ఒక్క వెంట్రుక యువరాణి
హిమగిరిని పాలించే శ్వేతగుప్తుడికి ఒక తీవ్ర వివిధ ప్రాంతాల సమస్య ఎదురైంది. యువరాణి చంచలితకు స్వయంవరం తేదీ నిర్ణయించి ఆ పనుల్లో నిమగ్నమవగానే, చంచలిత శిరోజాలు ఒక్కొక్కటే ఊడసాగాయి. తొలుత దానిని చిన్న సమస్యగానే భావించారు. రోజులు గడిచేకొద్దీ తీవ్రత ఎక్కువైంది. రాజవైద్యులేగాక, ప్రముఖ ధన్వంతరులు ఎన్నో మందులు వాడారు. కానీ ఫలితం కనిపించలేదు.. ఇంకొన్ని రోజులు గడవగానే యువరాణికి ఒక్క వెంట్రుక మాత్రమే మిగిలింది!
ఒకరోజు సభలో శ్వేతగుప్తుడు చింతా క్రాంతుడై ఉన్నాడు. అప్పుడే ఓ అపరిచితుడు రాజదర్శనానికి వచ్చాడు. "మహా రాజా! నా పేరు శీఘ్రభట్టు వైద్యుణ్ని. మా తాతల కాలం నుంచీ ఈ వైద్య వృత్తే భుక్తిని కలిగిస్తోంది. నేను యువరాణి సమస్యకు పరిష్కారంతోనే వచ్చాను. ఒక్క అవకాశం ఇప్పించండి" వినయంగా చెప్పాడు తను. ఎంతోమంది పేరుమోసిన వైద్యులు పరిష్కరించలేని దానికి, ఇతను మార్గం. చూపుతాడన్న నమ్మకం శ్వేతగుప్తుడికి కలుగాలేదు. ఒకింత అసహనంతో, "ఎవరో ఒకరైనా నా చిట్టి తల్లి ఇబ్బంది తీర్చకపోరన్న ఆశతోనే నీకూ ఒక అవకాశం కల్పిస్తున్నాను. ప్రయత్నించు" అని ఆజ్ఞ చేశాడు.
తక్షణమే శీఘ్రభట్టు తన సంచీలోని మూలికలను తీసి కల్వంలో నూరి, మరి కొన్ని రసాయనాలు కలిపి ఔషధం తయారుచేశాడు. దానిని శ్వేతగుప్తుడికి అందిస్తూ, "ప్రభూ! రేపటి అమావాస్య రోజున దీనిని యువరాణి తలకు పట్టించి, వచ్చే పౌర్ణమి వరకూ ఉంచండి. పౌర్ణమినాటికి నిండు శిరోజాలతో ఆమె కళకళలాడుతుంది" ధీమాగా చెప్పాడు శీఘ్రభట్టు. "ఫలితం వచ్చేవరకూ మీరు మా అతిథిగా ఉండండి" అంటూ అతని బసకు ఆదేశాలిచ్చాడు శ్వేతగుప్తుడు. మరుసటి రోజు వైద్యుడు చెప్పినట్లే యువరాణి ఔషధాన్ని తన శిరస్సుకు పులుముకుంది.
కాలం గడిచి పౌర్ణమి వచ్చింది. శీఘ్రభట్టు సూచనతో తలస్నానం చేసి అద్దంలో చూసుకున్న చంచలిత కెవ్వుమంది. ఉన్న ఒక్క వెంట్రుకా ఊడి నున్నటి గుండు ప్రత్యక్షమైంది! అది చూసి కోపం పట్టలేని శ్వేతగుప్తుడు శీఘ్రభట్టుకు మరణ శిక్ష విధించి చెరసాలలో వేయించాడు. ఆకస్మికంగా వచ్చిన దురవస్థకు శీఘ్ర భట్టు పూర్తిగా దిగాలుపడ్డాడు. తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. గ్రంథాల్లోని సూచనలను కచ్చితంగా పాటించాడు. మరి!
మరణశిక్ష అమలు సమయం దగ్గరి కొచ్చింది. అన్నాహారాలు లేక నీరసించి నేలకు అతుక్కుపోయిన శీఘ్రభట్టును చూసి, వనమాలి అనే కాపలా భటుడికి జాలి కలిగింది. అతని దీనస్థితి గురించి ఆలోచించిన వనమాలికి ఓ ఉపాయం తట్టింది. దానిని మెల్లగా శీఘ్రభట్టుకు చెప్పాడతను. అతను చెప్పిన ఉపాయం విన్నాక తన ప్రాణం మిగులుతుందేమో నన్న ఆశ శీఘ్రభట్టులో కలిగింది.
మరణశిక్షకు ముందురోజు అతణ్ని శ్వేతగుప్తుడి ముందు భటులు హాజరుపరిచారు. "ఉన్న ఒక్క వెంట్రుకనూ పోగొట్టి మాకెంతో మానసిక వేదనను కలిగించావు. నీకు విధించిన శిక్ష సరైనదేనని మా విశ్వాసం. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు. దానిని తీర్చడం మా విధి" గంభీరంగా చెప్పాడు మహారాజు. "ఔషధ తయారీలో నేనెలాంటి లోపమూ చేయలేదని నమ్ముతున్నాను. ఇక దానిని తలకు పూసే సమయమే తారుమారయ్యానని నా అనుమానం. ఔషధం మళ్లీ చేస్తాను. ఈసారి పౌర్ణమినాడు తలకు పట్టించి అమావాస్య వరకు ఉంచండి. ఫలితం రాకుంటే నాకు శిక్షను అమలు పర్చండి. అప్పటివరకూ శిక్షను వాయిదా వేయమనేదే నా చివరి కోరిక."
అతని మాటలు విని శ్వేతగుప్తుడు కాసేపు ఆలోచించి శిక్ష వాయిదావేశాడు. ఔషధం తయారుచేశాక పౌర్ణమిరోజు పూసి అమావాస్య వరకూ ఉంచారు. ఎంతో విచిత్రం.. యువరాణి నల్లటి కురులతో నిగనిగలాడింది. రాజుకైతే పట్టరాని సంతోషం కలిగింది. శీఘ్రభట్టు శిక్ష రద్దు చేసి అతణ్ని సన్మానించబోయాడు. దానికి అతను సమ్మతించక, “ఈ ఘనత నాది కాదు. ఈ ఉపాయమిచ్చిన మహానుభావుడిది" అని జరిగిందంతా చెప్పాడు. రాజు వనమాలి, శీఘ్రభట్టులను ధన, కనక, వజ్ర వైఢూర్యాలతో సన్మానించాడు. అంతేగాక, వనమాలిని తన మంత్రుల్లో ఒకరిగా నియమించుకున్నాడు.