11.రేయ్.. ఎవర్రా మీరంతా?

పంతులు గారు: ఏమయ్యా.. పెళ్లికి అక్షింతలు చల్లమంటే అందరూ కలిసి యూరియా చల్లుతున్నారు, ఏమిటయ్యా ఇదీ?

పెళ్లికొడుకు: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారుగా పంతులు గారూ.. అందుకే బాగా పండాలని నేనే ఇలా సెట్ చేశా!

పంతులు గారు (షాక్ తో): రేయ్.. ఎవర్రా మీరంతా?



12.బంపర్‌ ఆఫర్‌

‘ఏసీ కోచ్‌లో ప్రయాణించేవారి భార్యకు టికెట్‌ ఉచితం’ అని ప్రకటించింది రైల్వేశాఖ.
ఆ స్కీమ్‌తో ఏమేరకు ఫలితాలు వచ్చాయో తెలుసుకునేందుకు, పథకాన్ని
ఉపయోగించుకున్నవారి ఇళ్లకు సిబ్బందిని పంపింది.
తలుపు తట్టిన ప్రతి ఇంట్లోనూ గొడవే! ‘నాకు తెలియకుండా...
ఎప్పుడు, ఎక్కడికి, ఎవరితో వెళ్లావు?’ అని.

13.అనుభవం

ఆఫీసర్‌: మా కంపెనీ కోసం బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తి కావాలి. మీకా లక్షణాలు ఉన్నాయా?!

అభ్యర్థి: నాకంటే బాధ్యతాయుతమైన వ్యక్తి మీకు దొరకడు సార్‌. నేను పనిచేసిన ప్రతి కంపెనీలోనూ, ఏం జరిగినా నాదే బాధ్యత అని తేల్చేవాళ్లు!


14.అంతా టైమ్‌

సుబ్బారావు కారు తోలీ తోలీ అలసిపోయాడు. కాసేపు రోడ్డు పక్కనే నిలిపి
ఓ కునుకు తీసే ప్రయత్నంలో పడ్డాడు. అలా తలవాల్చాడో లేదో.
‘హలో. టైమ్‌ ఎంతయ్యింది?’ అని లేపాడు దారిన పోయే దానయ్య. లేచి
విసుక్కుంటూ ‘నాలుగున్నర’ అని చెప్పి మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు.
మరో పది నిమిషాలకు... ‘మాస్టారూ! టైమ్‌ ఎంతయ్యింది?’ అని అడిగాడు రోడ్డున పోయే రామయ్య.
‘నాలుగూ ముప్పావు’ అని విసుక్కున్నాడు సుబ్బారావు.
ఇలాగే ఉంటే లాభం లేదనుకుని ఓ కాగితం మీద ‘నాకు టైమ్‌ తెలియదు’ అని రాసి అద్దానికి తగిలించి నిద్రపోయాడు.
పది నిమిషాలు గడిచాయో లేదో ఎవరో నిద్ర లేపారు.
‘టైమ్‌ తెలియదన్నావుగా. నాకు తెలుసు. ఐదు గంటలు’ అని చెప్పి
చక్కాపోయాడు, పక్క నుంచి పోయే పాపయ్య.

15.పోయింది

వెంకట్‌: ఉబ్బసం తగ్గడానికి స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తీసి పడుకోమని చెప్పారు కదా!

డాక్టర్: అవును... ఇంతకీ మీ ఉబ్బసం పోయిందా?

వెంకట్‌: లేదు. నా లాప్‌టాప్‌, రోలెక్స్‌ వాచీ మాత్రం పోయాయి.




16.ఓ మిడిల్ క్లాస్ కథ

మా ఇంట్లో ఎలుక పడింది. దాన్ని ఎలా వదిలించుకోవాలో చెప్పవా!
ఏముంది ఓ బోను ఉంచు.
అబ్బే బోను కొనేందుకు నా దగ్గర డబ్బెక్కడుంది?
సరే! ఎలుకల మందు పెట్టు.
అహా... అది చాలా ఖరీదు కదా!
పోనీ పకోడీ పెట్టి, ఎలుక తింటుంటే కొట్టి చంపెయ్యి.
నేను తిండి తినే రెండు రోజులయ్యింది.
కనీసం ఓ ఉల్లిపాయ ముక్కన్నా వాడు.
అమ్మో ఉల్లిపాయలా... బోల్డు రేటు కదా!
ఇంక ఆ ఎలుక ఖర్మ... నీ దరిద్రం చూశాక విరక్తి పుట్టి రెండ్రోజుల్లో
అదే పారిపోతుంది.

17.స్నేహం కోసం...

‘నువ్వు నా ప్రాణస్నేహితుడివి కాబట్టి నా బీరువా తాళాలు నీ దగ్గర ఉంచి
వెళ్తున్నాను’ అంటూ రోహిత్‌ చేతిలో తాళం చెవులు ఉంచి ఊరికి బయల్దేరాడు
కార్తీక్‌. పది నిమిషాల్లో అతనికి రోహిత్‌ నుంచి ఫోన్‌వచ్చింది.
‘పచ్చి మోసం. నువ్వు ఇచ్చిన తాళం చెవులతో బీరువా తెరుచుకోవడం లేదు’ అంటూ.

18.దారి

అభిరాం ఊరికి వెళ్తూవెళ్తూ దారి తప్పిపోయాడు. దిక్కులు చూస్తూ ఉండగా,
దారిన పోయే దానయ్య కనిపించాడు. ‘నక్కలపాలేనికి ఎటు వెళ్లాలో చెబుతారా!’ అని అడిగాడు.
‘నేరుగా ఓ నలభై వేల కిలోమీటర్లు వెళ్తే నక్కలపాలెం వస్తుంది’ తాపీగా చెప్పాడు దానయ్య.
‘అంతదూరం ఉంటుందా! దానికంటే, వెనక్కి తిరిగి వెళ్లిపోవడం నయం’ అంటూ నిట్టూర్చాడు అభిరాం.
‘వెనక్కి తిరిగి వెళ్లేట్లయితే ఓ మూడు కిలోమీటర్లలోనే నక్కలపాలెం
వస్తుంది’ అంటూ జారుకున్నాడు దానయ్య.

19.ఆఫర్

ఏదో కేసులో వీరబాబును ఉరితీస్తున్నారు.
తనని చూసి జైలువార్డెనుకి జాలేసింది. ‘చూడూ! రేపు ఉదయమే నిన్ను ఉరితీసేస్తారు.
ఈలోగా నాతో కలిసి ఓ రెండు పెగ్గులు మందుకొట్టు’ అని ఆఫర్‌ చేశాడు.
‘అబ్బే వద్దులేండి... నేను మందు కొడితే వారం రోజులు హ్యాంగోవర్‌
తగ్గదు’ అంటూ ఆఫర్‌ను తిరస్కరించాడు వీరబాబు.

20.మ్యాన్ హాండ్లింగ్

తన ఇంట్లోకి చొరబడే ప్రయత్నంలో ఉన్న దొంగని చూసి రంగాయమ్మ
చితక్కొట్టేసింది. ఆపై బుద్ధిగా పోలీసులను పిలిచింది. ‘వెరీ గుడ్‌
రంగాయమ్మగారు! మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ ఆ దొంగని మరీ
అంతలా కొట్టకుండా ఉండాల్సింది’ అంటూ పొగడ్తలతో పాటు నసిగాడు ఇన్‌స్పెక్టరు.
‘అబ్బే నిజంగా అలా కొట్టాలనుకోలేదండీ! గేటు దూకి ఇంట్లోకి వస్తున్న
మనిషి మా ఆయనే అనుకున్నాను.
అందుకే చితకామతకా దంచేశాను’ అంటూ సంజాయిషీ చెప్పుకుంది రంగాయమ్మ.

Pagination Example

తదుపరి