మాయ దయ్యం
అనగనగా కొత్తపల్లిలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి కుడివైపుగా కొంత దూరంలో రామయ్య కుటుంబం నివసించేది. ఎడమ వైపుగా కొంత దూరంలో రమణమ్మ అనే అవ్వ ఒక్కతే ఉండేది.
అయితే ఆ అవ్వ కాస్తా రెండు నెలల క్రితం చనిపోయింది. అప్పటి వరకు చక్కగా ఉన్న ఆ ప్రదేశం అంతా అవ్వ చనిపోయేసరికి పాడుబడ్డట్లు అయిపోయింది. దానికి తోడు, ఇప్పుడు రావి చెట్టు పైనుండి వింత వింత శబ్దాలు వినబడసాగాయి!
"ముసలమ్మ దయ్యమై రావి చెట్టులో ఉంది" అని ఊళ్ళో వాళ్లంతా చెప్పుకోవటం మొదలు పెట్టారు. రోజూ రాత్రిళ్ళు ఆ శబ్దాలు వినీ వినీ రామయ్య కుటుంబం అల్లల్లాడిపోసాగింది. రామయ్య భార్య సీతమ్మ అయితే ఇల్లు వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోదామని పోరటం మొదలు పెట్టింది. రామయ్య కొడుకు రవికి మాత్రం ఆ ఊరును వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. ముఖ్యంగా తన స్నేహితులను వదలాలని లేదు వాడికి. వాడు వాళ్ల టీచరును అడిగాడు "దయ్యాలంటే ఏమిటి టీచర్? అవి ఎట్లా ఉంటాయి? దేనితో తయారవుతాయి?" అని.
"దయ్యాలు అంటూ ఏవీ లేవు. అవి కేవలం మన ఆలోచనల్లో తయారౌతాయి. వాటినే భ్రమలు అంటారు. వాటికి భయపడటం అనేది మానసిక బలహీనతే తప్ప మరేమీ కాదు" అని వాళ్ళ సైన్సు టీచరుగారు చెప్పారు. "కానీ 'దయ్యాలే లేవు- అంతా మనభ్రమ' అని అమ్మకు తెలియ జేసేది ఎట్లా?" ఎంత ఆలోచించినా రవికి అర్థం కాలేదు. ఎన్నో సార్లు అమ్మకి చెప్పాలని ప్రయత్నించాడు వాడు; కానీ లాభం లేకపోయింది. రోజు రోజుకి దిగులుతో కృంగిపోసాగింది సీతమ్మ.
కొడుకు తన మాటలు నమ్మటం లేదని ఒక రోజున సీతమ్మకీ కోపం వచ్చింది: "నువ్వు ఏదైనా ఒక రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడురా, దయ్యం ఉందో లేదో నీకే తెలుస్తుంది!" అంది ఆపుకోలేక. "సరే! నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను. దయ్యం ఎట్లా ఉందో చూసి, ఆ తర్వాతే మాట్లాడతాను నీతో" అని, ఆ రోజు రాత్రి రావి చెట్టు దగ్గరికి వెళ్ళాడు రవి. అంతా చిమ్మ చీకటిగా ఉంది. దూరంగా హైవే మీదినుండి పోతున్న వాహనాల లైట్లకు చెట్టు పైభాగం మటుకు వింతగా వెలుగొందు-తున్నది. ఆ వెలుతురులో చెట్టు పైన నిజంగానే ఏదో ఒక వింత ఆకారం కనపడింది!
"ఏమిటది?" అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేసాడు రవి. చేతిలో ఉన్న టార్చిలైటును వేసి అటువైపు తిప్పాడో లేదో- ఆ ఆకారం అర్థం కాని వింత శబ్దాలు చేస్తూ ఒక్కసారిగా వాడి మీదికి దూకింది. రవి చేతిలోని టార్చిలైటు క్రింద పడిపోయింది. వాడు భయంతో అరుచుకొంటూ వెనక్కి పరిగెత్తి ఇంటికి చేరాడు. ఇల్లు చేరినా వాడి గుండె దడదడా కొట్టుకుంటూనే ఉన్నది.
"సైన్సుటీచరుగారు చెప్పింది సామాన్యంగా అబద్ధం కాకూడదు- అయినా మరి ఈ దయ్యాన్ని తను నిజంగా చూశాడు కదా, అది తన మీదికి దూకింది కూడాను! ఇప్పుడేం చెయ్యాలి?" అన్న ఆలోచనతో వాడికి ఇక నిద్ర పట్టలేదు. క్రితం రోజు రాత్రి తను దయ్యాన్ని చూసిన సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు వాడు. "ఆ దయ్యాన్ని ఎలా వెళ్ళకొట్టాలి?" అనే, ఇప్పుడు వాడి ఆలోచన అంతా: ఎందుకంటే రవికి ఆ ఊరన్నా, అక్కడి స్నేహితులన్నా, టీచర్లన్నా ఎంతో ఇష్టం. ఆ ఊరిని వదిలి వెళ్ళటం అనేది వాడికి అస్సలు ఇష్టం లేదు.
"వీలైతే మా స్నేహితులందరినీ కూడగట్టుకుంటాను; అందరం కలిసి దయ్యాన్ని పారద్రోలతాం" అనుకున్నాక వాడికి కొంచెం హాయిగా అనిపించింది. ఉదయాన్నే వాడు తన స్నేహితులందరినీ కలిసి జరిగిందంతా చెప్పాడు. తను ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నాడో కూడా చెప్పి, వాళ్లని సహాయం చేయమన్నాడు.
"అమ్మో! మాకు భయం, మేము రాము" అన్నారు అందరూ భయంగా. వాళ్ళు అట్లా అనేసరికి పాపం, రవికి ఏడుపు వచ్చింది. వాడి బాధని చూసి స్నేహితులందరూ జాలి పడ్డారు. "ఏది ఏమైనా సరే- ధైర్యంగా వెళ్తాం. రవికి తోడుగా ఉంటాం. వెళ్ళి దయ్యాన్ని తరిమేస్తాం" అని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఆరోజు రాత్రి అందరూ ఒక చోటున చేరారు. కట్టెలకు పాత బట్టలు చుట్టి, నూనె పోసి, దివిటీలు వెలిగించారు. వాటిని పట్టుకొని, అందరూ నిశ్శబ్దంగా రావి చెట్టుని చేరుకున్నారు.
దివిటీల వెలుగులో దూరం నుండే అందరికీ కనబడింది చెట్టుమీది ఆ ఆకారం. పిల్లల్ని చూడగానే వికృత శబ్దాలు చేస్తూ వాళ్ల మీదికి దూకింది ఆ ఆకారం! చురుకుగా ఉన్న పిల్లలు అంతలోనే గ్రహించారు- "ఒరే! ఇది గబ్బిలంరా! దయ్యం కాదు!" అని అరిచారు. ఆ సరికి గబ్బిలం వాళ్ల మీదికి దూకనే దూకింది. ఐతేనేమి, ఇప్పుడు పిల్లలకు అదంటే భయం పోయింది. అది ఎంత భయపెట్టినా పిల్లలు మటుకు ధైర్యంతో నిలబడ్డారు. దివిటీలను దానిమీదికి గురి పెట్టి విసిరారు. అన్ని వైపులనుండి మండుతున్న దివిటీలు తగిలేసరికి ఆ గబ్బిలం ఎటూ పోలేక పోయింది. కాలి, క్రిందపడి, చచ్చిపోయింది!
పిల్లలంతా సంతోషంగా కేకలు వేయటం మొదలు పెట్టారు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా లేచి పరుగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి. ముందుగా చేరుకున్నది రవి వాళ్ళ అమ్మే! రవి అమ్మకు గబ్బిలాన్ని చూపించి అన్నాడు- "ఇదేనమ్మా దయ్యం!" అని. సీతమ్మ సంతోషంగా నవ్వి, రవిని దగ్గరకు తీసుకున్నది. ధైర్య సాహసాలతో దయ్యాన్ని చంపేసిన పిల్లలందర్నీ ఊళ్ళోవాళ్ళు చాలా మెచ్చుకున్నారు.