పేజీ సంఖ్య - 53
వినబడలేదు!
రత్నం: మీ ఆయనని ఆసుపత్రిలో చేర్చారటగా... ఇప్పుడెలా ఉంది.
పద్మ: బాగానే ఉన్నారు పిన్నిగారు...
రత్నం: ఇంతకీ ఎలా జరిగింది...
పద్మ: అదా... అమ్మతో ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తున్నా. సేమియాలో యాలకుల పొడి వేయమని అమ్మ చెప్పింది, నాకు సరిగా వినబడక ఎలకల పొడి వేశా! అంతే... పిన్నిగారు!
శుద్ధ అనువాదం
‘హోమ్‌డెలివరీ అంటే ఏంటి గురూ?’
‘ఆసుపత్రిలో కాకుండా, ఇంట్లోనే పురుడు పోసుకోవడం!’
లాక్ ప్రాబ్లమ్
భార్య ఉదయాన్నే మంచం మీది నుంచి దిగకుండానే మేకప్ వేసుకుంటోంది.
భర్త: ఒసేయ్... నీకు పిచ్చి పట్టిందా? ఇంకా లేవను కూడా లేదు, అప్పుడే మేకప్ ఏంటి?
భార్య: అబ్బా... మీరు ఆగండీ... నేను నా ఫోన్‌లాక్ ఓపెన్ చేస్కోవాలి. అది నన్ను గుర్తు పట్టట్లేదు!
వీళ్లు మాత్రం మారరు!
పరీక్ష పాసయితే...
అమ్మ: నా బంగారు కొండ!
నాన్న: నువ్వు నా కొడుకువి రా...
ప్రేయసి: ఐ లవ్ యూ రా...
స్నేహితులు: మామా... రారా బారుకి పోదాం!
పరీక్ష ఫెయిల్ అయితే...
అమ్మ: ఎంతసేపు మొబైల్ పట్టుకుని కూర్చుంటావ్?
నాన్న:అస్తమానం టీవీ... టీవీ... ఎప్పుడైనా చదువుకుంటేగా!
ప్రేయసి: వెధవ... నీకు జీవితంలో ఓ లక్ష్యం అంటూ ఉంటే కదా!
స్నేహితులు: మామా... రారా బారుకి పోదాం!
అదీ నమ్మకం
ఏరొనాటికల్ ప్రొఫెసర్లందరూ ఫ్లైట్‌లో కూర్చున్నారు. విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా అనౌన్స్‌మెంట్ వచ్చింది...
‘‘డియర్ సర్స్... సర్‌ఫ్రైజ్ ఏంటంటే...
ఈ విమానం మీ స్టూడెంట్స్ స్వయంగా తయారుచేసింది!’’
అంతే ప్రొఫెసర్లందరూ ఫ్లైట్ దూకేసి పరుగో పరుగు...
ఒక్క ప్రిన్సిపాల్ తప్ప!
ఓ స్టూడెంట్ వచ్చి, ప్రిన్సిపాల్‌ను అడిగాడు... ‘‘మీకు భయం లేదా సార్..?’’
దానికాయన ‘‘లేదు.. నా స్టూడెంట్స్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది... ఈ ఫ్లైట్ స్టార్ట్ అవ్వదని!!!’’ అంటూ సీట్లో నిద్రలోకి జారుకున్నాడు.
రెండూ ఒక్కటే!
భర్త: రాధా... హిప్నాటిజం అంటే ఏమిటి?
భార్య: నాకు తెలిసినంత వరకూ... ఒక వ్యక్తిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని, తను చెప్పినట్లు చేయించుకోవడం.
భర్త: నాన్సెన్స్... తెలియకపోతే తెలియదని చెప్పు. దాన్ని పెళ్లి అంటారు కానీ, హిప్నాటిజం అని ఎందుకంటారు? నువ్వేంచెప్పినా నమ్మేస్తాననుకున్నావా...
శుభ్రత ముఖ్యం
కస్టమర్: హలో మాస్టారు... డెటాల్ సోప్ ఉందా...
దుకాణదారు: ఉంది సార్!
కస్టమర్: నిజంగానే ఒరిజినల్ డెటాల్ సోప్ ఉంది కదా...
దుకాణదారు: అవునండీ... ఒరిజినల్ సోపే ఉంది!
కస్టమర్: అయితే... దాంతో మీ చేతులు శుభ్రంగా కడుక్కుని, ఒక కిలో మైదా పిండి ఇవ్వండి!
సైడ్ బిజినెస్
‘‘నువ్వు తినగా మిగిలిన అన్నం ఏం చేస్తావయ్యా...’’ అడుక్కునేవాడిని అడిగింది కాంతం.
‘‘ఏం చేస్తానమ్మా... మెత్తగా రుబ్బి, ఎండబెట్టి వడియాలు చేసి మార్కెట్లో అమ్ముతుంటాను...’’ సిగ్గుపడుతూ చెప్పాడు భిచ్చపతి.
బీరువా సమస్యలు
ఆడవాళ్లు బీరువా తెరువగానే, వారికి రెండు సమస్యలు ఎదురవుతాయి.
అవి...
బీరువాలో కొత్త బట్టలు లేకపోవడం.
బట్టలు పెట్టడానికి బీరువా సరిపోకపోవడం.
నిజమైన ప్రేమ
పెళ్లి కాకముందు ప్రేయసి పక్కన కూర్చొని చెరువులో రాళ్లేస్తూ మాట్లాడేవాడు.
పెళ్లి చేసుకున్నాక... బియ్యంలో రాళ్లు ఏరుతూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.
వాడంటే రాళ్లకి ఎంత ప్రేమో, మళ్లీ వాడి దగ్గరికే తిరిగి వచ్చేశాయి!!!
ఇలా చెప్పాలి...
భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసు కొచ్చాడు సుబ్బారావు.
భర్త: ఆమ్లెట్ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి.. ఆగు ఆగు.. మరీ అంత పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్ మాడిపోతోంది. తిప్పూ... తిప్పూ.. ఇంకా ఎంత సేపూ.. ఇంకొంచెం ఉప్పు వెయ్యి, అయ్యో అయ్యో... మరీ అంతనా వేసేది...
భార్య: అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజే కొత్తగా చేస్తున్నట్లు ఆ అరుపులేంటి?
భర్త: నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నువ్వు అరిస్తే... నాకూ ఇలాగే మండుతుంది మరి!
(అంటూ నెమ్మదిగా జారుకున్నాడు...)
రహస్యం తెలిసిపోద్ది!
ప్రకాష్ ఎంత కష్టమొచ్చినా ఆఫీస్‌కి సెలవు పెట్టడు. అనగనగా ఒకరోజు
సునీత: ఏమండీ... రేపు సెలవు పెట్టండీ. సరదాగా పిల్లలతో బయటికి వెళ్దాం.
ప్రకాష్: కుదరదు...
సునీత: ఎందుకు?
ప్రకాష్: కుదరదంటే కుదరదు...
సునీత: ఏ... ఎందుకు? మీరు లేకపోతే కంపెనీలో ఏ పనీ జరగదా ఏంటి?
ప్రకాష్: జరుగుతుంది. కానీ నేను లేకపోయినా కంపెనీకి వచ్చే నష్టం ఏమీ ఉండదనే విషయం మేనేజ్‌మెంట్‌కు తెలిసిపోతుంది.
భయపడడం పక్కా!
‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తే ఎవరూ పట్టించుకోరు...
అదే సిగరెట్ ప్యాకెట్ మీద ‘పొగతాగితే లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది’ అని రాయండి. ఒక్కడైనా సిగరెట్ తాగితే ఒట్టు!
కష్టం- సుఖం
‘జీవితంలో కష్టాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. సుఖం మాత్రం వచ్చీ,
పోతూ ఉంటుంది...’
‘అవును స్వామీ... నా భార్య ఎప్పుడూ నాతోనే ఉంటుంది. మరదలు మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటుంది...’
నావి కావు!
పోలీసు: హత్య జరిగిన కత్తిపైన నీ వేలిముద్రలు ఉన్నాయి కాబట్టి నువ్వే ముద్దాయివి..
ముద్దాయి: నేను ఎమ్‌బీఏ చదివాను సార్... వేలిముద్రలు వేయాల్సిన ఖర్మ నాకేంటి...
అప్పు రహస్యం
‘అడక్కుండానే అప్పు ఇస్తున్నావ్. నువ్వు చాలా మంచివాడివి బ్రో’
‘అదేం... లేదు రా! ఇంట్లో డబ్బు ఉంటే నా భార్య షాపింగ్ తీసుకెళ్లమని విసిగిస్తుంది, పోనీ తీసుకెళ్లానా... శారీ సెలక్షన్‌కో రెండు గంటలు, దాని మీద గాజుల సెలక్షనుకో మూడు గంటలు, మ్యాచింగ్ కమ్మలు, బొట్టుబిళ్లలు, అదీ, ఇదీ అని... టైమ్ వృథా, పర్సు ఖాళీ. నీ దగ్గరుంటే సేఫ్‌గా ఉంటుందని!’
అసలు సంగతి
విజయ్: మా ఆవిడకి సర్వమత సమానత్వ భావన కాస్త ఎక్కువరా...
భాస్కర్: ఓ చాలా మంచిదే కదా! మరి ఎందుకురా... ఏడుస్తూ చెబుతున్నావ్...
విజయ్: ఏం మంచిదిరా... దసరా, రంజాన్, క్రిస్మస్... ఇలా ప్రతీ పండగకీ కొత్త బట్టలు కొనమంటే ఎలారా... చచ్చేది?
కొత్త కంప్లైంట్...
పోలీసు: ఏం జరిగిందమ్మా... ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు?
మంగమ్మ: మా పక్కింటి పంకజం మీద. మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గును ఫోటో తీసి, తన ఇంటి ముందు తానే వేసుకున్నట్టుగా ఫేసుబుక్కులో పోస్టు చేసింది. కాపీరైట్ చట్టం ప్రకారం కేసు పెట్టాలని వచ్చా.
మర్మమెరిగిన తండ్రి
రవి: బ్యాంక్ ఎగ్జామ్స్‌కు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలని ఫోన్ చేస్తే, మా నాన్న వెంటనే పంపించాడు రా...
కిరణ్: మీ నాన్న చాలా మంచివాడ్రా. నువ్వంటే ఎంత నమ్మకం!
రవి: డబ్బులు పంపలేదు. పుస్తకాలు కొని పంపించాడ్లే!
రొట్టె విరిగి....
వైవాహిక జీవితంలో అతి పెద్ద జోక్ ఏమిటంటే...
‘‘ఏమండోయ్! నేను మీతో అస్సలు మాట్లాడను... అదే నేను మీకు వేసే శిక్ష’’ అని భార్య మొండికేసి కూర్చోవడం.
అబ్బా అలాగా!
డాక్టర్: నేను తొమ్మిది గంటలకు వేసుకొమ్మంటే, నువ్వు ఆరు గంటలకే మందులేసుకున్నావట.. ఎందుకయ్యా?
పేషెంట్: అంటే సార్... బ్యాక్టీరియాకు సర్‌ప్రైజ్ ఇద్దామని!
పెళ్లిచూపులు
కుమారుడికి సలహాలు చెబుతున్నాడు తండ్రి..
తండ్రి: ఒరేయ్... అసలే నీకు సిగ్గు ఎక్కువ. కాబోయే మామగారు కట్నం కింద బండి ఇస్తానంటే... కారు అడుగు. కూలర్ పెడతామంటే ఏసీ అడుగు... వాచీ పెడతామంటే బ్రాస్‌లెట్ అడుగు... అర్థమైందా?
కొడుకు: అలాగే నాన్నా ... మరి అమ్మాయిని ఇస్తామంటే వాళ్లమ్మనో, అమ్మమ్మనో అడగమంటారా?
(బిత్తర చూపులు చూస్తూ అడిగాడు కొడుకు...)
నా చావుకొచ్చింది
‘‘ఎందుకు ఏడుస్తున్నావ్?’’
‘‘మా ఊర్లో ఏనుగు చనిపోయింది’’
‘‘ఓ... అదంటే నీకు అంత ప్రేమా..?’’
‘‘లేదు...లేదు.
నేను శ్మశానంలో గోతులు తీసేవాడిని. ఇప్పుడు దానికీ నేనే పెద్ద గొయ్యి తీయాలి’’
పెళ్లికానుక
పెళ్లికూతురు లావణ్యకి గిఫ్ట్‌బాక్స్ ఇచ్చి ‘‘ఈ చీర శోభనం రాత్రి మాత్రమే కట్టుకో...’’ అంది లిల్లీ.
ఆ రాత్రి ఎంతో ఆసక్తిగా బాక్స్ విప్పిన లావణ్య అవాక్కయ్యింది... అది ఖాళీ బాక్స్!
చిక్కులమారి హోటల్
పల్లెటూరి పద్మనాభం ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. కొద్దిసేపటికి అతను, వెయిటర్‌తో గొడవ పడుతుండడం చూసి, ఆ రెస్టారెంట్ యజమాని వచ్చి ఏమైందని అడిగాడు.
వెయిటర్: ఏం కావాలి అంటే నూడుల్స్ తెమ్మన్నాడు సార్... తీసుకొచ్చి ఇచ్చాను....
యజమాని: సరే... ఏమైంది మరి... వేడిగా లేవా?
వెయిటర్: కాదు సార్... నూడుల్స్ మొత్తం చిక్కులు పడి ఉన్నాయి.. డబ్బులు కడుతున్నా కదా... చిక్కులన్నీ తీసి ఇమ్మంటున్నాడు.
తింగరోడు
డాక్టర్: దెబ్బ తగిలిన చోట ఈ మందును రెండు పూటలా రాసుకోండి. ఓ పది రోజుల్లో గాయం తగ్గిపోతుంది.
పేషెంట్: నాకు ఈ దెబ్బ మా ఇంటి నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో తగిలిందండీ! రోజూ అక్కడికి వెళ్లి రాసుకోవడమంటే చాలా కష్టం.