పేజీ సంఖ్య - 74
తొందరపడ్డాడు!
‘‘మొదటి భార్య ఉత్తమురాలని నీవే అంటున్నావుగా ... మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకోవలసి వచ్చింది?’’ అడిగాడు సుబ్రావ్.
‘‘ఆ విషయం నేను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది’’ నెత్తి బాదుకున్నాడు అప్రావ్.
దెబ్బకు దెబ్బ
‘‘అన్నయ్యా ... నాయనమ్మ పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తున్నావురా?’’ అడిగింది చెల్లాయి.
‘‘పుట్‌బాల్ ఇద్దామనుకుంటున్నాను’’ చెప్పాడు అన్నయ్య.
‘‘పుట్‌బాల్‌ని 90 ఏళ్ల నానమ్మ ఏం చేసుకుంటుందిరా?’’ కిసుక్కున నవ్వింది చెల్లాయి.
‘‘మొన్నటి నా బర్త్‌డేకి భగవద్గీత ఇచ్చిందిగా మరి?’’ కసిగా చెప్పాడు అన్నయ్య.
దూరాలోచన
‘‘ఆత్మహత్య చేసుకోవడమెలా? పుస్తకం కావాలండి’’ అడిగాడు చెంగల్రావు.
‘‘పుస్తకం ఇస్తాను సరే, దాన్ని ఎవరు రిటర్న్ చేస్తారు?’’ సందేహిస్తూ అడిగాడు లైబ్రేరియన్ చిన్నారావు.
బంధుప్రీతి
తీవ్ర అస్వస్థతతో హాస్పటల్లో చేరిన పెరుమాళ్ల చుట్టూ బంధుగణమంతా మూగింది. అప్పటికే మాట పడిపోయిన ఆయన పక్కనే ఉన్న కూతుర్ని పెన్ను, కాగితం తెమ్మని సైగచేశాడు. ఆ కాగితంపై ఆయాసపడుతూనే ఏదో రాసి బాల్చీ తన్నేశాడు. అంతా గొల్లుమన్నారు. కర్మకాండలన్నీ పూర్తయ్యాక గానీ ఆ కాగితం విప్పి చదవడం కుదర్లేదు వాళ్లకి. అందులో ఇలా ఉంది - ‘‘నా తల దగ్గర కూర్చున్నావిడ తొడకింద ఆక్సిజన్ పైపు నలుగుతోంది. నాకు ఊపిరి ఆడటం లే ....’’
డౌట్
టీచర్ మహాభారతం గురించి క్లాసులో పాఠం చెబుతున్నాడు. ‘‘చెరసాలలో దేవకి, వసుదేవులను కంసుడు బంధించాడు. వాళ్లకు పుట్టబోయే ఎనిమిదవ సంతానంతో తనకు చావు ఉందని ఆకాశవాణి చెప్పింది. మొదటి బిడ్డ పుట్టగానే విషమిచ్చాడు కంసుడు. రెండో బిడ్డ పుట్టగానే పర్వతాల మీదనుండి గిరాటేశాడు. మూడో బిడ్డ ..’’
‘‘సార్, నాదొక డౌట్’’ అడిగాడు రంజిత్.
‘‘అడుగు’’ చెప్పాడు టీచర్.
‘‘చావు తప్పదని తెలిసి కూడా దేవకి వసుదేవులను ఒకే చెరసాలలో ఎందుకు బంధించాడు కంసుడు?’’
‘‘ .........................?’’
ఎవరి పని వాళ్లే చెయ్యాలి
క్రికెట్ గేమ్‌లో విశ్రాంతి సమయం. ధోని, రోహిత్‌ని పెప్సీ తెమ్మన్నాడు. రోహిత్ పెప్సీని ఓపెన్ చేయబోతుంటే వద్దని వారించి దాన్ని సుహాగ్‌కి ఇచ్చాడు ధోని.
‘‘ఏం .. నేను ఓపెన్ చేయకూడదా?’’ చిన్నబుచ్చుకున్నాడు రోహిత్.
‘‘సుహాగ్ ఓపెనర్ .. ఎవరి పని వాళ్లే చెయ్యాలి ’’ చెప్పాడు ధోని.
మాలోకం
‘‘విండో కర్టెన్లకు సరిపడా గుడ్డ ఇవ్వండి’’ అడిగాడు రామ్‌సింగ్
‘‘సైజు చెప్పండి’’ విసుక్కున్నాడు సేల్స్‌మాన్.
‘‘ పొడవు 15 అంగుళాలు, అడ్డం 20 అంగుళాలు.’’
‘‘అంత చిన్న విండోలా?’’
‘‘అవును ... కంప్యూటర్ విండోస్’’ చెప్పాడు రామ్‌సింగ్.
జీవితం, ఒక సినిమా టైటిల్
కాలేజీ - బొమ్మరిల్లు, స్టూడెంట్ - సైనికుడు, క్లాస్ - అప్పుడప్పుడు, ఎగ్జామ్ - అనుకోకుండా ఒకరోజు, క్వశ్చన్ పేపర్ - అపరిచితుడు, మేథమెటిక్స్ - ఘర్షణ, కాపీ - ఒకరికొకరు, స్లిప్ - ఆపద్భాందవుడు, రిజల్ట్ ్స - అదృష్టం, పాస్ - స్టూడెంట్ నెం.1, ఫెయిల్ - అంతులేని కథ, సప్లిమెంటరీ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, ఫస్ట్ ఇయర్ - బుద్ధిమంతుడు, సెకండియర్ - కంత్రీ, థర్డ్ ఇయర్ - పోకిరి, ఫోర్త్ ఇయర్ - దేశముదురు, మార్కులు ఎన్ని - ఆ ఒక్కటీ అడక్కు.
హౌస్‌ఫుల్
‘‘మన పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా రమేష్?’’
‘‘ఈ జన్మలో అది సాధ్యం కాదు సుమా’’
‘‘అదేంటి?’’
‘‘అవును. కిందటి జన్మలో మాటిచ్చిన రమని ఈ జన్మలో చేసుకోబోతున్నాను’’
తండ్రీకొడుకుల సవాల్
‘‘ఉద్యోగం సంపాదించుకునే వరకు నీవు నా ఇంటి గుమ్మం తొక్కితే ఒట్టే’’ కోపంగా అరిచాడు తండ్రి.
‘‘నాకు ఉద్యోగం దొరికాక ఈ ఇంటి గుమ్మం తొక్కితే ఒట్టే’’ శపథం చేశాడు పుత్రరత్నం.
తర్కపోతు
‘‘ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులనూ చెప్పగలడంటారా?’’ అడిగాడు చింటూ.
‘‘నెవ్వర్ ... సందేహం ఎందుకొచ్చింది?’’ ప్రశ్నించింది టీచర్ సుహాసిని.
‘‘మరి ఒక స్టూడెంట్ సబ్జెక్ట్స్‌న్నీ చదవగలడని మీరెలా ఊహించుకున్నారు మరి?’’ నిలదీశాడు చింటూ.
‘ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ’ అనగానేమి?
అప్పారావుకి దారిలో వంద రూపాయలు దొరికాయి. ఆ వందతో హోటల్లోకి దూరి కడుపునిండా తిన్నాడు. బిల్ మూడు వందలయ్యింది. బిల్ కట్టలేదని హోటల్ మేనేజరు అప్పారావుని పోలీసులకి అప్పగించాడు. పోలీసులకి ఆ వంద ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోయాడు అప్పారావు.
ఇంట్లో ఓకే, ఆఫీసులోనే రానిది!
‘‘ఈ మధ్య నిద్రపట్టడం లేదు డాక్టర్ ... మందులు రాయండి’’ అడిగాడు పరాంకుశం.
‘‘మందులు అలవాటైతే మంచిది కాదు. మొదట పరుపు మెత్తగా, దిండు మరీ ఎత్తుగా కాకుండా, కిటికీ కర్టెన్లు లేత రంగులో, గది నీలి రంగు వెలుతురులో, గాలి ధారాళంగా వచ్చేట్లు ఏర్పాట్లు చేసుకోండి. నిద్ర దానంతటదే వస్తుంది. అప్పటికీ నిద్ర పట్టకపోతే మందులు రాస్తాను’’ చెప్పాడు డాక్టర్ గోపి.
‘‘మీరన్నది నిజమే డాక్టర్. కానీ .. ఈ ఏర్పాట్లన్నీ ఆఫీసులో వీలుకాదేమో’’ నసిగాడు పరాంకుశం.
నో ... గ్యాప్
‘‘ఐ లవ్ యూ’’ చెప్పాడు రవితేజ.
‘‘నా చెప్పు సైజు తెలుసా?’’ కయ్యిమంది కీర్తి.
‘‘ఇలా ప్రపోజ్ చేసానో లేదో ... అప్పుడే గిఫ్ట్స్ అడగడం మొదలు పెట్టావా ... దొంగా’’ మురిసిపోయాడు రవితేజ.
ఆజన్మ ఖైదు
‘‘ఆ రమని టీజ్ చేసినందుకు కోర్టు నీకు జైలు శిక్ష విధించిందని విన్నాను ... ఎన్నేళ్లురా?’’ అడిగాడు సుందరం.
‘‘వందేళ్లు’’ వాపోయాడు జోగినాథం.
‘‘అదేంట్రా ... ’’ ఆశ్చర్యపోయాడు సుందరం.
‘‘రమతో నా పెళ్లి ఫిక్స్ చేశాడు’’ బోరుమన్నాడు జోగినాథం.
దొందూ దొందే
‘‘డాడీ ... నా హోమ్ వర్క్ చేసిపెట్టవా?’’
‘‘పోరా ... నేను గిన్నెలు తోముతున్నాను’’
‘‘హోమ్ వర్క్ చేయకపోతే టీచర్ తన్నుద్ది’’
‘‘గిన్నెలు తోమకపోతే మీ మమ్మీ తోలు వలిచిద్ది’’
స్టూడెంట్ నెం. 1
‘‘డాడీ ... ఈరోజు మా కాలేజీకి కొత్త లెక్చరర్ వచ్చాడు’’ చెప్పాడు వినోద్.
‘‘వెరీ గుడ్ ... ఆయన పేరేంటి?’’ అడిగాడు తండ్రి.
‘‘ఇంకా ఆయనకు మేం పేరు పెట్టలేదు డాడీ’’ చెప్పాడు వినోద్.
మాలోకపు జనకుడు
‘‘మనబ్బాయి ఎదురింటి అమ్మాయిని పెళ్లాడతానని మొండిపట్టు పట్టాడండి’’ మొత్తుకుంది ఆండాళ్లు.
‘‘నీ పిచ్చిగాని ... ఈ కాలం పిల్లలు మన మాట వింటారటే ... సరే, వాడు మనసు పడ్డ అమ్మాయితోనే పెళ్లి జరిపిద్దాం’’ పేపరు చదువుతూ సాలోచనగా అన్నాడు ఆనందరావు.
‘‘మీ మతిమరుపు మండా ... మనబ్బాయికింకా పదేళ్లు కూడా నిండలేదండి’’ నెత్తి బాదుకుంది ఆండాళ్లు.
కుటుంబమనగా
‘‘చంటీ, సౌరకుటుంబం గురించి వివరించగలవా?’’
‘‘సూర్యుడు, ఆయన పెళ్లాం, పిల్లలూ ... ’’
ఒకటి తీసేద్దాం!
‘‘ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తోంది డాక్టర్’’ చెప్పాడు సుబ్బులు.
‘‘ఈ జబ్బుకి పెద్ద ఆపరేషనేమీ అక్కర్లేదోయ్, ఒక కన్ను తీసేస్తే సరి’’ చెప్పాడు కంటి డాక్టర్ నేత్రానంద్.
రెండూ కలపాలి
‘‘ఉపకారం అంటే ఏమిట్రా?’’ అడిగాడు మాస్టారు.
‘‘ఉప్పు, కారం కలిపితే తయారయ్యే పదార్ధమండి’’ బాగా ఆలోచించి చెప్పాడు విద్యార్థి.
అమ్మాయిలూ తెలుసుకోండి!
‘ఉన్నోడు ఐ - ఫోన్ కొనిస్తాడు. లేనోడు ఐస్‌క్రీం తినిపిస్తాడు.
కాసులున్నోడు కార్లలో తిప్పుతాడు - పైసల్లేనోడు పానీపూరీ తినిపిస్తాడు
ప్రెజెంటేషన్‌లోనే తేడా - ప్రేమలో కాదు’
అదీ సంగతి
‘‘పరీక్ష ప్యాసయితే బైక్ కొనిస్తానని చెప్పా కదరా. మరెందుకు ఫెయిలయ్యావు?’’ నిలదీశాడు తండ్రి.
‘‘టైమంతా బైక్ నేర్చుకోవడంలోనే అయిపోయింది డాడీ ... చదవడం కుదర్లేదు’’ నిజాయితీగా చెప్పాడు కొడుకు.
ఏది తెలుగు?
‘‘ఇంటర్వ్యూలో ఎందుకు సెలక్ట్ కాలేదురా?’’ అడిగింది అమ్మ.
‘‘కమ్యూనికేషన్ స్కిల్స్ లేవన్నారమ్మా’’ చెప్పాడు కొడుకు.
‘‘తెలుగులో ఏడవరా’’ చిరాకుపడింది అమ్మ.
‘‘భావప్రకటన నైపుణ్యాలు కొరవడ్డాయన్నారమ్మా’’ చెప్పాడు కొడుకు.
‘‘నేను చెప్పమంది తెలుగులో’’ కోపంగా అంది అమ్మ.
దొంగోడి స్వగతం
‘‘మడిసన్నాక కుసింత కళాపోసనుండాలి, ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకీ తేడా ఏటుంటదనే రావుగోపాల్రావు డైలాగ్ గుర్తుకొచ్చి, 64 కళల్లో చోర కళ కూడా ఒకటి కదా, సరే దాన్ని పోషిద్దాం అనుకున్నాను. పోలీసోళ్లు బొక్కలో తోసి గొడ్డుని బాదినట్టు బాదారు .. ఎందుకు చెప్మా?!’
తారుమారు
‘‘నీ మేజోళ్లు ఒకటి తెలుపు, మరొకటి నలుపు. ఇంటికి వెళ్లి మార్చుకొని రా’’ చెప్పింది టీచర్.
‘‘లాభం లేదు టీచర్ ... ఇంటి దగ్గర కూడా ఒకటి తెలుపు, మరొకటి నలుపు సాక్సులే ఉన్నాయి’’ చెప్పాడు రామ్‌సింగ్.
అసలైన బుద్ధూ
‘‘దొంగ నీ సెల్ ఫోన్ తీసుకుని పారిపోతుంటే అలా నవ్వుతూ నిల్చున్నావేంట్రా?’’ ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధు.
‘‘పిచ్చాడు, సెల్ ఏం చేసుకుంటాడు? ఛార్జర్ నా దగ్గరే ఉంది’’ నవ్వుతూనే బదులిచ్చాడు బుద్ధు.