పేజీ సంఖ్య - 77

గండం తప్పించారు

‘‘నేను నీ వయసులో ఉండగా చిత్తుకాయితాలు ఏరుకుని లక్షాధికారినయ్యాను తెలుసా?’’ ఫేస్‌బుక్‌లో ఛాటింగ్‌ చేస్తున్న కొడుకుతో అన్నాడు వీరభద్రయ్య.

‘‘థాంక్‌ గాడ్‌ ... మంచి పని చేసారు. లేకపోతే ఇప్పుడు నేను చిత్తుకాగితాలు ఏరుకోవలసి వచ్చేది’’ లాప్‌టాప్‌ నుండి తల తిప్పకుండా జవాబిచ్చాడు అఖిలేష్‌.


తిక్క కుదిరిందా?

‘‘నీకు హనుమంతుడు తెలుసా?’’

‘‘ఆయ్‌ ... గుళ్లో చూడ్డమేనండి. బయటంతగా పరిచయం లేదు’’


ప్రేమ బంధమూ ... ఎంత మధురమూ!

‘‘వేణూ .. నేను నీకు దక్కనేమోనని భయంగా ఉంది. మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు’’ బేలగా అంది సుమ.

‘‘నా కోసం విచారించకు సుమా ... నాకు మా అక్కకూతురు రెడీగా ఉంది’’ క్యాజువల్‌గా చెప్పాడు వేణు.


ఎలా గుర్తించడం?

‘‘ఏమండీ ... నేను బెండకాయ, వంకాయ కూరలు తప్పించి మరేవీ వండలేనండి’’ కొత్తగా కాపురానికి వచ్చిన శ్యామల భోజనం వడ్డిస్తూ గోముగా అంది.

ముద్ద గుటకేస్తూ ‘‘ఇంతకీ ఆ రెండిట్లో ఇదేం కూర?’’ మిడిగుడ్లతో అడిగాడు మోహన్రావు.


అదీ సంగతి!

‘‘మొన్న వేటకి వెళ్లినప్పుడు పెద్దపులి చెవులు ఒకే దెబ్బకి నరికేశాను’’ మీసం మెలేస్తూ చెప్పాడు శూరసేనుడు.

‘‘మరి తల నరకలేదా?’’ తెల్లబోయాడు సేనాధిపతి విక్రమాదిత్య.

‘‘దాన్ని ముందే నరికేశాడెవడో’’ పిడికిలి బిగించాడు శూరసేనుడు.


ఒత్తు ఒక్కటే తేడా!

‘‘ఒకటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు’’ గోడకు కొట్టిన బంతిలా వచ్చింది జవాబు.


రాసలీల వేళ రాయబారమేల?

‘‘డాక్టర్‌ని ప్రేమించడం పొరపాటైపోయిందే’’ వాపోయింది సుజాత.

‘‘ఏమయిందే?’’ ఆరా తీసింది హరిత.

‘‘ఆయన రాసే ప్రేమలేఖలు అర్థంగాక, అస్తమానం మెడికల్‌ షాపు వారితో చదివించుకోవాల్సి వస్తోంది’’ బదులిచ్చింది సుజాత.


ఒకరికి ఖేదం - ఒకరికి మోదం

‘‘సార్‌ ... ‘డబ్బు సంపాదించడం ఎలా?’ అనే మీరు రాసిన పుస్తకం చదివిన తర్వాతే నేను లక్షాధికారిని కాగలిగాను - ధన్యవాదాలు’’ సంతోషంగా చెప్పాడు వీరగంధం.

‘‘ఆ పుస్తకం ప్రచురించడానికి నా ఆస్తంతా అమ్ముకోవలసి వచ్చింది’’ బాధగా బదులిచ్చాడు రచయిత రాజలింగం.


పీనాసి మొగుడు

పెళ్లయిన పదేళ్ల తర్వాత పిచ్చయ్య భార్యతో షికారుకు వెళ్లాడు. దారిలో ఒక మిఠాయి కొట్టు దగ్గర ఆగ‘‘ఏమోయ్‌ ... మరో స్వీట్‌ తింటావా?’’ జేబులోంచి పర్స్‌ తీస్తూ డాబుగా అడిగాడు.

‘‘మరోటా ... ?’’ ఆశ్చర్యపోయింది అలివేలు.

‘‘అప్పుడే మర్చిపోతే ఎట్టా? మన పెళ్లయిన కొత్తలో ఇదే షాపులో నీకు మైసూరుపాక్‌ కొనిచ్చా’’ గుర్తు చేశాడు పిచ్చయ్య.


తిక్క+శంకరయ్య

‘ఇచ్చట పెళ్లికి కావలసిన అన్ని రకాల సరుకులు అమ్మబడును’

ఆ బోర్డు చూసిన శంకరయ్య కొట్టుముందు ఆగి, యజమానితో ‘‘నాలుగు రకాల పెళ్లికూతుళ్లని చూపండి .. నచ్చితే ఒకటి కొంటాను’’ అడిగాడు అమాయకంగా.


వాడనివ్వరసలు

‘‘అదేమిటే ... మీ ఆయన నీ కూడా ఉండి మాటిమాటికి నీ నెత్తిపై నీళ్లు చల్లుతున్నాడు?’’ ఆశ్చర్యపోయింది స్నేహితురాలు రాధిక.

‘‘ నా నెత్తిన కాదు, నా తల్లోని పూలమీద .. పూలకొట్లో పనిచేస్తారులే’’ తాపీగా బదులిచ్చింది మోహిని.


చిత్తభ్రాంతి

‘‘పెళ్లయ్యాక నీ లైఫ్‌లో వచ్చిన మార్పేమిటోయ్‌?’’ అడిగాడు ఆనందరావు.

‘‘పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కతే అప్సరసలా కనిపించేది. పెళ్లయ్యాక మా ఆవిడ తప్పించి తతిమ్మా వాళ్లంతా అప్సరసల్లా కనిపిస్తున్నారు’’ వాపోయాడు భాస్కర్రావు.


బుద్ధి మారలేదు

‘‘ఈ డాక్టరు ఇంతకుముందు హోటలు నడిపినట్టున్నాడ్రా?’’ కసిగా అన్నాడు వెంకట్రావు.

‘‘ఎలా చెప్పగలిగావు?’’ ఆసక్తిగా అడిగాడు అప్పారావు.

‘‘ఇంజక్షన్‌ చేయించుకున్నాక డబ్బుల్లేవన్నానని ఆస్పత్రి బెడ్‌ షీట్లన్నీ నాతో ఉతికించాడు’’ బావురుమన్నాడు వెంకట్రావు.

నిద్దరకు పనికొచ్చిన కథ

‘‘రాత్రి పూట ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కథ చెప్పడం తప్పయిపోయిందిరా’’ చెప్పాడు రచయిత రామారావు.

‘‘ఏమన్నాడు ... కథ నచ్చలేదన్నాడా?’’ అడిగాడు సుబ్బారావు.

‘‘నీవు కథ చెబుతుంటే జోలపాడినట్టుంది. ప్రతి రోజూ వచ్చి నాకు నిద్దరొచ్చేదాకా చెబుతూ ఉండని అన్నాడ్రా’’ బావురుమన్నాడు రామారావు.

పొదుపు అవసరం

‘‘సార్‌, మన సినిమాలో బిచ్చగత్తె పాత్రకి సాదాసీదా మొహం గల అమ్మాయి కావాలి’’ చెప్పాడు డైరెక్టరు.

‘‘ఇప్పటికే బడ్జెట్‌ ఎక్కువై ఏడుస్తుంటే మరొకర్ని ఎక్కడ్నుంచి తెచ్చేదయ్యా? మన హీరోయిన్నే మేకప్‌ లేకుండా చూపించు చాలు’’ చిరాగ్గా సలహా ఇచ్చాడు నిర్మాత భజగోవిందం.


నేటి ప్రేమ

‘‘ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా ... ఈలోగా ప్రేమికుల రోజు జరుపుకోవాలా రాజూ?’’ సందేహంగా అడిగింది రాణి.

‘‘పెళ్లిరోజు వరకు కలిసుంటామంటావా’’ ఠపీమని బదులిచ్చాడు రాజు.


డూప్‌ లేక నేను లేను

‘‘శోభనం రోజే మీ ఆవిడ మిమ్మల్ని చెప్పుతో కొట్టడానికి కారణం?’’ అడిగాడు విలేకరి.

‘‘నాది మొదట్నించి రిస్క్‌ తీసుకునే మనస్తత్వం కాదు. ఎందుకైనా మంచిదని ముందుగా శోభనం గదిలోకి నా డూప్‌ని పంపాను’’ తాపీగా బదులిచ్చాడు సినిమా హీరో.


‘యాడే’ అసలు కారణం

‘‘మన టూ వీలర్స్‌ అమ్మకాలు గణనీయంగా పడిపోవడం వెనకున్న కారణం కనిపెట్టారా?’’ కోపంగా అడిగాడు యజమాని.

‘‘ప్రతి టూ వీలర్‌తో పాటు టూల్‌ సెట్‌కి బదులు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఫ్రీ అనే యాడ్‌ ఇవ్వడం వల్ల’’ నసుగుతూ చెప్పాడు సేల్స్‌మేన్‌.


డబ్బారాయుళ్లు

‘‘మీకోసం గంగాజలంతో కాఫీ చేయించాను. తాగండి’’ చెప్పాడు కోతలరాయుడు.

‘‘అబ్బెబ్బే వద్దు ... నీనిప్పుడే అమృతం తాగి ఇలా వచ్చా’’ బదులిచ్చాడు డాబులరాయుడు.


కంత్రీ మొగుడు

‘‘ఫిల్టర్‌ కాఫీ తయారుచేసుకు వస్తానని వంటింట్లోకి వెళ్లిందా ... గుండె నెప్పి అంటూ కేకేసి కుప్పకూలిపోయింది’’ చెప్పాడు బాబూరావు.

‘‘అయ్యోపాపం .. మీ కష్టం పగాళ్లకైనా రావద్దు. వెంటనే ఏం చేశారు?’’ జాలిగా అడిగాడు సుబ్బారావు.

‘‘ఏం చేస్తాను ... చచ్చినట్టు ఇన్‌స్టెంట్‌ కాఫీ కలుపుకు తాగి, ఆనక అంబులెన్స్‌కి కాల్‌ చేశా’’ చిరాగ్గా చెప్పాడు బాబూరావు.


ఆటోజా ... తప్పింది

‘‘నీ కూతురి పేరు అంబుజా ... వెరైటీగా ఉందే’’ ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి.

‘‘అంబులెన్స్‌లో పుట్టిందని అలా పెట్టాం’’ గర్వంగా చెప్పింది మీనాక్షి.

‘‘నయం ... ఆటోలో పుట్టలేదు’’ నవ్వింది కామాక్షి.


మిత్రలాభం

‘‘ఒరే శీనూ .. నీటముంచినా, పాలముంచినా నీదే భారం’’ దీనంగా అన్నాడు భాను.

‘‘అంత ఖర్చుపెట్టి పాలు తేలేను కానీ, నీట్లో ముంచుతాలే’’ తాపీగా చెప్పాడు శీను.


మాతృప్రేమ

‘‘మా అమ్మాయిని కొట్టకండి టీచర్‌ .. జ్వరమొచ్చిద్ది’’ చెప్పింది సుబ్బలక్ష్మి.

‘‘అల్లరి బాగా చేస్తే తప్పదు మరి’’ నవ్వుతూ అంది టీచరమ్మ.

‘‘అప్పుడు పక్కమ్మాయిని కొట్టండి. మా అమ్మాయి వెంటనే అల్లరి మానేస్తుంది’’ సలహా ఇచ్చింది సుబ్బలక్ష్మి.


చిట్టి తవిక

శ్రీరామ రక్ష - రేపే పరీక్ష

పూనాను దీక్ష - పాసయితే లక్ష

ఫేలయితే రిక్షా - అదే నాకు శిక్ష!


అంతకంటేనా?

‘‘నేను ఏ ధర్మం చేస్తే ప్రజలు నన్ను గౌరవిస్తారంటావు సెక్రటరీ?’’ అడిగాడు మంత్రి పున్నారావు.

‘‘కాలధర్మమండి’’ ఠపీమని సెలవిచ్చాడు సెక్రటరీ.


అసలంటూ ఉండాలిగా ..

‘‘మనూరి గవర్నమెంటు ఆస్పత్రిలో మెదడువాపు వ్యాధి రాకుండా బిళ్లలిస్తున్నారట .. వెళ్లొస్తాను’’ గడపదాటుతూ చెప్పాడు చెంగల్రావు.

‘‘అవి మెదడున్నోళ్ళకేమోనండి ...’’ వెనకనుండి వినిపించింది భార్య గొంతు.


శాంపుల్‌ చూడండి!

‘‘ఈ ఎలకలమందు బాగా పని చేస్తుందా?’’ అనుమానంగా అడిగాడు వీరగంధం.

‘‘అంత అనుమానమైతే కొంచెం తిని చూడండి’’ అలవాటుగా చెప్పాడు దుకాణం యజమాని.


అద్గదీ సంగతి!

‘‘ఏంటయ్యా సర్వరూ ... అన్నం ఇంత నల్లగా తగలడ్డదేం?’’ కోపంగా అరిచాడు సుబ్బారావు.

‘‘మా ప్రొప్రయిటరు బియ్యాన్ని బ్లాకులో కొన్నారటండి’’ తాపీగా బదులిచ్చాడు సర్వర్‌.


నన్నలా పంచుకున్నారు

‘‘మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి, సాయంత్రం నానమ్మ ఇంటికి భోజనానికి వెళ్తున్నావెందుకురా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బంటి.

‘‘మా అమ్మానాన్న పోట్లాడుకుని వాళ్ల వాళ్ల పుట్టిళ్ళకు వెళ్లారు. అందుకే నాకీ తిప్పలు’’ నిట్టూరుస్తూ చెప్పాడు చంటి.


గడసరి అత్త

‘‘ఏంటత్తయ్యా ... ఈ రోజు బియ్యంలో రాళ్లు ఏరకుండానే అన్నం వండుతున్నావు?’’ ఆశ్చర్యంగా అడిగింది కోడలమ్మ.

‘‘ఈరోజు నేను ఉపవాసం కదమ్మా ... ’’ నవ్వుతూ చెప్పింది అత్తమ్మ.


వ్యాపార ప్రకటన

డెంటిస్టు ఏకదంతం తన హాస్పటల్‌ గురించి ఇచ్చిన ప్రకటన ఇది.

‘‘మా హాస్పటల్లో మూడు పళ్లకు పైగా పీకుంచుకున్నవారికి జ్ఞాన దంతం ఫ్రీగా పీకబడును’’


కూల్‌ ఐడియా

‘‘నీ భర్త స్లో పాయిజన్‌తో నిన్ను చంపడానికి ఎత్తువేశాడంటున్నావు .. రుజువేమిటి?’’ అడిగాడు జడ్జి.

‘‘రోజూ ఒక కూల్‌ డ్రింక్‌ తాగమని ఒత్తిడి తెస్తున్నాడు యువరానర్‌’’ చెప్పింది పార్వతి.


నెంబరు చెప్పండి చాలు

ఒక మంత్రి హఠాత్తుగా మరణించడంతో, ఆయన భార్య కఠోర తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమై ‘‘సత్యవంతుడికై పోరాడిన సావిత్రికంటే నీవే గొప్పదానివి. ఇవిగో నీ పతి ప్రాణంబుల్‌’’ అని వరమిచ్చాడు.

‘‘బోడి ప్రాణాలెవడిక్కావాలి? స్విస్‌ బ్యాంకు అకౌంటు నంబర్‌ చెప్పకుండా చచ్చాడు. ఆ నెంబరు చెప్పండి చాలు’’ వరమడిగింది మంత్రిసతి


డబ్బు పోతే తట్టుకోలేను

‘‘ఆపరేషన్‌ చేసేముందు బాధ తెలియకుండా ఇంజక్షన్‌ ఇస్తాను ... కానీ బిల్లు కట్టేప్పుడు కొంత బాధ తప్పదోయ్‌’’ నవ్వుతూ అన్నాడు డాక్టర్‌ పరమహంస.

‘‘అయితే, ఆ ఇచ్చే ఇంజక్షనేదో బిల్లు చెల్లించేప్పుడే ఇవ్వండి డాక్టర్‌’’ బతిమాలాడు భాస్కర్రావు.


ఆ తర్వాత చూపుల్లేవ్‌!

‘‘నాకో మిత్రుడున్నాడు. మా ఇద్దరి మధ్య అరమరికలు లేవు తెలుసా. ఎలాంటి రహస్యాలూ ఉండకూడదని ఒకరి తప్పులు ఒకరం మనసు విప్పి మాట్లాడుకున్నాం’’ చెప్పాడు సుబ్బారావు.

‘‘గ్రేట్‌ .. తర్వాత ఏమయ్యింది?’’ ఆసక్తిగా అడిగాడు అప్పారావు.

‘‘ఆ తర్వాత మేం కలుసుకోలేదు ’’ ఠపీమని బదులిచ్చాడు సుబ్బారావు.


ముందు జాగ్రత్త

‘‘రండి ... నా కారులో లిఫ్ట్‌ ఇస్తాను’’

‘‘ఉండండి ...

దేవుడికి ప్రార్థన చేస్తాను’’

‘‘అంటే నా డ్రైవింగ్‌ పై

నమ్మకం లేదా?’’

‘‘అబ్బే ...

నా ప్రార్థనపై నమ్మకముంది’’


ప్యాసవడం గారంటీ!

‘‘ఈసారైనా ప్యాసవుతానా స్వామీ?’’ చెయ్యి చాపి అడిగాడు సుబ్బులు.

‘‘తప్పకుండా ... కానీ, ఒక పనిచెయ్యాలి’’ చెప్పాడు జ్యోతిష్యుడు.

‘‘ప్యాసవడానికి ఏం చేయమన్నా చేస్తాను ...’’ ఉత్సాహంగా ముందుకు వంగాడు సుబ్బులు.

‘‘పరీక్షల ముందు కనీసం రెండు రోజులైనా చదవాలి’’ తాపీగా చెప్పాడు జ్యోతిష్యుడు.


పాటే జీవితం

‘‘మీ అమ్మానాన్నలు ఏం చేస్తుంటార్రా?’’ అడిగింది పంతులమ్మ.

‘‘పాటలు పాడుతుంటారండి’’ చెప్పాడు బుజ్జి.

‘‘గాయకులని చెప్పాలి ... సరే, ఏం పాటలు పాడుతుంటారు?’’ సవరించి అడిగింది పంతులమ్మ.

‘‘అమ్మ చీటీ పాట, నాన్న వేలం పాటండి’’ ఠపీమని చెప్పాడు బుజ్జి.


అదే ... ఆలోచిస్తున్నాను

‘‘డియర్‌, మనం పెళ్లి చేసుకోడానికి ఇదే మంచి సమయం’’ చెప్పింది సుజాత.

మౌనంగా విన్నాడు సృజన్‌.

‘‘మాట్లాడరేం?’’ రెట్టించింది సుజాత.

‘‘నీవన్నది నిజమే కాని, ఇంత సడన్‌గా మనల్ని పెళ్లాడ్డానికి ఎవరు రెడీగా ఉంటారు సుజీ?’’ నుదురు రుద్దుకుంటూ చెప్పాడు సృజన్‌.


ఎంకి పెళ్లి ... సుబ్బి చావుకి

‘‘డాక్టర్‌, ఇప్పుడు నాకు ఆపరేషన్‌ అవసరమంటారా?’’ దీనంగా అడిగాడు ఆనందరావు.

‘‘అవసరం లేకుండా ఎందుకు చేస్తానయ్యా ... మా అల్లుడికి కారు కొనిస్తానని మాటిచ్చాను మరి’’ తాపీగా చెప్పాడు డాక్టర్‌.


పన్ను దక్కించుకున్నాను

‘‘దొంగ నీ కళ్ల ముందే లక్షల సొత్తు దోచుకుంటుంటే అరవకుండా నోరు మూసుకున్నావెందుకు?’’ గద్దించాడు ఎస్‌.ఐ.

‘‘అరిస్తే నా బంగారపు పన్ను దొంగకి కనిపిస్తుందని’’ చెప్పాడు చెంచయ్య.


నరాలు లెక్కెడతాడేమో!

‘‘మా ఆయన ఆవులిస్తే పేగులు లెక్కపెడతాడే’’ చెప్పింది నీరజ.

‘‘అవునా ... మరి గేదెలిస్తే?’’ ఎద్దేవా చేసింది గిరిజ.


నేను చెప్పలేనండి!

‘‘డాక్టర్‌ మా రాజీకి విపరీతంగా జుట్టు ఊడిపోతోంది’’ చెప్పాడు కృష్ణమూర్తి.

‘‘ఎక్కువగా ఆలోచిస్తే అంతేనయ్యా... మనసు ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పు మీ రాజీకి’’ చెప్పాడు డాక్టర్‌.

‘‘రాజి మా పెంపుడు కుక్కండి’’ కృష్ణమూర్తి.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -77

Responsive Footer with Logo and Social Media