బంగారు చెవి పోగుల కథ



పూర్వ కాలంలో మనుష్యుల మనస్తత్వాలు కూడా మంచిగా వుండేవి. మనుష్యుల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా వుండేవి. అటువంటి కాలంలో ఒకరోజు ఇద్దరు బాటసారులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చీకటిపడటం వల్ల ప్రయాణాన్ని ఆపి ఒక చిన్న సత్రం దగ్గర ఆగి అక్కడ భోజనాలు చేసి అక్కడే నిద్రకుపక్రమించారు. వాళ్ళిద్దరూ స్నేహితులు కాదు. ఇద్దరూ వేరు వేరు గ్రామాలకు చెందినవారు. మార్గం మధ్యలో కలుసుకున్నారు. ఒకని పేరు శాంతయ్య, రెండవ వ్యక్తి పేరు కాంతయ్య. శాంతయ్య చెవులకు పోగులున్నాయి.

అవి బంగారు పోగులు. ఆ పోగులు ఎంతో ఆకర్షణీయంగా వున్నాయి. కాంతయ్యకళ్ళు శాంతయ్య చెవి పోగుల మీద పడ్డాయి. వాటిని ఎలాగయినా తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ లక్ష్యంతోనే శాంతయ్యతో స్నేహం నటిస్తూ, అతనిని అనుసరిస్తూ వచ్చాడు. శాంతయ్య అమాయకుడు. ఇద్దరి మధ్య సంభాషణలో కాంతయ్య అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో సహనంగా సమాధానాలు చెప్పాడు శాంతయ్య. కాంతయ్య మాత్రం పోగుల గురించే ఆలోచిస్తూ వున్నాడు. ఆ తరువాత శాంతయ్య నిద్రలోకి జారుకున్నాడు. కాంతయ్య నిద్ర నటిస్తూ వున్నాడు. బంగారు పోగులు అతని కళ్ళలో మెదులుతూ వుండటం వల్ల నిద్రపోలేకపోయాడు. అదే సందర్భంలో కాంతయ్య కొక మెరుపులాంటి ఉపాయం తట్టింది. దాన్ని అమలుపర్చే సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. అర్థరాత్రి తరువాత అందరూ దీర్ఘ నిద్రలో వున్నారు. కొంతమంది గురకలు పెడుతున్నారు. కాంతయ్య కూడా అప్పటికి మగత నిద్రలోకి జారుకుని మళ్ళీ మేలుకున్నాడు. ఆ తరువాత మెల్లగా శాంతయ్య దగ్గరకు వెళ్ళి ఒక చెవి పోగు తస్కరించాడు. రెండవ పోగు కూడా తీయటానికి ప్రయత్నించాడు.

శాంతయ్య అవతలవైపుకు తిరగలేదు. పోగు తీయటం సాధ్యపడలేదు. కాంతయ్య కొంతసేపు అక్కడే వుండి శాంతయ్య ఇవతలివైపుకు తిరుగుతాడేమోనని చూశాడు. శాంతయ్య కదలలేదు. 'దొరికిన దానితో తృప్తి పడటం మంచిది', అనుకున్నాడు కాంతయ్య. వెంటనే ఆ పోగును తన చెవికి పెట్టుకుని ఏమీ తెలియనట్లే నిద్రపోయాడు కాంతయ్య.

తెల్లవారిన తరువాత ప్రయాణీకులందరూ నిద్ర లేచారు. అందరూ తమ తమ సామాన్లు సర్దుకుంటూ వున్నారు. ఆ సమయంలో శాంతయ్య తన చెవిపోగు పోయిందని గ్రహించాడు. ఆతృతగా ఆ ప్రాంతమంతా కలయజూశాడు. ఎక్కడా పోగు కనిపించలేదు. ఆ పోగు కాంతయ్య చెవికి అలంకరింపబడి వుంది. అది తన చెవిపోగే అని గుర్తించాడు. “నా చెవి పోగు నీ దగ్గరకు ఎలా వచ్చింది. బహుశా నేను నిద్రలో వున్నప్పుడు నువ్వు దానిని దొంగిలించివుంటావు, నా పోగు నాకు ఇవ్వు,” అని కాంతయ్యని అడిగాడు శాంతయ్య.” నోర్ముయ్, హద్దుమీరి మాట్లాడకు. అసలు నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను” అసలు నీ చెవికి వున్న పోగు ఎక్కడిది? అది అచ్చం నా చెవిపోగులానే వుంది. అది కనిపించకపోవటం వల్లనే నేను వెతకులాడుతూ వున్నాను. నా చెవిపోగు దొంగిలించింది చాలక నన్నే దొంగగా జమకడుతున్నావు. మర్యాదగా నా చెవిపోగు నాకు తిరిగి ఇవ్వు” అని గర్జించాడు కాంతయ్య. ఆ విధంగా ఇద్దరి మధ్య కొంతసేపు సంవాదం నడిచింది.

శాంతయ్య, కాంతయ్యల మధ్య జరుగుతున్న గొడవ చూసి కొద్దిసేపటిలోనే అక్కడ జనం పోగయ్యారు. అయితే ఇద్దరికీ చెవిపోగులు వుండటం వల్ల, ఎవరి వాదన సరైనదో తెలియక పోవటం వలన ఎవరూ నోరు మెదపలేదు. కేవలం చూస్తూ వుండి పోయారు. పైగా రెండు చెవిపోగులు ఒకే రకంగా వుండటం వాళ్ళ మౌనానికి మరొక కారణం. సాక్షులు ఎవ్వరూ లేరు. అందువల్ల అసలు దొంగ ఎవరో అర్థం కావటం లేదు. గుమిగూడిన జనంలో ఒకడు రాజుగారికి ఫిర్యాదు చేయటం మంచిదని సూచించాడు. రాజుగారి ఆస్థానానికి ఇద్దరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు. సమస్య రామన్న దగ్గరకు వచ్చింది. రామన్న కాంతయ్య, శాంతయ్య చెప్పిన విషయాలు అన్నీ ప్రశాంతంగా విన్నాడు. సాక్షులెవ్వరూ లేకపోవడం వలన సమస్య జఠిలంగా మారింది.

చివరికి రామన్న కాంతయ్య, శాంతయ్యలను తమ చెవిపోగులు తీసి తనకివ్వమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. రామన్న రెండు పోగుల్ని తన చేతుల్లో వుంచి రెండూ సమానమైన బరువుతో వుండటం గమనించాడు. దాంతో తప్పకుండా రెండు పోగులు ఒకే వ్యక్తికి చెంది వుంటాయనే విషయంలో రామన్న నిర్ధారణకు వచ్చాడు. వెంటనే పోగులు వాళ్ళిద్దరికీ ఇచ్చి అంతకు ముందు ధరించినట్లుగానే ధరించమని రామన్న శాంతయ్య, కాంతయ్యలకు చెప్పాడు. వాళ్ళు ఆ పోగుల్ని ధరిస్తూ వుండగా రామన్న వాళ్ళను సునిశితంగా పరిశీలించాడు. ఆ తరువాత, “గత రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారు ?" అని కాంతయ్య, శాంతయ్యలను అడిగాడు. “మేము ఒక సత్రంలో నిద్రించాము” ఇద్దరూ ఒకేసారి చెప్పారు. “మీరు ఎటువైపుకు తిరిగి పడుకున్నారు” అని మళ్ళీ రామన్న వాళ్ళిద్దరినీ అడిగాడు.

రామన్న అడిగిన పశ్న వెనుక వున్న ఆంతర్యం వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. అందువల్ల వాళ్ళు ఎటు తిరిగి పడుకుంది స్పష్టంగానే చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి వారిద్దరిలో ఒకరు రెండవ వ్యక్తి చెవిపోగు దొంగిలించాడనే విషయంలో ఒక నిర్థారణకు వచ్చాడు రామన్న. ఆ తరువాత కాంతయ్య వైపు తిరిగి, "శాంతయ్య నీ చెవి పోగు దొంగిలించాడన్నావు కదా ! ఏ చెవి పోగో చెప్పగలవా ?” అని అడిగాడు రామన్న. రామన్న ప్రశ్నకు కంగుతిన్న కాంతయ్య “ఎడమ చెవిపోగు" అని బదులిచ్చాడు. వెంటనే రామన్న, “మూర్ఖుడా, నీ ఎడమ చెవి నీ తల కింద వుంది. అటువంటప్పుడు నీ ఎడమ చెవి పోగు దొంగిలించటం ఎలా సాధ్యం ? నీకు తెలియకుండా నీ పోగు తియ్యటం ఎలా వీలవుతుంది.!" అని రామన్న కాంతయ్యను గద్దించాడు. కాంతయ్యకు నోటి వెంట మాట రాలేదు.

అప్పుడు రామన్న, “నువ్వొక మోసగాడివి. ఇంకా అబద్ధం చెప్పకు. నువ్వు పోగు దొంగిలించి పారిపోవాలని ప్రయత్నించావు. నువ్వే నేరస్తుడివి. నిజాయితీగా నీ తప్పు వొప్పుకుని శాంతయ్యకు పోగు ఇచ్చి క్షమాభిక్ష అడుగు. ఇక నువ్వు తప్పించుకోవటం అసాధ్యం. నేను నిన్ను జైలులో పెట్టిస్తాను” అని కేకలు వేశాడు రామన్న. కాంతయ్య గందరగోళపడిపోయి తన తప్పు వొప్పుకుని, క్షమించమని ప్రార్థించాడు. తన పోగు తనకు తిరిగి దక్కటమే కాకుండా, తాను దొంగను కానని రుజువయినందుకు శాంతయ్య అమితంగా ఆనందించాడు. రామన్నకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

ఆ తరువాత రామన్న తన తీర్పు చదివాడు, "కాంతయ్య శాంతయ్య చెవిపోగు దొంగిలించాడు. అతను కావాలనే ఆ పని చేశాడు. అయితే చివరకు తన తప్పును అంగీకరించాడు. ఆ విషయాన్ని దృష్టిలో వుంచుకుని కాంతయ్యకు ఆరు నెలలు సాధారణ శిక్ష విధిస్తున్నాను”, అని ప్రకటించాడు రామన్న. రామన్న తీర్పు విని రాజు కూడా ఆనందించాడు. ఆ ఆనందంతో అతన్ని హృదయానికి హత్తుకున్నాడు. “రామన్నా! నేను నీకు ఎంతో కృతజ్ఞుణ్ని. నా దగ్గర ఈ సంక్లిష్ట సమస్యకు పరిష్కారం లేదు. కొద్దిసేపట్లోనే నువ్వు సమస్యను సునాయాసంగా పరిష్కరించావు. ఈ ఆస్థానంలో న్యాయమూర్తి స్థానంలో వుండదగిన వ్యక్తివి నువ్వు” అని ప్రకటించి రాజు బంగారు కానుకలు ఇచ్చాడు రామన్నకు.

Responsive Footer with Logo and Social Media