పేదరాసి పెద్దమ్మ - దొంగలు



రంగాపురం అనే ఊరిలో ఒక పేదరాసి పెద్దమ్మ ఉండేది. ఆమె ఆ ఊరికి వచ్చేవారికి పూటకూళ్ళ భోజనాలు పెడుతూ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె ఇంటికి నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెను తమకు భోజనం వండి పెట్టమని, ఆ ఊర్లో రెండు, మూడు రోజుల పాటు ఉంటామని తెలిపారు. సరేనని పెద్దమ్మ వారిని స్నానపాదులు ముగించుకుని వచ్చేలోగా భోజనం సిద్ధం చేస్తానని తన పనిలో నిమగ్నమైనది.

ఆ నలుగురు వ్యక్తులు దొంగతనాలు చేస్తూ వచ్చిన సొమ్మును పంచుకునేవారు. వారు పెద్దమ్మ ఇంటికి రాకముందే వేరే గ్రామంలో దొంగతనము చేసి ఆ సొమ్ముతో పెద్దమ్మ ఇంటికి వచ్చారు. వారు ఒకసారి ఆ గ్రామ పరిస్థితులు తాము దొంగతనము చేయడానికి ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరాలని అనుకున్నారు. అలాగే పెద్దమ్మ అమాయకత్వం కూడా వారికి అర్థమైంది. ఎలాగైనా ఆమె వద్ద సొమ్ము భద్రముగా ఉంటుందని ఆ నలుగురు లోపలకి వెళ్ళి పెద్దమ్మా ఇదిగో మాకు చిన్న సహాయం చేసిపెట్టు. మేము ఒకపని కోసం ఊరిలోకి వెళ్తున్నాము. ఈ వరహాల మూటను నీవద్ద భద్రముగా ఉంచు. మేము నలుగురం కలసి వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఒక్కరు వచ్చి అడిగినా ఇవ్వవద్దు అని చెప్పి ఊర్లోకి వెళ్దామన రెండడుగులు వేశారు.

ఆ నలుగురిలో ఒకడు పెద్దమ్మ అమాకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాగైనా ఆ వరహాలను కాజేయాలని పథకం వేసి తోటి మిత్రులతో నేను పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి రాతిచెంబు తెచ్చుకుంటాను అని, పెద్దమ్మ చెంబును ఇవ్వదేమో మీరు కూడా ఇవ్వమని చెప్పండి అన్నాడు. మేము చెబుతాములే అని ఆగారు. ఆ నాలుగవ వాడు పెద్దమ్మను వరహాల మూటను తెమ్మన్నారు ఇవ్వు అని అడిగాడు. పెద్దమ్మ లేదు మీ నలుగురు కలిసి వస్తేనే ఇవ్వమన్నారు కదా నేను ఇవ్వను అని చెప్పింది. వెంటనే వాడు ఆ ముగ్గురితో పెద్దగా మీరు కూడా చెబితేనే ఇస్తుందట, ఇవ్వమని చెప్పండి అన్నాడు. ఆ ముగ్గురూ రాతిచెంబేకదా అడిగేది దానికి లోపలకి వెళ్ళి చెప్పటం ఎందుకని బయట నుండి పెద్దమ్మా ఇవ్వు అన్నారు. పెద్దమ్మ మళ్ళీ అడిగింది ఇవ్వనా అని, వాళ్ళు సరే ఇవ్వు అని ఊర్లోకి వెళ్ళారు.

ఆ నాలుగవ వాడు వరహాల మూటను తీసుకుని దొడ్డి దారిన పారిపోయాడు. పెద్దమ్మ వంట సిద్ధం చేసి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ముగ్గురు వచ్చి భోజనం చేశాక పెద్దమ్మను వరహాల మూటను అడిగారు. పెద్దమ్మ అదేమిటి మీరు ఇవ్వమని బయటి నుంచి చెబితేనే కదా ఆ నాలుగవ వానికి ఇచ్చాను. మరలా నన్ను అడుగుతారేమిటి? అని అమాయకంగా అన్నది.‌ మేము నిన్ను ఎప్పుడు ఇవ్వమన్నాము? వాడు రాతిచెంబు కదా నిన్ను అడిగినది. అదే ఇవ్వమని చెప్పాము. మాకు తెలియదు మంచితనంగా మా వరహాలు మాకివ్వు లేదంటే న్యాయాధికారి వద్దకు వెళ్తాం అని గొడవ చేశారు. తనకేం తెలియదని మీరు బయటనుండి ఇవ్వమంటేనే ఇచ్చాను అని పెద్దమ్మ మొత్తుకున్నా వినలేదు ముగ్గురూ పెద్దమ్మను న్యాయాధికారి వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి పెద్దమ్మ వద్ద నుండి వరహాలు ఇప్పించమని కోరారు. పెద్దమ్మ జరిగిన విషయాన్ని చెప్పినా న్యాయాధికారి పట్టించుకోకుండా పెద్దమ్మనే వరహాలు చెల్లించాలని తీర్పు చెప్పాడు.

అప్పుడే ఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, “ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే” అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమని కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.

Responsive Footer with Logo and Social Media