సుబ్బుగాడి విచిత్ర నిచ్చెన
మెల్లగా సూర్యుడు ఇంటికి వెళ్తున్నాడు. పిల్లలందరూ పరిగెత్తుకుంటూ పేదరాసి పెద్దమ్మ ఇంటి ముందుకు చేరిపోయారు. రోజు సాయంత్రం అవ్వగానే పెద్దమ్మ చెప్పే మంచి మంచి నీతి కథలు వినడం అందరికి అలవాటు. పిల్లలతో పాటు పెద్దలు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. పేదరాసి పెద్దమ్మ కథలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.
ఇంతలో పెద్దమ్మ ఇంట్లో నుంచి బయటకొచ్చి అరుగు మీద కూర్చుంది. ఆవిడని చూడగానే అప్పటిదాకా అల్లరి చేస్తున్న పిల్లలు టక్కున నిశ్శబ్దంగా మారిపోయారు. ఆ పిల్లలను చూస్తూ పెద్దమ్మ ఓ సారి నవ్వింది. " పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథేంటో తెలుసా...
సుబ్బు గాడి విచిత్ర నిచ్చెన...."
ఆ పేరు వినగానే పిల్లలంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.
"సరే కథలోకి వెళ్తాం అంటూ పెద్దమ్మ కథ చెప్పడం ప్రారంభించింది. ఒక ఊర్లో సుబ్బు అనే అమాయకుడు ఉండేవాడు. కష్టపడి పని చేసేవాడు. కానీ వాడి భార్య గౌరీ మాత్రం గయ్యాళి. తనకు దురాశ ఎక్కువ. ఆకాశంలో మేడలు కడుతూ ఉండేది.
ఇదిలా ఉండగా ఒకరోజు గౌరీ సుబ్బుని సంతలోకి వెళ్లి ఒక కోడి పిల్లని కొనుక్కొని రమ్మంది. సరే అని సుబ్బు సంతలోకి వెళ్లి ఒక మంచి కోడిని కొని ఇంటికి బయలుదేరాడు. కానీ దారిలో ఒక వ్యక్తి దిగులుగా ఎదురయ్యాడు. తనని చూస్తుంటే చాలా పేదవాడు లాగా అనిపించాడు. వెంటనే సుబ్బు తనని చూసి జాలి పడుతూ ఏమైంది అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. నేను చాలా పేదవాడిని. నాకొక భార్య, కూతురు. మా కుటుంబం సరిగా భోజనం చేసి రెండు రోజులు అయ్యింది. ఉదయం నుంచి తిరుగుతున్నా సరే ఒక్క పని కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఇంటికెళ్లి మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు అని బాధపడుతూ చెప్పాడు.
అతని కష్టం విన్న సుబ్బు కరిగిపోయి తన దగ్గరున్న కోడిని ఇవ్వబోయాడు. కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోలేదు.
నేను పేదవాడినే కానీ బిచ్చగాడిని కాదు. ఊరికే తీసుకుంటే అది భిక్షం అవుతుంది అన్నాడు.. అప్పుడు సుబ్బు కాసేపు అలోచించి సరే అయితే ఈ కోడికి బదులుగా మీ ఇంట్లో నీకు అవసరం లేని ఏదైనా వస్తువు ఉంటే అది నాకు ఇవ్వు అన్నాడు.
దానికి ఆ పేదవాడు సంతోషించి సుబ్బుని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇల్లంతా వెతికినా ఏమి ఇవ్వాలో తెలియలేదు. చివరకి అటక మీద వాళ్ళ తాతగారు ఎప్పుటి నుంచో దాచిపెట్టిన నిచ్చెన ఒకటి కనిపించింది. అది తను ఇప్పటిదాకా ఉపయోగించింది లేదు. అది ఇద్దామని అనుకున్నాడు. సరే అని
సుబ్బు ఆ నిచ్చెన తీసుకొని కోడి వాళ్లకు ఇచ్చి ఇంటి బాట పట్టాడు.
ఖాళీ చేతులుతో తిరిగొచ్చిన సుబ్బుని చూసి ఏమైంది అని గౌరి అడిగింది. జరిగింది మొత్తం చెప్పాడు. అది వినగానే గౌరికి పట్టరాని కోపం వచ్చింది. కోడిని తీసుకొని రమ్మంటే అది ఇచ్చేసి ఎందుకు పనికిరాని నిచ్చెన తీసుకొని వచ్చావా. ఈరోజు రాత్రికి నువ్వు బయటే పడుకో అని అరిచేసి తలుపేసింది.
ఆ మాటతో సుబ్బుకి ఏం చేయాలో తెలియక నిచ్చెన పక్కన పెట్టుకొని ఇంటి బయటే పెరట్లో బాధ పడుతూ పడుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అర్థరాత్రి సమయంలో తన కళ్ళ మీద విపరీతమైన వెలుగు ఒకటి పడటంతో మెలుకువ వచ్చింది. లేచి చూస్తే ఆ వెలుగు నిచ్చెన నుంచి వస్తుంది. అది కూడా దాని పొడువు బాగా పెరిగిపోయి నిటారుగా నిలబడింది. చూస్తుంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉంది. అది చూడగానే ముందు ఆశ్చర్యపోయాడు. ఈ నిచ్చెన లో ఏదో మాయ ఉంది అదేదో తెలుసుకుందామని నిర్ణయించుకున్నాడు. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. అలా కాసేపు ఎక్కగా ఎక్కగా సుబ్బు ముందు ఒక చిన్న రంధ్రం కనిపించింది. అందులో నుంచి బయటకు వచ్చాక తెలిసింది అదొక చెట్టు తొర్ర అని.. ఒక్కసారిగా తను వచ్చిన చోటు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయాడు. అది ఒక మాయ లోకం లాగా ఉంది.
అక్కడంతా ఎటు చూసినా చాలా వింతగా ఉంది. తన పక్కనుంచే మేఘాలు వెళ్లిపోతున్నట్టు అనిపించాయి. చుట్టూ పచ్చగా ఏదో అడివిలో ఉన్నట్టుంది. ఇంతలో ఎవరో పెద్దగా అరుస్తున్నట్టు తన వైపు వస్తున్నట్టు అనిపించింది. వెంటనే సుబ్బు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెట్టు చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. అలా వెళ్లే సమయంలో తన జేబులోని చిల్లర కొంచెం ఆ దారిలో పడిపోయింది. కాసేపటికి సుబ్బు కొంతమంది రాక్షసులు ఆ దారిలో రావడం చూసాడు. వాళ్లు చాలా భయంకరంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి తల మీద రెండు కొమ్ములు ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే భయంతోనే ప్రాణం పోయేలా ఉంది.
కానీ విచిత్రంగా వాళ్ళతో పాటు ఒక బంగారు నెమలి కూడా కనిపించింది. ఆ నెమలి దారిలో నడిచే సమయంలో ఇందాక సుబ్బు పారేసుకున్న నాణాలు మీద అడుగు వేసి వెళ్ళింది.
వాళ్లు వెళ్ళేదాకా చెట్టు చాటునే ఉండి, వెళ్లిన తరువాత ఆ నాణాలు తీసుకుందామని వెళ్ళాడు. కానీ
విచిత్రంగా అవి బంగారు నాణాలు గా మారిపోయాయి. అది చూడగానే సుబ్బుకి పట్టరాని ఆనందం వేసింది.
అదే సంతోషంతో ఆ చెట్టు తొర్ర ద్వారా నిచ్చెన చేరి భూమి మీదకు వచ్చాడు. వెంటనే వెళ్లి తన భార్యని నిద్ర లేపి ఆ నాణాలు చూపించాడు. అది చూడగానే గౌరీ కూడా సంబరపడిపోయింది. ఎలా వచ్చాయి అని అడిగితే సుబ్బు జరిగింది మొత్తం చెప్పాడు.
దానికి గౌరీ సరే రేపు మనమిద్దరం అక్కడికి వెళ్తాం అని అంది.
తరువాతి రోజు అనుకున్నట్టుగానే ఇద్దరు తమ జేబుల నిండా నాణాలు తీసుకొని అర్థరాత్రి అవ్వగానే వింత నిచ్చెన ఎక్కి ఆ చెట్టు తొర్ర ద్వారా మాయ లోకం చేరుకున్నారు. తరువాత ఆ నెమలి నడిచే దారి మొత్తం ఆ నాణాలు చల్లారు. అది అయిపోయాక ఇద్దరు ఒక చెట్టు చాటున నిలబడ్డారు. కాసేపటికి మళ్ళీ నిన్నటిలాగానే కొందరు రాక్షసులతో పాటు ఆ బంగారు నెమలి వచ్చింది. వీళ్ళు చల్లిన అన్ని నాణాలు కాకపోయినా కొన్ని నాణాలు మీద నడుచుకుంటూ వెళ్ళింది.
ఆ నెమలి పాదాలు తాకిన ప్రతి నాణం బంగారంలా మారిపోయింది. ఆ రాక్షసులు వెళ్ళిపోగానే సుబ్బు, గౌరీ ఆ బంగారు నాణాలు అన్ని తీసుకొని కిందకి వచ్చేసారు.
అది మొదలు రోజు వీళ్ళు అర్థరాత్రి ఆ మాయలోకానికి వెళ్లడం దారి మొత్తం నాణాలు చల్లడం... వాళ్లు వెళ్ళిపోయాక బంగారు నాణాలు ఏరుకొని రావడం ఇదే తంతు..
కష్టపడకుండా వస్తున్న సొమ్ము కావడంతో ఇద్దరిలో బద్దకం బాగా పెరిగిపోయింది. సోమరిపోతుల లాగా తయారు అయ్యారు. ఒకప్పటిలా సుబ్బు కూడా కష్టపడి పనిచేయడం మానేసాడు.
ఇదిలా ఉండగా ఒకసారి రోజు లాగానే ఇద్దరు మళ్ళీ వింత నిచ్చెన ద్వారా ఆ మాయ లోకానికి చేరుకున్నారు. కానీ ఆ రోజు గౌరికీ ఆ రాక్షసులు రోజు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని అనిపించింది. ఎప్పటి నుంచో అది సుబ్బు మదిలో కూడా ఆ ప్రశ్న ఉండటంతో ఇద్దరు ఆ రాక్షసులకు కనపడకుండా వాళ్ళని వెంబడిస్తూ వెనకాలే వెళ్లారు.
వాళ్లు అలాగే కొంత దూరం వెళ్లారు. అక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ముందు అందరూ చేరి ఏదో పూజ చేసారు. ఆ పూజలో భాగంగానే కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం కూడా చేసారు. అలా కాసేపు చేసిన తరువాత మళ్ళీ వచ్చిన దారిలోనే వెనుతిరిగారు.
అది చూసిన గౌరికీ ఒక దురాలోచన కలిగింది.
ఇలా ఎంత కాలమని రోజు నాణాలు చల్లుకుంటూ, ఏరుకుంటూ బ్రతుకుతాం. రేపు వాళ్లు పూజలో ఉన్నప్పుడు అదేదో ఆ బంగారు నెమలిని ఎత్తుకొని మనతో పాటు కిందకి తీసుకొని పోతే మనం కోరుకున్నంత బంగారం దొరుకుతుంది కదా అని.. అదే ఆలోచన సుబ్బుకు చెప్పింది. సుబ్బు కూడా బంగారానికి ఆశపడి సరే అన్నాడు.
మరుసటి రోజు కూడా ఆ రాక్షసులని వెంబడిస్తూ ఆ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. వాళ్లు ధ్యానం చేస్తూ
కళ్ళు మూయగానే ఇద్దరు కలిసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నెమలిని పట్టుకున్నారు.
వీళ్ళు ఆ నెమలిని ముట్టుకోగానే అది పెద్దగా మనుషులు, మనుషులు అంటూ అరిచింది. అది అరవగానే ఆ రాక్షసులు కళ్ళు తెరిచారు. కోపంగా వీళ్ళ వైపు చూసారు. వాళ్ళని చూడగానే సుబ్బు, గౌరి బయపడిపోయి ఆ బంగారు నెమలిని అక్కడే వదిలేసి పరుగు మొదలుపెట్టారు.
ఆ రాక్షసులు వీళ్ళని చంపడానికి ఆయుధాలతో వెంబడించారు. సుబ్బు, గౌరి ప్రాణ భయంతో వేగంగా పరిగెత్తుకుంటూ చెట్టు తొర్రలోకి దూరిపోయారు. ఆ రాక్షసులకు రోజు వీళ్ళు ఆ మాయ లోకంలోకి ఈ చెట్టు తొర్ర ద్వారా వస్తున్నారు అని తెలుసుకొని దాన్ని శాశ్వతంగా ఒక పెద్ద బండరాయితో మూసేసారు.
బ్రతుకు జీవుడా అనుకుంటూ సుబ్బు, గౌరి ప్రాణాలతో భూమి మీద బయటపడ్డారు.
ఆ తర్వాత ఆ మాయ లోకానికి వెళ్లే దారి లేక రోజు వచ్చే ఆ బంగారు నాణాలు కూడా వాళ్ళ దురాశతో కోల్పోయారు. ఇక చేసేదేమి లేక అప్పటి నుంచి మళ్ళీ కష్టపడి పని చేస్తూ సంపాదించడం మొదలుపెట్టారు.
ఈ కథలో నీతి ఏంటో తెలుసా పిల్లలు" అంటూ పేదరాసి పెద్దమ్మ పిల్లలవైపు చూసింది.
అందరు కలిసి ఒకేసారి దురాశ దుఃఖానికి చేటు ..." అని అరిచారు.
సరిగ్గా చెప్పారు. ఈ కథలో సుబ్బు, గౌరీ తమ దగ్గర ఉన్న దాంతో చాలని తృప్తి పడింటే రోజు బంగారు నాణాలు వచ్చేవి కానీ దురాశతో నెమలినే కాజేయాలనీ చూసారు చివరకు ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు. అదృష్టం బాగుండి తప్పించుకున్నారు..
మీరు కూడా అలా దురాశ పడకండి తరువాత బాధపడకండి. ఇది పిల్లలు ఈరోజు కథ. రేపటి కథతో మళ్ళీ కలుద్దాం.." అని అంది పేదరాసి పెద్దమ్మ.