిస్టు.

‘‘ఈలోగా నేను చచ్చిపోతే’’ భయంగా అడిగాడు రామారావు.

‘‘పర్లేదు సార్‌, మీ వాళ్లెవరైనా ఫోన్‌ చేసి ఆపాయింట్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకోవచ్చు’’ చెప్పింది రిసెప్షనిస్టు.


తేడా

‘‘రైలుకీ బస్సుకీ తేడా ఏమిట్రా?’’

‘‘చెప్పి ఆలస్యంగా వచ్చేది రైలు. చెప్పకుండానే ఆలస్యంగా వచ్చేది బస్సు.’’


పరీక్ష పెట్టాను

‘‘నీవు ఈ మధ్య అప్పులు ఎక్కువగా చేస్తున్నావట ఎందుకు?’’ అడిగాడు పాపారావు.

‘‘నా పై ఎంతమందికి నమ్మకం ఉందో తెలుకుందామని’’ చెప్పాడు అప్పారావు.


కక్ష తీరే మార్గమదే!

పెళ్లయిన ఏడాదికే రాణి చావు బతుకుల్లో హాస్పటల్లో చేరింది. చివరి మాటగా భర్తతో -

‘‘మీరు మళ్లీ తప్పక పెళ్లి చేసుకోవాలి. అదీ నా ఫ్రెండ్‌ పద్మను మాత్రమే’’ మాట తీసుకుంది.

‘‘పద్మ అంటే నీకు ఎంత ప్రాణం రాణీ’’ కళ్లు తుడుచుకున్నాడు వెంకట్రావు.

‘‘ఆ దిక్కుమాలిందే నీతో నన్ను పెళ్లికి ఒప్పించింది. అది ఇంతకింతా అనుభవించాలి’’ పైకి అనలేక తల ఊపింది రాణి.


రివర్సయ్యింది

‘‘మా ఆయనకి నిద్రలో నడిచే అలవాటుందని చెబితే మందిచ్చారు గుర్తుందా డాక్టర్‌?’’ అంది సుమతి. ‘‘యా ... ఇప్పుడు ఎలా ఉంది?’’ అడిగాడు డాక్టర్‌ ఉత్సాహం. ‘‘నడకలో మార్పులేదు. గతంలో ముందుకు నడిచేవారు. మీ మందు వాడిన తర్వాత వెనక్కి నడుస్తున్నారు’’ చెప్పింది సుమతి.


ఒక వికెట్‌కి ఒక ఉద్యోగం

‘‘మా హాస్పిటల్లో ఆపరేషన్‌ ఫెయిలై పేషెంటు చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇక్కడే ఉద్యోగం ఇస్తారు తెలుసా?’’ గొప్పగా చెప్పింది నర్స్‌ నాంచారి.

‘‘అసలు సంగతి అదన్నమాట! ఇంత చిన్న హాస్పిటల్లో రోగులకంటే సిబ్బంది ఎక్కువుందేం చెప్మా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను’’ అంది నాంచారి స్నేహితురాలు మయూరి.


సెల్‌ కాపురం

‘‘లతా ... నీకు మీ ఆయనకు ఫేస్‌ టు ఫేస్‌ మాటలు లేవటగా?’’ అడిగింది సుజాత.

‘‘సెల్‌ టు సెల్‌ ఉన్నాయిలే’’ చెప్పింది లత.


క్లూ

‘‘వేమన శతకం రాసిందెవర్రా?’’ అడిగాడు మాస్టారు.

‘‘తెలియదు సార్‌ ’’ చేతులు కట్టుకుని నిజాయితీగా చెప్పాడు బుల్లబ్బాయి.

‘‘నేను అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది చూడు’’ క్లూ అందించాడు మాస్టారు.

‘‘‘శతకం’గారు సార్‌’’ ఠపీమని చెప్పాడు బుల్లబ్బాయి.


గడుగ్గాయి

‘‘ఏం తమాషాగా ఉందా? కీటకాలను గీయమంటే తెల్లపేపరు ఇస్తావా?’’ అరిచాడు డ్రాయింగ్‌ మాస్టారు.

‘‘నేను గీసినవి సూక్ష్మజీవులు సార్‌. కళ్లకు కనిపించవు. భూతద్దంలో చూడాల్సిందే’’ చెప్పాడు విద్యార్థి.


మరి కుళ్లబొడవరా?

‘‘వాళ్ల చేతులు పడిపోను... గొడ్డుని బాదినట్టు బాది వదలారుకదయ్యా. ఇంతకీ ఏం తప్పు చేసావని?’’ ఒంటిమీది దెబ్బలకు వేడి కాపడం పెడుతూ అంది ఆండాళ్లు.

‘‘ఒక చచ్చినోడి ఫోటో తీయడానికి వెళ్లి అలవాటులో పొరపాటుగా స్మైల్‌ ప్లీజ్‌ అన్నాను’’ మూలుగుతూ చెప్పాడు ఫోటోగ్రాఫర్‌ బోసుబాబు.


నిన్ను చూసే ఎక్కాను!

కదుల్తున్న రైల్లోకి హడావిడిగా ఎక్కిన రామ్‌లాల్‌తో ‘‘కళ్లు కనిపించడం లేదా .. ఇది ఆడవాళ్ల పెట్టె’’ అరిచాడు టి.సి. చందన్‌లాల్‌.

‘‘సారీ మేడమ్‌, మీరు అబ్బాయనుకున్నాను’’ సంజాయిషీ చెప్పాడు రామ్‌లాల్‌.


అదీ విషయం!

‘‘ఇంట్లో నా మాటే నెగ్గుతుంది తెలుసా?’’

‘‘అవునా!’’

‘‘మరేఁ ... మా ఆవిడతో వేడి నీళ్లు తెమ్మని చెప్పడం ఆలస్యం .. క్షణాల్లో నా ముందు ఉంచుతుంది’’

‘‘ఇంతకీ వేడి నీళ్లతో నీకేం పని?’’

‘‘వాటితో కడిగితే అంట్ల జిడ్డు బాగా వదులుతుంది’’


మారియానా మజాకా?

టీచర్‌ రమోలా హిస్టరీ పాఠంలో భాగంగా ప్రపంచం మాప్‌ను బోర్డు మీద గీసి ‘‘మారియా ... నీవు వచ్చి ఇందులో అమెరికా ఎక్కడుందో గుర్తించు’’ అంది.

మారియా వచ్చి రూల్‌ కర్రతో అమెరికా ఎక్కడుందో చూపించింది.

‘‘వెరీ గుడ్‌ మారియా ... వెళ్లి నీ సీట్లో కూర్చో’’ అని ‘‘ఇప్పుడు చెప్పండి పిల్లలూ ... అమెరికాను ఎవరు కనిపెట్టారు?’’ అడిగింది రమోలా.

‘‘మారియా ...’’ గొల్లున అరిచారు పిల్లలంతా ఏకకంఠంతో.


కన్నింగ్‌ రోమియో

‘‘ఈ రోజు బాగా గుర్తొస్తున్నావు డార్లింగ్‌. అందుకే రాత్రి 2 దాటినా, ఉండలేక కాల్‌ చేస్తున్నా’’ ముద్దు ముద్దుగా అన్నాడు ప్రియుడు గోవిందు.

‘‘ఇప్పుడే కదా గంటసేపు మాట్లాడి ఫోన్‌ పెట్టేశావు!’’ ఆశ్చర్యపోయింది రశ్మి.

‘‘ఓ ... షిట్‌, మళ్లీ నీకే కాల్‌ చేశానా?’’ ఫోన్‌ కట్‌ చేశాడు ప్రియుడు గోవిందు.


నీచేతి వంటకాదుగా!

సుమతి, సుకుమార్‌లు భోంచేయడానికి హోటల్‌కు వెళ్లారు. సర్వర్‌ మీల్స్‌ తేగానే గబగబ తినబోయాడు సుకుమార్‌.

‘‘ఆగండి ... మర్చిపోయారా? భోంచేసేముందు దేవుడికి ప్రార్థన చేస్తారుగా’’ గుర్తు చేసింది సుమతి.

‘‘ఇది నీ వంట కాదు కదా’’ ముద్ద మింగుతూ చెప్పాడు సుకుమార్‌.


ఇక పెళ్లయినట్టే !

చాలా కాలం తర్వాత మిత్రులు ప్రసాద్‌, రాజేష్‌లు కలుసుకున్నారు. 35 ఏళ్లు దాటినా ప్రసాద్‌కి పెళ్లి కాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు రాజేష్‌.

‘‘ఏం చేసేదిరా ... నాకు నచ్చిన అమ్మాయిలెవరూ మా అమ్మకి నచ్చట్లేదు, మా అమ్మకు నచ్చే గుణాలున్న అమ్మాయేమో దొరకట్లేదు’’ వాపోయాడు ప్రసాద్‌.

‘‘సరే, మీ అమ్మకు నచ్చే గుణాలున్న ఒకమ్మాయి పలానా దగ్గర ఉంది. ప్రయత్నించు’’ అని అడ్రస్‌ చెప్పాడు రాజేష్‌.

మళ్లీ కొంత కాలానికి మిత్రులిద్దరూ కలుసుకున్నారు.

‘‘ఏరా కుదిరిందా?’’ అడిగాడు రాజేష్‌.

‘‘నా పిండాకూడు. ఆ అమ్మాయి మా అమ్మకి బాగా నచ్చింది కానీ ...’’

‘‘మరింకేం ప్రాబ్లమ్‌?’’

‘‘మా అమ్మకి నచ్చింది కదా ... అంచేత మానాన్నకు నచ్చలేదు’’ బోరుమన్నాడు పెళ్లికాని ప్రసాద్‌.


ఐ వాంట్‌ ఎ జాబ్‌!

‘‘నేను స్కూలుకు వెళ్లను’’ చింటూ.

‘‘గాడిదలు కాస్తావా?’’ తండ్రి.

‘‘పని చేస్తా’’ చింటూ

‘‘నీవు చదివిందే యుకేజీ ... పనెవడిస్తాడు?’’ తండ్రి.

‘‘ఎల్‌కేజీ అమ్మాయిలకు ట్యూషన్‌ చెబుతా’’


రాజుగారి తెలివి

‘‘మహారాజా, యుద్ధానికి సిద్ధముగా ఉండమని పక్క దేశపు రాజు ఎస్‌.ఎం.ఎస్‌. పంపించాడు. ఏమి కర్తవ్యం’’ చెప్పాడు మహామంత్రి.

‘‘SMS Failed అని రిప్లయ్‌ ఇవ్వు’’ ఆజ్ఞాపించాడు రాజు.


సింగ్‌కా బేటా

‘‘రేపు సూర్యుడి మీద పాఠం చెబుతాను .... డుమ్మా కొట్టకుండా అందరూ రావాలి’’ పిల్లలకు వార్నింగ్‌ ఇచ్చింది సైన్స్‌ టీచర్‌ ప్రమీల.

‘‘సారీ టీచర్‌ ... అంత దూరం మా డాడీ పంపించడు’’ చెప్పాడు రామ్‌సింగ్‌.


తిక్క శంకరయ్య

‘‘ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు?’’ అడిగాడు శంకరయ్య.

‘‘రూపవతి, గుణవతి, సహనవతి, సాహసవతి ...’’ చెప్పాడు సురేష్‌.

‘‘ఒక్కదానితోనే వేగలేక చస్తున్నా ... నలుగురితో ఎలా వేగుతావురా పిచ్చోడా? ’’ తల కొట్టుకున్నాడు శంకరయ్య.


చేజారిన అదృష్టం

సుందరి, సుబ్బారావులు పార్కుకు వెళ్లారు.

‘‘ఆ చెట్టుకింది చప్టామీద చేతిలో మందు బాటిల్‌తో ... గడ్డం పెరిగిన ఆ మనిషిని చూశారా?’’ భర్త చెవిలో మెల్లగా గొణిగింది సుందరి.

‘‘ఆఁ ... చూశాను. అయితే ... ?’’ భృకుటి ముడుస్తూ అన్నాడు సుబ్బారావు.

‘‘పదేళ్లక్రితం ప్రపోజ్‌ చేస్తే తిరస్కరించాను ... వాడే వీడు’’ గొప్పగా చెప్పింది సుందరి.

‘‘ఎంత ఆనందం కలిగితే మాత్రం ... దానిని పదేళ్లుగా సెలబ్రేట్‌ చేసుకోవడం అంత మంచిది కాదు’’ ఈర్ష్యగా అన్నాడు సుబ్బారావు.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -76

Responsive Footer with Logo and Social Media