వీరభద్ర విజయం



కైలాసం పైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువైవున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుణ్ని గౌరవిస్తాడు. దక్షుడు తనకు తగినట్లు గౌరవించుట జరపలేదని, శివుడు తనని అవమానించినట్లు భావించి, కోపగించి ప్రతికారంగా శివుడు లేని యాగాలు చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు.

దేవతలు, మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఆ వార్త నారదుని వల్ల తెలుసుకొన్న దాక్షాయణి శివునికా వార్తను తెలుపుతుంది. శివుని ఆజ్ఞ గైకొని యజ్ఞాన్ని చూడడానికి బయలుదేరుతుంది. దక్షుడు ఆమెను పిలవని పేరంటానికి వచ్చినందుకు తిరస్కరించడమే కాకుండా శివుణ్ణి నిందిస్తాడు. అది భరించలేని దాక్షాయణి శివయోగాగ్నిలో దేహత్యాగం చేస్తుంది. శివుడు ఆగ్రహించి దక్షుడిని “వైవశ్వత మన్వంతరంలో ఇంద్రుని కొడుకుగా పుట్టిన నిన్ను సంహరిస్తాను” అని శపిస్తాడు. దాక్షాయణి హిమవంతుని అనుగ్రహించి కూమార్తెగా పుడుతుంది.

పిమ్మట హిమవంతుడు శైలజను శివునికి శుశ్రూష చేయడానికి పంపుతాడు. అమరావతి పైకి తారకాసురుడు దండెత్తి వస్తాడు. తారకాసురునికి శివునికి పుట్టిన వానిచేతిలో తప్ప మరణ లేదు. శివుడు విరాగి తపస్సులో ఉంటాడు. కనుక, ఇంద్రుడు శివుని కరగించమని మన్మథుని ఆజ్ఞాపిస్తాడు. నగజ శుశ్రూష చేస్తుండగా మన్మథుడు శివుని మీద బాణం వేస్తాడు. తపోభంగమైన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుని బూడిద చేస్తాడు. హిమవంతుడు కూతురు పార్వతీదేవిని ఇంటికి తీసుకువెళతాడు. శంకరుడు ఎరుకసాని వలె వచ్చి అంతఃపురంలోని శైలజకు ఎరుక చెప్తాడు. పార్వతీదేవి తపస్సుకై వనానికి వెళ్తుంది, ఆమె తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమవుతాడు.

పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. ఆ సమయంలో భూమి సమత్వం కోసం శివుడు అగస్త్యుని దక్షిణ దిక్కుకు పంపుతాడు. కల్యాణ శుభవేళ బ్రహ్మాదులు మన్మథుని గురించి చెప్తారు. అశరీరుడుగా మన్మథుడు పునరుజ్జీవితుడు అవుతాడని శివుడు వరం ఇస్తాడు. పార్వతీదేవి అడుగగా శివుడు నీలగళానికి కారణమైన హాలాహలభక్షణ వృత్తాంతం చెప్తాడు. వైవశ్వత మన్వంతరంలో దక్షుడు శివరహితముగా మఖము చేయదొడంగెను. అది దధీచి శివునికి తెలుపగా, కోపంతో శివుడు చేసిన హుంకారం నుండి వీరభద్రుడు పుడతాడు.

పార్వతీదేవి కోపం నుండి భద్రేశ్వరి పుడుతుంది. ఇద్దరూ యాగశాలకు దండత్తి వెళ్తారు. దక్షుని తల ఖండించి. వెళ్ళి పరమశివునకి దక్షాధ్వర ధ్వంసం విన్నవిస్తారు. అలా దక్షుడు విగతజీవుడు కావడంతో, దేవతలందురూ బ్రహ్మదేవునితో కూడి వెళ్ళి శంకరుని వేడుకుంటారు. ఆయన ప్రసన్నుడు అవుతాడు.

పిమ్మట, గొఱ్ఱె తల తీసుకువచ్చి దక్షుని శరీరానికి తగిలించి అతనిని పునరుజ్జీవుని చేస్తారు. శివుడు వీరభద్రునికి పట్టంగట్టుతాడు.