గంగమ్మ మోసకరితనం



రంగాపురానికి దగ్గరగా మాచవరం అనే గ్రామము ఉండేది. ఆఊరిలో నివసించే రంగమ్మ చాలా నిజాయితీగా, ఎక్కువ తక్కువగా దుబారా చేయక తనకు ఉన్నదానిలోనే తృప్తిగా బ్రతికేది. రంగమ్మకు రెండు గేదెలు ఉండేవి. ఆ గేదెలు ఇచ్చేపాడితోనే కొన్ని పాలు అమ్ముకుని తన కుటుంబ అవసరాలకు మరికొన్ని ఉంచుకునేది. తన ఇంటిలోని పాలు వలన వచ్చే నెయ్యి కాచి అప్పుడప్పుడు ఆ నెయ్యి ని కూడా అమ్మేది. ఆమె ఇంటికి పొరుగున గంగమ్మ కుటుంబం ఉండేది. గంగమ్మ చాలా గడసరి. అయినదానికి కానిదానికి దుబారాగా ఖర్చు చేసేది. ఆర్భాటాలు ఎక్కువగా ప్రదర్శించేది. ఆమెకు ఎనిమిది గేదెల పాడి ఉండేది. ఊర్లో ఎక్కువ మందికి ఆమెనే పాలు పోసేది. అందుకని ఆమె మాటలను ఊరిలోని నమ్మేవారు.

ఒకసారి అనుకోకుండా గంగమ్మ ఇంట్లోని నెయ్యగిన్నె జారి పడింది. ఒక వీశెడు నెయ్యి నేలపాలైంది. సరేలే ఏం చేస్తాను నాకు ప్రాప్తతం లేదని సర్ధిచెప్పుకునే సమయంలో ఆ ఊరిలోని రామయ్య బానే మోతుబరి రైతు వచ్చి తనకు ఆరు వీశెల నెయ్యి కావాలని అడిగాడు. గంగమ్మకు ఏమి చెయ్యాలో పాలుపోక ఆలోచనలో పడింది. వెంటనే ఆమెకు రంగమ్మ గుర్తుకు వచ్చింది. తన ఇంటిలోని నెయ్యిని ఒక డబ్బాలో పోసి రంగయ్యను కూర్చోమని నెయ్యి గిన్నెతో రంగమ్మ ఇంటికి వెళ్ళి ఒక్క వీశెడు నెయ్యి అరువుగా ఇవ్వమని రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఎంతైనా పొరుగున ఉన్న మనిషి కదా అని వీశెడు నెయ్యి ఇస్తూ రెండు రోజుల్లో ఇవ్వాలని చెప్పింది. సరేనంటూ గంగమ్మ నెయ్యి తీసుకుని వెళ్ళి రంగయ్యకు ఆరు వీశెల నెయ్యి ఇచ్చి పంపివేసింది.

రెండు రోజుల్లో తిరిగి ఇస్తానన్న గంగమ్మ నెయ్యి గురించి ఏమీ మాట్లాడకుండా , ఏమీ తెలియనిదానిలా ఉన్నది. అలా వారం గడిచింది. కానీ గంగమ్మ తిరిగి నెయ్యి ఇవ్వలేదు. ఉండబట్టలేక రంగమ్మ వెళ్ళి తనకు ఇవ్వాల్సిన నెయ్యి గురించి అడిగింది. వెంటనే గంగమ్మ నేను నీ దగ్గర నెయ్యి తీసుకోవడం ఏమిటి? నేనే ఊరిలోని వారికి అమ్ముతాను. నీదగ్గర నేను అరువు తీసుకున్నానంటే నవ్వుతారు. ఇప్పటికైనా వెళ్ళిపో, ఎవరైనా వింటే పరువుపోతుంది అని గదమాయించింది. ఇరుగుపొరుగు వారితో రంగమ్మ చెబితే ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా,ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు.

ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.

గంగమ్మ మోసకరితనం

మరిన్ని కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూరయ్య - పేరయ్య

సుబ్బయ్య మూర్ఖత్వం

పేదరాసి పెద్దమ్మ - దొంగలు

గుణపాఠం

తిన్న యింటి వాసాలు

జీవితం ఒక పరీక్ష

సుబ్బయ్య గుర్రం

కష్టార్జితం

రామన్న తీర్పు

పోయిన వస్తువు

బంగారు చెవి పోగుల కథ

వజ్రం కోసం తగాదా

మర్యాద రామన్నగా మారిన వెర్రి రామన్న

Responsive Footer with Logo and Social Media