వజ్రం కోసం తగాదా



చిత్రపురం అనే వూరిలో రామశర్మ అనే పేద వ్యక్తి వున్నాడు. విలువయిన ఒక వజ్రం తప్ప అతని దగ్గర మరే ఇతర ఆస్తి లేదు. ఆ వజ్రం అతనికి తన పూర్వీకుల నుండి సంక్రమించింది.

ముసలితనంలోవున్న రామశర్మ తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటగా కాశీయాత్ర చేయాలకున్నాడు. తాను ఇల్లు వదలి వెళుతున్నందువల్ల విలువయిన వజ్రాన్ని ఇంట్లో వుంచటం కానీ, తనతో తీసుకెళ్ళటం కానీ మంచిది కాదని నిర్ణయించుకున్నాడు. ఆ వజ్రాన్ని తన స్నేహితుడు, పొరుగువాడు అయిన శ్రీనివాసులు దగ్గర వుంచాలని నిర్ణయించు కున్నాడు. అనుకున్నట్టుగానే ఆ వజ్రాన్ని శ్రీనివాసులుకు ఇచ్చి తను తిరిగి వచ్చేంతవరకు జాగ్రత్తగా వుంచమని కోరాడు. ఆ వజ్రాన్ని భద్రంగా వుంచగలనని హామీ ఇచ్చాడు శ్రీనివాసులు. అతని మాటలకు అమితంగా సంతోషించిన రామశర్మ నిశ్చింతగా కాశీకి బయలుదేరి వెళ్ళాడు. కాశీతోపాటు అనేక ప్రాంతాలు సందర్శించి రామశర్మ తన స్వస్థలం తిరిగి వచ్చాడు. ప్రయాణంలో బాగా అలసిపోయి వుండటం వలన రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుని, మూడవ రోజు శ్రీనివాసులు ఇంటికి వెళ్ళాడు.

తన వజ్రాన్ని ఇమ్మని అడిగాడు రామశర్మ. అందుకు శ్రీనివాసులు “వజ్రం ఏమిటి? నీకు తిరిగి ఇచ్చేశాను కదా !" అని అన్నాడు. రామశర్మ బిత్తరపోయాడు. తేరుకుని వజ్రం విషయం శ్రీనివాసులుకు గుర్తుచేసే ప్రయత్నం చేశాడు రామశర్మ. అందువల్ల వుపయోగం కన్పించలేదు. "రెండు రోజుల క్రితం నువ్వు నా దగ్గరకు వచ్చి వజ్రాన్ని తీసుకుని వెళ్ళి, ఇప్పుడు మళ్ళీ వజ్రం ఇమ్మని అడుగుతావేంటి ?" అని రెట్టించాడు శ్రీనివాసులు. శ్రీనివాసులు చెపుతున్న అబద్ధాన్ని రామశర్మ జీర్ణించుకోలేకపోయాడు. “ఇంతకు ముందు నీ దగ్గరకు ఎప్పుడు వచ్చాను. వూరి నుంచి వచ్చిన తరువాత ఇదే మొదటిసారి నీ దగ్గరకు రావటం. అటువంటప్పుడు నువ్వు నాకు వజ్రాన్ని ఇవ్వటం ఎలా సాధ్యం. దయచేసి అబద్ధం చెప్పకు. నా వజ్రం నాకు తిరిగి ఇవ్వు” అని వేడుకున్నాడు.

దాంతో మరింత కోపగించుకున్నాడు శ్రీనివాసులు. "నాకు ముందే తెలుసు నువ్వు ఇలా అడ్డం తిరిగి మాట్లాడతావని. అందుకే ఆ వజ్రాన్ని నీకు ముగ్గురి సమక్షంలో ఇచ్చాను. ఓ మంగలి, మరొక చాకలి, ఇంకొక తాపీమేస్త్రి సమక్షంలో ఇచ్చాను” అన్నాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. ఇక విషయం తేలదని ఇద్దరూ రామన్న దగ్గరకు వెళ్లారు. ఇద్దరి కథనాలు విన్న తరువాత రామన్న సాక్షులను పిలిచాడు. ముగ్గురు సాక్షులను మూడు గదుల్లో వుంచి, మొదటగా మంగలిని ప్రశ్నించాడు. “శ్రీనివాసులు రామశర్మకు వజ్రం ఇవ్వటం నువ్వు చూశావా?" అని అడిగాడు. మంగలి ఏమాత్రం తొట్రుపాటు పడకుండా చూశానని చెప్పాడు. “అయితే నువ్వు చూసిన వజ్రం పరిమాణంలో వుండే రాయి ఒకటి తీసుకురా” అని అడిగాడు రామన్న. అలాగే మిగతా ఇద్దరికి కూడా చెప్పాడు. వాళ్ళు ముగ్గురూ రామన్న చెప్పినట్లుగానే చేశారు.

ఆ మరుక్షణము రామన్న తను తీర్పు చెప్పబోతున్నట్లు ప్రకటించాడు. దాంతో అందరిలో ఆసక్తి పెరిగింది. చాలా మంది అతృతతో అక్కడ గుమిగూడారు. రామన్న కొంతసేపు ఆలోచించి శ్రీనివాసులు నేరస్తుడు అని ప్రకటించాడు. "అతనికి మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురికి ఒక్కొక్క సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను” అని ప్రకటించాడు. “తప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్ళు కూడా నేరంలో భాగమే” అని నిర్ధారించాడు రామన్న.

రామన్న తీర్పుకు ఆధారం ఏమిటో అక్కడ గుమిగూడిన ప్రజలకు అర్ధం కాలేదు. అదే విషయాన్ని వివరించమని అందరూ రామన్నను అడిగారు. రామన్న నవ్వుతూ “ముగ్గురు సాక్షులనూ విడి విడిగా కలిసి వారిని తాము చూచిన వజ్రంతో సమానమైన రాళ్ళను తీసుకురమ్మన్నాను.” ముగ్గురూ మూడు వేరువేరు పరిమాణాలు వున్న రాళ్ళను తెచ్చారు. దాంతో వాళ్ళెవ్వరూ అసలా వజ్రాన్ని చూడలేదనే విషయం నాకు స్పష్టమయింది. ఆ ముగ్గురూ దొంగ సాక్ష్యం చెపుతున్నారని నిర్ధారణకు వచ్చి తీర్పు చెప్పాను” అని వివరించాడు. అందరూ రామన్న తెలివి తేటలకు మరొకసారి సంతోషించారు.

Responsive Footer with Logo and Social Media