మదయంతి
అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు. అతనికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడిపేరు యజ్ఞుడు. రెండోవాడిపేరు యజ్ఞకోపుడు. మూడోవాడిపేరు యజ్ఞదత్తుడు. ముగ్గురికీ విద్యాబుద్ధులు నేర్పాడు తండ్రి. యుక్తవయసుకి వచ్చారు వారు. వయసుకి వచ్చిన కుమారులను దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పాడు తండ్రి.‘‘వయసుకి వచ్చిన మగపిల్లలు ఇంట్లో ఉండడం అంటే భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవడమే! అందుకనే చెబుతున్నాను, ఇక ఇల్లు విడిచి, విశాల ప్రపంచాన్ని విడిది చేసుకుని బతకండి. ప్రయోజకులై తిరిగి రండి.’’సరేనన్నారు ముగ్గురూ.
నిత్యకర్మలకు సంబంధించి వస్తువులను మూటగట్టుకున్నారు. ఆ మూటలను భుజాన పెట్టుకున్నారు. చేతికర్రలను పట్టుకున్నారు. బయల్దేరారు. బతుకు గురించీ, భవిష్యత్తు గురించీ రకరకాలుగా ఆలో చిస్తూ ముగ్గురూ మూడు రాదార్ల కూడలికి చేరుకున్నారు. ఒకొక్కరూ ఒకో రాదారిలో నిల్చు న్నారు. అనుకున్నారిలా.‘‘ఏడేళ్ళ తర్వాత ఇదే వేసవి రోజుల్లో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అప్పటికి ఎవరెంత ప్రయోజకులమో తెలుసుకుందాం. అప్పుడే ఇంటికి వెళ్దాం.’’ముగ్గురూ మూడు రాదారుల్లో ప్రయాణించి, ఒకరికి ఒకరు కనుమరుగయ్యారు.పదిరోజులు పాటు ప్రయాణించి ప్రయా ణించి పెద్దవాడు ఓ సైన్యశిబిరానికి చేరుకున్నాడు. సైన్యంలో చేరాడతను. అక్కడ కర్రయుద్ధం, కత్తియుద్ధం నేర్చుకున్నాడు.
యుద్ధవీరుడైనాడు. రాజ్యాలను, ప్రధానంగా కోటలను ఆక్రమించుకునేటప్పుడు యజ్ఞుడిదే ముందడుగు. ఎంత ఎత్తయిన కోటగోడలనైనా ఎక్క గలడతను. దిగడంలో కూడా అతనికి అతనే సాటి. రహస్యంగా కోటలోకి దిగి, కోట తలుపులు తెరిచి, సైన్యాన్ని రప్పించడం, రాత్రికి రాత్రే రాజులనూ, రాజ్యాలనూ స్వాధీనం చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య అయింది యజ్ఞుడికి.రెండోవాడు యజ్ఞకోపుడు నడచి నడచి ఓ రేవు పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ నౌకానిర్మాణకూలీగా జీవితాన్ని ప్రారంభించాడు. నౌకను నిర్మించేందుకు ఎలాంటి కలప పనికి వస్తుంది. ఏ రీతిన వాటిని పలకలుగా చెయ్యాలి. చేసిన తర్వాత వాటిని అమర్చి నౌకను ఎలా రూపొందించాలన్నది బాగా తెలుసుకున్నాడు. నౌకను నిర్మించాలంటే యజ్ఞకోపుడే అన్నట్టుగా పేరుపడ్డాడు.మూడోవాడు యజ్ఞదత్తుడు, అన్నలిద్దరిలా తెలివైనవాడు కాదు. పైగా బద్ధకుడు. కోరికలు కూడా లేనివాడు. దానికి తగ్గట్టుగానే అతను ఓ అడవికి చేరుకున్నాడు. ఆ అడవిలో చెట్లనీ, పుట్లనీ, పక్షులనీ, జంతువులనీ చూసి ఆనం దించసాగాడు. జానెడుపొట్టకోసం, నగరాలను ఆశ్రయించనక్కరలేదనుకున్నాడు.
అడవితల్లి ఒడిలోనే హాయిగా ఉందామనుకున్నాడు. ఉండిపోయాడు. ఆకలి వేస్తే పండో కాయో తినడం, దాహం వేస్తే నీరు తాగడం, పక్షుల కూతలనూ, జంతువుల అరుపులనూ అనుకరించడం అలవాటు చేసుకున్నాడు. ఏ అరుపు ఏ జంతువు ఎందుకు అరుస్తుందో, ఏ కూత ఏ పక్షి ఎందుకు కూస్తుందో తెలుసుకోగలిగాడు. తెలుసుకోవడమే కాదు, వాటి భాషల్లో మాట్లాడ సాగాడు. అలా పక్షులతోనూ, జంతువులతోనూ మటామంతీ జరుపుతూ ఒకటేమిటి...చుట్టుపక్కల అడవులన్నీ తిరిగేశాడు. అడవిలో యజ్ఞదత్తుడు మనిషికాడు. పక్షుల్లో పక్షి. జంతువుల్లో జంతువు. అతన్ని చూసి ఇటు పక్షులుగానీ, అటు జంతువులుగానీ భయపడేవి కావు. పైగా దగ్గరగా వచ్చిన అతన్ని పలకరించి కుశల ప్రశ్నలు వేసేవి. అతను పెడితే తినేవి. అతను పాడితే వినేవి. అతను నిద్రిస్తే అతనితో పాటు ఎలాంటి భయాలూ లేకుండా నిద్రించేవి. ఒకొక్కప్పుడు ఆ అడవిలో అలా, ఈ అడవిలో ఇలా అంటూ అతనికి రహస్యాలు కూడా చెప్పేవి. రహస్యాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు యజ్ఞదత్తుడు. ఏడేళ్ళు గడిపేశాడు అలా.
అనుకున్నదానికి ఒక రోజు ముందుగానే యజ్ఞుడు, యజ్ఞకోపుడు మూడురాదార్ల కూడలిలో కలుసుకున్నారు. తమ్ముడు యజ్ఞదత్తుని కోసం నిరీక్షించసాగారు. ఏడేళ్ళ తర్వాత అన్నలను కలుసుకోవాలన్న మాటే మరచిపోయాడు యజ్ఞదత్తుడు. మరచిపోయి అడవిలో ఆనం దంగా తిరుగుతోంటే... ఓ పక్షి వచ్చి చెప్పిందిలా.‘‘నీ కోసం మీ అన్నలిద్దరూ మూడు రాదార్ల కూడలిలో నిరీక్షిస్తున్నారు. ఏడేళ్ళ తర్వాత ముగ్గురూ అక్కడ కలుసుకోవాలనుకున్నారట కదా, మీ అన్నలు అనుకుంటుంటే విన్నాను.
వెళ్ళిరా.’’‘‘అయ్యయ్యో! ఆ సంగతే మరచిపోయాను.’’ అంటూ పరుగు పరుగున బయల్దేరాడు యజ్ఞదత్తుడు. అడవిలో పరుగుదీస్తున్న అతన్ని జంతువులడిగాయి, ఎక్కడికి? అని. పక్షులు అడిగాయి, పరుగు ఎందుకు? అని. అన్నిటికీ సమాధానాలు చెప్పాడతను. మళ్ళీ అడవికి ఎప్పుడు వస్తావంటే...చెప్పలేనన్నాడు. రాకపోవచ్చని బాధపడ్డాడు కూడా. అప్పుడు అతనికి పక్షులు పువ్వులు కానుకగా ఇచ్చాయి. జంతువులు పళ్ళనీ, కందమూలాలనీ ఆహా రంగా అందించాయి. తాగమని తేనెనిచ్చాయి తేనెటీగలు. ఆగమని అల్లరి చేశాయి కుందేటికూనలు. అయినా ఆగలేదు యజ్ఞదత్తుడు. అన్నలను చేరుకున్నాడు.
చిరిగిన బట్టలు, పెరిగిన జుత్తు, గడ్డంలో దాగిన ముఖం...యజ్ఞదత్తుణ్ణి గుర్తుపట్టలేకపోయారు అన్నలు. ఆనం దంగా ‘అన్నలూ’ అని అరిస్తే ఆ గొంతుని బట్టి వాడు తమ తమ్ముడనుకున్నారు వారు.‘‘ఏంట్రా ఈ వేషం?’’ అని జాలిపడ్డారు.అన్నలిద్దరూ రాకుమారుల్లా ఉన్నారు. గుర్రాల మీద ప్రయాణించి వచ్చినట్టున్నారు. అక్కడి గుర్రాలనూ, వాటి మీది మూటలనూ చూసి వారిని మెచ్చుకున్నాడు యజ్ఞదత్తుడు.‘‘మమ్మల్ని తర్వాత మెచ్చుకుందువుగాని, ముందు దుస్తులు మార్చుకో.’’ అన్నారు అన్నలు. మూటలు విప్పి, మంచి దుస్తులు తమ్మునికి అందజేశారు.ఇప్పుడు ముగ్గురూ రాకుమారుల్లా ఉన్నారు. ఏడేళ్ళ తర్వాత ఎలాంటి ఆటంకాలూ లేకుండా కలిసినందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహంతో పండుగ చేసుకోవాలనుకున్నారు. విందువినోదాలకు సిద్ధమయ్యారు. దగ్గరలోని ఖరీదైన ఓ పూటకూళ్ళ ఇంటికి చేరుకున్నారు.సుష్టుగా భుజించారు.
తాంబూలసేవనం చేసి, ఒకరి అనుభవాలను ఒకరు పంచుకున్నారు. అంతలో వారున్న గది కిటికీకి అటు పక్కగా ఉన్న చెట్టుపైకి ఓ పక్షి వచ్చి వాలింది. కూయడం ప్రారంభించింది. సన్నగా, వినసొంపుగా ఉంది ఆ కూత. అన్నలిద్దరూ అది వింటూ ఆనందిస్తోంటే తమ్ముడు అర్థం చేసుకుని, తలూపసాగాడు. ‘‘ఆ పక్షి ఏమంటోందో తెలుసా?’’ అడిగాడు అన్నల్ని.‘‘తెలీదు. నీకు తెలుసా? ఏమంటోంది?’’‘‘ఏమంటోందంటే... ఇక్కడ లంకెబిందెలు ఉన్నాయట! వందలాది ఏళ్ళుగా ఇక్కడ ఆబిందెలు ఉన్న సంగతి ఎవరికీ తెలియదట! పూటకూళ్ళ ఇంటి పెరటిలో ఓ పెద్ద బండరాయి ఉందట! ఆ రాయిని అక్కణ్ణుంచి తొలగించి తవ్వితే దాని కిందన ఉన్నాయట బిందెలు. సొంతం చేసుకోమంటోంది. పక్షులు ఎప్పుడూ అబద్ధాలు చెప్పవు, పదండి, లంకెబిందెలు తెచ్చుకుందాం.’’ అన్నాడు యజ్ఞదత్తుడు.‘‘పదండి తవ్వుదాం’’ అన్నాడు యజ్ఞకోపుడు.
పెద్దవాడు యజ్ఞుడుకి పక్షికూత మీద నమ్మకం లేదుగాని, తమ్ముల్లిద్దరూ తవ్వుదాం అంటున్నారు కదా, తవ్వడంలో నష్టం ఏముంది? దొరికితే లంకెబిందెలు దొరుకుతాయి. లేదంటే లేదనుకున్నాడు. అయితే దొరికిన సొమ్మును సమానంగా వాటాలు వెయ్యాలన్నాడు. ముగ్గురిలో ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదన్నాడు. సరేనంటే సరే అనుకున్నారు.
రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ పెరటిలోని బండరాయిని తొలగించి తవ్వి చూశారు. నిజంగానే లంకెబిందెలు దొరికాయి వారికి. వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారు నగలూ, వరహాలు ఉన్న బిందెలు లక్ష్మీప్రసన్నం అనిపించాయి. ముగ్గురూ సమానంగా వాటాలు వేసుకున్నారు. మర్నాడు ఇంటికి చేరుకున్నారు. తండ్రికి నమస్కరించి, తామెంత ప్రయోజకులైందీ తెలియజేశారు. ఆనందించాడు తండ్రి.రోజులు గడుస్తున్నాయి.ఒకరోజు ఇంటి దగ్గరగా ఉన్న చెట్టు మీద వాలి అదే పనిగా కూస్తున్న పక్షి కూతను పదే పదే వింటున్న తమ్ముణ్ణి సమీపించారు అన్నలు.
‘‘ఏమంటోంది ఆ పక్షి?’’ అడిగారు.‘‘ఏమంటోందంటే...మన ఊరి సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో ఓ దీవి ఉందట! ఆ దీవిలో ఓ పాలరాతి కోట ఉందట! ఆ కోట ప్రధానద్వారం దగ్గర నిప్పులుమిసే నాగులు కాపలా ఉన్నాయట! ప్రధానద్వారం దాటి వాకిలిలో అడుగుపెడితే అక్కడ కాలకూటసర్పం కాపలా ఉందట! దాన్ని దాటి లోపలికి వెళితే అందాల రాకుమారి మదయంతి అక్కడ బందీగా ఉందట! బందీగా ఉన్న మదయంతిని కాపాడినవారే ఆమెకు భర్తవుతాడట! రాకుమారితో పాటు అక్కడ ఉన్న ఆమె ఆస్తి... చెప్పలేనన్ని నగలు, ముత్యాలు, రత్నాలు అన్నీ కూడా అతని సొంతంట.’’ చెప్పాడు యజ్ఞదత్తుడు.
‘పదండి మరి, మదయంతిని కాపాడు కుందాం.’’ అన్నాడు యజ్ఞకోపుడు. రాత్రీపగలూ అదే పనిగా కూర్చుని పటిష్టమైన నావని తయారు చేశాడతను. ఎలాంటి ఆటుపోట్లనైనా, తుపాన్లనైనా ఆ నావ తట్టుకుని నిలబడగలదు. తండ్రి ఆశీస్సులు తీసుకుని, బయల్దేరారు ముగ్గురూ. సముద్రం మీద పక్షం రోజులు ప్రయాణించి దీవికి చేరుకున్నారు. పక్షి చెప్పినట్టుగానే అక్కడ పాలరాతి కోట ఉంది. చాలా ఎత్తుగా ఉందది. ప్రధానద్వారం దగ్గర నాగులు కాప లాగా ఉన్నాయి. వాటి కాటును తప్పించుకుని లోనికి ప్రవేశించడం కష్టం. ఒకవేళ ప్రవేశించినా వాకిలిలోని కాలకూటసర్పానికి బలికాకతప్పదు. ఎలా? అనుకున్నారు ముగ్గురూ. సాలోచనగా పెద్దవాడు పాముల కళ్ళబడకుండా నేల మీద పాకుతూ వెళ్ళి, కోటని చుట్టి వచ్చాడు. చాలా ఎత్తులో కోటకొమ్మన అతనికి ఓ కిటికీ కనిపించింది. కిటికీ ఉన్నదంటే...మదయంతి అక్కడ ఉన్నట్టే! అను మానం లేదనుకున్నాడు. నావలోని మోకును తెమ్మన్నాడు తమ్ముల్ని. తెచ్చారు వారు. దానిని కోటకొమ్మకు విసిరి, పీట ముడితో బిగించాడు యజ్ఞుడు. పిడికత్తిని నోట కరుచుకుని, తాడు సాయంతో కోటకొమ్మకు, కిటికీ దగ్గరగా చేరుకున్నాడు. కిటికీలోంచి చూశాడు.
దుఃఖిస్తున్న మదయంతి కనిపించింది అతనికి. పిలిచాడు. తలెత్తి చూసిందామె. భయపడింది.‘‘భయపడకు! నేను కానివాణ్ణి కాను. నిన్ను కాపాడేవాణ్ణి.’’ అన్నాడు యజ్ఞుడు. పిడికత్తితో కిటికీ ఊచలు కోసి, లోనికి ప్రవేశించాడు. గది నిండా సంచులతో ఉన్న ముత్యాలను, రత్నాలను, నగలనూ చూశాడు. వీటి సంగతి తర్వాత...ముందు మదయంతిని కిందికి పంపాలనుకున్నాడు. కోటకొమ్మకు బిగిసి ఉన్న మోకును చూపించాడామెకు.‘‘దీనిని పట్టుకుని జాగ్రత్తగా కిందికి దిగు. అక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. వారు నిన్ను కాపాడుకుంటారు.’’ అన్నాడు యజ్ఞుడు. అతను చెప్పినట్టుగానే చేసింది మదయంతి. కిందికి దిగి, యజ్ఞకోపుణ్ణి, యజ్ఞదత్తుణ్ణి కలిసింది.‘‘అన్నయ్య ఏడి?’’ అడిగారు వారు.‘‘వస్తున్నారు’’ అంది మదయంతి.మదయంతి ఆస్తిని ఒకొక్క సంచినీ మోకుకు వేలాడదీసి, వాటన్నిటిసహా జాగ్రత్తగా కిందికి దిగాడు యజ్ఞుడు.నాగులకు కనిపించకుండా, వారు వచ్చిన జాడే తెలియకుండా నావలోకి మదయంతితో పాటుగా చేరుకున్నారు. సముద్ర ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
‘‘నన్ను కాపాడిన మీ ముగ్గురికీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ సాహసానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. నాతో పాటు నా ఆస్తి కూడా మీదే! తీసుకోండి.’’ అంది మదయంతి.-కఽథ చెప్పడాన్ని ముగించింది పేదరాశిపెద్దమ్మ. ముగించి ఇలా అన్నది.‘‘మదయంతి ఆస్తిని సరిసమానంగా ముగ్గురన్నదమ్ములూ పంచుకున్నారు. అలా మదయంతిని పంచుకోవడం కుదరదు. ఆమెను ఎవరు పెళ్ళి చేసుకోవాలన్నది ముగ్గురన్నదమ్ములకీ పెద్ద ప్రశ్న అయింది. జవాబు మదయంతికి తెలుసు కాని, ఆమెను అడగలేదెవరూ. పైగా వాళ్ళలో వాళ్ళే ఆమె కోసం గొడవలు పడసాగారు. ఇప్పటికీ ఆ గొడవ సాగుతూనే ఉంది. వాళ్ళ సంగతి వదిలేయండి. అన్నదమ్ములు ముగ్గురిలో మదయంతిని ఎవరు పెళ్ళి చేసుకోవడం సబబో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి.’’పెద్దమ్మ ప్రశ్నకి సరైన సమాధానం కోసం తర్జనభర్జన పడసాగారు సత్రంలోని వారు. రోజులు గడిచిపోతున్నాయి.