గుణపాఠం
మర్యాద రామన్న కొలువులో రోజూ తగువుల సందడి.."న్యాయం జరుగుతుంది అని నమ్మి రామన్న దగ్గరికి వెళ్లిన ఏ ఒక్కరికి అన్యాయం జరగక పోవడంతో అతను అంటే ఆ ఊరి వాళ్ళకే కాక చుట్టుపక్కల వారు కూడా దేవునిలా భావించసాగారు. అతని తీర్పు అంటే రామాబాణమే ".
"ఒకరోజు ఒక విచిత్రం అయినా తగువు రామన్న కొలువుకి వచ్చింది".పాపయ్య అనే షావుకారు దగ్గర మారయ్య అనే పేదవాడు తన కూతురి సమర్త బంతికి అవసరమయ్యే మూడువందలు అప్పు తీసుకున్నాడు.మూడేల్లో లో అసలు వడ్డీ కలిపి వెయ్యి రూపాయలు పైచీలుక లెక్కతేల్చాడు పాపయ్య. అంత అప్పు తీర్చే స్థోమత మారయ్యకి లేదు. దాంతో పెళ్ళాం చనిపోయిన పాపయ్య "నీ అప్పు కింద నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావా..? నువ్వు ఉంటున్న ఇల్లు నాకు స్వాధీనం చేసి అప్పు రద్దు చేసుకుంటావా..?" అని బేరం పెట్టాడు. " కూతురన్ని పాపయ్యకిచ్చి చేసి ఆ అమ్మాయి గొంతు కోయలేక... అలాగని ఇల్లు అతనికి అప్పచెప్పి పెళ్ళాం బిడ్డలతో రోడ్డున పడలేక మారయ్య రామన్నను ఆశ్రయించాడు. ఏదో ఒకటి చేసి పాపయ్య అప్పు నుంచి విముక్తిన్ని చేయమని వేడుకున్నాడు".
పాపయ్య గురించి రామన్న విని ఉన్నాడు."మారయ్యని కాపాడటంతో పాపయ్యకి తగిన గుణపాఠం కూడా చెప్పాలని నిర్ణయించుకొని పాపయ్యకు కబురుపంపాడు. "రామన్న దగ్గర నుంచి కబురు అనగానే పాపయ్యకి గుండెలు జారిపోయాయి " ఎలాగోలా దైర్యం చిక్కబెట్టుకొని వచ్చాడు.... " రా పాపయ్య రా..!" ఈ మారయ్య నీ మీద పిర్యాదు చేసాడు.. నువ్వు ఇతనికి మూడువేల రూపాయలు అప్పు ఉన్నావు అంటగా.... ఆ అప్పు చెల్లించకుండా మాట దాటేస్తున్నావుట...అందుకే ఎప్పుడు చెల్లిస్తావో ఓ మాట అడుగుదామని పిలిచాను" అంటూ పాపయ్యతో చెప్పాడు రామన్న... "రామన్న గారు..!!ఈ మారయ్య మాటలు అసలు నమ్మకండి. ఇతనే నాకు వెయ్యి రూపాయలు పైచీలుక బాకీ ఉన్నాడు.అది తీర్చమని నేను ఒత్తిడి చేస్తున్న అని ఇలా తిరకాసు పెట్టాడు. కావాలంటే మారయ్య నాకు రాసిచ్చిన అప్పు పత్రం ఉంది. నేను అతనికి రాసిచ్చిన అప్పు పత్రం ఉంటే చూపించమనండి "ఆవేశంగా రామన్న కు చెప్పాడు పాపయ్య. " సరే, సరే.. రేపు మీ ఇద్దరూ అప్పు పత్రాలు తీసుకురండి.. నిజానిజాలు తేలిపోతాయి "అంటూ ఆ పూటకి పాపయ్య ను మారయ్య ను ఇంటికి పొమ్మన్నాడు. రామన్న.ఆ ఇద్దరూ వెళ్ళిపోయాక ఒక యువకుడిని పిలిచి చెవిలో రహస్యంగా చెప్పాడు.
ఆ యువకుడు సరాసరి పాపయ్య ఇంటికి వెళ్లి "మారయ్య మీతో రాజీకి ఒప్పుకున్నాడు. మీ మీద అనవసరంగా ఆవేశపడి రామన్నకు తప్పుడు పిర్యాదు చేసాడు అంటా.. రేపూ పంచాయతీలో మారయ్య చూపించే అప్పు పత్రం మీరు రాసిందేనని ఒప్పుకునే పక్షంలో తన కూతురిని మీకిచ్చి త్వరలో పెళ్లి చేస్తానని చెప్పమన్నాడు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు.. ముఖ్యంగా రామన్నగారికి అని చెప్పాడు. \ " మారయ్య కూతురు అందమైన పిల్ల " తనకి కూతురుని ఇవ్వడానికి మారయ్య సిద్ధంగా ఉన్నాడని వినగానే పాపయ్యకి ఆవేశం పుట్టుకొచ్చింది.మరో ఆలోచన లేకుండా "సరే..! నా మాట నేను నిలబెట్టుకుంటాను. మారయ్యను తన మాట నిలబెట్టుకోమను. లేకపోతే ఈసారి రామన్న దగ్గర పిర్యాదు నేను చేయవలసి ఉంటది". అని ఆ యువకుడికి చెప్పి పంపాడు.
"ఆ యువకుడు తిరిగివచ్చి జరిగినిది అంతా రామన్నకు చెప్పాడు ". "రామ్మాన నవ్వి " చేప గాలానికి తగులుకుంది ఇక తరిగి కూర వండడమే మిగిలింది "అని మారయ్య ఇంటికి బయలుదేరాడు. మర్నాడు పాపయ్య, మారయ్య అప్పు పత్రాలతో రామన్న దగ్గరకు వచ్చారు. ఇద్దరూ ఆ పత్రాలను రామన్నకు అందించారు.ఆ రెండిటిని పరుశీలించినట్టు నటించి "మీ ఇద్దరి వాలకం బలే ఉందే. మారయ్య దగ్గర మూడు వేల రూపాయలు అప్పు తీసుకొని అవి జమ వేయకుండానే.. అతనికే అప్పు ఇచ్చి పత్రం రాయించుకున్నావు. ఈ మారయ్య తక్కువ తిన్నాడా..! మూడు వేల రూపాయలు అప్పు ఇచ్చినవాడి దగ్గర ఆ అప్పు వసూలు చేసుకోకుండా అప్పు తీసుకొని పత్రం రాసి ఇచ్చినాడు. ఏమిటి ఇది అంతా అని ఇద్దరిని గద్దించాడు.
మారయ్య నోరు విప్పకుండానే పాపయ్య కల్పించుకొని " రామన్న గారు నన్ను మన్నించాలి.మారయ్య దగ్గర అప్పు తీసుకొని పత్రం రాసించ్చిన మాట మర్చిపోయాను. ఆయనకి నేను రాసిచ్చిన పత్రం నిజమైనది.ఆ తరువాత మూడు వందలు జమచేసినట్టు గుర్తుగా వేలిముద్ర వేయిచ్చుకున్నాడు. మీరు అప్పు పత్రం తెమ్మనగానే ఆ కాగితాన్ని అప్పు పత్రం గా మార్చి తెచ్చాను. బుద్ధి గడ్డి తిని ఆ పని చేసాను " అంటూ లెంపలు వేసుకున్నాడు. "నిజం ఒప్పుకున్నందుకు సంతోషం పాపయ్య "మారయ్య నీకు రాసింది అప్పు పత్రం కాదుగనుక దీన్ని రద్దు చేస్తున్నాను ".అంటూ ఆ పత్రాన్ని చింపేశాడు రామన్న. ఇక నువ్వు మారయ్య కు రాసి ఇచ్చిన పత్రం మిగిలింది.అతని బాకీ వెంటనే తీర్చేయు. దీన్ని కూడా రద్దు చేస్తా అన్నాడు.
"అయ్యా! ఆ డబ్బు రేపు నేను స్వయంగా మారయ్య ఇంటికి పట్టుకెళ్లి ఇస్తాను "అదే కుదరదు..నీ దగ్గర డబ్బులేకపోతే చెప్పు నేను ఏర్పాటు చేస్తాను. అంతేగాని సమస్యను సగం మాత్రమే పరిష్కరించానన్న అపవాదు నాకు మిగిలేట్టు చెయ్యకు "... అంటూ గంబీరంగా పాపయ్య మాటలని తుంచేసాడు రామన్న. "కుడితిలో పడ్డ ఎలుకల అయ్యింది పాపయ్య పరిస్థితి".. చేసేదేంలేక ఇంటికి మనిషిని పంపి డబ్బు తెప్పించి మారయ్యకు ఇచ్చి అప్పు పత్రం రామన్న చేతులమీదుగా ముక్కలు చేయించుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజులు ఆగి మారయ్య ఇంటికి వెళ్ళాడు పాపయ్య.
పాపయ్యను నానా తిట్టులు తిట్టి ఇంటిలోంచి రోడ్ మీదకి గెంటాడు మారయ్య.పాపయ్య కు జరిగింది ఏంటో అర్ధం అయింది. "అందరి ముందు అబద్ధాన్ని నిజం అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు తను నిజం చెప్పినా అబద్దం అంటారు కనుక నోరు మూసుకున్నాడు పాపం "పాపయ్య. "రామన్న గుణపాఠం తో బుద్ధి తెచుకున్న పాపయ్య అప్పటినుంచి తన ప్రవర్తన మార్చుకొని నలుగురితో మంచిగా ఉండసాగాడు..