స్త్రీ సుఖి, భోజనసుఖి, నిద్రాసుఖి
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు.అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా! నీకు ముగ్గురు అన్నదమ్ముల కథ చెప్పుచున్నాను శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు:
వంగాదేశమున భూషణుడను ఉండెను. అతనికి ముగ్గురు కొడుకులు కలిగిఉండెను. ఆ బ్రాహ్మణుడు ఒక యాగము చేయదలచి తన పుత్రులను పిలిచి మీరు సముద్రమునకు వెళ్లి యొక కూర్మమును తీసుకొనిరండని చెప్పి పంపెను.
ఆ ముగ్గురు సముద్రమునకు వెళ్లి ఒక కూర్మమును చూచి తమ్ముని పిలిచి దానిని ఎత్తుకొని రమ్మని చెప్పగా వాడు నేను భోజన సుఖిని కనుక ఎత్తజాలనని తెలిపిను. రెండవవానిని యొత్తమనగా వాడు నేను స్త్రీ భోగిని కావున ఎత్తడములేదని చెప్పెను. జ్యేష్ఠుడు నేను నిద్రాసుఖిని కనుక ఎత్తనని పలికెను. ఈ విధముగా వారు తగవుపడి, విజయనగరమనే పట్టణమునకుపోయి, ఆ పట్టణము నేలుచున్న ప్రతాపుడను రాజువద్ద తమ వాజ్యామును చెప్పుకొనిరి.
అప్పుడు ఆ రాజు వారి సామర్థ్యమును తెలుసుకొనవలెనని భావించి ఒక స్త్రీని పిలిపించి, వేలగాక వస్త్రభూషణములు ధరింపజేసి స్త్రీ భోగి వద్దకు పంపగానే వాడు ఆ స్త్రీని చూచి, ముక్కు మూసుకొని నీవద్ద దుర్వాసన కలదు వెంటనే వెళ్ళిపొమ్మని పంపివేసెను. ఆ సంగతి రాజు తెలుసుకొని, దాని తల్లిని పిలిపించి ఆ స్త్రీ పూర్వచరిత్ర తెలుపుమనియడుగాగా "ఇది నా చెల్లెలి కూతురు. ఇది పుట్టిన ఐయిదు దినములకే నా చెల్లెలు మరణించినది. అప్పుడు నుంచి దేనికి మేకపాలు పట్టించి పెంచితిని. కావున దీని శరీరము దుర్వాసన కలిగిఉన్నది" అని చెప్పెను.
తరువాత రాజు మదురమైన పదార్ధము వండించి భోజనసుఖిని పిలిపించి భోజనం చేయమనగా,వాడు ఆ యన్నమును చూచి పీనుగుకంపు కొట్టుచున్నదని పలికి వదిలిపెట్టెను. రాజు ఆ సంగతివిచారించగా, ఆ యన్నము శ్మశానము దగ్గరనున్న భూమిలో పండించిన వడ్లబియ్యముతోవండిచినందున అట్టి వాసన కలిగినదని గ్రహించెను.
పిమ్మట ఆరాజు ఒక మృదువైన పరుపును తయారుచేయించి, నిద్ర సుఖ్ని పిలిచి దానిపై పరుండుమని చెప్పగా, వాడా పరుపుపై పవళించి వెంటనే పైకి లేచిపోయెను. అలా ఎందుకు చేసితివి అని రాజు అడుగగా ఆ పరుపులో ఒక వెంట్రుక ఉన్నది అది ఒత్తుకొనుటచే లేచితిని అని చెప్పెను. రాజు ఆ పరుపును విప్పించి చూడగా దానియందు రోమముండెను.
రాజు వారు ముగ్గురు చెప్పిన విషయములు విని, వారికిగల సామర్థ్యమునకు సంతోషించి తగు బహుమతులు ఇచ్చి గౌరవించెను. ఓ విక్రమాదిత్య మహారాజా! ఆ ముగ్గురిలో ఎవరు అధిక సుకుమారులు?" అని ప్రశ్నించగా, విక్రమాదిత్యుడు "భోజన సుఖి, స్త్రీ సుఖి బుద్ధిచేత గ్రహించి చెప్పిరి. నిద్రాసుఖి పరుపులోనున్న వెంట్రుక వలన కలిగిన దద్దు వాని శరీరమున కానవచ్చెను. కావున వాడే సుకుమారి" యని చెప్పెను.
రాజుకీవిధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.