గులాబీ సుందరి


శివసతీపురం చిన్న రాజ్యం. రాజ్యం అంతా కలిపి, ఓ వెయ్యి గడపలుంటాయంతే! ఆ రాజ్యానికి రాజు ఉత్తముడు. అతనికి ఓ కూతురు. ఆమె పేరు జయంతి. సన్నగా, అందంగా చాలా బాగుంటుంది జయంతి. ఆమె కురులు బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి.. గులాబీలంటే ఆమెకు చాలా ఇష్టం. గుత్తులు గుత్తులుగా గులాబీలను ముడుచుకుంటుందామె. గులాబీ రేకులను పరుచుకుని పడుకుంటుందామె. గులాబీలు లేనిదే ఉండలేదామె. అందుకనే రాజ్యంలో అందరూ ఆమెను 'గులాబీ సుందరి' అని కూడా పిలుస్తారు.

సూర్యాస్తమయం అయితే చాలు! జయంతి అంతఃపుర కిటికీ దగ్గరగా నిల్చుని చప్పట్లు కొడుతుంది. ఆ చప్పట్లకి ఎక్కణ్ణుంచి వస్తుందో తెలియదు కానీ, అందమైన బంగారుపిచ్చుక వచ్చి ఆమె భుజం మీద వాలుతుంది. పిచ్చుక వచ్చి వాలడం ఆలస్యం, జయంతి బంగారు కురులు మరింత ప్రకాశవంతమవుతాయి. వెయ్యిదీపాల కాంతిలా వెలిగిపోతాయి. ఆ కాంతిని చూస్తూ బంగారుపిచ్చుక గొంతు సవరించుకుంటే, ఆ గొంతులో శృతి కలుపుతుంది జయంతి. అందమైన పాట పాడతారిద్దరూ. ఆ పాట వింటూ రాజ్యంలోని ప్రజలంతా నిద్రపోవడం అలవాటు. జయంతి, పిచ్చుకల పాట వింటూ నిద్రపోతే తెల్లార్లూ మంచి మంచి కలలు వస్తాయి. మంచి మంచి కలలు రావడమే కాదు, ఆ కలలను నెరవేర్చుకునే శక్తియుక్తులు కూడా వస్తాయి. అందుకని గులాబీసుందరి పాటకోసం ఒళ్ళంతా చెవులు చేసుకుంటారు ప్రజలు.

జయంతికి ఆరేళ్ళు వచ్చిన దగ్గర నుంచీ పాడుతోందిలా. ఇప్పుడు ఆమెకు పదహారేళ్ళు. గత పదేళ్ళుగా రాజ్యంలోని ప్రజలకి పీడకలలంటే తెలీవు. నిద్రలేమి అన్నది కూడా లేదు. హాయిగా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఎప్పటిలాగే పిచ్చుక-జయంతి పాట పాడుతున్నారు ఓ రోజు. ఆ పాట ఊరవతల మర్రిచెట్టు కింద ఉన్న మంత్రగత్తెకు వినపడిందీసారి. పాట తియ్యగా హాయిగా ఉండటంతో, మంత్రగత్తె మనసును దోచేసింది ఆ పాట. దాంతో మంత్రోచ్చారణ మీద ధ్యాసను కోల్పోయిందామె. అపశబ్దాలు పలక సాగింది. మంత్రోచ్చారణలో అపశబ్దాలు దొర్లడంతో మంత్రం వికటించింది. పిశాచి ప్రత్యక్షమైంది. హింసించసాగిందామెను. ఆ హింసను తట్టుకోలేకపోయింది మంత్రగత్తె.

పాడింది ఎవరన్నది తెలుసుకునేందుకు కళ్ళు మూసుకుంది. జయంతి కనిపించిందామెకు. కోపం కట్టలు తెంచుకుంది. జయంతిని శపించిందిలా. "అబ్రకదబ్ర! జయంతి కురులు నల్లనైపోవాలి! అబ్రకదబ్ర! గులాబీసుందరి గుబులై పోవాలి" అని మంత్రగత్తె అనగానే, మరుక్షణంలోనే జయంతి జుత్తు మాడిపోయినట్టుగా నల్లగా అయిపోయింది. జడలు గట్టింది. అలాగే ఆమె గుండెంతా బాధతో నిండిపోయింది. ఊరికూరకనే కన్నీళ్ళు రాసాగాయి. ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో సూర్యాస్తమయం అయింది. అంత దుఃఖంలోనూ జయంతి అంతఃపురం కిటికీ దగ్గరకు వచ్చింది. బంగారుపిచ్చుకను పిలుస్తున్నట్టుగా చప్పట్లు చరిచింది. పిలుపు అందుకున్నది పిచ్చుక. వచ్చింది. జయంతి భుజం మీద వాలింది. గొంతు సవరించుకుంది. పాట అందుకుంది. జయంతి శృతి కలిపింది.

పాట వింటూ ప్రజలంతా నిద్రపోయారు. అయితే ఆ రాత్రి వారెవ్వరికీ మంచి కలలు రాలేదు.పీడకలలొచ్చాయి. పీడకలలతో పాటు పిశాచాలు కూడా కనిపించాయి. వెంటతరిమాయి. నిద్రించేందుకు భయపడి, మేల్కొనే ఉన్నారంతా. ఎప్పుడు సూర్యో దయం అవుతుందా? ఈ సంగతి ఎప్పుడు రాకుమారికి చెబుదామా? అని వేచి చూశారు. సూర్యోదయం అయింది. అవుతూనే పరుగున వచ్చారు అంతఃపురానికి జరిగిందంతా జయంతికి చెప్పారు.. "అమ్మో! ఆ పీడకలల్ని తట్టుకోలేం తల్లీ! ఆ పిశాచాలను పట్టుకోలేం తల్లీ!. భయంకరం చాలా భయంకరం." అన్నారు. అయ్యయ్యో అనుకుంది జయంతి. జాలిపడ్డది.

సూర్యాస్తమయం కాగానే అ సాయంత్రం పిచ్చుకను పిలిచింది. వచ్చింది పిచ్చుక. అయితే చిత్రంగా గొంతు సవరించుకోలేదు. పాట అందుకోలేదు."ఏమైంది?" అడిగింది జయంతి. "నీ జుత్తు కారు నలుపైంది. వాసన వేస్తోంది. ఆ వాసనకి నా గొంతు పూడుకుపోయింది." అన్నది పిచ్చుక."మనం పాడినా ప్రమాదమే! ప్రజలకి పీడకలలు వస్తున్నాయి. పిశాచాలు వెంట తరుముతున్నాయి." అంది జయంతి."అవునా?" ఆశ్చర్యపోయింది పిచ్చుక. "ఇప్పుడేం చెయ్యాలి? ఏం చేస్తే మళ్ళీ మన ప్రజ లకి మంచి మంచి కలలూ, కలతలేని నిద్రవస్తుంది?" అడిగింది జయంతి. అప్పుడు ఆమె జుత్తుకేసి చూసింది పిచ్చుక. ఆ జుత్తులో గులాబీలు లేవు. "గులాబీలు ఎందుకు తురుముకోలేదు?" అని అడిగింది పిచ్చుక. గుబులుగుబులుగా ఉంది. గులాబీల మీదకి మనసు పోలేదు" అని చెప్పింది జయంతి.. "అక్కడే తప్పు జరిగింది" అన్నది పిచ్చుక. ఆశ్చర్యంగా చూసింది జయంతి.

"గులాబీరేకులు పరుచుకుని కూడా రాత్రి నువ్వు పడుకోలేదు, అవునా?" అని అడిగింది పిచ్చుక. సశేషం అవునని చెప్పింది జయంతి.. అదీ సంగతి! అందుకే ఇలా జరిగింది. ఓ పని చెయ్యి! ఈ రాత్రి ఎప్పట్లాగే గులాబీలు పరుచుకుని పడుకో! రేపు ఉదయం గులాబీరేకులు నీళ్ళలో వేసుకుని తలస్నానం చెయ్యి. సాయంత్రం గులాబీలు తురుముకుని, నన్ను కేకేయ్." అని చెప్పి పిచ్చుక ఎగిరిపోయింది. ఆ రాత్రి పిచ్చుక చెప్పినట్టుగానే చేసింది జయంతి. ఉదయం గులాబీలు నీటిలో వేసుకుని తలస్నానం చేసింది. సాయంత్రం తురుముకుంది. పిచ్చుకను కేకేసింది. పిచ్చుక రానేలేదు.

జయంతి కురులు ఎప్పటిలా బంగారుమయంమయిపోయాయి. అలాగే ఆమె గుండెల్లో గుబులు కూడా మటుమాయం అయింది. ఇంతలో పిచ్చుక రానే వచ్చింది. దాని గొంతు విచ్చుకుంది. పాట పాడింది. పిచ్చుక గొంతుతో శృతి కలిపి, జయంతి కూడా పాడింది. ఆ పాట మధురం అనిపించింది ప్రజలకి. హాయిగా నిద్రపోయారంతా. రాత్రి నుంచి తెల్లారేదాకా మంచి మంచి కలలు కన్నారు. చీకటింకా విడిపోలేదు. చిక్కగా ఉంది. మర్రిచెట్టు కింది మంత్రగత్తె మీద, మళ్ళీ పిశాచి దాడి చేసింది. "ప్రజలంతా సుఖంగా ఉన్నారు. హాయిగా నిద్రపోతున్నారు. పీడకలలు లేవు. మా పిశాచాలకు ప్రవేశం లేదు. ఏం చేస్తున్నావు?" మంత్రగత్తెను నిలదీసింది పిశాచి."చూడేం చేస్తానో" అంది మంత్రగత్తె. మంత్రోచ్చారణ చేసింది. మళ్ళీ శపించిందిలా. "అబ్రకదబ్ర! జయంతి కురులు నల్లనైపోవాలి! అబ్రకదబ్ర! గులాబీసుందరి గుబులై పోవాలి!"జయంతి గుబులైపోయింది. ఆమె కురులు నల్లనైపోయాయి.. ఈసారి జయంతికి అందకుండా ఉండేందుకు, రాజ్యంలోని గులాబీలను మాయం చేసింది మంత్రగత్తె.

పువ్వులతో పాటు గులాబీ మొక్క ఒక్కటి కూడా రాజ్యంలో లేకుండా చేసింది. “ఈసారి నా శాపానికి తిరుగులేదు. మంత్రానికి లొంగనిది లేదు." అని నవ్వింది. మంత్రగత్తె నవ్వుతోంటే పిశాచి నృత్యం చేసింది. మంత్రగత్తెను మెచ్చుకుంది పిశాచి.. సాయంత్రం అయింది. దిగులు దిగులుగా అంతఃపురం కిటికీ దగ్గర నిల్చుంది జయంతి. జడలుగట్టిన నల్లని కురులతో దిష్టిబొమ్మలా తయారైంది. చేతులు జాచి చప్పట్లు కొట్టింది. బంగారు పిచ్చుకను కేకేసింది. వచ్చింది పిచ్చుక. జయంతిని చూసింది. ఆమె భుజమ్మీద వాలలేదు. గాలిలో ఎగురుతూ అక్కడక్కడే తిరగసాగింది."చూశావా, మళ్ళీ ఎలా తయారయ్యానో” బాధపడ్డది జయంతి. "గులాబీ చికిత్స చేసుకో! అందాన్ని సంతరించుకో." అంది పిచ్చుక.

"రాజ్యంలో ఒక్క గులాబీపువ్వు లేదు. మొక్కలు కూడా మాయమైపోయాయి." అంది."మా మంచి పిచ్చుకవు కదూ! మరో మంచి ఉపాయం చెప్పవూ?" అని అడిగింది జయంతి... "గులాబీ చికిత్స చేసుకో! అందాన్ని సంతరించుకో" అని చెప్పి పిచ్చుక వెళ్ళిపోయింది. జయంతి ఎంత పిలిచినా వెను తిరిగి చూడలేదది. కన్నీటి చెరువులయ్యాయి కళ్ళు, ఏడవసాగింది జయంతి. ఆమె కన్నీరు బొట్టు బొట్టుగా అంతఃపురం కిటికీ నుంచి కిందకి పడసాగాయి. ఆ సమయంలోనే బొబ్బిలి యువరాజు, ఓ చిన్న బంగారుపెట్టెలో, నీలిరంగు వస్త్రంలో భద్రంగా దాచిన బంగారు రంగులో గల తలవెంట్రుకను చూస్తూ వస్తున్నాడు.

జయంతి కన్నీటిబొట్టు ఆ వెంట్రుక మీద పడింది. పడడం ఆలస్యం, ఆ వెంట్రుక గులాబీపువ్వుగా మారిపోయింది. గులాబీని పట్టుకుని, తల పైకెత్తి చూశాడు యువరాజు. జయంతి కనిపించిందతనికి. కిందకి చూస్తున్న జయంతికి మాత్రం యువరాజు చేతిలో గులాబీ మాత్రమే కనిపించింది. "గులాబీ" అంటూ గట్టిగా అరిచింది జయంతి. అంతఃపురం నుండి వడివడిగా వచ్చింది. యువరాజు చేతిలోని గులాబీని అందుకుంది. వెళ్ళిపోయిందక్కణ్ణుంచి. కొన్ని గులాబీరేకులు తుంచి నీటిలో వేసి, వాటితో స్నానం చేసింది జయంతి. మరుక్షణం బంగారు వెంట్రుకల్ని సొంతం చేసుకుంది. మరికొన్ని రేకులు పక్క మీద పరచి పవళించింది. గుండెలోని గుబులు దూరం చేసుకుంది. ఇంకొన్ని రేకుల్ని తురిమి అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంది రాకుమారి. మళ్ళీ మామూలు మనిషైంది జయంతి.. ఎవరో రాకుమారుని చేతి గులాబీతో చక్కదనాలు సంతరించుకుందంటే... ఆ రాకుమారుణ్ణి రాజభవనంలోకి ఆహ్వానించాడు ఉత్తముడు. జరిగిందంతా తెలుసుకున్నాడు.

"నీకు ఆ బంగారు వెంట్రుక ఎక్కడిది యువరాజా?" అని అడిగాడు ఉత్తముడు. యువరాజు చెప్పేందుకు సంశయిస్తుంటే మళ్ళీ రెట్టించాడు ఉత్తముడు. అప్పుడు చెప్పాడిలా యువరాజు. "చిన్నప్పుడు నేనూ, జయంతీ ఇద్దరం ఒకే గురుకులంలో చదువుకున్నాం. జయంతి అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తనకి నేనన్నా చాలా ఇష్టం. అక్కడ విద్యాభ్యాసం ముగిసి వెళ్ళిపోతున్నప్పుడు, జయంతి తల వెంట్రుక అడిగి నేనొకటి తీసుకున్నాను. అలాగే తను కూడా, నా తల వెంట్రుక అడిగి తీసుకుంది" అని అన్నాడు యువరాజు. ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు ఉత్తముడు. "నేను చెబుతున్నది నిజం రాజా! మా ప్రేమకు మా తలవెంట్రుకలే గుర్తు. వాటిని మేము ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం. కావాలంటే, ఈ విషయమై మీరు జయంతిని అడిగి చూడండి" అని అన్నాడు యువరాజు.

జయంతిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు ఉత్తముడు. క్షణాల్లో ఆమెను అక్కడ ప్రవేశపెట్టారు పరిచారికలు. అప్పుడు చూసింది రాకుమారుణ్ణి జయంతి. "రాకుమారీ" అంటూ చేతులు జాచి పిలిచిన రాకుమారుని చేతుల్లో పరవశంగా వాలిపోయింది రాకుమారి. గుండెల్లో దాచిన చిన్న బంగారుపెట్టె తీసి చూపించిందతనికి. అందులో రాకుమారుని తల వెంట్రుక ఉంది. మెరిసిపోతోంది. "చూశావా! నిన్ను గుండెల్లో దాచుకున్నాను.” అంది జయంతి. రాజు ఉత్తమునికి, అడగకుండానే అన్నీ తెలిసినట్టయ్యాయి. ఆలస్యం అమృతం విషం అనుకున్నాడతను. రాకుమారునికి, జయంతిని ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగవైభవంగా వివాహం జరిగింది.

రాజ్య పౌరులంతా ముచ్చటగా తిలకించారు ఆ వివాహాన్ని. ఆనందించారు. జయంతి అందాలు మళ్ళీ సంతరించుకోవడంతో, మంత్రగత్తె శాపం తొలగిపోయింది. శాపం తొలగిపోవడంతో, మంత్రగత్తె మాయం చేసిన గులాబీపువ్వులూ, మొక్కలూ ఎక్కడివక్కడ రాజ్యంలో మళ్ళీ వేళ్ళూనుకున్నాయి. ఆ సాయంత్రం పిచ్చుకతో జయంతి పాట వినవస్తుంటే తట్టుకోలేకపోయింది మంత్రగత్తె. మంత్రోచ్చారణకు భంగం కలగడాన్ని భరించలేకపోయింది. మాటకి మాట అందలేదు. అపశబ్దాలు దొర్లాయి. పిశాచి ప్రత్యక్షమైంది. చాచి పెట్టి కొట్టిందామెను. ఆ దెబ్బకి మంత్రగత్తె పేలిపోయింది. చిన్నచిన్న ఖండాలుగా మారి గాలిలో ఎగిరిపోయి, ధూళిలో కలిసిపోయింది మంత్రగత్తె....

Responsive Footer with Logo and Social Media